కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 49

పునరుత్థాన నిరీక్షణ తప్పకుండా నిజమౌతుంది!

పునరుత్థాన నిరీక్షణ తప్పకుండా నిజమౌతుంది!

‘దేవుడు తిరిగి బ్రతికిస్తాడని నేను నమ్మకంతో ఎదురుచూస్తున్నాను.’—అపొ. 24:15.

పాట 151 ఆయన పిలుస్తాడు

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. యెహోవా సేవకులమైన మనం దేని కోసం నిరీక్షిస్తున్నాం?

నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొంతమంది కుటుంబ జీవితం సంతోషంగా సాగాలని, తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, లేదా తమకున్న జబ్బు నయమవ్వాలని కోరుకుంటారు. క్రైస్తవులుగా మనం కూడా అలాంటి వాటిని కోరుకుంటుండవచ్చు. అయితే మనం అంతకన్నా గొప్పదాని కోసం, అంటే శాశ్వత జీవితం కోసం, చనిపోయిన మన ప్రియమైన వాళ్లు పునరుత్థానమయ్యే రోజు కోసం నిరీక్షిస్తున్నాం.

2 అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: ‘నీతిమంతుల్ని, అనీతిమంతుల్ని దేవుడు తిరిగి బ్రతికిస్తాడని నేను నమ్మకంతో ఎదురుచూస్తున్నాను.’ (అపొ. 24:15) పునరుత్థాన నిరీక్షణ గురించి మొదటిగా మాట్లాడింది పౌలు కాదు. పూర్వీకుడైన యోబు కూడా దాని గురించి మాట్లాడాడు. దేవుడు తనను గుర్తుపెట్టుకుని మళ్లీ బ్రతికిస్తాడని యోబు బలంగా నమ్మాడు.—యోబు 14:7-10, 12-15.

3. మొదటి కొరింథీయులు 15వ అధ్యాయం మనకెలా సహాయం చేస్తుంది?

3 “మృతుల పునరుత్థానం” క్రైస్తవ బోధలన్నిటికీ “పునాది” లాంటిది, అది మన “ప్రాథమిక బోధ.” (హెబ్రీ. 6:1, 2) మొదటి కొరింథీయులు 15వ అధ్యాయంలో పౌలు పునరుత్థానం గురించి చర్చించాడు. ఆయన రాసిన విషయాలు మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకు ప్రోత్సాహాన్ని ఇచ్చి ఉంటాయి. అవి మనకు కూడా ప్రోత్సాహాన్ని ఇస్తాయి, పునరుత్థాన నిరీక్షణ మీద మనకున్న నమ్మకాన్ని బలపరుస్తాయి.

4. మన ప్రియమైన వాళ్లు పునరుత్థానం అవుతారని నమ్మాలంటే ముందుగా ఏం నమ్మడం ప్రాముఖ్యం?

4 మన ప్రియమైన వాళ్లు పునరుత్థానం అవుతారని నమ్మాలంటే ముందుగా, యేసుక్రీస్తు పునరుత్థానం అయ్యాడని నమ్మడం ప్రాముఖ్యం. పౌలు కొరింథీయులకు ప్రకటించిన ‘మంచివార్తలో’ యేసుక్రీస్తు పునరుత్థానం కూడా ఉంది. (1 కొరిం. 15:1, 2) నిజానికి, ఒక క్రైస్తవుడు ఆ పునరుత్థానాన్ని నమ్మకపోతే అతని విశ్వాసం వృథా అని పౌలు చెప్పాడు. (1 కొరిం. 15:17) యేసు పునరుత్థానం అయ్యాడని నమ్మితేనే, ఇతరులు కూడా పునరుత్థానం అవుతారని నమ్మగలం.

5-6. మొదటి కొరింథీయులు 15:3, 4 లో ఉన్న విషయాల వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి?

