కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 30

సత్యంలో నడుస్తూ ఉండండి

సత్యంలో నడుస్తూ ఉండండి

“నా పిల్లలు సత్యంలో నడుస్తున్నారని వినడం కన్నా నాకు సంతోషకరమైన విషయం ఇంకొకటి లేదు.”—3 యోహా. 4.

పాట 54 ఇదే త్రోవ

ఈ ఆర్టికల్‌లో . . . *

1. మూడో యోహాను 3, 4 ప్రకారం మనకు ఎప్పుడు సంతోషంగా అనిపిస్తుంది?

అపొస్తలుడైన యోహాను చాలామందికి సత్యాన్ని బోధించాడు. ఆయన వాళ్లను తన ఆధ్యాత్మిక పిల్లల్లా భావించాడు. వాళ్లు యెహోవా సేవలో నమ్మకంగా కొనసాగుతున్నారని విన్నప్పుడు ఆయన ఎంతో సంతోషించాడు. అయితే వాళ్లకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. వాళ్ల విశ్వాసాన్ని బలపర్చడానికి యోహాను చాలా కృషిచేశాడు. అదేవిధంగా మన పిల్లలు, మనం సత్యం నేర్పించినవాళ్లు యెహోవాకు సమర్పించుకుని, ఆయన సేవలో కొనసాగుతున్నప్పుడు మనకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది.—3 యోహాను 3, 4 చదవండి.

2. యోహాను మూడు ఉత్తరాలు ఎందుకు రాశాడు?

2 యోహాను క్రీ.శ. 98 లో ఎఫెసు లేదా ఆ దగ్గర్లో నివసించి ఉంటాడు. పత్మాసు ద్వీపంలోని జైలు నుండి విడుదలైన తర్వాత ఆయన అక్కడికి వెళ్లి ఉంటాడు. ఆ సమయంలో యోహాను పవిత్రశక్తి ప్రేరణతో మూడు ఉత్తరాలు రాశాడు. నమ్మకమైన క్రైస్తవులకు యేసు మీదున్న విశ్వాసాన్ని బలపర్చడానికి, వాళ్లను సత్యంలో నడుస్తూ ఉండమని ప్రోత్సహించడానికి ఆయన వాటిని రాశాడు.

3. మనం ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?

3 అప్పటికి అపొస్తలుల్లో ఇంకా బ్రతికున్నది యోహాను ఒక్కడే. క్రైస్తవ సంఘాలపై అబద్ధ బోధకులు చూపిస్తున్న చెడు ప్రభావం గురించి ఆయన ఆందోళనపడ్డాడు. * (1 యోహా. 2:18, 19, 26) ఆ అబద్ధ బోధకులు దేవుడు తమకు తెలుసని చెప్పుకున్నారు, కానీ వాళ్లు యెహోవా ఆజ్ఞలకు లోబడలేదు. మనం ఈ ఆర్టికల్‌లో, పవిత్రశక్తి సహాయంతో యోహాను రాసిన సలహాల్ని పరిశీలిస్తూ ఈ మూడు ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం: సత్యంలో నడవడం అంటే ఏంటి? మనకు ఎలాంటి సవాళ్లు ఎదురవ్వవచ్చు? సత్యంలో కొనసాగేలా మనం ఒకరికొకరం ఎలా సహాయం చేసుకోవచ్చు?

సత్యంలో నడవడం అంటే ఏంటి?

4. మొదటి యోహాను 2:3-6; రెండో యోహాను 4, 6 ప్రకారం సత్యంలో నడవాలంటే మనం ఏం చేయాలి?

4 సత్యంలో నడవాలంటే, దేవుని వాక్యమైన బైబిల్లో ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అంతేకాదు, ‘[యెహోవా] ఆజ్ఞల్ని పాటించాలి.’ (1 యోహాను 2:3-6; 2 యోహాను 4, 6 చదవండి.) ఆ విషయంలో యేసు పరిపూర్ణ ఆదర్శం ఉంచాడు. కాబట్టి యేసు అడుగుజాడల్లో నడవడానికి వీలైనంత ఎక్కువగా కృషిచేయడం ద్వారా మనం యెహోవా ఆజ్ఞల్ని పాటించవచ్చు.—యోహా. 8:29; 1 పేతు. 2:21.

5. మనం ఏ విషయాల్ని బలంగా నమ్మాలి?

