కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 23

“నీ పేరు పవిత్రపర్చబడాలి”

“నీ పేరు పవిత్రపర్చబడాలి”

“యెహోవా, నీ పేరు ఎప్పటికీ నిలిచివుంటుంది.”—కీర్త. 135:13.

పాట 10 మన దేవుడైన యెహోవాను స్తుతించండి!

ఈ ఆర్టికల్‌లో. . . *

1-2. యెహోవాసాక్షులు ఏ విషయాల్ని చర్చించడానికి ఇష్టపడతారు?

ప్రస్తుతం మన ముందు రెండు అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవి: యెహోవా సర్వాధిపత్యం, ఆయన పేరు పవిత్రపర్చబడడం. యెహోవాసాక్షులమైన మనం ఈ ఆసక్తికరమైన విషయాల గురించి చర్చించడానికి ఇష్టపడతాం. ఇంతకీ దేవుని సర్వాధిపత్యం, ఆయన పేరు పవిత్రపర్చబడడం ఒకదానితో ఒకటి సంబంధం లేని విషయాలా? కాదు.

2 దేవుని పేరు పవిత్రపర్చబడాలని మనందరికీ తెలుసు. అంతేకాదు యెహోవా సర్వాధిపత్యం, అంటే ఆయన పరిపాలనా విధానం అన్నిటికన్నా శ్రేష్ఠమైనదిగా నిరూపించబడాలని కూడా మనకు తెలుసు. అందుకే ఈ రెండు విషయాలు మనకెంతో ప్రాముఖ్యమైనవి.

3. యెహోవా అనే పేరులో ఏమేం ఇమిడివున్నాయి?

3 నిజానికి యెహోవా అనే పేరులో ఆయనకు సంబంధించిన అన్ని విషయాలతోపాటు, ఆయన పరిపాలనా విధానం కూడా ఇమిడివుంది. కాబట్టి యెహోవా పేరు పవిత్రపర్చబడితే, ఆయన పరిపాలనా విధానం శ్రేష్ఠమైనదని కూడా నిరూపించబడినట్టే. అవును యెహోవా పేరుకు, ఆయన విశ్వసర్వాధిపత్యానికి దగ్గరి సంబంధం ఉంది.—“ ఈ ప్రాముఖ్యమైన విషయంలో ఇమిడివున్న అంశాలు” అనే బాక్సు చూడండి.

4. దేవుని పేరు గురించి కీర్తన 135:13 ఏం చెప్తుంది? ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలు చర్చిస్తాం?

4 యెహోవా అనే పేరు చాలా ప్రత్యేకమైనది. (కీర్తన 135:13 చదవండి.) ఆ పేరు ఎందుకంత ప్రాముఖ్యమైనది? మొదట్లో ఆ పేరు మీద ఎలా నింద వేయబడింది? యెహోవా దాన్ని ఎలా పవిత్రపరుస్తాడు? ఆ పేరును పవిత్రపర్చడానికి మనమేం చేయవచ్చు? ఈ ప్రశ్నల గురించి ఇప్పుడు చర్చిద్దాం.

పేరుకున్న ప్రాముఖ్యత

5. ‘దేవుని పేరు పవిత్రపర్చబడాలి’ అని అన్నప్పుడు కొంతమంది ఏం అనుకోవచ్చు?

5 “నీ పేరు పవిత్రపర్చబడాలి.” (మత్త. 6:9) దేవుని పేరు పవిత్రపర్చబడడం, మన ప్రార్థనలో అత్యంత ప్రాముఖ్యమైన విషయంగా ఉండాలని యేసు బోధించాడు. “నీ పేరు పవిత్రపర్చబడాలి” అని యేసు చెప్పిన మాటలకు అర్థం ఏంటి? దేన్నైనా పవిత్రపర్చడం అంటే దాన్ని శుభ్రపర్చడం, స్వచ్ఛంగా చేయడం అని అర్థం. యెహోవా పేరు పవిత్రమైనదే కదా, దాన్ని శుభ్రపర్చాల్సిన, స్వచ్ఛంగా చేయాల్సిన అవసరం ఏంటని కొంతమంది అనుకోవచ్చు. దీనికి జవాబు తెలుసుకోవాలంటే అసలు ఒక పేరులో ఏయే విషయాలు ఇమిడివుంటాయో అర్థంచేసుకోవాలి.