5 పునరుత్థానం గురించి మాట్లాడుతున్నప్పుడు పౌలు ముందుగా మూడు వాస్తవాల్ని ప్రస్తావించాడు: (1) “క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు.” (2) “ఆయన సమాధి చేయబడ్డాడు.” (3) లేఖనాల్లో రాసివున్నట్టే ఆయన “మూడో రోజున బ్రతికించబడ్డాడు.”—1 కొరింథీయులు 15:3, 4 చదవండి.

6 యేసు చనిపోవడం, సమాధి చేయబడడం, తిరిగి బ్రతికించబడడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? మెస్సీయ ‘సజీవుల దేశం నుండి కొట్టివేయబడతాడని, దుష్టులతో పాటు సమాధి చేయబడతాడని’ యెషయా ప్రవక్త ముందే చెప్పాడు. అంతకన్నా ముఖ్యంగా, ఆయన ‘అనేకమంది పాపాల్ని మోస్తాడని’ కూడా యెషయా చెప్పాడు. యేసు తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా ఇవ్వడం ద్వారా అనేకమంది పాపాల్ని మోశాడు. (యెష. 53:8, 9, 12; మత్త. 20:28; రోమా. 5:8) యేసు చనిపోవడం, సమాధి చేయబడడం, తిరిగి బ్రతికించబడడం అనేవి చాలా ముఖ్యమైన విషయాలు. అవి, మనం పాపమరణాల నుండి విడిపించబడతామని, చనిపోయిన మన ప్రియమైన వాళ్లను తిరిగి కలుస్తామని నమ్మడానికి గట్టి ఆధారాన్ని ఇస్తున్నాయి.

చాలామంది సాక్షులు ఇచ్చిన సాక్ష్యం

7-8. యేసు పునరుత్థానం అయ్యాడని క్రైస్తవులు ఎందుకు నమ్మవచ్చు?

7 భవిష్యత్తులో పునరుత్థానం జరుగుతుందని నమ్మాలంటే ముందుగా, యేసు పునరుత్థానం అయ్యాడని నమ్మాలి. యెహోవా యేసును తిరిగి బ్రతికించాడని ఎందుకు ఖచ్చితంగా చెప్పవచ్చు?

8 యేసు పునరుత్థానం అయ్యాడని చాలామంది ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. (1 కొరిం. 15:5-7) పౌలు ప్రస్తావించిన సాక్షుల్లో మొదటి వ్యక్తి అపొస్తలుడైన పేతురు (కేఫా). పునరుత్థానమైన యేసు పేతురుకు కనిపించాడని కొంతమంది శిష్యులు కూడా చెప్పారు. (లూకా 24:33, 34) అంతేకాదు, “పన్నెండుమంది అపొస్తలులు” కూడా పునరుత్థానమైన యేసును చూశారు. తర్వాత ఆయన “ఒకేసారి 500 కన్నా ఎక్కువమంది సహోదరులకు కనిపించాడు.” అది, శిష్యులు గలిలయలో సంతోషంగా కలుసుకున్న సందర్భం అయ్యుంటుంది, మత్తయి 28:16-20 లో దాని గురించి ఉంది. తర్వాత ఆయన “యాకోబుకు” కనిపించాడు. ఈ యాకోబు యేసు తమ్ముడు అయ్యుంటాడు, అంతకుముందు అతను యేసును మెస్సీయగా అంగీకరించలేదు. (యోహా. 7:5) కానీ పునరుత్థానమైన యేసును చూశాక యాకోబుకు నమ్మకం కలిగింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దాదాపు క్రీ.శ. 55 లో పౌలు ఈ ఉత్తరం రాసే సమయానికి, ఆ ప్రత్యక్ష సాక్షుల్లో చాలామంది ఇంకా బ్రతికే ఉన్నారు. కాబట్టి, యేసు నిజంగా పునరుత్థానం అయ్యాడా లేదా అని సందేహించే వాళ్లెవరైనా ఆ ప్రత్యక్ష సాక్షుల్ని అడిగి తెలుసుకోవచ్చు.

