కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 19

అంత్యకాలంలో “ఉత్తర రాజు”

అంత్యకాలంలో “ఉత్తర రాజు”

“అంత్యకాలంలో దక్షిణ రాజు అతనితో [ఉత్తర రాజుతో] పోరాటం  చేస్తాడు.”—దాని. 11:40.

పాట 150 మీ విడుదల కోసం దేవుణ్ణి వెదకండి

ఈ ఆర్టికల్‌లో . . . *

1. బైబిలు ప్రవచనాలు ఏం తెలియజేస్తున్నాయి?

అతి త్వరలో యెహోవా ప్రజలకు ఏం జరగబోతోంది? దానికి జవాబు బైబిల్లో ఉంది. మనందరిపై ప్రభావం చూపించే ప్రాముఖ్యమైన సంఘటనల గురించి బైబిలు ప్రవచనాలు తెలియజేస్తున్నాయి. అలాంటి ఒక ప్రవచనం, భూమ్మీదున్న అత్యంత శక్తివంతమైన కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తాయో చెప్తోంది. ఆ ప్రవచనం దానియేలు 11వ అధ్యాయంలో ఉంది. అందులో, ఒకరితోఒకరు పోరాడే ఇద్దరు రాజుల గురించి ఉంది. ఆ ప్రవచనం వాళ్లను ఉత్తర రాజు, దక్షిణ రాజు అని పిలుస్తోంది. ఆ ప్రవచనంలోని చాలా భాగం ఇప్పటికే నెరవేరింది కాబట్టి, అందులోని మిగతా భాగం కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని మనం నమ్మవచ్చు.

2. ఆదికాండం 3:15; ప్రకటన 11:7; 12:17 వచనాలు తెలియజేస్తున్నట్లు, మనం దానియేలు ప్రవచనాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఏయే విషయాల్ని గుర్తుంచుకోవాలి?

2 దానియేలు 11వ అధ్యాయంలో ఉన్న ప్రవచనాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి: ఆ ప్రవచనం, ఎక్కువమంది దేవుని ప్రజలున్న ప్రాంతాన్ని పరిపాలించిన లేదా వాళ్లమీద దాడిచేసిన పరిపాలకుల గురించి, ప్రభుత్వాల గురించి మాత్రమే మాట్లాడుతోంది. ప్రపంచ జనాభాలో దేవుని ప్రజల సంఖ్య చాలా తక్కువే అయినప్పటికీ, ప్రభుత్వాలు వాళ్లను ఎందుకు హింసిస్తున్నాయి? ఎందుకంటే యెహోవాను, యేసును సేవిస్తున్న ప్రజల్ని నిర్మూలించడమే సాతానుకు, అతని వ్యవస్థ అంతటికి ఉన్న ప్రధాన లక్ష్యం. (ఆదికాండం 3:15; ప్రకటన 11:7; 12:17 చదవండి.) మనం గుర్తుంచుకోవాల్సిన రెండో విషయం ఏంటంటే: దానియేలు ప్రవచనం బైబిల్లోని మిగతా ప్రవచనాలతో పొందికగా ఉండాలి. కాబట్టి మనం బైబిల్లోని మిగతా లేఖనాలను కూడా పరిశీలించిన తర్వాతే దానియేలు ప్రవచనాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలం.

3. ఈ ఆర్టికల్‌లో, తర్వాతి ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

3 ఆ రెండు విషయాల్ని మనసులో ఉంచుకుని, దానియేలు 11:25-39 వచనాల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. 1870 నుండి 1991 వరకు ఎవరు ఉత్తర రాజుగా, ఎవరు దక్షిణ రాజుగా ఉన్నారో చూస్తాం. అంతేకాదు, దానియేలు ప్రవచనంలోని ఈ భాగానికి సంబంధించి మన అవగాహనలో మార్పు ఎందుకు అవసరమో తెలుసుకుంటాం. తర్వాతి ఆర్టికల్‌లో దానియేలు 11:40–12:1 లో ఉన్న మిగతా ప్రవచనాన్ని పరిశీలించి, 1991 నుండి హార్‌మెగిద్దోను వరకు జరిగే సంఘటనల విషయంలో సరైన అవగాహనను సంపాదించుకుంటాం. ఈ రెండు ఆర్టికల్స్‌ని బాగా అర్థం చేసుకోవడానికి, “అంత్యకాలంలో శత్రు రాజులు” అనే చార్టు సహాయం చేస్తుంది. ముందుగా, ఈ ప్రవచనంలోని ఇద్దరు రాజుల్ని ఎలా గుర్తుపట్టవచ్చో చూద్దాం.