5 సత్యంలో నడుస్తూ ఉండాలంటే, యెహోవా ఎప్పుడూ నిజమే చెప్తాడని, ఆయన వాక్యమైన బైబిల్లో ఉన్నవన్నీ నిజమని బలంగా నమ్మాలి. యేసే వాగ్దానం చేయబడిన మెస్సీయ అని కూడా బలంగా నమ్మాలి. నేడు చాలామంది, దేవుని రాజ్యానికి రాజుగా యేసు అభిషేకించబడ్డాడనే విషయాన్ని సందేహిస్తున్నారు. యెహోవా గురించిన, యేసు గురించిన సత్యాన్ని బలంగా నమ్మనివాళ్లను తప్పుదారి పట్టించడానికి “చాలామంది మోసగాళ్లు” ప్రయత్నిస్తారని యోహాను హెచ్చరించాడు. (2 యోహా. 7-11) ఆయన ఇలా రాశాడు: “యేసే క్రీస్తని ఒప్పుకోని వ్యక్తి తప్ప అబద్ధాలకోరు ఎవరు?” (1 యోహా. 2:22) మనం మోసపోకుండా ఉండాలంటే, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడమే ఏకైక మార్గం. అప్పుడే మనం యెహోవా, యేసు గురించి బాగా తెలుసుకుంటాం. (యోహా. 17:3) అంతేకాదు, మనం తెలుసుకున్నది సత్యం అని బలంగా నమ్ముతాం.

మనకు ఎలాంటి సవాళ్లు ఎదురవ్వవచ్చు?

6. యౌవన క్రైస్తవులకు ఎదురయ్యే ఒక సవాలు ఏంటి?

6 మనుషుల బోధలు మనల్ని తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది, కాబట్టి క్రైస్తవులమైన మనం వాటిని నమ్మి మోసపోకూడదు. (1 యోహా. 2:26) ముఖ్యంగా యౌవన క్రైస్తవులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫ్రాన్స్‌కు చెందిన 25 ఏళ్ల అలెక్సియ * ఇలా చెప్తోంది: “స్కూల్లో నేర్పించిన పరిణామ సిద్ధాంతం, ఇతర సిద్ధాంతాలు నేను సత్యాన్ని సందేహించేలా చేశాయి. కొన్నిసార్లు నాకు అవి బాగా నచ్చేవి. కానీ, యెహోవా చెప్పేది వినకుండా, మా టీచర్లు చెప్పే ప్రతీదాన్ని నమ్మడం సరైనది కాదని నాకు అనిపించింది.” అప్పుడు అలెక్సియ, జీవం—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? (Life—How Did It Get Here? By Evolution or by Creation?) అనే పుస్తకం చదివింది. అది చదివాక ఆమె సందేహాలన్నీ ఎగిరిపోయాయి. ఆమె ఇలా చెప్తోంది: “బైబిల్లో ఉన్నది సత్యమని నేను పరిశీలించి తెలుసుకున్నాను. బైబిలు ప్రమాణాల్ని పాటిస్తే సంతోషంగా, ప్రశాంతంగా జీవిస్తామని అర్థం చేసుకున్నాను.”

7. మనం ఎలాంటి జీవితం జీవించకూడదు, ఎందుకు?

7 యౌవనులైనా, పెద్దవాళ్లయినా క్రైస్తవులందరూ రెండు రకాల జీవితం జీవించకూడదు. ఒకవైపు తప్పుడు పనులు చేస్తూ, మరోవైపు సత్యంలో నడవడం అసాధ్యమని యోహాను చెప్పాడు. (1 యోహా. 1:6) మనకు ఇప్పుడూ, భవిష్యత్తులో దేవుని ఆమోదం ఉండాలంటే, మనం చేసే ప్రతీ పనిని యెహోవా చూస్తున్నాడని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మనం రహస్యంగా చేసేవాటిని మనుషులు చూడలేకపోయినా, యెహోవా చూస్తాడు.—హెబ్రీ. 4:13.

8. మనం వేటిని పాటించకూడదు?

