కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 50

“చనిపోయినవాళ్లు ఎలా బ్రతికించబడతారు?”

“చనిపోయినవాళ్లు ఎలా బ్రతికించబడతారు?”

“మరణమా, నీ విజయం ఎక్కడ? మరణమా, నీ విషపు కొండి ఎక్కడ?”—1 కొరిం. 15:55.

పాట 141 జీవం ఒక అద్భుతం

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. పరలోక పునరుత్థానం గురించి క్రైస్తవులందరూ ఎందుకు తెలుసుకోవాలి?

నేడు యెహోవాను సేవిస్తున్న ప్రజల్లో చాలామందికి భూమ్మీద శాశ్వత కాలం జీవించే నిరీక్షణ ఉంది. అయితే భూమ్మీద మిగిలివున్న అభిషిక్త క్రైస్తవులకు పరలోక నిరీక్షణ ఉంది. ఈ అభిషిక్త క్రైస్తవులు పరలోకంలో తమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నారు. మరి భూనిరీక్షణ ఉన్నవాళ్ల సంగతేంటి? మనం ఈ ఆర్టికల్‌లో చూడబోతున్నట్టు, పరలోక పునరుత్థానం వల్ల భూనిరీక్షణ ఉన్నవాళ్లు కూడా ఆశీర్వాదాలు పొందుతారు. కాబట్టి మనకు పరలోక నిరీక్షణ ఉన్నా, భూనిరీక్షణ ఉన్నా పరలోక పునరుత్థానం గురించి తెలుసుకోవాలి.

2 మొదటి శతాబ్దంలో కొంతమంది శిష్యులు దైవప్రేరణతో పరలోక నిరీక్షణ గురించి రాశారు. అపొస్తలుడైన యోహాను ఇలా వివరించాడు: “మనం ఇప్పుడు దేవుని పిల్లలం, కానీ భవిష్యత్తులో మనం ఎలా ఉంటామో ఇంకా వెల్లడి చేయబడలేదు. అయితే ఆయన వెల్లడి చేయబడినప్పుడు మనం ఆయనలా ఉంటామని మాత్రం మనకు తెలుసు.” (1 యోహా. 3:2) కాబట్టి, పరలోకానికి పునరుత్థానం అయినప్పుడు వాళ్లు ఎలా ఉంటారో అభిషిక్త క్రైస్తవులకు తెలీదు. అయితే, వాళ్లు పరలోక బహుమానం పొందినప్పుడు యెహోవాను నిజంగా చూస్తారని వాళ్లకు తెలుసు. పరలోక పునరుత్థానం గురించి బైబిలు అన్ని వివరాలూ చెప్పట్లేదు, కానీ అపొస్తలుడైన పౌలు రాసిన మాటల్ని బట్టి మనం కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. క్రీస్తు “ప్రభుత్వాలన్నిటినీ, సమస్తమైన అధికారాన్ని, శక్తిని” అలాగే ‘చివరి శత్రువైన మరణాన్ని’ నిర్మూలిస్తున్నప్పుడు అభిషిక్తులు ఆయనతోపాటే ఉంటారు. చివరికి యేసు, ఆయన సహపరిపాలకులు సమస్తాన్ని యెహోవాకు లోబరుస్తారు, అలాగే తమను తాము కూడా యెహోవాకు లోబర్చుకుంటారు. (1 కొరిం. 15:24-28) అది ఎంత అద్భుతమైన సమయమో కదా! *

3. మొదటి కొరింథీయులు 15:30-32 ప్రకారం, పునరుత్థాన నిరీక్షణ మీద ఉన్న నమ్మకం వల్ల పౌలు ఏం చేయగలిగాడు?

