కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రతీరోజు యెహోవాతో కలిసి పనిచేయండి

ప్రతీరోజు యెహోవాతో కలిసి పనిచేయండి

“మేము దేవుని తోటి పనివాళ్లం.”1 కొరిం. 3:9.

పాటలు: 64, 111

1. మనం ఏయే విధాలుగా యెహోవాతో కలిసి పనిచేయవచ్చు?

యెహోవా మనుషుల్ని సృష్టించినప్పుడు, వాళ్లు తనతో కలిసి పనిచేయాలని ఆయన కోరుకున్నాడు. కానీ తర్వాత మనుషులందరూ అపరిపూర్ణులయ్యారు. అయినప్పటికీ, యెహోవా నమ్మకమైన సేవకులు మాత్రం ప్రతీరోజు ఆయనతో కలిసి పనిచేయవచ్చు. ఉదాహరణకు మనం మంచివార్త ప్రకటిస్తూ, శిష్యుల్ని చేస్తున్నప్పుడు “దేవుని తోటి పనివాళ్లం” అవుతాం. (1 కొరిం. 3:5-9) ఎంతో ప్రాముఖ్యమైన ఆ పనిచేయడానికి సర్వశక్తిమంతుడైన సృష్టికర్త మనల్ని ఎంపికచేసుకోవడం మనకు దొరికిన గొప్ప గౌరవం! అయితే, ప్రీచింగ్‌ ఒక్కటే కాదు ఇంకొన్ని పనులు చేసినప్పుడు కూడా మనం దేవుని తోటి పనివాళ్లం అవుతాం. అంటే కుటుంబానికి, సంఘానికి సహాయం చేసినప్పుడు; ఇతరులకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు; సంస్థ చేపడుతున్న పనులకు మద్దతిచ్చినప్పుడు; మన సేవను విస్తృతం చేసుకున్నప్పుడు మనం దేవుని తోటి పనివాళ్లం అవుతాం. అదెలాగో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.—కొలొ. 3:23.

2. యెహోవా కోసం మనం చేసే పనుల్ని వేరేవాళ్లు చేసే పనులతో ఎందుకు పోల్చుకోకూడదు?

2 ఈ ఆర్టికల్‌ పరిశీలిస్తున్నప్పుడు, మనందరి పరిస్థితులు ఒకేలా ఉండవని గుర్తుంచుకోవడం ప్రాముఖ్యం. మన వయసు, ఆరోగ్యం, పరిస్థితులు, సామర్థ్యాలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి యెహోవా కోసం మీరు చేసే పనుల్ని, వేరేవాళ్లు చేసే పనులతో పోల్చుకోకండి. అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు, “ప్రతీ వ్యక్తి తాను చేసిన పనుల్ని పరిశీలించుకోవాలి, అంతేగానీ వేరేవాళ్లతో పోల్చుకోకూడదు. అప్పుడు, అతను చేసిన పనుల వల్లే అతనికి సంతోషం కలుగుతుంది.”—గల. 6:4.

కుటుంబానికి, సంఘానికి సహాయం చేయండి

3. కుటుంబ అవసరాలు తీర్చే ప్రతీఒక్కరు యెహోవాతో కలిసి పనిచేస్తున్నారని ఎందుకు చెప్పవచ్చు?

3 మనం మన కుటుంబాల్ని పోషించాలని యెహోవా కోరుతున్నాడు. ఉదాహరణకు, కుటుంబ అవసరాల కోసం మీరు డబ్బు సంపాదించాల్సి రావచ్చు. చాలామంది తల్లులు ఇంట్లోనే ఉంటూ తమ పిల్లల ఆలనాపాలన చూసుకోవాల్సి రావచ్చు. అంతేకాదు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీకుండవచ్చు. ఇవన్నీ ప్రాముఖ్యమైన పనులే. ఎందుకంటే బైబిలు ఇలా చెప్తుంది, “ఎవరైనా సొంతవాళ్లకు, ముఖ్యంగా కుటుంబ సభ్యులకు కావాల్సినవి సమకూర్చకపోతే, అతను విశ్వాసాన్ని విడిచిపెట్టినట్టే; అలాంటి వ్యక్తి అవిశ్వాసి కన్నా చెడ్డవాడు.” (1 తిమో. 5:8) కుటుంబ బాధ్యతల వల్ల మీరు అనుకున్నంత ఎక్కువగా యెహోవా సేవ చేయలేకపోతుండవచ్చు. కానీ నిరుత్సాహపడకండి! ఎందుకంటే, మీరు మీ కుటుంబ అవసరాల్ని తీర్చినప్పుడు యెహోవా సంతోషిస్తాడు.—1 కొరిం. 10:31.