9. అపొస్తలుల కార్యాలు 9:3-5 ప్రకారం, యేసు పునరుత్థానానికి పౌలు కూడా ఒక సాక్షి అని ఎందుకు చెప్పవచ్చు?

9 తర్వాత యేసు పౌలుకు కూడా కనిపించాడు. (1 కొరిం. 15:8) పౌలు (సౌలు) దమస్కుకు వెళ్తున్నప్పుడు, పునరుత్థానమైన యేసు స్వరాన్ని విన్నాడు, అలాగే ఆయన పరలోకంలో ఉండడం ఒక దర్శనంలో చూశాడు. (అపొస్తలుల కార్యాలు 9:3-5 చదవండి.) యేసు నిజంగా పునరుత్థానం అయ్యాడని చెప్పడానికి ఈ సంఘటన మరో ఆధారాన్ని ఇస్తుంది.—అపొ. 26:12-15.

10. యేసు పునరుత్థానం అయ్యాడని నమ్మిన తర్వాత పౌలు ఏం చేశాడు?

10 మిగతావాళ్లు ఇచ్చే సాక్ష్యం కన్నా పౌలు ఇచ్చే సాక్ష్యం కొంతమందికి ఎక్కువ ఆసక్తిగా అనిపించి ఉంటుంది, ఎందుకంటే ఆయన ఒకప్పుడు క్రైస్తవుల్ని హింసించాడు. కానీ యేసు పునరుత్థానం అయ్యాడని నమ్మిన తర్వాత, ఆ సత్యాన్ని ఇతరులకు చెప్పి ఒప్పించడానికి పౌలు ఎంతో కృషిచేశాడు. యేసు చనిపోయి తిరిగి బ్రతికాడనే సత్యాన్ని ఇతరులకు చెప్పే క్రమంలో పౌలు దెబ్బలు తిన్నాడు, చెరసాలలో వేయబడ్డాడు, ఓడ ప్రమాదాలు ఎదుర్కొన్నాడు. (1 కొరిం. 15:9-11; 2 కొరిం. 11:23-27) యేసు మృతుల్లో నుండి లేపబడ్డాడని పౌలు ఎంత బలంగా నమ్మాడంటే, ఆ సత్యాన్ని ఇతరులకు ప్రకటించడానికి తన ప్రాణాల్ని కూడా లెక్కచేయలేదు. తొలి క్రైస్తవులు ఇచ్చిన ఈ సాక్ష్యాల్ని పరిశీలించాక, యేసు నిజంగా పునరుత్థానం అయ్యాడని మీకు నమ్మకం కలగట్లేదా? పునరుత్థాన నిరీక్షణ మీద మీకున్న నమ్మకాన్ని అది బలపర్చట్లేదా?

తప్పుడు అభిప్రాయాల్ని సరిదిద్దడం

11. కొరింథులోని కొంతమంది క్రైస్తవులకు పునరుత్థానం గురించి తప్పుడు అభిప్రాయాలు ఉండడానికి కారణం ఏమై ఉండవచ్చు?