3 పునరుత్థాన నిరీక్షణ మీద ఉన్న నమ్మకం వల్ల పౌలు ఎన్నో శ్రమల్ని సహించాడు. (1 కొరింథీయులు 15:30-32 చదవండి.) “నాకు ప్రతీరోజు చావు ఎదురౌతోంది” అని ఆయన కొరింథీయులతో అన్నాడు. ఆయన ఇంకా ఇలా రాశాడు: ‘నేను ఎఫెసులో క్రూరమృగాలతో పోరాడాను.’ ఎఫెసులోని క్రీడా ప్రాంగణంలో తాను జంతువులతో పోరాడడం గురించి పౌలు మాట్లాడుతుండవచ్చు. (2 కొరిం. 1:8; 4:10; 11:23) లేదా తన మీద ద్వేషం వెళ్లగక్కుతున్న యూదుల్ని, ఇతరుల్ని ఆయన “క్రూరమృగాలతో” పోల్చి ఉండవచ్చు. (అపొ. 19:26-34; 1 కొరిం. 16:9) ఏదేమైనా పౌలు ఎన్నో తీవ్రమైన కష్టాల్ని ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ, భవిష్యత్తు మీద తనకున్న నిరీక్షణను కాపాడుకున్నాడు.—2 కొరిం. 4:16-18.

మన పని మీద ఆంక్షలు ఉన్న దేశంలోని ఒక కుటుంబం యెహోవా సేవలో కొనసాగుతున్నారు, భవిష్యత్తులో దేవుడు మెరుగైన జీవితాన్ని ఇస్తాడనే పూర్తి నమ్మకంతో ఉన్నారు (4వ పేరా చూడండి)

4. పునరుత్థాన నిరీక్షణ నేడున్న క్రైస్తవులకు ఎలా ధైర్యాన్ని ఇస్తుంది? (ముఖచిత్రం చూడండి.)

4 మనం ప్రమాదకరమైన కాలాల్లో జీవిస్తున్నాం. మన సహోదరుల్లో కొంతమంది నేరాలకు బలౌతున్నారు. ఇంకొంతమంది యుద్ధాలు జరుగుతున్న ప్రాంతాల్లో ఆందోళనకరమైన పరిస్థితుల మధ్య జీవిస్తున్నారు. మరికొంతమంది ప్రకటనా పని మీద ఆంక్షలు లేదా నిషేధాలు ఉన్న దేశాల్లో, తమ ప్రాణాన్ని లేదా స్వేచ్ఛను పణంగా పెట్టి యెహోవాను సేవిస్తున్నారు. అయినప్పటికీ, ఈ సహోదర సహోదరీలందరూ యెహోవా సేవలో కొనసాగుతూ మనకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పుడు ప్రాణాలు కోల్పోయినా, భవిష్యత్తులో యెహోవా తమను పునరుత్థానం చేసి మరింత మెరుగైన జీవితాన్ని ఇస్తాడనే నమ్మకంతో వాళ్లు ధైర్యంగా ఉంటున్నారు.

5. ఎలాంటి ఆలోచన వల్ల పునరుత్థాన నిరీక్షణ మీద మనకున్న విశ్వాసం బలహీనపడవచ్చు?

5 ఒక ప్రమాదకరమైన ఆలోచనకు దూరంగా ఉండమని పౌలు తన సహోదరుల్ని హెచ్చరించాడు. కొరింథులో కొంతమంది, “చనిపోయినవాళ్లు బ్రతికించబడకపోతే, ‘ఎలాగూ రేపు చచ్చిపోతాం కదా, రండి తిందాం, తాగుదాం’” అనే ఆలోచనతో ఉన్నారు. నిజానికి ఆ ఆలోచన పౌలుకు ముందు కాలంలో కూడా ఉంది. ఆయన యెషయా 22:13 లో ఉన్న మాటల్ని ఎత్తి చెప్తుండవచ్చు. ఇశ్రాయేలీయుల వైఖరి గురించి ఆ లేఖనం మాట్లాడుతుంది. వాళ్లు దేవునికి దగ్గరవ్వడానికి ప్రయత్నించే బదులు సుఖాల వెంట పరుగెత్తారు. చెప్పాలంటే ఇశ్రాయేలీయుల ఆలోచన, ‘ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు కాబట్టి ఇప్పుడు సుఖంగా బ్రతుకుదాం’ అన్నట్టు ఉంది. నేడు కూడా చాలామంది అలాంటి ఆలోచనతోనే ఉన్నారు. అయితే, ఆ తప్పుడు ఆలోచన వల్ల ఇశ్రాయేలీయులు ఎలాంటి చెడు పర్యవసానాలు అనుభవించారో బైబిలు చెప్తుంది.—2 దిన. 36:15-20.