6. పేరు అనేది ఎందుకంత ప్రాముఖ్యం?

6 పేరు అంటే కేవలం పేపరు మీద రాసే అక్షరాలో, నోటితో పలికే పదాలో కాదు. బైబిలు ఇలా చెప్తుంది: ‘గొప్ప సంపదల కన్నా మంచిపేరును ఎంచుకోవడం మంచిది.’ (సామె. 22:1; ప్రసం. 7:1) పేరు అనేది ఎందుకంత ప్రాముఖ్యమైనది? ఒకరి పేరు వినగానే ఆ వ్యక్తి ఎలాంటివాడో అవతలి వాళ్లకు గుర్తొస్తుంది. కాబట్టి ఒకరి పేరు చూడ్డానికి ఎలా ఉంది, వినడానికి ఎలా ఉంది అనేది ముఖ్యం కాదు. ఆ పేరు చూసినప్పుడు లేదా విన్నప్పుడు ఇతరులకు ఏం గుర్తొస్తుంది అనేదే ముఖ్యం.

7. ప్రజలు ఏవిధంగా దేవుని పేరును పాడుచేయడానికి ప్రయత్నిస్తున్నారు?

7 ప్రజలు యెహోవా గురించి అబద్ధాలు చెప్తూ ఆయన గురించి చెడు ప్రచారం చేస్తున్నారు. అలా వాళ్లు దేవుని పేరును పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి ఒక ప్రయత్నం మొట్టమొదటిసారిగా ఏదెను తోటలో జరిగింది. దాని గురించిన మరిన్ని విషయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

దేవుని పేరు మీద పడిన మొదటి నింద

8. ఆదాముహవ్వలకు ఏం తెలుసు? మనం ఏ ప్రశ్నల గురించి ఆలోచించవచ్చు?

8 ఆదాముహవ్వలకు దేవుని పేరు యెహోవా అని తెలుసు, ఆయన గురించిన ప్రాముఖ్యమైన సత్యాలు కూడా తెలుసు. తమకు జీవాన్ని, అందమైన పరదైసును, ఒక మంచి తోడును ఇచ్చిన సృష్టికర్త ఆయనే అని వాళ్లకు తెలుసు. (ఆది. 1:26-28; 2:18) మరి వాళ్లు తమ పరిపూర్ణ మేధస్సును ఉపయోగించి, యెహోవా తమకోసం చేసిన వాటన్నిటి గురించి ఆలోచిస్తారా? యెహోవా పట్ల ప్రేమ, కృతజ్ఞత పెంచుకోవడానికి కృషి చేస్తారా? వాళ్లను దేవుని శత్రువు పరీక్షించినప్పుడు ఏం జరిగిందో తెలుసుకుంటే ఆ ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది.

9. ఆదికాండం 2:16, 17; 3:1-5 ప్రకారం, యెహోవా మొదటి మానవ జంటతో ఏమని చెప్పాడు? ఆ విషయాన్ని సాతాను ఎలా తప్పుగా వాడుకున్నాడు?

9 ఆదికాండం 2:16, 17; 3:1-5 చదవండి. సాతాను సర్పాన్ని ఉపయోగించుకుని హవ్వను ఈ ప్రశ్న అడిగాడు: “ఈ తోటలో ఉన్న అన్ని చెట్ల పండ్లనూ మీరు తినకూడదని దేవుడు నిజంగా చెప్పాడా?” యెహోవా అబద్ధికుడని అర్థం వచ్చేలా సాతాను మాట్లాడాడు. దానివల్ల, హవ్వ దేవుని గురించి తప్పుగా ఆలోచించడం మొదలుపెట్టింది. నిజానికి ఒక్క చెట్టు పండ్లను తప్పించి, అన్ని చెట్ల పండ్లను తినొచ్చని దేవుడు ఆదాముహవ్వలకు చెప్పాడు. వాళ్లు తినడానికి ఏదెను తోటలో ఎన్నో రకాల పండ్లు ఉన్నాయి. (ఆది. 2:9) అవును, యెహోవా ఉదారత గల దేవుడు. అయితే ఒక్క చెట్టు పండ్లను మాత్రం తినొద్దని దేవుడు చెప్పిన మాటను సాతాను తప్పుగా వాడుకున్నాడు. దేవునికి ఉదారత లేదని అనిపించేలా ఒక ప్రశ్న అడిగాడు. అప్పుడు హవ్వ, ‘మాకేదైనా మంచి జరగకుండా దేవుడు అడ్డుకుంటున్నాడా?’ అని ఆలోచించి ఉంటుంది.