4. తల్లిదండ్రులు రాజ్య పనులకు మొదటిస్థానం ఎలా ఇవ్వవచ్చు? అలాచేస్తే ఏమి జరుగుతుంది?

4 పిల్లలు ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకునేలా సహాయం చేయడం ద్వారా క్రైస్తవ తల్లిదండ్రులు యెహోవాతో కలిసి పనిచేయవచ్చు. చాలామంది తల్లిదండ్రులు అలాగే చేశారు. దానివల్ల వాళ్ల కొడుకులు, కూతుళ్లు పెద్దవాళ్లు అయ్యాక పూర్తికాల సేవచేయాలని నిర్ణయించుకున్నారు. కొంతమందైతే ఇంటికి దూరంగా వెళ్లి సేవచేయడానికి కూడా సిద్ధమయ్యారు. వాళ్లు మిషనరీలుగా, అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో పయినీర్లుగా, అలాగే బెతెల్‌ కుటుంబ సభ్యులుగా సేవచేస్తున్నారు. నిజమే, పిల్లలు అలా ఇంటికి దూరంగా వెళ్లడంవల్ల తల్లిదండ్రులు ఇంతకుముందులా వాళ్లతో సమయం గడపలేకపోవచ్చు. అయినప్పటికీ ఆ సేవను కొనసాగిస్తూ ఉండమని తల్లిదండ్రులు వాళ్లను నిస్వార్థంగా ప్రోత్సహిస్తారు. ఎందుకు? ఎందుకంటే, పిల్లలు తమ జీవితంలో యెహోవాకు మొదటి స్థానం ఇస్తున్నందుకు తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. (3 యోహా. 4) అలాంటి తల్లిదండ్రుల్లో చాలామంది హన్నాలానే భావిస్తారు. ఆమె తన కొడుకైన సమూయేలును యెహోవాకే ఇస్తున్నానని చెప్పింది. ఈ విధంగా దేవునితో కలిసి పనిచేయడం గొప్ప గౌరవమని తల్లిదండ్రులు భావిస్తున్నారు.—1 సమూ. 1:28.

5. సంఘంలోని సహోదరసహోదరీలకు మీరెలా సహాయం చేయవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)

5 మీకు కుటుంబ బాధ్యతలు అంతగా లేకపోతే అనారోగ్యంతో, వృద్ధాప్యంతో, వేరే ఏదైనా సమస్యతో బాధపడుతున్న సహోదరసహోదరీలకు మీరు సహాయం చేయవచ్చు. లేదా వాళ్ల బాగోగులు చూసుకుంటున్న వాళ్లకు సహాయం చేయవచ్చు. మీ సంఘంలో ఎవరెవరికి అలాంటి సహాయం అవసరమో ఆలోచించండి. ఉదాహరణకు, ఒక సహోదరి వయసుపైబడిన తన తండ్రిని లేదా తల్లిని చూసుకుంటూ ఉండవచ్చు. ఆ సహోదరి వేరే పనులు చేసుకోగలిగేలా మీరు ఆమె తండ్రికి లేదా తల్లికి తోడుగా ఉండగలరా? లేదా ఎవరినైనా మీటింగ్స్‌కి, షాపింగ్‌కి, హాస్పిటల్‌కి తీసుకెళ్లగలరా? మీరలా సహాయం చేసినప్పుడు యెహోవా మీ ద్వారా వాళ్ల ప్రార్థనలకు జవాబిస్తుండవచ్చు. ఆ విధంగా మీరు యెహోవాతో కలిసి పనిచేసినట్లు అవుతుంది.—1 కొరింథీయులు 10:24 చదవండి.

ఆతిథ్యం ఇవ్వండి

6. ఆతిథ్యం ఇవ్వడంలో భాగంగా మనం ఏమి చేయవచ్చు?