ఉత్తర రాజును, దక్షిణ రాజును ఎలా గుర్తుపట్టవచ్చు?

4. ఉత్తర రాజును, దక్షిణ రాజును గుర్తుపట్టడానికి ఏ మూడు విషయాలు సహాయం చేస్తాయి?

4 మొదట్లో “ఉత్తర రాజు” అనే మాట ఇశ్రాయేలు దేశానికి ఉత్తరాన ఉన్న రాజ్యాన్ని, “దక్షిణ రాజు” అనే మాట దక్షిణాన ఉన్న రాజ్యాన్ని సూచించాయి. అలాగని ఎలా చెప్పవచ్చు? దానియేలు దగ్గరికి సందేశాన్ని తీసుకొచ్చిన దేవదూత ఏమన్నాడో పరిశీలించండి: “చివరి రోజుల్లో నీ ప్రజలకు ఏం సంభవిస్తుందో నువ్వు గ్రహించేలా సహాయం చేయడానికి నేను వచ్చాను.” (దాని. 10:14) క్రీ.శ. 33 పెంతెకొస్తు వరకు ఇశ్రాయేలీయులు మాత్రమే దేవుని ప్రజలుగా ఉన్నారు. అయితే క్రీ.శ. 33 పెంతెకొస్తు రోజు మొదలుకొని, నమ్మకమైన యేసు శిష్యులు మాత్రమే తన ప్రజలని యెహోవా స్పష్టం చేశాడు. కాబట్టి, దానియేలు 11వ అధ్యాయంలో ఉన్న ప్రవచనంలోని చాలా భాగం ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడట్లేదు కానీ క్రీస్తు అనుచరుల గురించి మాట్లాడుతోంది. (అపొ. 2:1-4; రోమా. 9:6-8; గల. 6:15, 16) అంతేకాదు ఆ ప్రవచనంలోని ఉత్తర రాజు, దక్షిణ రాజు వేర్వేరు కాలాల్లో వేర్వేరు ప్రభుత్వాల్ని సూచించారు. అయినప్పటికీ, ఆ రాజులు మూడు విషయాల్లో మాత్రం ఒకేలా ప్రవర్తించారు: (1) ఆ రాజులు ఎక్కువమంది దేవుని ప్రజలున్న ప్రాంతాన్ని పరిపాలించారు లేదా దేవుని ప్రజల్ని హింసించారు. (2) వాళ్లు దేవుని ప్రజలతో వ్యవహరించిన తీరు, వాళ్లకు సత్యదేవుడైన యెహోవా మీదున్న ద్వేషాన్ని స్పష్టం చేసింది. (3) ఆ ఇద్దరు రాజులు ఆధిపత్యం కోసం ఒకరితోఒకరు పోరాడారు.

5. క్రీ.శ. 100వ సంవత్సరం నుండి 1870 వరకు ఉత్తర రాజు, దక్షిణ రాజు అంటూ ఎవరైనా ఉన్నారా? వివరించండి.

