కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 22

కంటికి కనిపించని సంపదల పట్ల కృతజ్ఞత చూపించండి

కంటికి కనిపించని సంపదల పట్ల కృతజ్ఞత చూపించండి

“మనం . . . కనిపించనివాటి మీద దృష్టిపెడతాం. ఎందుకంటే కనిపించేవి తాత్కాలికం, కనిపించనివి శాశ్వతం.”—2 కొరిం. 4:18.

పాట 45 నా హృదయ ధ్యానం

ఈ ఆర్టికల్‌లో . . . *

1. పరలోక సంపదల గురించి యేసు ఏం చెప్పాడు?

కొన్నిరకాల సంపదలు, ముఖ్యంగా అత్యంత విలువైన సంపదలు కంటికి కనిపించవు. యేసు కొండమీది ప్రసంగంలో, వస్తుసంపదల కన్నా ఎంతో విలువైన పరలోక సంపదల గురించి మాట్లాడాడు. ఆ తర్వాత ఆయన ఈ సత్యం చెప్పాడు: “నీ సంపద ఎక్కడ ఉంటే నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది.” (మత్త. 6:19-21) మనం దేన్నైతే విలువైనదిగా చూస్తామో, దాన్ని సొంతం చేసుకోవడానికి శాయశక్తులా కృషిచేస్తాం. మనం దేవుని దగ్గర మంచి పేరు సంపాదించుకోవడం ద్వారా ‘పరలోకంలో సంపదలు’ కూడబెట్టుకుంటాం. అలాంటి సంపదల్ని ఎవ్వరూ నాశనం చేయలేరని, దొంగిలించలేరని యేసు చెప్పాడు.

2. (ఎ) రెండో కొరింథీయులు 4:17, 18 ప్రకారం, పౌలు మనల్ని ఏమని ప్రోత్సహిస్తున్నాడు? (బి) ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

2 అపొస్తలుడైన పౌలు మనల్ని, ‘కనిపించనివాటి మీద దృష్టిపెట్టమని’ ప్రోత్సహిస్తున్నాడు. (2 కొరింథీయులు 4:17, 18 చదవండి.) మనం దేవుని రాజ్యంలో ఆనందించే దీవెనలు కూడా ఆ కనిపించనివాటి కిందకే వస్తాయి. అయితే ఈ ఆర్టికల్‌లో, ప్రస్తుతం మనం ఆనందించగల నాలుగు సంపదల గురించి పరిశీలిస్తాం. కంటికి కనిపించని ఆ నాలుగు సంపదలు ఏంటంటే: దేవునితో స్నేహం; ప్రార్థన అనే వరం; దేవుని పవిత్రశక్తి సహాయం; పరిచర్యలో యెహోవా, యేసు, దేవదూతలు ఇచ్చే మద్దతు. ఈ సంపదల పట్ల కృతజ్ఞత ఎలా చూపించవచ్చో కూడా తెలుసుకుంటాం.

యెహోవాతో స్నేహం

3. కంటికి కనిపించని అత్యంత విలువైన సంపద ఏంటి? అదెలా సాధ్యమైంది?

3 కంటికి కనిపించని సంపదల్లో అత్యంత విలువైనది, యెహోవా దేవునితో స్నేహం. (కీర్త. 25:14) పవిత్రుడైన దేవుడు పాపులైన మనుషులతో స్నేహం చేయడం ఎలా సాధ్యమౌతుంది? యేసు అర్పించిన విమోచన క్రయధనం మనుషులందరి ‘పాపాల్ని తీసేస్తుంది’ కాబట్టి అది సాధ్యమైంది. (యోహా. 1:29) యేసు చివరిశ్వాస వరకు నమ్మకంగా ఉండి, మనుషులందరి కోసం తన ప్రాణాన్ని అర్పిస్తాడని యెహోవాకు ముందే తెలుసు. అందుకే క్రీస్తు చనిపోవడానికి ముందు జీవించిన మనుషులతో కూడా దేవుడు స్నేహం చేశాడు.—రోమా. 3:25.