6 దేవుని తోటి పనివాళ్లు ఆతిథ్యానికి పెట్టింది పేరు. బైబిల్లో “ఆతిథ్యం” అని అనువదించబడిన గ్రీకు పదానికి, “అపరిచితుల పట్ల దయ చూపించడం” అని అర్థం. (హెబ్రీ. 13:2; అధస్సూచి) మనం అలాంటి దయను ఏయే విధాలుగా చూపించవచ్చో తెలిపే ఎన్నో ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. (ఆది. 18:1-5) మనకు అవకాశం దొరికిన ప్రతీసారి ఇతరులకు సహాయం చేయవచ్చు, చేయాలి కూడా. వాళ్లు “తోటి విశ్వాసులు” అయినా, కాకపోయినా మనం సహాయం చేయాలి.—గల. 6:10.

7. పూర్తికాల సేవకులకు ఆతిథ్యం ఇవ్వడంవల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి?

7 వసతి అవసరమైన పూర్తికాల సేవకులకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా యెహోవాతో కలిసి పనిచేయవచ్చు. (3 యోహాను 5, 8 చదవండి.) మనం అలా ఆతిథ్యం ఇచ్చినప్పుడు వాళ్లూ ప్రయోజనం పొందుతారు, మనమూ పొందుతాం. అంటే బైబిలు చెప్తున్నట్లు, ‘ఒకరి వల్ల ఒకరం ప్రోత్సాహం పొందుతాం.’ (రోమా. 1:11, 12) ఓలాఫ్‌ అనే సహోదరుని అనుభవం పరిశీలించండి. అతను యువకుడిగా ఉన్నప్పుడు, తమ సంఘాన్ని సందర్శించడానికి ఒక పెళ్లికాని ప్రాంతీయ పర్యవేక్షకుడు వచ్చాడు. సంఘంలోనివాళ్లు ప్రాంతీయ పర్యవేక్షకుని కోసం వసతి ఏర్పాటు చేసే స్థితిలో లేరు. అప్పుడు ఓలాఫ్‌ ఆ సహోదరుణ్ణి తనతోపాటు ఉంచుకోవడానికి సాక్షులుకాని తన తల్లిదండ్రుల్ని అనుమతి అడిగాడు. వాళ్లు దానికి ఒప్పుకున్నారు, కాకపోతే ఓలాఫ్‌ సోఫాలో పడుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఓలాఫ్‌ దానికి సంతోషంగా అంగీకరించాడు. అతను ఆ వారమంతా ప్రాంతీయ పర్యవేక్షకునితో చక్కని సహవాసాన్ని ఆనందించాడు. ప్రతీరోజు ఉదయాన్నే లేచి, వాళ్లిద్దరూ టిఫిన్‌ చేస్తూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుకున్నారు. ఆ సహోదరుని నుండి ఓలాఫ్‌ ఎంతగా ప్రోత్సాహం పొందాడంటే, తాను కూడా పూర్తికాల సేవ మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. గత 40 సంవత్సరాలపాటు ఓలాఫ్‌ వేర్వేరు దేశాల్లో మిషనరీగా సేవచేశాడు.

8. ఇతరులు మొదట్లో కృతజ్ఞత చూపించకపోయినా మనమెందుకు దయ చూపించాలి? ఒక ఉదాహరణ చెప్పండి.

8 ఇతరులు మొదట్లో కృతజ్ఞత చూపించకపోయినా, అపరిచితుల పట్ల దయ చూపించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు, స్పెయిన్‌లోని ఒక సహోదరి ఈక్వెడార్‌కు చెందిన యెసికా అనే స్త్రీకి బైబిలు స్టడీ చేసేది. ఒకరోజు స్టడీ జరుగుతున్నప్పుడు యెసికా ఏడ్చేసింది. ఆమె ఎందుకు ఏడుస్తుందని సహోదరి అడిగింది. స్పెయిన్‌​కు రాకముందు యెసికా కడుబీదరికంలో జీవించింది. ఒకరోజు తన పాప ఆకలి తీర్చడానికి ఆమె దగ్గర నీళ్లు తప్ప ఏమీ లేవు. పాపను నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తూ ఆమె సహాయం కోసం ప్రార్థించింది. ఇంతలో, ఇద్దరు సాక్షులు వచ్చి ఒక పత్రిక ఇచ్చారు. కానీ ఆమె వాళ్లతో దురుసుగా ప్రవర్తించి, ఆ పత్రికను చింపేసి “ఈ పత్రికతో మా పాప ఆకలి తీర్చమంటారా?” అని అరిచింది. ఆ సహోదరీలు ఆమెను ఓదార్చడానికి చూశారు గానీ ఆమె వినలేదు. తర్వాత, వాళ్లు గుమ్మం దగ్గర ఒక సంచిలో ఆహారాన్ని పెట్టి వెళ్లారు. ఇదంతా గుర్తొచ్చి, తన ప్రార్థనకు యెహోవా ఇచ్చిన జవాబును గుర్తించలేకపోయినందుకు యెసికా స్టడీ మధ్యలో ఏడ్చింది. కానీ ఇప్పుడు ఆమె యెహోవా సేవచేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. దీన్నిబట్టి, ఆ సాక్షులు ఇచ్చిన ఆతిథ్యానికి మంచి ఫలితాలు వచ్చాయని స్పష్టమౌతుంది.—ప్రసం. 11:1, 6.

