కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

నేను చేయాల్సిన వాటినే చేశాను

నేను చేయాల్సిన వాటినే చేశాను

డొనాల్డ్‌ రిడ్లీ దాదాపు 30 కన్నా ఎక్కువ సంవత్సరాలు యెహోవాసాక్షుల తరఫున ఎన్నో కేసులు వాదించాడు. రక్తం ఎక్కించుకోవాలో వద్దో నిర్ణయించుకునే హక్కు రోగులకు ఉంటుందని డాక్టర్లకు, జడ్జిలకు వివరించడానికి డాన్‌ చాలా కృషిచేశాడు. దానివల్ల, అమెరికా హైకోర్టుల్లో యెహోవాసాక్షులు ఎన్నో కేసులు గెలిచారు. స్నేహితులు ఆయన్ని డాన్‌ అని పిలిచేవాళ్లు. డాన్‌ కష్టపడి పనిచేసేవాడు, వినయంగా ఉండేవాడు, స్వార్థం చూసుకునేవాడు కాదు.

డాన్‌కు ఒక అరుదైన జబ్బు ఉందని డాక్టర్లు 2019 లో గుర్తించారు. పైగా దానికి చికిత్స లేదు. ఆ జబ్బు ఎక్కువ అవ్వడంతో 2019 ఆగస్టు 16న ఆయన చనిపోయాడు. ఇది ఆయన జీవిత కథ.

నేను అమెరికాలోని మిన్నెసోటాలో ఉన్న సెయింట్‌ పాల్‌లో పుట్టాను. మాది ఒక మధ్య తరగతి రోమన్‌ క్యాథలిక్‌ కుటుంబం. మా అమ్మానాన్నలకు మేం మొత్తం ఐదుగురు పిల్లలం, నేను రెండోవాడిని. నేను క్యాథలిక్‌ స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో, చర్చిలో ఆరాధన చేసే ఫాదర్‌కు సహాయకుడిగా ఉండేవాన్ని. అప్పటికింకా నాకు బైబిలు విషయాలు అంతగా తెలీవు. దేవుడే అన్నిటినీ చేశాడని నమ్మేవాడిని కానీ, క్యాథలిక్‌ చర్చి మీద నమ్మకం ఉండేది కాదు.

సత్యం ఎలా తెలుసుకున్నానంటే . . .

‘విలియమ్‌ మిషెల్‌ లా కాలేజీలో’ నేను మొదటి సంవత్సరం చదువుతున్న రోజుల్లో, యెహోవాసాక్షులు మా ఇంటికొచ్చారు. అప్పుడు నేను బట్టలు ఉతుకుతూ బిజీగా ఉన్నాను, దాంతో వాళ్లు మరొకసారి వస్తామని చెప్పి వెళ్లారు. వాళ్లు మళ్లీ వచ్చినప్పుడు ఈ రెండు ప్రశ్నలు అడిగాను: “ఈ లోకంలో మంచివాళ్లు ఎందుకు ఎదగలేకపోతున్నారు?” “ప్రజలు నిజంగా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?” వాళ్లు నాకు నిత్యజీవమునకు నడుపు సత్యము అనే పుస్తకాన్ని, అలాగే పచ్చ రంగు అట్టతో ఆకర్షణీయంగా ఉన్న న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద హోలీ స్క్రిప్చర్స్‌ బైబిలును ఇచ్చారు. వాటిని తీసుకుని బైబిలు స్టడీకి కూడా ఒప్పుకున్నాను. స్టడీ తీసుకుంటున్నప్పుడు చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. త్వరలో దేవుని రాజ్యం ఈ భూమిని పరిపాలిస్తుందని నేర్చుకున్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. మానవ ప్రభుత్వాలు బాధల్ని, కష్టాల్ని, దుఃఖాన్ని పెంచాయే తప్ప ప్రజల జీవితాల్ని మార్చలేకపోయాయి.