10. సాతాను దేవుని పేరుమీద ఎలా నేరుగా దాడిచేశాడు? దానివల్ల ఏం జరిగింది?

10 అప్పటికి హవ్వ ఇంకా యెహోవానే తన పరిపాలకునిగా భావిస్తోంది. అందుకే దేవుడిచ్చిన స్పష్టమైన ఆజ్ఞను సాతానుకు చెప్పింది. అంతేకాదు, వాళ్లు ఆ చెట్టును కనీసం ముట్టుకోకూడదని కూడా చెప్పింది. ఆ చెట్టు పండును తింటే చనిపోతారని దేవుడిచ్చిన హెచ్చరిక హవ్వకు తెలుసు. కానీ సాతాను హవ్వతో, “మీరు చావనే చావరు” అన్నాడు. (ఆది. 3:2-4) అలా సాతాను పరోక్షంగా కాదుగానీ, నేరుగానే దేవుని పేరు మీద దాడిచేయడం మొదలుపెట్టాడు. ఒక విధంగా చెప్పాలంటే, యెహోవా అబద్ధికుడని సాతాను అన్నాడు. అలా సాతాను అపవాదిగా లేదా ఇతరుల మంచిపేరును పాడుచేసే వాడిగా మారాడు. హవ్వ సాతాను మాటల్ని నమ్మింది, పూర్తిగా మోసపోయింది. (1 తిమో. 2:14) ఆమె యెహోవా కన్నా సాతానునే ఎక్కువ నమ్మింది. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా, యెహోవా ఇచ్చిన ఆజ్ఞను మీరాలనే చెడ్డ నిర్ణయం తీసుకుంది. ఆమె యెహోవా తినొద్దని చెప్పిన పండును తింది, ఆ తర్వాత ఆదాముకు కూడా ఇచ్చింది.—ఆది. 3:6.

11. ఆదాముహవ్వలు ఏం చేసుంటే బాగుండేది? కానీ వాళ్లు ఏం చేయలేదు?

11 హవ్వ సాతానుతో ఏం అనుంటే బావుండేదో ఆలోచించండి: “అసలు నువ్వెవరు? నాకు మా నాన్న యెహోవా గురించి బాగా తెలుసు. ఆయనంటే నాకిష్టం. నేను ఆయన్నే నమ్ముతాను. ఆయన నాకు ఆదామును, కావల్సిన వాటన్నిటినీ ఇచ్చాడు. ఆయన గురించి చెడుగా మాట్లాడడానికి నీకెంత ధైర్యం? ఇక్కడి నుండి వెళ్లిపో!” ఒకవేళ నిజంగా హవ్వ ఇలా అనుంటే ఎంత బావుండేది! తాను ఎంతో ప్రేమించే కూతురు అలా మాట్లాడడం విని యెహోవా చాలా సంతోషించి ఉండేవాడు. (సామె. 27:11) కానీ హవ్వకు గానీ, ఆదాముకు గానీ యెహోవా మీద నిజమైన ప్రేమ లేదు; అందుకే సాతాను తమ తండ్రి పేరును పాడుచేయడానికి ప్రయత్నిస్తున్నా, వాళ్లు ఆయన తరఫున మాట్లాడే ప్రయత్నం చేయలేదు.

12. సాతాను హవ్వ మనసులో ఎలాంటి సందేహాలు నాటాడు? ఆదాముహవ్వలు ఏం చేయలేదు?