5 క్రీ.శ. 100వ సంవత్సరం తర్వాత, క్రైస్తవ సంఘంలోకి చాలా ఎక్కువమంది అబద్ధ క్రైస్తవులు చొరబడ్డారు. వాళ్లు దేవుని వాక్యంలోని సత్యాల్ని దాచిపెట్టి అబద్ధమత సిద్ధాంతాల్ని బోధించడం మొదలుపెట్టారు. ఆ కాలం మొదలుకొని దాదాపు 1870 వరకు భూమ్మీద వ్యవస్థీకరించబడిన దేవుని సేవకుల గుంపు అంటూ ఏమీలేదు. పొలంలో అడ్డూఅదుపు లేకుండా పెరిగే కలుపుమొక్కల్లా అబద్ధ క్రైస్తవులు విపరీతంగా పెరిగిపోయారు. దాంతో నిజ క్రైస్తవుల్ని గుర్తించడం దాదాపు అసాధ్యమైంది. (మత్త. 13:36-43) ఈ వాస్తవం ఏ విషయాన్ని తెలియజేస్తుంది? క్రీ.శ. 100వ సంవత్సరం నుండి 1870 వరకు పరిపాలించిన రాజులు గానీ, ప్రభుత్వాలు గానీ ఉత్తర రాజును, దక్షిణ రాజును సూచించట్లేదని అది చూపిస్తోంది. ఎందుకంటే వాళ్లు దాడిచేయడానికి ఆ కాలంలో భూమ్మీద వ్యవస్థీకరించబడిన దేవుని సేవకుల గుంపు అంటూ ఏమీ లేదు. * అయితే 1870 తర్వాత ఉత్తర రాజు, దక్షిణ రాజు మళ్లీ తెర మీదికి వచ్చారని చెప్పడానికి సరైన కారణాలు ఉన్నాయి. ఏంటవి?

6. భూమ్మీద వ్యవస్థీకరించబడిన దేవుని సేవకుల గుంపు మళ్లీ ఎప్పుడు ఏర్పడింది? వివరించండి.

6 దేవుని ప్రజలు మళ్లీ ఒక గుంపుగా వ్యవస్థీకరించబడడం 1870 లో ప్రారంభమైంది. ఆ సంవత్సరంలోనే సి.టి. రస్సెల్‌, అలాగే ఇంకొంతమంది కలిసి దేవుని వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ బైబిలు సత్యాల్ని వెలికితీయడం మొదలుపెట్టారు. సహోదరుడు రస్సెల్‌, ఆయన సహచరులు బైబిలు ప్రవచించిన ‘సందేశకునిగా’ పనిచేసి మెస్సీయ రాజ్యం స్థాపించబడడానికి ‘మార్గాన్ని సిద్ధం చేశారు.’ (మలా. 3:1) దాంతో భూమ్మీద వ్యవస్థీకరించబడిన దేవుని సేవకుల గుంపు మళ్లీ ఏర్పడింది! మరి వాళ్ల మీద ప్రభావం చూపించగల ప్రభుత్వాలు ఏవైనా ఆ కాలంలో ఉన్నాయా? దానిగురించి ఇప్పుడు పరిశీలిద్దాం.

దక్షిణ రాజు ఎవరు?

7. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఒక సమయం వరకు ఎవరు దక్షిణ రాజుగా ఉన్నారు?

7 బ్రిటన్‌ దేశం 1870 నాటికి ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద సామ్రాజ్యంగా మారింది. అంతేకాదు శక్తివంతమైన సైన్యాన్ని ఏర్పర్చుకుంది. దానియేలు ప్రవచనం ఒక చిన్న కొమ్ము పైకి లేవడం గురించి, అది మొదటి మూడు కొమ్ముల్ని పెరికేయడం గురించి మాట్లాడుతోంది. ఆ చిన్న కొమ్ము బ్రిటన్‌కు సూచనగా ఉంది; మిగతా మూడు కొమ్ములు ఫ్రెంచ్‌, స్పెయిన్‌, నెదర్లాండ్స్‌ దేశాలకు సూచనగా ఉన్నాయి. (దాని. 7:7, 8) అంతేకాదు, మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఒక సమయం వరకు బ్రిటన్‌ మాత్రమే దక్షిణ రాజుగా ఉంది. అయితే అదే సమయంలో అమెరికా అత్యంత ధనిక దేశంగా ఎదిగింది, బ్రిటన్‌తో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకోవడం మొదలుపెట్టింది.

8. చివరి రోజులంతటిలో ఎవరు దక్షిణ రాజుగా ఉన్నారు?