సంస్థ చేపడుతున్న పనులకు స్వచ్ఛందంగా మద్దతివ్వండి

9, 10. (ఎ) స్వచ్ఛందంగా పనిచేయడానికి ఇశ్రాయేలీయులకు ఎలాంటి అవకాశాలు ఉండేవి? (బి) నేడు సహోదరులు ఏయే విధాలుగా సంఘానికి సహాయం చేయవచ్చు?

9 ప్రాచీనకాలంలో, స్వచ్ఛందంగా పనిచేయడానికి ఇశ్రాయేలీయులకు ఎన్నో అవకాశాలు ఉండేవి. (నిర్గ. 36:2; 1 దిన. 29:4, 5; నెహె. 11:2) నేడు మీకు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. మీ సమయాన్ని, వనరులను, నైపుణ్యాలను స్వచ్ఛందంగా ఉపయోగిస్తూ సహోదరసహోదరీలకు సహాయం చేయవచ్చు. మీరలా చేసినప్పుడు ఎంతో సంతోషాన్ని, యెహోవా దీవెనల్ని పొందుతారు.

10 సంఘ పరిచారకులుగా, పెద్దలుగా సేవచేస్తూ యెహోవాతో కలిసి పనిచేయమని బైబిలు సహోదరుల్ని ప్రోత్సహిస్తుంది. (1 తిమో. 3:1, 8, 9; 1 పేతు. 5:2, 3) అలాంటి సహోదరులు ఇతరులకు ఆధ్యాత్మిక విషయాల్లో, మరితర విషయాల్లో సహాయం చేస్తారు. (అపొ. 6:1-4) సంఘపెద్దలు మిమ్మల్ని అటెండెంట్‌గా ఉండమని గానీ సాహిత్యం, క్షేత్రం, క్లీనింగ్‌, మరితర పనుల్లో సహాయం చేయమని గానీ అడిగారా? అలాంటి పనుల్లో సహాయం చేసిన సహోదరులు ఎంతో ఆనందాన్ని పొందామని చెప్తున్నారు.

నిర్మాణ ప్రాజెక్టుల్లో స్వచ్ఛందంగా పనిచేసేవాళ్లకు తరచూ కొత్త స్నేహితులు దొరుకుతారు (11వ పేరా చూడండి)

11. నిర్మాణ ప్రాజెక్టుల్లో పనిచేయడం వల్ల ఒక సహోదరి ఎలాంటి ప్రయోజనం పొందింది?

11 నిర్మాణ ప్రాజెక్టుల్లో స్వచ్ఛందంగా పనిచేసేవాళ్లకు తరచూ కొత్త స్నేహితులు దొరుకుతారు. మార్జీ అనే సహోదరి, రాజ్యమందిర నిర్మాణ ప్రాజెక్టుల్లో 18 సంవత్సరాలు పనిచేసింది. అలా పనిచేస్తున్నప్పుడు, ఆమె యౌవన సహోదరీల మీద శ్రద్ధ చూపించి వాళ్లకు శిక్షణ ఇచ్చింది. స్వచ్ఛంద సేవకులు ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి ఇదో చక్కని అవకాశమని ఆమె చెప్పింది. (రోమా. 1:12) నిజానికి ఆ సహోదరి కష్టాలు ఎదుర్కొన్నప్పుడు, నిర్మాణ పనిలో దొరికిన ఆ స్నేహితులే ఆమెను ప్రోత్సహించారు. నిర్మాణ పనిలో మీరెప్పుడైనా స్వచ్ఛందంగా పని చేశారా? మీకు ఏ ప్రత్యేక నైపుణ్యం లేకపోయినా మీరు స్వచ్ఛందంగా పనిచేయవచ్చు.