12 హవ్వ మనసులో సందేహాల్ని నాటడం ద్వారా సాతాను యెహోవా పేరును పాడుచేయడం మొదలుపెట్టాడు. తమ తండ్రైన యెహోవా నిజంగా మంచివాడేనా అనే సందేహాన్ని హవ్వ మనసులో పుట్టించాడు. తమ తండ్రి పేరు మీద సాతాను ఘోరమైన నిందలు వేస్తున్నా ఆదాముహవ్వలు ఆయన పక్షాన మాట్లాడలేదు. బదులుగా, చాలా తేలిగ్గా సాతాను మాయలో పడిపోయి తమ తండ్రికి ఎదురుతిరిగారు. నేడు కూడా సాతాను ఇలాంటి కుయుక్తులే ఉపయోగిస్తున్నాడు. యెహోవా గురించి అబద్ధాలు వ్యాప్తిచేయడం ద్వారా ఆయన పేరును పాడుచేయాలని సాతాను చూస్తున్నాడు. ఆ అబద్ధాల్ని నమ్మే ప్రజలు యెహోవా నీతియుక్త పరిపాలనను తిరస్కరిస్తున్నారు.

యెహోవా తన పేరును పవిత్రపర్చుకుంటాడు

13. యెహెజ్కేలు 36:23 బైబిలు సారాంశాన్ని ఎలా తెలియజేస్తోంది?

13 తన పేరు మీద నిందలు వేస్తున్నా యెహోవా చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. తన పేరు మీద వేయబడిన నిందలు అబద్ధాలని నిరూపించడానికి యెహోవా ఏం చేశాడు అన్నదే బైబిలు సారాంశం. (ఆది. 3:15) ఆ సారాంశం ఏంటంటే: తన కుమారుడు పరిపాలించే రాజ్యం ద్వారా యెహోవా తన పేరును పవిత్రపర్చి, భూమ్మీద నీతిని, శాంతిని తిరిగి నెలకొల్పుతాడు. అయితే ఆయన దాన్ని ఎలా చేస్తాడో తెలియజేసే సమాచారం బైబిల్లో ఉంది.—యెహెజ్కేలు 36:23 చదవండి.

14. ఏదెనులో జరిగిన తిరుగుబాటుకు యెహోవా స్పందించిన తీరు ఆయన పేరును ఎలా పవిత్రపర్చింది?

14 యెహోవా తన సంకల్పాన్ని నెరవేర్చడానికి చేసిన వాటన్నిటినీ అడ్డుకోవడానికి సాతాను శతవిధాలా ప్రయత్నించాడు, కానీ ప్రతీసారి విఫలమయ్యాడు. యెహోవా తన పేరును పవిత్రపర్చుకోవడానికి ఏమేం చేశాడో బైబిల్లో ఉంది. ఆయన నిజంగా ఒక ప్రేమగల తండ్రని, అత్యుత్తమ పరిపాలకుడని ఆయన పనులు నిరూపిస్తున్నాయి. కానీ సాతాను తిరుగుబాటు చేయడం, చాలామంది అతని పక్షాన చేరడం యెహోవాను ఎంతో బాధపెట్టింది. (కీర్త. 78:40) అయినాసరే తన పేరును పవిత్రపర్చుకునే విషయంలో యెహోవా తెలివిని, ఓర్పును, న్యాయాన్ని ప్రదర్శించాడు. అంతేకాదు తనకున్న అపారమైన శక్తిని ఎన్నో విధాలుగా చూపించాడు. అన్నిటికన్నా ముఖ్యంగా, ఆయన చేసిన ప్రతీదానిలో ప్రేమ కనిపిస్తుంది. (1 యోహా. 4:8) నిజమే, తన పేరును పవిత్రపర్చుకోవడానికి యెహోవా అలుపెరగకుండా కృషిచేశాడు.

సాతాను హవ్వకు యెహోవా గురించి అబద్ధాలు చెప్పాడు, వందల సంవత్సరాలుగా దేవుని పేరు పాడుచేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు (9-10, 15 పేరాలు చూడండి) *

15. నేడు సాతాను దేవుని పేరు మీద ఎలాంటి నిందలు వేస్తున్నాడు? దానివల్ల ఏం జరుగుతోంది?