1982 ఆరంభంలో నేను యెహోవాకు సమర్పించుకుని, అదే సంవత్సరంలో జరిగిన “రాజ్య సత్యం” (“Kingdom Truth”) సమావేశంలో బాప్తిస్మం తీసుకున్నాను. ఆ సమావేశం సెయింట్‌ పాల్‌లోని సివిక్‌ సెంటర్‌లో జరిగింది. ఆ తర్వాతి వారంలో, మిన్నెసోటా బార్‌ పరీక్ష (లాయరుగా పని చేయడానికి రాసే పరీక్ష) రాయడానికి మళ్లీ అదే సివిక్‌ సెంటర్‌కి వెళ్లాను. అక్టోబరులో ఫలితాలు వచ్చాయి, నేను ఆ పరీక్ష పాస్‌ అయ్యి లాయరుగా పనిచేసే అర్హత సంపాదించాను.

“రాజ్య సత్యం” సమావేశంలో నాకు మైక్‌ రిచర్డ్‌సన్‌ అనే సహోదరుడు పరిచయం అయ్యాడు; ఆయన బ్రూక్లిన్‌ బెతెల్‌లో పని చేసేవాడు. ప్రధాన కార్యాలయంలో లీగల్‌ ఆఫీసు ఏర్పాటు చేశారని ఆయన నాకు వివరించాడు. అప్పుడు నాకు అపొస్తలుల కార్యాలు 8:36 లో ఉన్న ఇతియోపీయుడైన అధికారి మాటలు గుర్తుకొచ్చి, ‘లీగల్‌ ఆఫీసులో పని చేయడానికి నాకున్న ఆటంకం ఏంటి?’ అని ఆలోచించాను. వెంటనే బెతెల్‌ అప్లికేషన్‌ నింపి పంపించాను.

నేను యెహోవాసాక్షి అవ్వడం మా అమ్మానాన్నలకు నచ్చలేదు. బెతెల్‌లో నేను చేయబోయే పని, నా లాయరు వృత్తికి ఏ రకంగా ఉపయోగపడుతుందని నాన్న అడిగాడు. నేను అక్కడ స్వచ్ఛందంగా పని చేస్తానని, అక్కడ నాకు నెలకు 75 డాలర్లు ఇస్తారని ఆయనకు వివరించాను. అప్పట్లో ఖర్చుల కోసం బెతెల్‌ సేవకులకు ఆ డబ్బు ఇచ్చేవాళ్లు.

అప్పటికే నేను కోర్టులో ఉద్యోగం చేస్తుండడం వల్ల, వెంటనే బెతెల్‌కి వెళ్లడం కుదర్లేదు. 1984 నుండి న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌ బెతెల్‌లో సేవ చేయడం మొదలుపెట్టాను. నన్ను లీగల్‌ డిపార్ట్‌మెంట్‌కు నియమించారు. అంతకుముందు కోర్టులో పనిచేసిన అనుభవం, తర్వాతి రోజుల్లో నాకు చాలా ఉపయోగపడింది.

స్టాన్లీ థియేటర్‌ మరమ్మతు

స్టాన్లీ థియేటర్‌ను సంస్థ కొన్నప్పటి ఫోటో

1983 నవంబరులో, న్యూ జెర్సీలోని జెర్సీ సిటీలో ఉన్న స్టాన్లీ థియేటర్‌ను సంస్థ కొనుగోలు చేసింది. దానికి మరమ్మతులు చేయడానికి అనుమతి కోరుతూ సహోదరులు అప్లికేషన్‌ పెట్టారు. వాళ్లు స్థానిక అధికారుల్ని కలిసి, ఆ థియేటర్‌ను యెహోవాసాక్షుల సమావేశాలు జరుపుకోవడానికి ఉపయోగించాలని అనుకుంటున్నట్టు వివరించారు. దానికి అధికారులు అభ్యంతరం చెప్పారు. జెర్సీ నగర నియమాల ప్రకారం, ఆరాధనకు సంబంధించిన భవనాలు ఇళ్ల మధ్య మాత్రమే ఉండాలి. అయితే ఈ థియేటర్‌ వ్యాపార ప్రాంతంలో ఉండడం వల్ల, నగర అధికారులు అనుమతి ఇవ్వలేదు. సహోదరులు కోర్టులో అప్పీలు చేసుకున్నా లాభం లేకపోయింది.