11 గ్రీకు నగరమైన కొరింథులో కొంతమంది క్రైస్తవులకు పునరుత్థానం గురించి తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. చివరికి వాళ్లు “మృతుల పునరుత్థానం లేదని” కూడా చెప్తున్నారు. దానికి కారణం ఏమై ఉండవచ్చు? (1 కొరిం. 15:12) మరో గ్రీకు నగరమైన ఏథెన్సులో తత్త్వవేత్తలు, యేసు పునరుత్థానం అయ్యాడనే బోధను ఎగతాళి చేశారు. ఆ తత్త్వవేత్తల ఆలోచన, కొరింథులోని కొంతమంది క్రైస్తవుల మీద ప్రభావం చూపించి ఉంటుంది. (అపొ. 17:18, 31, 32) ఇంకొంతమంది కొరింథీయులు, పునరుత్థానం సూచనార్థకమైనదని అంటే ఒక వ్యక్తి పాపంలో “చనిపోయి,” క్రైస్తవుడిగా “తిరిగి లేవడమే” పునరుత్థానమని అనుకుని ఉండవచ్చు. కారణం ఏదైనా, పునరుత్థానాన్ని నమ్మకపోతే వాళ్ల విశ్వాసం వృథానే. ఒకవేళ దేవుడు యేసును పునరుత్థానం చేసి ఉండకపోతే, విమోచన క్రయధనం చెల్లించబడేది కాదు, మనుషులందరూ పాపంలోనే ఉండిపోయే వాళ్లు. కాబట్టి, పునరుత్థానాన్ని నమ్మనివాళ్లకు ఒక నిరీక్షణ అంటూ ఉండదు.—1 కొరిం. 15:13-19; హెబ్రీ. 9:12, 14.

12. మొదటి పేతురు 3:18, 22 ప్రకారం, క్రీస్తు పునరుత్థానం అంతకుముందు జరిగిన పునరుత్థానాల కన్నా ఎందుకు గొప్పది?

12 “క్రీస్తు మృతుల్లో నుండి బ్రతికించబడ్డాడు” అని పౌలుకు స్వయంగా తెలుసు. క్రీస్తు పునరుత్థానం అంతకుముందు జరిగిన పునరుత్థానాల కన్నా గొప్పది, ఎందుకంటే అంతకుముందు పునరుత్థానమైన వాళ్లు మళ్లీ చనిపోయారు. పౌలు యేసును “చనిపోయినవాళ్లలో ప్రథమఫలం” అని అన్నాడు. యేసు ఏ విధంగా ప్రథమఫలం? పరలోక సంబంధమైన శరీరంతో తిరిగి బ్రతికించబడిన మొదటి వ్యక్తి యేసే. అంతేకాదు పరలోకానికి వెళ్లిన మొదటి వ్యక్తి కూడా ఆయనే.—1 కొరిం. 15:20; అపొ. 26:23; 1 పేతురు 3:18, 22 చదవండి.

ఎవరు “బ్రతికించబడతారు”?

13. పౌలు చెప్పినట్టు ఆదాము వల్ల ఏం జరిగింది? యేసు వల్ల ఏం జరుగుతుంది?

13 ఒక్క మనిషి చనిపోవడం వల్ల లక్షలమంది ఎలా బ్రతికించబడతారు? ఆ ప్రశ్నకు పౌలు స్పష్టమైన జవాబు ఇస్తున్నాడు. ఆదాము వల్ల మనుషులకు ఏం జరిగిందో, దానికి భిన్నంగా క్రీస్తు ద్వారా ఏం జరుగుతుందో పౌలు వివరిస్తున్నాడు. పౌలు ఇలా రాశాడు: “మరణం ఒక మనిషి ద్వారా వచ్చింది.” ఆదాము పాపం చేయడం వల్ల ఆయనకు, ఆయన పిల్లలకు మరణం వచ్చింది. ఆయన అవిధేయత వల్ల వచ్చిన చేదు పర్యవసానాల్ని మనం ఇప్పటికీ అనుభవిస్తున్నాం. కానీ, దేవుడు తన కుమారుణ్ణి పునరుత్థానం చేయడం వల్ల మంచి భవిష్యత్తును పొందే అవకాశం మనకు దొరుకుతుంది! పౌలు ఇలా రాశాడు: “మృతుల పునరుత్థానం కూడా ఒక మనిషి ద్వారానే కలుగుతుంది,” ఆయనే యేసు. “ఆదాము వల్ల అందరూ చనిపోతున్నట్టే, క్రీస్తు వల్ల అందరూ బ్రతికించబడతారు” అని పౌలు స్పష్టం చేశాడు.—1 కొరిం. 15:21, 22.