8 తప్పొప్పుల విషయంలో ఈ లోక ప్రమాణాల్ని పాటించకూడదు. యోహాను ఇలా రాశాడు: “ఒకవేళ మనం, ‘మాలో ఏ పాపం లేదు’ అని చెప్పుకుంటే, మనల్ని మనం మోసం చేసుకున్నట్టే.” (1 యోహా. 1:8) దేవునికి ఇష్టంలేని పనులు చేస్తూనే, ఆయనకు స్నేహితులుగా ఉండగలమని యోహాను రోజుల్లోని అబద్ధ బోధకులు చెప్పేవాళ్లు. నేడున్న ప్రజలు కూడా అలానే చెప్తున్నారు. చాలామంది తమకు దేవుని మీద నమ్మకం ఉందని చెప్పుకుంటున్నారు, కానీ తప్పొప్పుల విషయంలో ముఖ్యంగా, సెక్స్‌ విషయంలో యెహోవా ప్రమాణాల్ని లెక్కచేయట్లేదు. పైగా, ‘ఎవరి ఇష్టం వాళ్లది, ఎవరికి నచ్చినట్టు వాళ్లు జీవించవచ్చు’ అని అంటున్నారు.

యౌవనులారా, తప్పొప్పుల విషయంలో బైబిలు ప్రమాణాల మీద మీకున్న నమ్మకాన్ని బలపర్చుకోండి. అప్పుడు మీ విశ్వాసం గురించి ధైర్యంగా మాట్లాడగలుగుతారు (9వ పేరా చూడండి) *

9. బైబిలు ప్రమాణాలకు అంటిపెట్టుకుని ఉంటే, యౌవనులు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు?

9 తోటి విద్యార్థుల, తోటి ఉద్యోగుల ఒత్తిడి వల్ల సెక్స్‌ విషయంలో బైబిలు ప్రమాణాలకు అంటిపెట్టుకుని ఉండడం, యౌవన క్రైస్తవులకు కష్టంగా అనిపించవచ్చు. అలెక్సాండర్‌ అనే సహోదరుని విషయంలో అదే జరిగింది. ఆయనిలా చెప్తున్నాడు: “స్కూల్లో కొంతమంది అమ్మాయిలు సెక్స్‌లో పాల్గొనమని నన్ను ఒత్తిడి చేసేవాళ్లు. ‘నీకు గర్ల్‌ఫ్రెండ్‌ లేదంటే, నువ్వు గే అయ్యుంటావు’ అనేవాళ్లు.” మీకు కూడా అలాంటి ఒత్తిళ్లు ఎదురైతే, ఈ విషయాల్ని గుర్తుంచుకోండి: బైబిలు ప్రమాణాలకు అంటిపెట్టుకుని ఉంటే మీ ఆత్మ గౌరవాన్ని, ఆరోగ్యాన్ని, యెహోవాతో ఉన్న స్నేహాన్ని కాపాడుకుంటారు; తప్పుచేశానని బాధపడాల్సిన పరిస్థితి తెచ్చుకోరు. సెక్స్‌ విషయంలో ఎదురయ్యే ఒత్తిళ్లను జయించే కొద్దీ, సరైనది చేయడం మీకు మరింత తేలికౌతుంది. సెక్స్‌ గురించి ఈ లోకంలో ఉన్న తప్పుడు అభిప్రాయాలకు మూలం సాతానని మర్చిపోకండి. మీరు ఈ లోకంలోని ప్రజల ఆలోచనల్ని ఎదిరించినప్పుడు ‘దుష్టుడిపై విజయం సాధిస్తారు.’—1 యోహా. 2:14.

10. యెహోవాను స్వచ్ఛమైన మనస్సాక్షితో సేవించడానికి 1 యోహాను 1:9 మనకెలా సహాయం చేస్తుంది?

10 తప్పొప్పుల విషయంలో ప్రమాణాల్ని పెట్టే హక్కు యెహోవాకు మాత్రమే ఉందని మనకు తెలుసు. కాబట్టి మనం పాపం చేయకుండా ఉండడానికి తీవ్రంగా కృషిచేస్తాం. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే, ప్రార్థనలో యెహోవా ముందు దాన్ని ఒప్పుకుంటాం. (1 యోహాను 1:9 చదవండి.) కానీ ఏదైనా ఘోరమైన పాపం చేస్తే, మనల్ని శ్రద్ధగా చూసుకోవడానికి యెహోవా నియమించిన సంఘ పెద్దల సహాయం తీసుకుంటాం. (యాకో. 5:14-16) అయితే గతంలో చేసిన తప్పుల గురించే ఆలోచిస్తూ కృంగిపోకూడదు. ఎందుకు? ఎందుకంటే మన పాపాలు క్షమించబడేలా మన ప్రేమగల తండ్రి తన కుమారుణ్ణి విమోచన క్రయధనంగా అర్పించాడు. పశ్చాత్తాపపడే పాపుల్ని క్షమిస్తానని యెహోవా మాటిస్తున్నాడు, ఆయన మాట తప్పడు. కాబట్టి మనం స్వచ్ఛమైన మనస్సాక్షితో యెహోవాను సేవించగలం.—1 యోహా. 2:1, 2, 12; 3:19, 20.