15 ఈరోజు వరకు సాతాను దేవుని పేరు మీద నిందలు వేస్తూనే ఉన్నాడు. ప్రజలు దేవుని శక్తిని, న్యాయాన్ని, తెలివిని, ప్రేమను సందేహించేలా చేస్తున్నాడు. ఉదాహరణకు, యెహోవా సృష్టికర్త కాదని ప్రజల్ని నమ్మించడానికి సాతాను ప్రయత్నిస్తున్నాడు. ఒకవేళ ప్రజలు దేవుడు ఉన్నాడని నమ్మితే, ఆయన కఠినుడని, ఆయన ప్రమాణాలు కష్టమైనవని, అన్యాయమైనవని అనుకునేలా చేస్తున్నాడు. అంతేకాదు యెహోవా మనసు లేనివాడని, ప్రజల్ని నరకాగ్నిలో క్రూరంగా హింసిస్తాడని అబద్ధ ప్రచారం చేస్తున్నాడు. ఆ పచ్చి అబద్ధాల్ని నమ్మే ప్రజలు చాలా తేలిగ్గా యెహోవా నీతియుక్త పరిపాలనను తిరస్కరిస్తున్నారు. సాతాను పూర్తిగా నాశనమయ్యేవరకు దేవుని పేరుమీద నిందలు వేస్తూనే ఉంటాడు, మిమ్మల్ని యెహోవాకు దూరం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. మరి సాతాను విజయం సాధిస్తాడా?

మీ పాత్ర ఏంటి?

16. ఆదాముహవ్వలు చేయలేకపోయిన ఏ పనుల్ని మీరు చేయవచ్చు?

16 తన పేరును పవిత్రపర్చే అవకాశాన్ని యెహోవా అపరిపూర్ణ మనుషులకు కూడా ఇస్తు న్నాడు. కాబట్టి ఆదాముహవ్వలు చేయలేకపోయిన దాన్ని మీరు చేయవచ్చు. లోకంలోని ప్రజలు దేవుని గురించి అబద్ధాలు చెప్తూ ఆయన పేరు పాడు చేయాలని చూస్తున్నారు. కాబట్టి, మీరు యెహోవా తరఫున మాట్లాడుతూ ఆయన పవిత్రుడని, నీతిమంతుడని, మంచివాడని, ప్రేమగలవాడని అందరికీ చెప్పే అవకాశం మీకు ఉంది. (యెష. 29:23) మీరు ఆయన పరిపాలన కింద ఉండాలని కోరుకుంటున్నట్టు చూపించవచ్చు. ఆయన పరిపాలన మాత్రమే నీతియుక్తమైనదని, అది మాత్రమే శాంతి-సంతోషాల్ని తీసుకురాగలదని ప్రజలందరికీ తెలిసేలా చేయవచ్చు.—కీర్త. 37:9, 37; 146:5, 6, 10.

17. యేసు తన తండ్రి పేరును ఎలా తెలియజేశాడు?

17 మనం యెహోవా పేరును సమర్థించినప్పుడు, యేసుక్రీస్తును అనుకరించిన వాళ్లమౌతాం. (యోహా. 17:26) దేవుని పేరును ఉపయోగించడం ద్వారా, ఆయన ఎలాంటివాడో బోధించడం ద్వారా యేసు తన తండ్రి పేరును తెలియజేశాడు. ఉదాహరణకు యెహోవా కఠినుడని, స్వేచ్ఛనివ్వడని, ఆయనకు దగ్గరవ్వడం అసాధ్యమని, ఆయన కరుణ లేనివాడని ప్రజలు అనుకునేలా చేసిన పరిసయ్యుల్ని యేసు ఖండించాడు. తన తండ్రి అందర్నీ అర్థం చేసుకుంటాడని, ఓపిక చూపిస్తాడని, ప్రేమిస్తాడని, క్షమిస్తాడని తెలుసుకునేలా ప్రజలకు యేసు సహాయం చేశాడు. అంతేకాదు, ప్రతీ పనిలో తన తండ్రి లక్షణాల్ని అనుకరించడం ద్వారా కూడా యెహోవా ఎలాంటివాడో ప్రజలకు చూపించాడు.—యోహా. 14:9.

18. యెహోవా గురించి సాతాను ప్రచారం చేసే విషయాలు అబద్ధాలని ఎలా నిరూపించవచ్చు?