6. పునరుత్థాన నిరీక్షణ ఉన్న మనం స్నేహితుల్ని ఎంచుకునే విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?

6 చనిపోయిన వాళ్లను యెహోవా పునరుత్థానం చేస్తాడని మనం నమ్ముతున్నాం కాబట్టి స్నేహితుల్ని ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొరింథు సంఘంలోని వాళ్లు పునరుత్థానాన్ని నమ్మనివాళ్ల సహవాసానికి దూరంగా ఉండాలి. దాన్నుండి మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు: ఇప్పటి జీవితం కోసమే బ్రతికేవాళ్లతో క్రమంగా సహవసిస్తే మన మీద చెడు ప్రభావం పడుతుంది. ఒక నిజ క్రైస్తవుడు అలాంటి వాళ్లతో సహవసిస్తే అతని ఆలోచనా తీరు, అలవాట్లు పాడైపోవచ్చు. అలాంటి వాళ్లతో సహవసించడం వల్ల అతను చివరికి దేవుడు ద్వేషించేవాటిని చేసే ప్రమాదం ఉంది. అందుకే పౌలు సూటిగా ఇలా అన్నాడు: “కళ్లు తెరవండి, నీతిగా నడుచుకోండి; పాపపు మార్గంలో నడవకండి.”—1 కొరిం. 15:33, 34.

ఎలాంటి శరీరంతో తిరిగి బ్రతికించబడతారు?

7. మొదటి కొరింథీయులు 15:35-38 ప్రకారం, కొంతమంది పునరుత్థానం గురించి ఏమని అడిగి ఉండవచ్చు?

7 మొదటి కొరింథీయులు 15:35-38 చదవండి. ఆ కాలంలో, పునరుత్థానం మీద సందేహాలు పుట్టించాలనుకునే వ్యక్తి ఇలా అడిగి ఉండవచ్చు: “చనిపోయినవాళ్లు ఎలా బ్రతికించబడతారు?” మనం పౌలు ఇచ్చిన జవాబును పరిశీలించడం మంచిది. ఎందుకంటే, నేడు కూడా చాలామంది మరణం తర్వాత జీవితం గురించి రకరకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఇంతకీ బైబిలు ఏం చెప్తోంది?

పునరుత్థానమైన వాళ్లకు దేవుడు తగిన శరీరాన్ని ఇవ్వగలడని పౌలు వివరించాడు (8వ పేరా చూడండి)

8. పరలోక పునరుత్థానం గురించి అర్థం చేసుకోవడానికి ఏ ఉదాహరణ మనకు సహాయం చేస్తుంది?

8 ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని శరీరం కుళ్లిపోతుంది. కానీ శూన్యం నుండి విశ్వాన్ని తయారుచేసిన సృష్టికర్త, చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించి అతనికి ఒక శరీరాన్ని ఇవ్వలేడా? ఇవ్వగలడు. (ఆది. 1:1; 2:7) దేవుడు అతనికి అతని పాత శరీరాన్నే ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పడానికి పౌలు ఒక ఉదాహరణ ఉపయోగించాడు. ఒక “గోధుమ గింజ” లేదా “విత్తనం” గురించి ఆలోచించండి. ఒక విత్తనాన్ని నేలలో నాటినప్పుడు, అది మొలకెత్తి ఒక కొత్త మొక్కగా తయారౌతుంది. అలా వచ్చిన మొక్క, విత్తనానికి భిన్నంగా ఉంటుంది. మన సృష్టికర్త “తనకు నచ్చిన శరీరాన్ని” ఇవ్వగలడు అని చెప్పడానికి పౌలు ఆ ఉదాహరణ ఉపయోగించాడు.

9. వేర్వేరు శరీరాల గురించి 1 కొరింథీయులు 15:39-41 ఏం చెప్తుంది?