11. విశ్వాసాన్ని బలహీనపర్చే బోధల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు?

11 అబద్ధ బోధకుల ఆలోచనలకు దూరంగా ఉండాలి. క్రైస్తవ సంఘం మొదలైనప్పటి నుండి, సాతాను చాలామంది మోసగాళ్లను ఉపయోగించి దేవుని నమ్మకమైన సేవకుల మనసుల్లో సందేహాల్ని నాటడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి వాస్తవాలకు, అబద్ధాలకు మధ్య ఉన్న తేడాను మనం గుర్తించగలగాలి. * మనకు యెహోవా మీద ఉన్న నమ్మకాన్ని, తోటి సహోదరుల మీద ఉన్న ప్రేమను బలహీనపర్చడానికి శత్రువులు ఇంటర్నెట్‌ను, సోషల్‌ మీడియాను ఉపయోగించవచ్చు. వాటి వెనక ఉన్నది సాతానని మర్చిపోకండి, వాటికి దూరంగా ఉండండి.—1 యోహా. 4:1, 6; ప్రక. 12:9.

12. మనం నేర్చుకున్న సత్యాల పట్ల మనకున్న నమ్మకాన్ని ఎందుకు బలపర్చుకోవాలి?

12 మన విశ్వాసాన్ని బలహీనపర్చడానికి సాతాను చేసే దాడుల్ని ఎదిరించాలంటే, మనం యేసు మీద నమ్మకాన్ని పెంచుకోవాలి; దేవుని ఇష్టాన్ని నెరవేర్చడంలో ఆయనకున్న పాత్రను బాగా అర్థం చేసుకోవాలి. అంతేకాదు, నేడు తన సంస్థను నడిపించడానికి యెహోవా ఉపయోగించుకుంటున్న వాళ్లమీద కూడా నమ్మకాన్ని పెంచుకోవాలి. (మత్త. 24:45-47) అలా పెంచుకోవాలంటే, దేవుని వాక్యాన్ని క్రమంగా అధ్యయనం చేయాలి. అప్పుడు మన విశ్వాసం నేలలోకి లోతుగా వేళ్లూనుకున్న చెట్టులా ఉంటుంది. కొలొస్సయి సంఘానికి ఉత్తరం రాస్తున్నప్పుడు పౌలు అలాంటి మాటనే చెప్పాడు: “మీరు ప్రభువైన క్రీస్తుయేసును ఎలా అంగీకరించారో, అలాగే ఆయనతో ఐక్యంగా నడుస్తూ ఉండండి. మీరు నేర్చుకున్నట్టే, క్రీస్తు మీద మీకున్న విశ్వాసం లోతుగా వేళ్లూనుకున్న చెట్టులా బలంగా, స్థిరంగా ఉండాలి.” (కొలొ. 2:6, 7) మనం తీవ్రంగా కృషి చేసి విశ్వాసాన్ని బలపర్చుకుంటే, సాతాను గానీ అతని అనుచరులు గానీ మనల్ని సత్యంలో నడవకుండా అడ్డుకోలేరు.—2 యోహా. 8, 9.

13. మనం ఏ విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఎందుకు?