14. ఆదాము పునరుత్థానం అవుతాడా? వివరించండి.

14 ‘ఆదాము వల్ల అందరూ చనిపోతున్నారు’ అని అన్నప్పుడు పౌలు ఉద్దేశం ఏంటి? పౌలు ఇక్కడ మనుషులందరి గురించి మాట్లాడుతున్నాడు. వాళ్లు ఆదాము నుండి పాపాన్ని, అపరిపూర్ణతను వారసత్వంగా పొందారు కాబట్టి చనిపోతున్నారు. (రోమా. 5:12) అయితే, ‘బ్రతికించబడే’ వాళ్లలో ఆదాము ఉండడు. క్రీస్తు విమోచన క్రయధనం నుండి ఆదాము ప్రయోజనం పొందలేడు. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు, పైగా కావాలనే దేవునికి అవిధేయత చూపించాడు. ‘మేకలుగా’ తీర్పు తీర్చబడేవాళ్లు పొందే ‘శాశ్వత నాశనాన్నే’ ఆదాము కూడా పొందుతాడు.—మత్త. 25:31-33, 46; హెబ్రీ. 5:9.

పరలోకంలో జీవించడానికి పునరుత్థానమయ్యే ఎంతోమందిలో యేసు మొదటి వ్యక్తి (15-16 పేరాలు చూడండి) *

15. “అందరూ బ్రతికించబడతారు” అని చెప్పినప్పుడు పౌలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు?

15 “క్రీస్తు వల్ల అందరూ బ్రతికించబడతారు” అని పౌలు అన్న మాటల్ని గమనించండి. (1 కొరిం. 15:22) పౌలు ఈ ఉత్తరాన్ని కొరింథులోని అభిషిక్త క్రైస్తవులకు రాశాడు, వాళ్లు పరలోకంలో జీవించడానికి పునరుత్థానం అవుతారు. వాళ్లు “క్రీస్తుయేసు శిష్యులుగా పవిత్రపర్చబడి, పవిత్రులుగా ఉండడానికి” పిలవబడ్డారు. “క్రీస్తు శిష్యులుగా చనిపోయినవాళ్లు” అనే మాట కూడా పౌలు ఉపయోగించాడు. (1 కొరిం. 1:2; 15:18; 2 కొరిం. 5:17) పౌలు దైవప్రేరణతో రాసిన మరో ఉత్తరంలో, ‘ఆయనలా [యేసులా] చనిపోయిన వాళ్లు ఆయనలాగే తిరిగి బ్రతికించబడతారు’ అని చెప్పాడు. (రోమా. 6:3-5) యేసు పరలోక సంబంధమైన శరీరంతో తిరిగి బ్రతికించబడి, పరలోకానికి వెళ్లాడు. అభిషిక్త క్రైస్తవులందరి విషయంలో కూడా అదే జరుగుతుంది.

16. యేసును “ప్రథమఫలం” అని పిలవడం ద్వారా పౌలు ఏం తెలియజేస్తున్నాడు?

16 ‘చనిపోయినవాళ్లలో ప్రథమఫలంగా క్రీస్తు బ్రతికించబడ్డాడు’ అని పౌలు రాశాడు. లాజరు, ఇంకొందరు ఈ భూమ్మీద జీవించడానికి పునరుత్థానం చేయబడినప్పటికీ, పరలోక సంబంధమైన శరీరంతో బ్రతికించబడి శాశ్వత జీవితాన్ని పొందిన మొదటి వ్యక్తి యేసే అని గుర్తుంచుకోండి. ఇశ్రాయేలీయులు దేవునికి అర్పించే పంటలోని ప్రథమఫలంతో యేసును పోల్చవచ్చు. యేసును “ప్రథమఫలం” అని పిలవడం ద్వారా, ఆయన తర్వాత ఇంకొంతమంది కూడా పరలోకానికి పునరుత్థానం అవుతారని పౌలు తెలియజేస్తున్నాడు. అపొస్తలులు, ఇతర అభిషిక్త క్రైస్తవులు యేసులాగే పరలోకంలో జీవించడానికి పునరుత్థానం అవుతారు.