నేను బెతెల్‌కి వెళ్లిన మొదటి వారంలో, సంస్థ ఈ కేసును జిల్లా ఫెడరల్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇంతకుముందు నేను, మిన్నెసోటాలోని సెయింట్‌ పాల్‌ ఫెడరల్‌ కోర్టులో రెండేళ్లు పనిచేశాను. కాబట్టి ఇలాంటి కేసుల మీద నాకు మంచి అవగాహన ఉంది. కోర్టులో మన తరఫున వాదిస్తున్న లాయరు మాట్లాడుతూ, ‘ఇప్పటిదాకా స్టాన్లీ థియేటర్‌ను సినిమాల నుండి మ్యూజిక్‌ ఈవెంట్స్‌ దాకా ఎన్నో రకాల కార్యక్రమాలకు ఉపయోగించారు, ఇప్పుడు దాన్ని మతపరమైన కార్యక్రమాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం ఎలా అవుతుంది?’ అని ప్రశ్నించాడు. ఆ వాదనలో న్యాయం ఉందని భావించిన కోర్టు మనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మనకున్న మత స్వేచ్ఛను జెర్సీ నగరం గౌరవించలేదని కోర్టు అంది. థియేటర్‌ మరమ్మతు పనులు మొదలుపెట్టడానికి కావాల్సిన అనుమతులు ఇవ్వమని ఆదేశించింది. యెహోవా తన పనిని ముందుకు తీసుకెళ్లడానికి లీగల్‌ డిపార్ట్‌మెంట్‌ను ఎలా ఉపయోగించుకున్నాడో నేను కళ్లారా చూశాను. ఆ పనిలో నాకూ చిన్న వంతు ఉన్నందుకు చాలా సంతోషంగా అనిపించింది.

మరమ్మతు పనులు భారీయెత్తున జరిగాయి. ఆ పనులు ప్రారంభమైన సంవత్సరం లోపే, అంటే 1985 సెప్టెంబరు 8న, జెర్సీ సిటీ అసెంబ్లీ హాలులో గిలియడ్‌ పాఠశాల 79వ తరగతి గ్రాడ్యుయేషన్‌ జరిగింది. లీగల్‌ డిపార్ట్‌మెంట్‌తో కలిసి యెహోవా సంస్థ తరఫున పనిచేయడం నాకు దొరికిన గొప్ప గౌరవం. బెతెల్‌కి రాకముందు కూడా నేను లాయరుగా పనిచేశాను, కానీ అప్పుడు దొరకని సంతృప్తి బెతెల్‌ సేవలో దొరికింది. రాబోయే రోజుల్లో యెహోవా నన్ను ఇంకా చాలా పనుల్లో ఉపయోగించుకుంటాడని నేను ఊహించలేదు.

రక్తం ఎక్కించకుండా చేసే ఇతర వైద్య చికిత్సలను ఎంచుకునే హక్కు

1980లలో, రక్తం ఎక్కించకుండా చికిత్స చేయడానికి వైద్య సిబ్బంది ఒప్పుకునేవాళ్లు కాదు. స్వయంగా రోగులే చెప్పినా వినేవాళ్లు కాదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు, రక్తాన్ని నిరాకరించే హక్కు లేదని జడ్జీలు భావించేవాళ్లు. ఒకవేళ రక్తం ఎక్కించకపోతే, తల్లి చనిపోయి చంటిబిడ్డ అనాథ అవుతుందని వాళ్లు అనుకునేవాళ్లు.