12. విపత్తు సంభవించిన తర్వాత మీరెలా సహాయం చేయవచ్చు?

12 విపత్తులు సంభవించినప్పుడు మన సహోదరులకు సహాయం చేయడం ద్వారా కూడా యెహోవాతో కలిసి పనిచేయవచ్చు. ఉదాహరణకు, మనం డబ్బును విరాళంగా ఇవ్వవచ్చు. (యోహా. 13:34, 35; అపొ. 11:27-30) అంతేకాదు విపత్తు తర్వాత, క్లీనింగ్‌ లేదా మరమ్మతు పనుల్లో సహాయం చేయవచ్చు. పోలండ్‌కు చెందిన గాబ్రీయెలా అనే సహోదరి ఇల్లు వరదలవల్ల చాలావరకు ధ్వంసమైంది. చుట్టుపక్కల సంఘాల్లోని సహోదరులు వచ్చి సహాయం చేసినప్పుడు ఆమె చాలా సంతోషించింది. ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా, తాను కోల్పోయిన వాటిగురించి బాధపడే బదులు తాను పొందిన వాటిగురించి ఆలోచిస్తానని ఆమె చెప్పింది. “క్రైస్తవ సంఘంలో భాగంగా ఉండడం ఒక ప్రత్యేకమైన అవకాశమనీ, సంతోషానికి ఆనందానికి అదే మూలమనీ ఆ అనుభవం నాకు గుర్తుచేసింది” అని ఆమె అంటుంది. విపత్తు సంభవించిన తర్వాత సహాయం పొందిన చాలామంది ఇలానే భావిస్తున్నారు. ఇలాంటి సహోదరసహోదరీలకు సహాయం చేయడంలో యెహోవాతో కలిసి పనిచేసిన ప్రచారకులు ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని పొందుతున్నారు.—అపొస్తలుల కార్యాలు 20:35; 2 కొరింథీయులు 9:6, 7 చదవండి.

13. మనం స్వచ్ఛందంగా పనిచేసినప్పుడు యెహోవా మీదున్న ప్రేమ ఎలా పెరుగుతుంది? ఒక ఉదాహరణ చెప్పండి.

13 యుద్ధం కారణంగా కొంతమంది సాక్షులు అమెరికాకు శరణార్థులుగా వెళ్లారు. వాళ్లకు సహాయం చేయడంలో స్టెఫనీ అనే సహోదరి, అలాగే తన ప్రాంతంలోని ఇతర ప్రచారకులు యెహోవాతో కలిసి పనిచేశారు. వాళ్లు శరణార్థుల కోసం ఇళ్లు, సామాన్లు చూసి పెట్టారు. ఆమె ఇలా చెప్తుంది, “శరణార్థులు ప్రపంచవ్యాప్త సోదరుల ప్రేమను రుచి చూసినప్పుడు ఎంతో సంతోషించారు, కృతజ్ఞతలు తెలిపారు. దాన్నిబట్టి మేము ఎంతో కదిలించబడ్డాం. మేము వాళ్లకు సహాయం చేశామని శరణార్థులుగా వచ్చినవాళ్లు అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి వాళ్లే మాకు ఎంతో సహాయం చేశారు. వాళ్ల ప్రేమ, ఐక్యత, విశ్వాసం, యెహోవాపై నమ్మకం కళ్లారా చూసినప్పుడు మాకు ఆయన మీదున్న ప్రేమ ఇంకా పెరిగింది, సంస్థ ఇస్తున్న వాటన్నిటి పట్ల కృతజ్ఞత పెరిగింది.”

మీ సేవను విస్తృతం చేసుకోండి

14, 15. (ఎ) యెషయా ప్రవక్త ఎలాంటి స్ఫూర్తి చూపించాడు? (బి) యెషయా ప్రవక్తకు ఉన్నలాంటి స్ఫూర్తిని క్రైస్తవులు ఎలా చూపించవచ్చు?