17. అభిషిక్త క్రైస్తవులు పరలోక బహుమానం ఎప్పుడు పొందుతారు?

17 పౌలు కొరింథీయులకు ఉత్తరం రాసే సమయానికి అభిషిక్త క్రైస్తవులు ఇంకా పరలోకానికి పునరుత్థానం అవ్వలేదు. అది భవిష్యత్తులో జరుగుతుందని చెప్తూ పౌలు ఇలా వివరించాడు: “ప్రతీ ఒక్కరు తమతమ వరుసలో బ్రతికించబడతారు. ప్రథమఫలం క్రీస్తు; ఆ తర్వాత, ఆయన ప్రత్యక్షత సమయంలో ఆయనకు చెందినవాళ్లు బ్రతికించబడతారు.” (1 కొరిం. 15:23; 1 థెస్స. 4:15, 16) పౌలు చెప్పిన “ప్రత్యక్షత” సమయంలోనే ఇప్పుడు మనం జీవిస్తున్నాం. అవును చనిపోయిన అపొస్తలులు, ఇతర అభిషిక్త క్రైస్తవులు ఆ ప్రత్యక్షత సమయం వరకు వేచివుండి, తర్వాత ‘ఆయనలాగే [యేసులాగే] తిరిగి బ్రతికించబడతారు,’ పరలోక బహుమానం పొందుతారు.

మన నిరీక్షణ తప్పక నిజమౌతుంది!

18. (ఎ) మొదటి పునరుత్థానం తర్వాత ఇంకో పునరుత్థానం ఉంటుందని ఎందుకు చెప్పవచ్చు? (బి) భవిష్యత్తులో ఏం జరుగుతుందని 1 కొరింథీయులు 15:24-26 చెప్తుంది?

18 మరి, పరలోక నిరీక్షణ లేని మిగతా నమ్మకమైన క్రైస్తవులందరి సంగతేంటి? వాళ్లకు కూడా పునరుత్థాన నిరీక్షణ ఉంది. పరలోకానికి వెళ్లేవాళ్లు అంటే పౌలు, ఇతర అభిషిక్తులు “మొదటి పునరుత్థానంలో” ఉంటారని బైబిలు చెప్తుంది. (ఫిలి. 3:11) మొదటి పునరుత్థానం అంటున్నారంటే ఇంకో పునరుత్థానం కూడా ఉందని అర్థం. యోబు ఎదురుచూసింది భవిష్యత్తులో జరిగే ఆ ఇంకో పునరుత్థానం కోసమే. (యోబు 14:15) క్రీస్తు ఈ ప్రభుత్వాలన్నిటినీ, సమస్తమైన అధికారాన్ని, శక్తిని నిర్మూలిస్తున్నప్పుడు “ఆయనకు చెందినవాళ్లు” ఆయనతోపాటే పరలోకంలో ఉంటారు. “చివరి శత్రువు” అయిన మరణాన్ని కూడా ఆయన నాశనం చేస్తాడు. పరలోకానికి పునరుత్థానమైన వాళ్లు ఇక ఎప్పటికీ చనిపోరు. మరి మిగతా వాళ్ల సంగతేంటి?—1 కొరింథీయులు 15:24-26 చదవండి.

19. భూనిరీక్షణ ఉన్న వాళ్లు దేనికోసం ఎదురుచూడవచ్చు?