9 మొదటి కొరింథీయులు 15:39-41 చదవండి. సృష్టిలో గొప్ప వైవిధ్యం ఉందని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ఉదాహరణకు, పశువుల శరీరం వేరు; పక్షుల శరీరం వేరు; చేపల శరీరం వేరు. ఆకాశంలో మనం చూసే సూర్యుడి, చంద్రుడి వైభవాలు వేరు. “నక్షత్రాల్లో కూడా ఒక్కో నక్షత్రం వైభవం వేరు” అని పౌలు చెప్పాడు. మనకు ఆ తేడా స్పష్టంగా కనిపించకపోయినా అది నిజం. విశ్వంలో రకరకాల నక్షత్రాలు ఉన్నాయని, కొన్ని పెద్దవని, కొన్ని చిన్నవని, కొన్ని ఎరుపు, తెలుపు, పసుపు రంగులో ఉన్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. అంతేకాదు, ‘పరలోక సంబంధమైన శరీరాలు, భూసంబంధమైన శరీరాలు ఉన్నాయి’ అని పౌలు చెప్పాడు. ఆ మాటలకు అర్థం ఏంటి? భూమ్మీద రక్తమాంసాల శరీరాలు ఉన్నాయి, కానీ పరలోకంలో దేవదూతలకు ఉన్నలాంటి ఆత్మ సంబంధ శరీరాలు ఉన్నాయి.

10. పరలోకానికి వెళ్లేవాళ్లు ఏ శరీరంతో బ్రతికించబడతారు?

10 తర్వాత పౌలు ఏం చెప్పాడో గమనించండి: “మృతుల పునరుత్థానం విషయం కూడా అంతే. కుళ్లిపోయే శరీరం పాతిపెట్టబడుతుంది, అది కుళ్లిపోని శరీరంగా లేపబడుతుంది.” నిజమే, చనిపోయినప్పుడు మానవ శరీరం కుళ్లిపోయి మట్టిలో కలిసిపోతుంది. (ఆది. 3:19) మరి అది “కుళ్లిపోని శరీరంగా” ఎలా లేపబడుతుంది? పౌలు ఇక్కడ భూమ్మీదికి పునరుత్థానం చేయబడిన మనుషుల గురించి మాట్లాడట్లేదు, అంటే ఏలీయా, ఎలీషా, యేసు పునరుత్థానం చేసిన వాళ్ల గురించి మాట్లాడట్లేదు. బదులుగా, పరలోకానికి పునరుత్థానమయ్యే వాళ్ల గురించి అంటే ‘పరలోక సంబంధమైన శరీరంతో’ బ్రతికించబడే వాళ్ల గురించి మాట్లాడుతున్నాడు.—1 కొరిం. 15:42-44.

11-12. యేసు ఎలాంటి శరీరంతో తిరిగి బ్రతికించబడ్డాడు? అభిషక్తులు కూడా ఎలాంటి శరీరంతో బ్రతికించబడతారు?

11 భూమ్మీద ఉన్నప్పుడు యేసు రక్తమాంసాల శరీరంతో ఉన్నాడు. కానీ పునరుత్థానమైనప్పుడు ఆయన “జీవాన్నిచ్చే పరలోక సంబంధ వ్యక్తి” అయ్యి, పరలోకానికి తిరిగెళ్లాడు. అదేవిధంగా అభిషిక్త క్రైస్తవులు కూడా పరలోక సంబంధమైన శరీరాలతో బ్రతికించబడతారు. పౌలు ఇలా వివరించాడు: “మనం భూమి నుండి వచ్చిన వ్యక్తిలా ఉన్నట్టే, పరలోకం నుండి వచ్చిన వ్యక్తిలా కూడా ఉంటాం.”—1 కొరిం. 15:45-49.