1988 డిసెంబరు 29న, డెనీస్‌ నికెలో అనే సహోదరికి ప్రసవం తర్వాత తీవ్ర రక్తస్రావం జరిగింది. హిమోగ్లోబిన్‌ 5.0 కన్నా తక్కువకి పడిపోవడంతో, రక్తం ఎక్కించుకోవాలని డాక్టర్లు ఆమెకు చెప్పారు. సహోదరి దానికి ఒప్పుకోలేదు. అయితే ఆమెకు రక్తం ఎక్కించడం తప్పనిసరి అనే కారణం చూపించి, తర్వాతి రోజు ఉదయం కల్లా హాస్పిటల్‌ సిబ్బంది కోర్టు నుండి అనుమతి తెచ్చుకున్నారు. సహోదరి వాదన వినకుండానే, కనీసం ఆమెకు గానీ, ఆమె భర్తకు గానీ ఒక్కమాట చెప్పకుండానే కోర్టు ఆ అనుమతి ఇచ్చింది.

డిసెంబరు 30 శుక్రవారం రోజున సహోదరి భర్త, కుటుంబ సభ్యులు వద్దని చెప్తున్నా, హాస్పిటల్‌ సిబ్బంది ఆమెకు రక్తం ఎక్కించారు. అలా ఎక్కించకుండా అడ్డుకోవాలని ఆమె కుటుంబ సభ్యుల్లో చాలామంది, అలాగే ఒకరిద్దరు సంఘపెద్దలు హాస్పిటల్‌ బెడ్‌కు అడ్డుగా నిలబడినందుకు సాయంత్రం వాళ్లను అరెస్ట్‌ చేశారు. తర్వాతి రోజు ఉదయం కల్లా ఈ అరెస్ట్‌ గురించిన వార్త న్యూయార్క్‌లోని, చుట్టుపక్కల నగరాల్లోని న్యూస్‌ పేపర్లలో, టీవీ ఛానెళ్లలో, రేడియోల్లో వచ్చింది.

ఫిలిప్‌ బ్రమ్లీతో కలిసి దిగిన ఫోటో

నేను సోమవారం ఉదయం పైస్థాయి కోర్టు జడ్జి అయిన మిల్టన్‌ మాల్లన్‌తో మాట్లాడాను. కేసు వివరాలు అన్నీ చెప్పి, రోగి తరఫు వాదన వినకుండానే కిందిస్థాయి కోర్టు రక్తం ఎక్కించడానికి అనుమతి ఇచ్చిందని స్పష్టంగా వివరించాను. కేసుకు సంబంధించిన చట్టాలు, ఇతర వివరాలు చర్చించడానికి మధ్యాహ్నం తన ఆఫీసుకు రమ్మని ఆయన నాకు చెప్పాడు. అప్పుడు మా పర్యవేక్షకునిగా ఉన్న ఫిలిప్‌ బ్రమ్లీ నాతోపాటు వచ్చాడు. హాస్పిటల్‌ తరఫు లాయరును కూడా రమ్మని జడ్జి పిలిచాడు. ఆ రోజు చర్చలు వాడివేడిగా జరిగాయి. నేనెంత గట్టిగా మాట్లాడానంటే కాసేపటికి సహోదరుడు బ్రమ్లీ తన నోట్‌బుక్‌ మీద “కాస్త మెల్లగా మాట్లాడు” అని రాసిచ్చాడు. ఆయన నన్ను సరైన సమయంలో సరిదిద్దాడు. ఎందుకంటే, హాస్పిటల్‌ తరఫు లాయరు వాదన తప్పు అని నిరూపించే క్రమంలో నేను చాలా ఆవేశపడ్డాను.

ఎడమ నుండి కుడికి: రిచర్డ్‌ మోక్‌, గ్రెగరీ ఓల్డ్స్‌, పాల్‌ పాలిడారో, ఫిలిప్‌ బ్రమ్లీ, నేను, మార్యో మోరానో—వాచ్‌టవర్‌కు, విలేజ్‌ ఆఫ్‌ స్ట్రాట్టన్‌కు మధ్య కేసు జరుగుతున్న సమయంలో అమెరికా సుప్రీం కోర్టుకు వెళ్లినప్పుడు దిగిన ఫోటో.—జనవరి 8, 2003 తేజరిల్లు! (ఇంగ్లీషు) చూడండి