4. క్రీస్తు చనిపోవడానికి ముందు జీవించిన కొంతమంది దేవుని స్నేహితుల గురించి చెప్పండి.

4 క్రీస్తు చనిపోవడానికి కన్నా ముందు జీవించిన కొంతమంది దేవుని స్నేహితుల గురించి ఆలోచించండి. అబ్రాహాము చెక్కుచెదరని విశ్వాసం చూపించాడు. అబ్రాహాము చనిపోయి 1000 ఏళ్లు గడిచాక కూడా, యెహోవా అతన్ని ‘నా స్నేహితుడు’ అని పిలిచాడు. (యెష. 41:8) అవును, ఆఖరికి మరణం కూడా యెహోవాకు తన దగ్గరి స్నేహితులతో ఉన్న బంధాన్ని తెంచలేదు. అబ్రాహాము యెహోవా దృష్టిలో ఇంకా బ్రతికేవున్నాడు. (లూకా 20:37, 38) అలాంటి మరో వ్యక్తి యోబు. ఒక సందర్భంలో యెహోవా సన్నిధిలో దేవదూతలు సమకూడినప్పుడు, వాళ్ల ముందు ఆయన యోబు గురించి గొప్పగా మాట్లాడాడు. “అతను నింద లేనివాడు, నిజాయితీపరుడు; అతను దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనానికి దూరంగా ఉన్నాడు” అని యెహోవా చెప్పాడు. (యోబు 1:6-8) ఇంకో వ్యక్తి దానియేలు. అతను సుమారు 80 ఏళ్లపాటు అబద్ధ ఆరాధకుల మధ్య జీవించినా యెహోవాకు నమ్మకంగా ఉన్నాడు. వృద్ధుడైన దానియేలుకు దేవదూతలు మూడు సందర్భాల్లో కనిపించి, అతను దేవునికి ‘ఎంతో అమూల్యమైనవాడని’ అభయమిచ్చారు. (దాని. 9:23; 10:11, 19) చనిపోయిన తన ప్రియమైన స్నేహితుల్ని తిరిగి బ్రతికించే రోజు కోసం యెహోవా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.—యోబు 14:15.

కంటికి కనిపించని సంపదల పట్ల మనం ఏయే విధాలుగా కృతజ్ఞత చూపించవచ్చు? (5వ పేరా చూడండి) *

5. యెహోవాకు దగ్గరి స్నేహితులం అవ్వాలంటే ఏం చేయాలి?

5 నేడు ఎంతమంది అపరిపూర్ణ మనుషులు దేవునికి స్నేహితులుగా ఉన్నారు? కొన్ని లక్షలమంది దేవునితో స్నేహాన్ని ఆనందిస్తున్నారు. యెహోవా ‘నిజాయితీపరులకు దగ్గరి స్నేహితుడిగా’ ఉంటాడని బైబిలు చెప్తుంది. (సామె. 3:32) ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది పురుషులు, స్త్రీలు, పిల్లలు తాము దేవుని స్నేహితులమని తమ ప్రవర్తన ద్వారా చూపిస్తున్నారు. వాళ్లు యేసు బలిమీద విశ్వాసం ఉంచడం వల్లే దేవునికి స్నేహితులు అయ్యారు. కాబట్టి మనం కూడా యేసు బలిమీద విశ్వాసం ఉంచితే దేవునికి స్నేహితులం అవ్వగలం; మన జీవితాల్ని ఆయనకు సమర్పించుకొని బాప్తిస్మం తీసుకోగలం. ఈ రెండూ చాలా ముఖ్యమైన పనులు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది బాప్తిస్మం తీసుకుని, విశ్వంలోనే అత్యంత గొప్పవాడైన యెహోవాతో దగ్గరి స్నేహాన్ని ఆనందిస్తున్నారు. మీరు కూడా మీ జీవితాన్ని సమర్పించుకొని బాప్తిస్మం తీసుకుంటే ఆయనకు స్నేహితులు అవ్వగలరు.

6. దేవునితో స్నేహాన్ని విలువైనదిగా చూస్తున్నామని ఎలా చూపించవచ్చు?