8 మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్‌, అమెరికా దేశాలు చేతులు కలిపి అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని తయారు చేసుకున్నాయి. ఆ సమయంలో బ్రిటన్‌, అమెరికాలు మిత్ర దేశాలుగా మారడంతో ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యం ఏర్పడింది. దానియేలు ప్రవచించినట్లుగానే, ఈ ‘దక్షిణ రాజు ఎంతో విస్తారమైన, బలమైన సైన్యాన్ని’ సమకూర్చుకున్నాడు. (దాని. 11:25) చివరి రోజులంతటిలో ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యమే దక్షిణ రాజుగా ఉంది. * మరి ఉత్తర రాజు ఎవరు?

ఉత్తర రాజు ఎవరు?

9. ఒక కొత్త ఉత్తర రాజు ఎప్పుడు తెర మీదికి వచ్చాడు? దానియేలు 11:25 ఎలా నెరవేరింది?

9 రస్సెల్‌, ఆయన సహచరులు బైబిల్ని అధ్యయనం చేయడానికి ఒక గుంపుగా ఏర్పడిన తర్వాతి సంవత్సరంలో, అంటే 1871 లో ఒక కొత్త ఉత్తర రాజు తెర మీదికి వచ్చాడు. ఆ సంవత్సరంలో ఒటో వాన్‌ బిస్మార్క్‌, జర్మనీ దేశాన్ని ఒక సామ్రాజ్యంగా తీర్చిదిద్దడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఆ సామ్రాజ్యానికి మొదటి చక్రవర్తి విల్‌హెల్మ్‌ I. అతను బిస్మార్క్‌ను తన ప్రభుత్వానికి నాయకునిగా నియమించాడు. * జర్మనీ సామ్రాజ్యం, తర్వాతి కొన్ని దశాబ్దాల్లో ఆఫ్రికా, పసిఫిక్‌ ప్రాంతాల్లోని చాలా దేశాల్ని ఆక్రమించుకొని బ్రిటన్‌ కన్నా శక్తివంతంగా మారాలని ప్రయత్నించింది. (దానియేలు 11:25 చదవండి.) దాదాపు బ్రిటన్‌కు ఉన్నంత శక్తివంతమైన సైన్యాన్ని జర్మనీ సమకూర్చుకుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో శత్రు దేశాలతో పోరాడడానికి ఆ బలగాన్ని ఉపయోగించుకుంది.

10. దానియేలు 11:25బి, 26 ఎలా నెరవేరింది?

10 అయితే జర్మనీ సామ్రాజ్యానికి, అది సమకూర్చుకున్న సైన్యానికి ఏమౌతుందో కూడా దానియేలు ప్రవచనం చెప్పింది. ఉత్తర రాజు “నిలవడు” అని ఆ ప్రవచనం చెప్పింది. ఎందుకంటే “వాళ్లు అతనికి వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతారు. . . . అతని రుచికరమైన ఆహార పదార్థాలు తింటున్నవాళ్లు అతని పతనానికి కారణమౌతారు.” (దాని. 11:25బి, 26ఎ) దానియేలు కాలంలో, “రాజసేవ” చేసే అధికారులకు “రాజు తినే రుచికరమైన ఆహారపదార్థాలు” తినే అవకాశం ఉండేది. (దాని. 1:5) ఈ ప్రవచనం ఎవరి గురించి మాట్లాడుతోంది? జర్మనీ సామ్రాజ్యంలో ప్రముఖ స్థానాల్లో ఉన్న అధికారుల గురించి మాట్లాడుతోంది. వాళ్లలో చక్రవర్తి కింద ఉండే సైనికాధికారులు, సైనిక సలహాదారులు కూడా ఉన్నారు. వాళ్ల వల్లే జర్మనీలో పరిపాలనా వ్యవస్థ కుప్పకూలి కొత్త విధమైన ప్రభుత్వం మొదలైంది. * అయితే, దక్షిణ రాజుతో యుద్ధం చేయడం వల్ల వచ్చే ఫలితం గురించి కూడా దానియేలు ప్రవచనం చెప్పింది. “అతని [ఉత్తర రాజు] సైన్యం తుడిచిపెట్టుకుపోతుంది; చాలామంది చనిపోతారు.” (దాని. 11:26బి) ప్రవచనం చెప్పినట్టుగానే, మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైన్యం ‘తుడిచిపెట్టుకుపోయింది, చాలామంది చనిపోయారు.’ ఆ యుద్ధంలో జరిగినంత ప్రాణనష్టం అంతకుముందెన్నడూ జరగలేదు.