దాదాపు ఒక గంట తర్వాత, రేపు ఉదయం కోర్టులో ముందుగా మీ కేసే పరిశీలిస్తానని జడ్జి చెప్పాడు. మేం ఆఫీసు నుండి బయటికి వస్తుండగా, ‘రేపు హాస్పిటల్‌ తరఫు న్యాయవాది కేసు వాదించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది’ అని జడ్జి మాతో అన్నాడు. ఆ సహోదరికి బలవంతంగా రక్తం ఎక్కించే హక్కు వైద్య సిబ్బందికి ఉందని నిరూపించడం కష్టమని జడ్జి ఉద్దేశం. జడ్జి మాటలు విన్నాక, కేసు మనమే గెలుస్తామని యెహోవా భరోసా ఇస్తున్నట్లు అనిపించింది. యెహోవా తన పనిలో మమ్మల్ని ఉపయోగించుకుంటున్న విధానం చూసి ఆశ్చర్యపోయాను.

తర్వాతి రోజు ఉదయం కోర్టులో వాదించడానికి మేం రాత్రంతా సిద్ధపడ్డాం. కోర్టు బ్రూక్లిన్‌ బెతెల్‌కు దగ్గర్లోనే ఉండడంతో, మా చిన్న లీగల్‌ డిపార్ట్‌మెంట్‌లోని చాలామంది అక్కడికి నడుచుకుంటూ వచ్చేశారు. నలుగురు జడ్జీల బృందం మా వాదన విన్న తర్వాత, రక్తం ఎక్కించమని కింది కోర్టు ఇచ్చిన తీర్పు తప్పని తేల్చి చెప్పింది. రోగి వాదన వినకుండానే అనుమతి ఇవ్వడం మానవ హక్కులకు వ్యతిరేకమని తెలియజేస్తూ సహోదరి నికెలోకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

ఆ తర్వాత కొంతకాలానికి న్యూయార్క్‌లోని అత్యున్నత న్యాయస్థానం, రక్తం ఎక్కించకుండా చేసే ఇతర వైద్య చికిత్సల్ని ఎంచుకునే హక్కు నికెలోకి ఉందని స్పష్టం చేసింది. ఇలాంటి ఇంకో మూడు కేసుల్ని నేను అమెరికా హైకోర్టుల్లో వాదించాను. సహోదరి నికెలో కేసు అందులో మొదటిది. (“ అమెరికా హైకోర్టుల్లో సాధించిన విజయాలు” బాక్సు చూడండి.) బెతెల్‌లోని ఇతర లాయర్లతో కలిసి చిన్నపిల్లల సంరక్షణకు సంబంధించిన కేసులను, విడాకులకు, రియల్‌ ఎస్టేట్‌కు సంబంధించిన కేసులను కూడా వాదించాను.

పెళ్లి, కుటుంబ జీవితం

నా భార్య డెనిస్‌తో దిగిన ఫోటో

నా భార్య పేరు డెనిస్‌. నేను మొదటిసారి ఆమెను కలిసే నాటికి, ఆమె తన ముగ్గురు పిల్లలతో ఒంటరిగా జీవిస్తోంది. ఆమె భర్త ఆమెకు విడాకులిచ్చాడు. ఆమె కుటుంబాన్ని పోషించడానికి ఉద్యోగం చేస్తూనే, పయినీరు సేవ కూడా చేస్తుండేది. అన్ని కష్టాలు అనుభవిస్తూ కూడా, యెహోవా సేవ చేయాలని ఆమె పడుతున్న తపన నాకు చాలా నచ్చింది. 1992 లో న్యూయార్క్‌ నగరంలో “వెలుగు సంబంధులు” (“Light Bearers”) జిల్లా సమావేశానికి వెళ్లినప్పుడు, నేను ఆమెను కలిసి తనను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందని చెప్పాను. సంవత్సరం తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఆమెకు యెహోవా మీద చాలా ప్రేమ ఉంది, తనకు చమత్కారం కూడా కాస్త ఎక్కువే. నిజంగా, ఆమె నాకు యెహోవా ఇచ్చిన బహుమతి. ఆమె నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది.—సామె. 31:12.