6 దేవునితో స్నేహాన్ని విలువైనదిగా చూస్తున్నామని మనం ఎలా చూపించవచ్చు? వందకన్నా ఎక్కువ సంవత్సరాలు జీవించిన అబ్రాహాము, యోబు జీవితాంతం యెహోవాకు నమ్మకంగా ఉన్నారు. మనం వాళ్లను ఆదర్శంగా తీసుకుని, ఎన్ని సంవత్సరాలుగా యెహోవాను ఆరాధిస్తున్నా చివరివరకు నమ్మకంగా ఉండాలి. దానియేలులాగే మనం కూడా దేవునితో ఉన్న స్నేహాన్ని ప్రాణం కన్నా విలువైనదిగా చూడాలి. (దాని. 6:7, 10, 16, 22) మనకు యెహోవా సహాయం ఉంటే ఎలాంటి కష్టాలనైనా సహించగలం; ఆయనతో ఉన్న స్నేహాన్ని కాపాడుకోగలం.—ఫిలి. 4:13.

ప్రార్థన అనే వరం

7. (ఎ) సామెతలు 15:8 ప్రకారం, యెహోవా మన ప్రార్థనల్ని ఎలా వింటాడు? (బి) యెహోవా మన ప్రార్థనలకు ఎలా జవాబిస్తాడు?

7 కంటికి కనిపించని మరో సంపద, ప్రార్థన. దగ్గరి స్నేహితులు తమ ఆలోచనల్ని, భావాల్ని మనసువిప్పి మాట్లాడుకుంటారు. మన స్నేహితుడైన యెహోవాతో కూడా అలా మాట్లాడగలమా? మాట్లాడగలం! యెహోవా తన వాక్యమైన బైబిలు ద్వారా మనతో మాట్లాడుతూ తన ఆలోచనల్ని, భావాల్ని మనకు చెప్తున్నాడు. మనం ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడుతూ, మనసు లోతుల్లో ఉన్న ఆలోచనల్ని, భావాల్ని ఆయనకు చెప్పవచ్చు. మనం చేసే ప్రార్థనల్ని యెహోవా సంతోషంగా వింటాడు. (సామెతలు 15:8 చదవండి.) మనల్ని ఎంతో ప్రేమించే స్నేహితుడైన యెహోవా, మన ప్రార్థనల్ని కేవలం వినడమే కాదు, వాటికి జవాబు కూడా ఇస్తాడు. కొన్నిసార్లు ఆ జవాబు వెంటనే రావచ్చు. కొన్నిసార్లు జవాబు కోసం పదేపదే ప్రార్థించాల్సి రావచ్చు. ఏదేమైనా సరైన సమయంలో, శ్రేష్ఠమైన పద్ధతిలో ఆయన మనకు జవాబిస్తాడనే నమ్మకంతో మనం ఉండవచ్చు. అయితే ఆయనిచ్చే జవాబు మనం కోరుకున్నట్లు ఉండకపోవచ్చు. ఉదాహరణకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, దాన్నుండి యెహోవా మనల్ని బయటపడేయాలని మనం కోరుకోవచ్చు; కానీ ఆయన మనకు దాన్ని ‘సహించే’ తెలివిని, శక్తిని ఇవ్వవచ్చు.—1 కొరిం. 10:13.

(8వ పేరా చూడండి) *

8. ప్రార్థన అనే సాటిలేని వరం పట్ల కృతజ్ఞత ఉందని మనం ఎలా చూపించవచ్చు?