12 పునరుత్థానం గురించిన చర్చలో పౌలు ముగింపుకు వచ్చేశాడు. యేసు మానవ శరీరంతో తిరిగి బ్రతికించబడలేదని మనం గమనించాలి. “రక్తమాంసాలు దేవుని రాజ్యంలోకి” అంటే పరలోకంలోకి “ప్రవేశించలేవు” అని పౌలు సూటిగా చెప్పాడు. (1 కొరిం. 15:50) కాబట్టి అపొస్తలులు, ఇతర అభిషిక్తులు కుళ్లిపోయే శరీరాలతో అంటే రక్తమాంసాల శరీరాలతో పరలోకానికి పునరుత్థానం అవ్వరు. వాళ్లు ఎప్పుడు పునరుత్థానం అవుతారు? వాళ్లు చనిపోయిన వెంటనే పునరుత్థానం అవ్వరు గానీ వాళ్లు వేచివుండాలని పౌలు చెప్పాడు. పౌలు కొరింథీయులకు మొదటి ఉత్తరం రాసే సమయానికి, కొంతమంది శిష్యులు అప్పటికే “చనిపోయారు.” వాళ్లలో ఒకరు, అపొస్తలుడైన యాకోబు. (అపొ. 12:1, 2) మిగతా అపొస్తలులు, అభిషిక్తులు ఆ తర్వాత “చనిపోయారు.”—1 కొరిం. 15:6.

మరణంపై విజయం

13. యేసు ప్రత్యక్షత కాలంలో ఏం జరుగుతుంది?

13 యేసు, పౌలు ఇద్దరూ చరిత్రలో ఒక ప్రత్యేకమైన సమయం గురించి అంటే క్రీస్తు ప్రత్యక్షత గురించి మాట్లాడారు. ఆ ప్రత్యక్షతా కాలంలో యుద్ధాలు, భూకంపాలు, తెగుళ్లు, ఇతర సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయి. 1914 నుండి ఆ ప్రవచనం నెరవేరడం మనం చూస్తున్నాం. ఆ సూచనలో మరో ప్రాముఖ్యమైన భాగం కూడా ఉంది. దేవుడు తన రాజ్యాన్ని స్థాపించాడనే మంచివార్త “అన్నిదేశాల ప్రజలకు సాక్ష్యంగా ఉండేలా . . . భూమంతటా ప్రకటించబడుతుంది. ఆ తర్వాత అంతం వస్తుంది” అని యేసు చెప్పాడు. (మత్త. 24:3, 7-14) ‘చనిపోయిన’ అభిషిక్త క్రైస్తవులు పునరుత్థానం అయ్యేది కూడా “ప్రభువు ప్రత్యక్షత” కాలంలోనే అని పౌలు చెప్పాడు.—1 థెస్స. 4:14-16; 1 కొరిం. 15:23.

14. క్రీస్తు ప్రత్యక్షత కాలంలో చనిపోయే అభిషిక్తులకు ఏం జరుగుతుంది?

14 ఇప్పుడున్న అభిషిక్త క్రైస్తవులు చనిపోయిన వెంటనే పరలోకానికి పునరుత్థానం అవుతారు. ఆ విషయాన్నే పౌలు 1 కొరింథీయులు 15:51, 52 లో చెప్పాడు: “మనమందరం మరణంలో నిద్రించం, కానీ మనమందరం మార్పు చెందుతాం; ఒక్క క్షణంలో, రెప్పపాటున, చివరి బాకా ఊదబడుతుండగా మనం మార్పు చెందుతాం.” ఆ మాటలు ఇప్పుడు నెరవేరుతున్నాయి! పునరుత్థానం అయ్యాక ఈ క్రీస్తు సహోదరులు గొప్ప సంతోషాన్ని పొందుతారు, “ఎప్పుడూ ప్రభువుతోనే ఉంటారు.”—1 థెస్స. 4:17.

“రెప్పపాటున” మార్పు చెందేవాళ్లు యేసుతో కలిసి ఇనుప దండంతో దేశాల్ని పగలగొడతారు (15వ పేరా చూడండి)

15. “రెప్పపాటున” మార్పు చెందేవాళ్లు పరలోకంలో ఏ పని చేస్తారు?