19 భూనిరీక్షణ ఉన్న వాళ్లు దేనికోసం ఎదురుచూడవచ్చు? పౌలులాగే వాళ్లు కూడా “నీతిమంతుల్ని, అనీతిమంతుల్ని దేవుడు తిరిగి బ్రతికిస్తాడని” నమ్మకంతో ఎదురుచూడవచ్చు. (అపొ. 24:15) అనీతిమంతులు పరలోకానికి వెళ్లలేరు కాబట్టి, ఆ మాటలు భవిష్యత్తులో భూమ్మీద జరిగే పునరుత్థానాన్ని సూచిస్తున్నాయని స్పష్టమౌతోంది.

పునరుత్థాన నిరీక్షణ మీద నమ్మకం ఉంచడం వల్ల మనం మంచి భవిష్యత్తు కోసం ఎదురుచూడవచ్చు (20వ పేరా చూడండి) *

20. పునరుత్థాన నిరీక్షణ మీద మీకున్న నమ్మకం ఎలా బలపడింది?

20 చనిపోయిన వాళ్లను “దేవుడు తిరిగి బ్రతికిస్తాడు”! అందులో ఎలాంటి సందేహం లేదు. భూమ్మీద పునరుత్థానమైన వాళ్లకు శాశ్వత కాలం జీవించే అవకాశం ఉంటుంది. ఆ వాగ్దానం నిజమౌతుందని మీరు నమ్మవచ్చు. చనిపోయిన మీ ప్రియమైన వాళ్ల విషయంలో మీరు ఒక నిరీక్షణతో ఉండవచ్చు. క్రీస్తు, అభిషిక్తులు కలిసి ‘1,000 సంవత్సరాలు రాజులుగా పరిపాలించినప్పుడు’ మీ ప్రియమైన వాళ్లు పునరుత్థానం అవుతారు. (ప్రక. 20:6) ఒకవేళ వెయ్యేళ్ల పరిపాలన మొదలవ్వకముందే మీరు చనిపోయినా, యేసు మిమ్మల్ని పునరుత్థానం చేస్తాడనే పూర్తి నమ్మకంతో ఉండవచ్చు. ఆ “నిరీక్షణ మనల్ని నిరాశపర్చదు.” (రోమా. 5:5) ఆ నిరీక్షణ వల్ల మీరు బలం పొంది, దేవుని సేవలో ఆనందంగా కొనసాగగలుగుతారు. అయితే, 1 కొరింథీయులు 15వ అధ్యాయంలో మనం నేర్చుకునే విషయాలు ఇంకా ఉన్నాయి. వాటి గురించి తర్వాతి ఆర్టికల్‌లో చూద్దాం.

పాట 147 యెహోవా శాశ్వత జీవితాన్ని వాగ్దానం చేశాడు

^ పేరా 5 మొదటి కొరింథీయులు 15వ అధ్యాయం ముఖ్యంగా పునరుత్థానం గురించి మాట్లాడుతుంది. పునరుత్థానం అనే బోధ ఎందుకు ప్రాముఖ్యమైనది? యేసు పునరుత్థానం అయ్యాడని మనం ఎందుకు నమ్మవచ్చు? ఆ ప్రశ్నలకు, పునరుత్థానానికి సంబంధించిన ఇతర ప్రశ్నలకు ఈ ఆర్టికల్‌లో జవాబులు చూస్తాం.

^ పేరా 56 చిత్రాల వివరణ: పరలోకానికి వెళ్లిన మొదటి వ్యక్తి యేసు. (అపొ. 1:9) ఆయన శిష్యుల్లో కొందరు అంటే తోమా, యాకోబు, లూదియ, యోహాను, మరియ, పౌలు వంటివాళ్లు ఆయనలాగే పరలోకానికి వెళ్తారు.

^ పేరా 58 చిత్రాల వివరణ: ఒక సహోదరుడు తన ప్రియమైన భార్యతో కలిసి చాలాకాలం యెహోవా సేవ చేశాడు. ఆమె చనిపోయింది, కానీ ఆమె పునరుత్థానం అవుతుందని నమ్ముతూ ఆయన యెహోవా సేవలో నమ్మకంగా కొనసాగుతున్నాడు.