14 మీరు ఇంకా ఎక్కువగా యెహోవాతో కలిసి పని చేయాలనుకుంటున్నారా? అవసరం ఎక్కువున్న ప్రాంతాలకు వెళ్లి సేవచేయాలని ఇష్టపడుతున్నారా? నిజమే, ఉదారతను చూపించడానికి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరంలేదు. కానీ అలా వెళ్లగలిగే సహోదరసహోదరీలు కొంతమంది ఉన్నారు. వాళ్లకు యెషయా ప్రవక్తకు ఉన్నలాంటి స్ఫూర్తే ఉంది. “నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవును?” అని యెహోవా అడిగినప్పుడు, “చిత్తగించుము నేనున్నాను నన్ను పంపు” అని యెషయా ముందుకొచ్చాడు. (యెష. 6:8) యెహోవా సంస్థకు సహాయం చేయాలనే కోరిక మీకుందా? అలా చేయడానికి మీ పరిస్థితులు అనుకూలిస్తాయా? మీరు సహాయం చేయగల కొన్ని మార్గాలు ఏమిటి?

15 ప్రకటనా పని, శిష్యుల్ని చేసే పని గురించి యేసు ఇలా చెప్పాడు, “కోయాల్సిన పంట చాలా ఉంది, కానీ పనివాళ్లు కొంతమందే ఉన్నారు. కాబట్టి తన పంట కోయడానికి పనివాళ్లను పంపించమని పంట యజమానిని వేడుకోండి.” (మత్త. 9:37, 38) అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో మీరు పయినీరు సేవచేయగలరా? లేదా అలా సేవచేసేలా ఇతరుల్ని ప్రోత్సహించగలరా? దేవుని మీద, సాటిమనిషి మీద ప్రేమ చూపించడానికి, అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో సేవచేయడం ఒక చక్కని మార్గమని చాలామంది సహోదరసహోదరీలు భావిస్తున్నారు. మీ సేవను విస్తృతం చేసుకోవడానికి ఇతర మార్గాల గురించి ఆలోచించగలరా? అలా విస్తృతం చేసుకున్నప్పుడు చాలా సంతోషిస్తారు.

16, 17. మీ సేవను విస్తృతం చేసుకోగల ఇంకొన్ని మార్గాలు ఏమిటి?

16 మీరు కొంతకాలంపాటు లేదా వారంలో ఒకట్రెండు రోజులు బెతెల్‌లో గానీ, నిర్మాణ ప్రాజెక్టుల్లో గానీ సేవ చేయాలనుకుంటున్నారా? అవసరం ఎక్కడుంటే అక్కడ సేవ చేసేవాళ్లు, అలాగే వేరే రంగాల్లో అనుభవం ఉన్నప్పటికీ సంస్థ చెప్పింది చేసేవాళ్లు యెహోవా సంస్థకు ఎప్పుడూ అవసరం. ఇష్టంగా త్యాగాలు చేసి, అవసరం ఎక్కడుంటే అక్కడ సేవచేసే ప్రతీ ఒక్కర్నీ యెహోవా విలువైనవాళ్లుగా చూస్తాడు.—కీర్త. 110:3.

17 యెహోవా సేవను ఇంకా ఎక్కువ చేయడానికి మీకు శిక్షణ కావాలా? అయితే, రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే పూర్తికాల సేవ చేస్తూ పరిణతి సాధించిన సహోదరసహోదరీలకు ఆ పాఠశాలలో శిక్షణనిస్తారు. దానివల్ల వాళ్లు యెహోవా సంస్థకు మరింత ఎక్కువగా ఉపయోగపడతారు. ఆ పాఠశాలకు వెళ్లేవాళ్లు, సంస్థ ఎక్కడ నియమిస్తే అక్కడ సేవచేయడానికి సిద్ధంగా ఉండాలి. మరి ఈ విధంగా యెహోవా సేవ ఎక్కువ చేయాలని కోరుకుంటారా?—1 కొరిం. 9:23.

18. ప్రతీరోజు యెహోవాతో కలిసి పనిచేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి?

18 యెహోవా ప్రజలమైన మనం ఉదారంగా, మంచిగా, దయగా, ప్రేమగా ఉంటాం. మనం ప్రతీరోజు ఇతరుల మీద శ్రద్ధ చూపిస్తాం. దానివల్ల సంతోషం, శాంతి, ఆనందం పొందుతాం. (గల. 5:22, 23) మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, యెహోవాలా ఉదారతను చూపిస్తూ, ఆయన తోటి పనివాళ్లలో ఒకరిగా ఉన్నంతకాలం సంతోషంగా ఉంటారు.—సామె. 3:9, 10.