15 “రెప్పపాటున” మార్పు చెందేవాళ్లు పరలోకంలో ఏం చేస్తారో బైబిలు మనకు చెప్తుంది. యేసు వాళ్లతో ఇలా అంటాడు: “నేను ఆజ్ఞాపించినవాటిని చివరివరకు పాటించి జయించే వ్యక్తికి లోకంలోని దేశాల మీద అధికారం ఇస్తాను. అలాంటి అధికారాన్నే నేను నా తండ్రి నుండి పొందాను. జయించే వ్యక్తి ఇనుప దండంతో ఆ ప్రజల్ని శిక్షిస్తాడు, వాళ్లు మట్టిపాత్రల్లా పగలగొట్టబడతారు.” (ప్రక. 2:26, 27) వాళ్లు తమ నాయకుడైన యేసును అనుసరించి, ఇనుప దండంతో దేశాల్ని పరిపాలిస్తారు.—ప్రక. 19:11-15.

16. చాలామంది మనుషులు మరణంపై ఎలా విజయం సాధిస్తారు?

16 కాబట్టి అభిషిక్తులు మరణంపై విజయం సాధిస్తారని స్పష్టమౌతోంది. (1 కొరిం. 15:54-57) వాళ్లు పరలోకానికి పునరుత్థానమైన తర్వాత, రాబోయే హార్‌మెగిద్దోను యుద్ధంలో యేసుతో కలిసి భూమ్మీదున్న చెడు అంతటినీ నిర్మూలిస్తారు. లక్షలమంది క్రైస్తవ స్త్రీపురుషులు ‘మహాశ్రమను దాటి వచ్చి’ కొత్తలోకంలోకి అడుగుపెడతారు. (ప్రక. 7:14) మరణంపై సాధించిన మరో విజయాన్ని వాళ్లు చూస్తారు, అంటే గతంలో చనిపోయిన కోట్లమంది ప్రజలు పునరుత్థానం అవ్వడాన్ని కళ్లారా చూస్తారు. ఆ అద్భుతమైన సంఘటన జరిగినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో ఊహించండి! (అపొ. 24:15) అంతేకాదు, యెహోవాకు పూర్తి నమ్మకంగా ఉన్న వాళ్లందరూ ఆదాము వల్ల వారసత్వంగా వచ్చిన మరణంపై విజయం సాధిస్తారు. అప్పుడు వాళ్లు శాశ్వత కాలం జీవించగలుగుతారు.

17. మొదటి కొరింథీయులు 15:58 ని మనసులో ఉంచుకుని, మనం ఇప్పుడు ఏం చేయాలి?

17 పునరుత్థానం గురించి పౌలు కొరింథీయులకు రాసిన ప్రోత్సాహకరమైన మాటల్ని బట్టి నేడున్న ప్రతీ క్రైస్తవుడు సంతోషించాలి. “ఎప్పుడూ ప్రభువు సేవలో నిమగ్నమై” ఉండమని పౌలు ఇచ్చిన సలహాను పాటించడానికి మనకు మంచి కారణాలు ఉన్నాయి. (1 కొరింథీయులు 15:58 చదవండి.) మనం ఆ పనిలో నమ్మకంగా, ఉత్సాహంగా పాల్గొంటే సంతోషకరమైన భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు. ఆ భవిష్యత్తు మనం ఊహించేదాని కన్నా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రభువు సేవలో మనం పడిన కష్టం వృథా కాలేదని అప్పుడు రుజువు అవుతుంది.

పాట 140 పరదైసులో శాశ్వత జీవితం!

^ పేరా 5 మొదటి కొరింథీయులు 15 వ అధ్యాయంలోని రెండో భాగం పునరుత్థానం గురించి, మరిముఖ్యంగా అభిషిక్తులు పొందే పునరుత్థానం గురించి వివరిస్తుంది. అయితే, పౌలు రాసిన విషయాలు వేరే గొర్రెలకు కూడా ప్రాముఖ్యమైనవే. పునరుత్థాన నిరీక్షణ ఉన్న మనం ఇప్పుడు ఎలా జీవించాలో, భవిష్యత్తులో సంతోషంగా జీవించడానికి ఆ నిరీక్షణ మనకెలా సహాయం చేస్తుందో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

^ పేరా 2 మొదటి కొరింథీయులు 15:29 గురించిన వివరణ, ఈ పత్రికలోని “పాఠకుల ప్రశ్నలు”లో ఉంది.