పాఠకుల ప్రశ్నలు
అపొస్తలుడైన పౌలు 1 కొరింథీయులు 15:29 లో, తన కాలంనాటి కొంతమంది క్రైస్తవులు చనిపోయినవాళ్ల కోసం బాప్తిస్మం తీసుకున్నారని చెప్తున్నాడా?
లేదు, అలాంటిది జరిగినట్టు బైబిల్లో గానీ చరిత్రలో గానీ ఆధారాలు లేవు.
చాలా బైబిళ్లలో ఆ లేఖనాన్ని అనువదించిన తీరును బట్టి, పౌలు కాలంలో క్రైస్తవులు చనిపోయినవాళ్ల కోసం నీటి బాప్తిస్మం తీసుకున్నారని కొంతమంది పాఠకులు అనుకున్నారు. ఉదాహరణకు ఒక బైబిల్లో ఆ లేఖనాన్ని ఇలా అనువదించారు: “మృతులేమాత్రమును లేపబడనియెడల మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేల?”—పరిశుద్ధ గ్రంథము.
అయితే, ఇద్దరు బైబిలు పండితులు ఏమంటున్నారో గమనించండి. డాక్టర్ గ్రిగరీ లాక్‌వుడ్ ఇలా అన్నాడు: “ఒక వ్యక్తి చనిపోయినవాళ్ల కోసం బాప్తిస్మం తీసుకున్నట్టు చరిత్రలో గానీ, బైబిల్లో గానీ ఆధారాలు లేవు.” ప్రొఫెసర్ గార్డన్ డీ. ఫీ కూడా ఇలా రాశాడు: “ఎవరైనా అలాంటి బాప్తిస్మం తీసుకున్నట్టు చరిత్రలో గానీ, బైబిల్లో గానీ రుజువులు లేవు. కొత్త నిబంధనలో దాని ప్రస్తావనే లేదు. తొలి క్రైస్తవులు గానీ, అపొస్తలులు చనిపోయిన కొత్తలో ఏర్పడిన చర్చీలు గానీ అలాంటి బాప్తిస్మం ఇచ్చినట్టు రుజువులు లేవు.”
యేసు అనుచరులు ‘అన్నిదేశాల ప్రజల్ని శిష్యులుగా చేయాలని, వాళ్లకు బాప్తిస్మం ఇవ్వాలని, యేసు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటించడం వాళ్లకు నేర్పించాలని’ బైబిలు చెప్తుంది. (మత్త. 28:19, 20) ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకుని శిష్యుడు అవ్వాలంటే యెహోవా గురించి, ఆయన కుమారుని గురించి తెలుసుకోవాలి, వాళ్లను నమ్మాలి, వాళ్లకు లోబడాలి. చనిపోయి సమాధిలో ఉన్న వ్యక్తి అలా చేయలేడు. బ్రతికున్న క్రైస్తవుడు కూడా చనిపోయిన వ్యక్తి కోసం అలా చేయలేడు.—ప్రసం. 9:5, 10; యోహా. 4:1; 1 కొరిం. 1:14-16.
మరైతే పౌలు ఏం చెప్తున్నాడు?
కొంతమంది కొరింథీయులు మృతుల పునరుత్థానం లేదని చెప్పేవాళ్లు. (1 కొరిం. 15:12) పౌలు వాళ్ల అభిప్రాయాన్ని సరిదిద్దాలనుకున్నాడు. తనకు “ప్రతీరోజు చావు ఎదురౌతోంది” అని పౌలు అన్నాడు. తనకు ప్రతీరోజు ప్రమాదాలు ఎదురౌతున్నాయని, అయినప్పటికీ యేసులాగే తాను తప్పకుండా పరలోకానికి పునరుత్థానం అవుతానని పౌలు వివరించాడు.—1 కొరిం. 15:30-32, 42-44.
అభిషిక్త క్రైస్తవులు ప్రతీరోజు శ్రమలు అనుభవించి చనిపోతారని, ఆ తర్వాత పునరుత్థానం అవుతారని కొరింథీయులు అర్థం చేసుకోవాలి. వాళ్లు క్రీస్తుయేసులోకి బాప్తిస్మం తీసుకుంటే, ‘ఆయన మరణంలోకి కూడా బాప్తిస్మం’ తీసుకున్నట్టే. (రోమా. 6:3) అంటే, పరలోకానికి పునరుత్థానం అవ్వాలంటే వాళ్లు యేసులాగే శ్రమలు అనుభవించి చనిపోవాలి.
యేసు నీటి బాప్తిస్మం తీసుకున్న రెండు కన్నా ఎక్కువ సంవత్సరాల తర్వాత, ఇద్దరు అపొస్తలులతో ఇలా అన్నాడు: “నేను తీసుకుంటున్న బాప్తిస్మం మీరు తీసుకుంటారు.” (మార్కు 10:38, 39) యేసు ఇక్కడ నీటి బాప్తిస్మం గురించి కాదుగానీ, ‘మరణంలోకి తీసుకునే బాప్తిస్మం’ గురించి మాట్లాడుతున్నాడు. అంటే దేవునికి నమ్మకంగా ఉండడం వల్ల తాను మరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన చెప్తున్నాడు. అభిషిక్త క్రైస్తవులు ‘క్రీస్తుతో కలిసి బాధలు అనుభవిస్తే ఆయనతోపాటు మహిమపర్చబడతారు’ అని పౌలు రాశాడు. (రోమా. 8:16, 17; 2 కొరిం. 4:17) కాబట్టి పరలోకానికి పునరుత్థానం అవ్వాలంటే వాళ్లు కూడా చనిపోవాల్సిందే.
పౌలు చెప్పిన మాటను ఖచ్చితమైన భావంతో ఇలా అనువదించవచ్చు: “చనిపోయినవాళ్లు బ్రతికించబడరంటే, మృతులుగా ఉండడం కోసం బాప్తిస్మం తీసుకునేవాళ్లకు ప్రయోజనం ఏంటి? చనిపోయినవాళ్లను బ్రతికించడం అనేదే లేకపోతే, మృతులుగా ఉండడం కోసం బాప్తిస్మం తీసుకోవడం దేనికి?”