11. దానియేలు 11:27-30ఎ ప్రకారం ఉత్తర రాజు, దక్షిణ రాజు ఏం చేశారు?

11 మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు చోటు చేసుకునే సంఘటనల గురించి దానియేలు 11:27, 28 లో ఉంది. ఉత్తర రాజు, దక్షిణ రాజు ‘ఒకే బల్ల దగ్గర కూర్చుని ఒకరితో ఒకరు అబద్ధాలాడతారని;’ ఉత్తర రాజు ‘విస్తారమైన వస్తువుల్ని’ పోగుచేసుకుంటాడని ఆ వచనాలు చెప్తున్నాయి. సరిగ్గా అలాగే జరిగింది. బ్రిటన్‌, జర్మనీ దేశాలు తాము శాంతిని కోరుకుంటున్నామని చెప్పుకున్నాయి, కానీ 1914 లో యుద్ధం మొదలైనప్పుడు, వాళ్ల మాటలన్నీ పచ్చి అబద్ధాలని తేలింది. అంతేకాదు, 1914కల్లా జర్మనీ ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాల్లో రెండో స్థానానికి చేరుకుంది. తర్వాత దానియేలు 11:29, 30ఎ ప్రవచిస్తున్నట్లు, జర్మనీ దక్షిణ రాజుతో యుద్ధం చేయడానికి వెళ్లి, ఓడిపోయింది.

ఆ రాజులు దేవుని ప్రజలతో యుద్ధం చేశారు

12. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఉత్తర రాజు, దక్షిణ రాజు ఏం చేశారు?

12 అయితే, 1914 మొదలుకొని ఆ ఇద్దరు రాజులు ఒకరితోఒకరు చేస్తున్న పోరాటం; అలాగే వాళ్లు దేవుని ప్రజల మీద చేస్తున్న దాడి అంతకంతకూ ఎక్కువౌతోంది. ఉదాహరణకు మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీ, బ్రిటన్‌ ప్రభుత్వాలు యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించిన దేవుని సేవకుల్ని హింసించాయి. అమెరికా ప్రభుత్వం కూడా ప్రకటనా పనిలో నాయకత్వం వహించిన సహోదరులను జైల్లో వేసింది. ఈ దాడులు ప్రకటన 11:7-10 లో ఉన్న ప్రవచనాన్ని నెరవేర్చాయి.

13. ఉత్తర రాజు 1933 నుండి, మరిముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఏం చేశాడు?

13 ఉత్తర రాజు 1933 నుండి, మరిముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం సమయంలో దేవుని ప్రజలపై అతి కిరాతకంగా దాడిచేశాడు. జర్మనీలో నాజీ పరిపాలన మొదలయ్యాక హిట్లర్‌, అతని అనుచరులు దేవుని ప్రజల పనిని నిషేధించారు. ఉత్తర రాజు సుమారు 1,500 మంది యెహోవా సేవకుల్ని బలి తీసుకున్నాడు, కొన్ని వేలమందిని కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లో నిర్బంధించాడు. ఈ సంఘటనల గురించి దానియేలు ప్రవచనం ముందుగానే చెప్పింది. ఉత్తర రాజు ప్రకటనా పనిపై నిషేధం విధించడం ద్వారా ‘పవిత్రమైన స్థలాన్ని అపవిత్రపర్చి, రోజువారీ బలుల్ని నిలిపేశాడు.’ (దాని. 11:30బి, 31ఎ) నాజీ నాయకుడైన హిట్లర్‌, జర్మనీ దేశంలో దేవుని ప్రజలు లేకుండా తుడిచిపెట్టేస్తానని శపథం కూడా చేశాడు.