13 లోకం మనల్ని ద్వేషిస్తుందని గుర్తుంచుకోవాలి. (1 యోహా. 3:13) “లోకమంతా దుష్టుని గుప్పిట్లో ఉంది” అని యోహాను కూడా గుర్తుచేస్తున్నాడు. (1 యోహా. 5:19) ఈ వ్యవస్థ అంతం దగ్గరపడుతున్న కొద్దీ సాతాను కోపం మరింత ఎక్కువౌతుంది. (ప్రక. 12:12) అతను అనైతికత, అబద్ధ బోధలు వంటి దొంగచాటు దాడులతో పాటు, తీవ్రమైన హింసను తీసుకురావడం ద్వారా నేరుగా కూడా దాడి చేస్తాడు. మన ప్రకటనా పనిని ఆపడానికి, మన విశ్వాసాన్ని బలహీనపర్చడానికి తనకు కొంచెం సమయమే ఉందని సాతానుకు తెలుసు. మన పని మీద ఎన్నో దేశాల్లో ఆంక్షలు లేదా నిషేధాలు రావడం చూసి మనం ఆశ్చర్యపోం. అలాంటి దేశాల్లో కూడా మన సహోదర సహోదరీలు నమ్మకంగా సహిస్తున్నారు. సాతాను ఏం చేసినా, మనం యెహోవాకు నమ్మకంగానే ఉంటామని వాళ్లు నిరూపిస్తున్నారు!

సత్యంలో కొనసాగేలా ఒకరికొకరు సహాయం చేసుకోండి

14. సత్యంలో కొనసాగేలా సహోదర సహోదరీలకు సహాయం చేయగల ఒక మార్గం ఏంటి?

14 సత్యంలో కొనసాగేలా సహోదర సహోదరీలకు సహాయం చేయాలంటే, మనం కనికరం చూపించాలి. (1 యోహా. 3:10, 11, 16-18) అంతా బాగున్నప్పుడే కాదు, సమస్యలు వచ్చినప్పుడు కూడా మనం ఒకరినొకరం ప్రేమించుకోవాలి. ఉదాహరణకు మీ తోటి విశ్వాసుల్లో ఎవరి కుటుంబ సభ్యులైనా, స్నేహితులైనా చనిపోయారా? వాళ్లకు మీ ఓదార్పు, సహాయం అవసరమా? లేదా మీ తోటి విశ్వాసులు ఎవరైనా ప్రకృతి విపత్తు వల్ల ఆర్థికంగా నష్టపోయారా? తమ ఇళ్లను, రాజ్యమందిరాల్ని తిరిగి నిర్మించుకునే విషయంలో వాళ్లకు సహాయం అవసరమా? సహోదర సహోదరీల మీద మనకున్న ప్రగాఢమైన ప్రేమను, కనికరాన్ని మాటల్లోనే కాదు పనుల్లో కూడా చూపించాలి.

15. మొదటి యోహాను 4:7, 8 ప్రకారం మనం ఏం చేయాలి?

15 మన ప్రేమగల పరలోక తండ్రిని అనుకరిస్తూ మనం ఒకరి మీద ఒకరం ప్రేమ చూపిస్తాం. (1 యోహాను 4:7, 8 చదవండి.) అలా ప్రేమ చూపించడానికి గల ఒక ముఖ్యమైన మార్గం, ఒకరినొకరం క్షమించుకోవడం. ఉదాహరణకు, సంఘంలో ఎవరైనా మనల్ని బాధపెట్టి, ఆ తర్వాత క్షమాపణ అడిగినప్పుడు మనం వాళ్లను క్షమించి, ఆ విషయాన్ని మర్చిపోవడం ద్వారా ప్రేమ చూపిస్తాం. (కొలొ. 3:13) ఆల్డో అనే సహోదరుడు అలానే చేశాడు. అతను ఎంతో గౌరవించే ఒక సహోదరుడు, ఆల్డో వాళ్ల సంస్కృతిని తక్కువ చేస్తూ మాట్లాడాడు. ఆల్డో ఇలా చెప్తున్నాడు: “ఆ సహోదరుని గురించి తప్పుగా ఆలోచించకుండా ఉండడానికి సహాయం చేయమని యెహోవాకు పట్టుదలగా ప్రార్థించాను.” అయితే ఆల్డో ఇంకో పని కూడా చేశాడు. తనతో పరిచర్య చేయడానికి రమ్మని ఆ సహోదరుణ్ణి ఆహ్వానించాడు. వాళ్లు కలిసి పరిచర్య చేస్తున్నప్పుడు, అతని మాటలు తనను ఎంత గాయపర్చాయో ఆల్డో వివరించాడు. ఆల్డో ఇంకా ఇలా అంటున్నాడు: “అది తెలిసిన తర్వాత, ఆ సహోదరుడు క్షమించమని అడిగాడు. తప్పుగా మాట్లాడినందుకు ఎంత బాధపడుతున్నాడో అతని స్వరాన్ని బట్టి నాకు అర్థమైంది. మేము జరిగిందంతా మర్చిపోయి, మళ్లీ మంచి స్నేహితులమయ్యాం.”