మాకు పెళ్లి అయ్యేనాటికి, ముగ్గురు పిల్లల్లో ఒకరికి 11 ఏళ్లు, ఇంకొకరికి 13 ఏళ్లు, మరొకరికి 16 ఏళ్లు. నేను వాళ్లకు మంచి నాన్నగా ఉండాలనుకున్నాను. పెంపుడు తండ్రి గురించి మన ప్రచురణల్లో వచ్చిన ఆర్టికల్స్‌ చదివి, వాటిలో ఉన్న సలహాలన్నీ జాగ్రత్తగా పాటించాను. కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ పిల్లలు నన్ను ఒక స్నేహితునిగా, నాన్నగా అంగీకరించారు. మా పిల్లల స్నేహితులకు కూడా మా ఇంట్లో స్వేచ్ఛ ఉండేది, వాళ్లందరూ కలిసి ఇంట్లో చేసే సందడి మాకు చాలా ఇష్టం.

వయసుపైబడిన మా నాన్నను, అత్తామామలను చూసుకోవడానికి, మేం 2013 లో విస్కాన్‌సిన్‌కు వెళ్లిపోయాం. కానీ సంతోషకరమైన విషయమేంటంటే, నా బెతెల్‌ సేవ ఆగలేదు. టెంపరరీ వాలంటీరుగా సేవచేస్తూ లీగల్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేయమని నాకు చెప్పారు.

ఊహించని మార్పు

2018 సెప్టెంబరులో, మాట్లాడే ముందు మాటిమాటికీ దగ్గు వస్తోందని గుర్తించాను. దగ్గర్లో ఉన్న డాక్టరుకు చూపించుకున్నాను, కానీ సమస్యేంటో ఆయనకు కూడా అర్థంకాలేదు. ఇంకో డాక్టరు దగ్గరకు వెళ్తే న్యూరాలజిస్ట్‌ని కలవమని చెప్పాడు. 2019 జనవరిలో న్యూరాలజిస్ట్‌కు చూపించుకున్నాను. నాకు ఒక అరుదైన జబ్బు వచ్చిందని, అది మెల్లమెల్లగా శరీరమంతా వ్యాపిస్తుందని ఆ డాక్టరు చెప్పాడు.

అది తెలిసిన మూడు రోజుల తర్వాత, నేను ఐస్‌ స్కేటింగ్‌ చేస్తూ కిందపడడం వల్ల కుడిచేతి మణికట్టు విరిగింది. నాకు స్కేటింగ్‌ చేయడం చిన్నప్పటి నుండి అలవాటు, ఆ ఆట మీద నాకు చాలా మంచి పట్టు ఉంది. అలాంటిది ఇప్పుడు దాన్ని ఆడుతూ పడిపోయానంటే, మెల్లమెల్లగా నా కండరాల కదలిక తగ్గిపోతోందని నాకు అర్థమైంది. చూస్తుండగానే నా జబ్బు ఎక్కువైపోయింది. రోజులు గడిచేకొద్దీ మాట్లాడడం, నడవడం, ఆహారం మింగడం చాలా కష్టమైపోయింది.

లాయరుగా నాకున్న అనుభవాన్ని యెహోవా సంస్థ కోసం ఉపయోగించినందుకు చాలా సంతోషంగా ఉంది. రక్తం ఎక్కించకుండా చేసే చికిత్సలను, ఆపరేషన్‌లను ఎంచుకునే విషయంలో యెహోవా ప్రజలకు ఉన్న హక్కు గురించి వేర్వేరు జర్నల్స్‌లో ఎన్నో ఆర్టికల్స్‌ రాశాను; ఆ విషయం మీద ప్రపంచంలోని వేర్వేరు సెమినార్లలో మాట్లాడాను. కానీ నా మనసులోని భావాల్ని లూకా 17:10 లో ఉన్న ఈ మాటలు చక్కగా వర్ణిస్తాయి: ‘నేను ఎందుకూ పనికిరాని దాసుడిని. నేను చేయాల్సిన వాటినే చేశాను.’