ఒక కొత్త ఉత్తర రాజు

14. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎవరు కొత్త ఉత్తర రాజు అయ్యారు? వివరించండి.

14 రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, జర్మనీ పరిపాలన కిందున్న పెద్దపెద్ద ప్రాంతాల్ని సోవియట్‌ యూనియన్‌ తన అధీనంలోకి తెచ్చుకుంది. అంతేకాదు క్రూరమైన నాజీ ప్రభుత్వంలాగే, దేశం కన్నా సత్యదేవుని ఆరాధనకే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే ప్రజలందర్నీ హింసించింది. అలా సోవియట్‌ యూనియన్‌ ఒక కొత్త ఉత్తర రాజు అయింది.

15. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఉత్తర రాజు ఏం చేశాడు?

15 రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన కొంతకాలానికి, కొత్త ఉత్తర రాజు అయిన సోవియట్‌ యూనియన్‌-దానికి మద్దతిచ్చిన దేశాలు దేవుని ప్రజలపై తమదైన రీతిలో దాడిచేశాయి. ప్రకటన 12:15-17 ప్రవచిస్తున్నట్టు, ఈ ఉత్తర రాజు మన ప్రకటనా పనిని నిషేధించడంతోపాటు వేలమంది యెహోవా ప్రజల్ని సైబీరియాకు బందీలుగా పంపించాడు. నిజానికి చివరి రోజులు అంతటిలో, ఉత్తర రాజు హింసను “నదిలా” వెళ్లగక్కుతూ దేవుని ప్రజల పనిని ఆపడానికి తీవ్రంగా కృషిచేశాడు. కానీ వాళ్ల పనిని ఆపలేకపోయాడు. *

16. దానియేలు 11:37-39 లో ఉన్న ప్రవచనాన్ని సోవియట్‌ యూనియన్‌ ఎలా నెరవేర్చింది?

16 దానియేలు 11:37-39 చదవండి. ఈ ప్రవచనం చెప్తున్నట్లు, ఉత్తర రాజు ‘తన తండ్రుల దేవుణ్ణి గౌరవించలేదు.’ అలాగని ఎలా చెప్పవచ్చు? సోవియట్‌ యూనియన్‌ మతాన్ని తుడిచిపెట్టేయాలనే లక్ష్యంతో, చాలా ఏళ్ల నుండి ఉన్న మత సంస్థల అధికారాల్ని లాగేసుకోవడానికి ప్రయత్నించింది. ఏవిధంగా? అంతకుముందు 1918 లో జారీ అయిన ఒక ఆజ్ఞను ఆధారంగా చేసుకొని, దేవుడు లేడనే సిద్ధాంతాన్ని పాఠశాలల్లో బోధించమని ఆదేశించింది. మరి, ఈ ఉత్తర రాజు “కోటల దేవుణ్ణి” ఏ విధంగా మహిమపర్చాడు? సోవియట్‌ యూనియన్‌ ఎంతో డబ్బు ఖర్చుపెట్టి సైనిక బలగాన్ని పెంచుకుంది, వేల సంఖ్యలో అణ్వాయుధాల్ని తయారు చేసుకుంది. వందల కోట్ల ప్రజల్ని బలి తీసుకోగల ఆయుధాల్ని ఉత్తర, దక్షిణ రాజులిద్దరూ సమకూర్చుకున్నారు!

శత్రువులిద్దరు కలిసి పనిచేశారు

17. “నాశనాన్ని కలగజేసే అసహ్యమైన వస్తువు” ఏంటి?

17 శత్రువులైన ఉత్తర రాజు, దక్షిణ రాజు ఒక పనిలో మాత్రం ఒకరికొకరు మద్దతిచ్చుకున్నారు; ‘వాళ్లు నాశనాన్ని కలగజేసే అసహ్యమైన వస్తువును నిలబెట్టడంలో’ కలిసి పనిచేశారు. (దాని. 11:31) ఆ “అసహ్యమైన వస్తువు” ఐక్యరాజ్య సమితి.