16-17. మనం ఏమని నిర్ణయించుకోవాలి?

16 అపొస్తలుడైన యోహాను తన తోటి సహోదరుల్ని ఎంతో ప్రేమించాడు, వాళ్లు విశ్వాసంలో బలంగా ఉండాలని కోరుకున్నాడు. ఆయనకు వాళ్లమీద ఉన్న ప్రేమ, శ్రద్ధ ఆయన రాసిన మూడు ఉత్తరాల్లోని సలహాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. యోహాను లాంటి సహోదర సహోదరీలు మనల్ని యేసుతోపాటు పరిపాలించబోతున్నారని తెలుసుకోవడం ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తుందో కదా!—1 యోహా. 2:27.

17 ఈ ఆర్టికల్‌లో చర్చించుకున్న సలహాల్ని మనసులో ఉంచుకుందాం. సత్యంలో నడుస్తూ ఉండాలని, అంటే మన జీవితంలోని అన్ని విషయాల్లో యెహోవాకు లోబడాలని నిర్ణయించుకుందాం. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేద్దాం, దానిలో ఉన్న విషయాల్ని నమ్ముదాం. యేసుపై బలమైన విశ్వాసాన్ని పెంచుకుందాం. మనుషుల బోధల వల్ల, అబద్ధ బోధకుల ఆలోచనల వల్ల మోసపోకుండా ఉందాం. రెండు రకాల జీవితానికి దూరంగా ఉందాం, పాపం చేయకుండా జాగ్రత్తపడదాం. యెహోవా ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా జీవిద్దాం. మనల్ని బాధపెట్టినవాళ్లను క్షమిస్తూ, అవసరంలో ఉన్నవాళ్లకు అండగా ఉంటూ సత్యంలో కొనసాగేలా ఒకరికొకరం సహాయం చేసుకుందాం. అలాచేస్తే, ఎలాంటి సవాళ్లు ఎదురైనా సత్యంలో నడుస్తూ ఉంటాం.

పాట 49 యెహోవా హృదయాన్ని సంతోషపెడదాం

^ పేరా 5 అబద్ధానికి తండ్రి అయిన సాతాను పరిపాలిస్తున్న లోకంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి సత్యంలో నడవడం ఒక పోరాటంలా ఉంటుంది. మొదటి శతాబ్దం చివర్లో జీవించిన క్రైస్తవులు కూడా అలాంటి పోరాటమే పోరాడారు. వాళ్లకు, అలాగే మనకు సహాయం చేయడానికి యెహోవా అపొస్తలుడైన యోహానును ప్రేరేపించి మూడు ఉత్తరాలు రాయించాడు. మనకు ఎలాంటి సవాళ్లు ఎదురౌతాయో తెలుసుకోవడానికి, వాటిని అధిగమించడానికి ఆ ఉత్తరాలు సహాయం చేస్తాయి.

^ పేరా 6 కొన్ని అసలు పేర్లు కావు.

^ పేరా 11 ఆగస్టు 2018 కావలికోట పత్రికలోని “మీకు వాస్తవాలు తెలుసా?” అనే అధ్యయన ఆర్టికల్‌ చూడండి.

^ పేరా 59 చిత్రాల వివరణ: ఒక యౌవన సహోదరి చదువుకుంటున్న స్కూల్లో ఎక్కడ చూసినా హోమోసెక్సువల్‌ జీవన విధానాన్ని సమర్థించే విషయాలే ఉన్నాయి. (కొన్ని దేశాల్లో, హోమోసెక్సువల్‌ జీవన విధానానికి సూచనగా ఇంద్రధనుస్సు రంగుల్ని ఉపయోగిస్తారు.) ఆ సహోదరి క్రైస్తవ ప్రమాణాల విషయంలో తన నమ్మకాన్ని బలపర్చుకోవడానికి పరిశోధన చేస్తోంది. ఆ కష్టమైన సవాలును ఎదుర్కోవడానికి అది ఆమెకు సహాయం చేసింది.