18 యేసులాగే మనం కూడా, యెహోవా గురించి మనకు తెలిసిన విషయాలను అందరికీ చెప్పవచ్చు. ఆయన ప్రేమగల, దయగల దేవుడని ప్రజలకు బోధించవచ్చు. అలా చేయడం ద్వారా, యెహోవా గురించి సాతాను ప్రచారం చేస్తున్న విషయాలు పచ్చి అబద్ధాలని నిరూపిస్తాం. ప్రజల మనసుల్లో, హృదయాల్లో యెహోవా మీదున్న తప్పుడు అభిప్రాయాన్ని సరిచేయడం ద్వారా ఆయన పేరును పవిత్రపరుస్తాం. మనం కూడా యెహోవా లక్షణాల్ని అనుకరించవచ్చు. మనం అపరిపూర్ణులం అయినప్పటికీ, ఆయన్ని అనుకరించడం సాధ్యమే. (ఎఫె. 5:1, 2) యెహోవా ఎలాంటి దేవుడో మన మాటల ద్వారా, పనుల ద్వారా చూపించినప్పుడు ఆయన పేరును పవిత్రపర్చిన వాళ్లమౌతాం. యెహోవా విషయంలో ఉన్న అపోహల నుండి బయటపడేలా ప్రజలకు సహాయం చేయడం ద్వారా కూడా ఆయన పేరును పవిత్రపరుస్తాం. అంతేకాదు, అపరిపూర్ణ మనుషులు దేవునికి యథార్థంగా ఉండగలరని నిరూపిస్తాం.—యోబు 27:5.

యెహోవా ప్రేమగల, దయగల దేవుడని అర్థం చేసుకునేలా బైబిలు విద్యార్థులకు సహాయం చేస్తాం (18-19 పేరాలు చూడండి) *

19. యెషయా 63:7 ప్రకారం ప్రజలకు ఏ విషయాలు బోధించడం మన ప్రధాన లక్ష్యం?

19 మనం యెహోవా పేరును పవిత్రపర్చడానికి చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. మనం ప్రజలకు బైబిలు సత్యాలు బోధిస్తున్నప్పుడు, దేవుని సర్వాధిపత్యం గురించి చెప్తుంటాం. అంటే విశ్వాన్ని పరిపాలించే హక్కు యెహోవాకు మాత్రమే ఉందని బోధిస్తాం. అయితే, వాళ్లకు దేవుని నియమాలు తెలియజేయడంతోపాటు, మన తండ్రైన యెహోవాను ప్రేమించేలా చేయడం, ఆయనకు నమ్మకంగా ఉండేలా నేర్పించడం మన ప్రధాన లక్ష్యం. కాబట్టి యెహోవాకున్న అద్భుతమైన లక్షణాల గురించి వాళ్లకు ముఖ్యంగా చెప్పాలి, యెహోవా అనే పేరు ధరించిన దేవుడు ఎలాంటివాడో అర్థమయ్యేలా బోధించాలి. (యెషయా 63:7 చదవండి.) ఆ విధంగా బోధిస్తే, యెహోవాకు నమ్మకంగా ఉండాలనే కోరిక గల ప్రజలకు ఆయన్ని ప్రేమించడం, ఆయనకు లోబడడం నేర్పించిన వాళ్లమౌతాం.

20. తర్వాతి ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

20 మన ప్రవర్తన, బోధనా విధానం యెహోవా పేరుకు ఘనత తెచ్చేలా ఉండాలన్నా, ఇతరులు యెహోవాకు దగ్గరయ్యేలా ఉండాలన్నా ఏం చేయాలి? దానికి జవాబును తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

పాట 2 యెహోవా నీ పేరు

^ పేరా 5 మనుషులు, దేవదూతలు ప్రాముఖ్యంగా ఎంచాల్సిన విషయాలు ఏంటి? అవి ఎందుకంత ప్రాముఖ్యమైనవి? వాటిలో మన పాత్ర ఏంటి? ఈ ప్రశ్నలకు, వీటికి సంబంధించిన ఇతర ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడం వల్ల యెహోవాతో మన స్నేహం మరింత బలపడుతుంది.

^ పేరా 61 చిత్రాల వివరణ: దేవుడు అబద్ధికుడని అనడం ద్వారా అపవాది దేవుని పేరు మీద నింద వేశాడు. కొన్ని వందల సంవత్సరాలుగా, సాతాను అబద్ధ సిద్ధాంతాలు వ్యాప్తి చేస్తూ దేవుడు క్రూరుడని, ఆయన సృష్టికర్త కాడని ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు.

^ పేరా 63 చిత్రాల వివరణ: బైబిలు స్టడీ చేస్తున్న సహోదరుడు దేవుని లక్షణాల గురించి నొక్కి చెప్తున్నాడు.