18. ఐక్యరాజ్య సమితిని “అసహ్యమైన వస్తువు” అని వర్ణించడం ఎందుకు సరైనది?

18 ఐక్యరాజ్య సమితిని “అసహ్యమైన వస్తువు” అని వర్ణించడం సరైనదే. ఎందుకంటే, దేవుని రాజ్యం మాత్రమే తీసుకురాగల ప్రపంచ శాంతిని తీసుకొస్తానని అది చెప్పుకుంటోంది. నిజానికి ఆ అసహ్యమైన వస్తువు ‘నాశనాన్ని కలగజేస్తుందని’ ప్రవచనం చెప్తోంది. ఎందుకంటే, అబద్ధమతాలన్నిటినీ నాశనం చేయడంలో ఐక్యరాజ్య సమితి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.—“అంత్యకాలంలో శత్రు రాజులు” చార్టు చూడండి.

ఈ విషయాలు తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

19-20. (ఎ) ఈ విషయాలు తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏం తెలుసుకుంటాం?

19 ఈ విషయాలు తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? ఎందుకంటే ఉత్తర రాజు, దక్షిణ రాజు గురించి దానియేలు ప్రవచనం చెప్తున్న విషయాలు 1870 నుండి 1991 వరకు ఖచ్చితంగా నెరవేరాయి. కాబట్టి ఆ ప్రవచనంలోని మిగతా విషయాలు కూడా నెరవేరతాయనే విశ్వాసంతో మనం ఉండవచ్చు.

20 సోవియట్‌ యూనియన్‌ 1991 లో పతనమైంది. మరి నేడు ఉత్తర రాజుగా ఎవరు ఉన్నారు? ఈ ప్రశ్నకు జవాబు తర్వాతి ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.

పాట 128 అంతం వరకు సహిద్దాం

^ పేరా 5 “ఉత్తర రాజు” గురించి, “దక్షిణ రాజు” గురించి దానియేలు పుస్తకంలో ఉన్న ప్రవచనం నెరవేరుతోంది అనడానికి స్పష్టమైన రుజువులు కనిపిస్తున్నాయి. అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఈ ప్రవచనంలో ఉన్న వివరాల్ని మనం ఎందుకు అర్థం చేసుకోవాలి?

^ పేరా 5 ఈ కారణాన్ని బట్టి, చక్రవర్తి అయిన ఆరేలియన్‌ పరిపాలన కిందున్న రోమా సామ్రాజ్యం (క్రీ.శ. 270-275) అప్పటి “ఉత్తర రాజు” అని, రాణి జెనోబియా పరిపాలన కిందున్న సిరియా దేశం (క్రీ.శ. 267-272) అప్పటి “దక్షిణ రాజు” అని చెప్పలేం. కాబట్టి, దానియేలు ప్రవచనానికి అవధానం ఇవ్వండి! (ఇంగ్లీషు) పుస్తకంలోని 13, 14 అధ్యాయాల్లో ఉన్న విషయాలకు సంబంధించి మన అవగాహనలో మార్పు వచ్చిందని గమనించండి.

^ పేరా 9 1890 లో జర్మనీ చక్రవర్తి అయిన విల్‌హెల్మ్‌ II బిస్మార్క్‌ను అధికారం నుండి తొలగించాడు.

^ పేరా 10 వాళ్లు చేసిన ఎన్నో రకాల పనుల వల్ల ప్రభుత్వం చాలా త్వరగా పతనమైంది. ఉదాహరణకు వాళ్లు చక్రవర్తికి సహకరించడం మానేశారు, యుద్ధం వల్ల వచ్చిన నష్టం తాలూకు రహస్య సమాచారాన్ని బయటికి చేరవేశారు, చక్రవర్తి అధికారం నుండి తప్పుకునేలా చేశారు.

^ పేరా 15 దానియేలు 11:34 తెలియజేస్తున్నట్టు, ఉత్తర రాజు కొంతకాలంపాటు క్రైస్తవుల్ని హింసించడం ఆపాడు. ఉదాహరణకు, 1991 లో సోవియట్‌ యూనియన్‌ పతనమైనప్పుడు అది జరిగింది.