8 ప్రార్థన అనే సాటిలేని వరం పట్ల కృతజ్ఞత ఉందని మనం ఎలా చూపించవచ్చు? “ఎప్పుడూ ప్రార్థించండి అని యెహోవా ఇస్తున్న నిర్దేశాన్ని పాటించడం ద్వారా కృతజ్ఞత చూపించవచ్చు. (1 థెస్స. 5:17) ప్రార్థించమని యెహోవా మనల్ని బలవంతపెట్టడం లేదు. బదులుగా, మనకున్న స్వేచ్ఛాచిత్తాన్ని గౌరవిస్తున్నాడు, “పట్టుదలగా ప్రార్థిస్తూ ఉండండి” అని చెప్తున్నాడు. (రోమా. 12:12) కాబట్టి ప్రతీరోజు సాధ్యమైనన్ని ఎక్కువసార్లు ప్రార్థించడం ద్వారా ఆ వరాన్ని విలువైనదిగా ఎంచుతున్నామని చూపించవచ్చు. అయితే, అలా ప్రార్థిస్తున్నప్పుడు యెహోవాకు కృతజ్ఞతలు, స్తుతులు చెప్పడం మర్చిపోకూడదు.—కీర్త. 145:2, 3.

9. ప్రార్థన గురించి ఒక సహోదరుడు ఏం చెప్పాడు? ప్రార్థన అనే వరం గురించి మీ అభిప్రాయం ఏంటి?

9 యెహోవా సేవలో ఎక్కువ సంవత్సరాలు గడుపుతూ, మన ప్రార్థనలకు ఆయనెలా జవాబిస్తున్నాడో అర్థం చేసుకునే కొద్దీ, ప్రార్థన అనే వరం పట్ల మనకున్న కృతజ్ఞత మరింత పెరగాలి. ఉదాహరణకు, 47 ఏళ్లుగా పూర్తికాల సేవ చేస్తున్న క్రిస్‌ ఇలా చెప్తున్నాడు: “నాకు తెల్లవారుజామునే లేచి ప్రార్థించడమంటే చాలా ఇష్టం. అప్పుడే ఉదయించిన సూర్యుని కిరణాలు పడి మంచు బిందువులు తళతళ మెరిసే ఆ సమయంలో యెహోవాతో మాట్లాడడం అద్భుతంగా అనిపిస్తుంది. దానివల్ల ప్రార్థన అనే వరాన్ని, ఇతర బహుమతుల్ని ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలనిపిస్తుంది. ప్రతీరోజు రాత్రి ఆయనకు ప్రార్థించిన తర్వాత స్వచ్ఛమైన మనస్సాక్షితో హాయిగా పడుకుంటాను.”

పవిత్రశక్తి అనే బహుమతి

10. దేవుని పవిత్రశక్తిని ఎందుకు విలువైనదిగా చూడాలి?

10 కంటికి కనిపించని ఇంకో సంపద, దేవుని పవిత్రశక్తి. మనం పవిత్రశక్తి కోసం అడుగుతూ ఉండాలని యేసు చెప్పాడు. (లూకా 11:9, 13) యెహోవా తన పవిత్రశక్తి ద్వారా మనకు శక్తినిస్తాడు, ఇంకా చెప్పాలంటే ‘అసాధారణ శక్తిని’ ఇస్తాడు. (2 కొరిం. 4:7; అపొ. 1:8) దేవుడిచ్చే పవిత్రశక్తి సహాయంతో మనం ఎలాంటి కష్టాన్నైనా సహించగలం.

(11వ పేరా చూడండి) *

11. పవిత్రశక్తి మనకు ఏయే విధాలుగా సహాయం చేయగలదు?

11 సంస్థ ఇచ్చే నియామకాల్ని సరిగ్గా చేయడానికి పవిత్రశక్తి మనకు సహాయం చేయగలదు. అంతేకాదు, మనలోని నైపుణ్యాల్ని, సామర్థ్యాల్ని మెరుగుపర్చగలదు. ఒక క్రైస్తవునిగా మనకున్న బాధ్యతల్ని పూర్తి చేయడానికి సహాయం చేయగలదు. మరి, పవిత్రశక్తిని విలువైనదిగా ఎంచుతున్నామని మనం ఎలా చూపించవచ్చు? ఒక విధానం ఏంటంటే, మన సేవకు వస్తున్న మంచి ఫలితాలకు కారణం మన సొంత శక్తి కాదుగానీ, పవిత్రశక్తి అని గుర్తించడం.

12. కీర్తన 139:23, 24 ప్రకారం, ఎలాంటి విషయాల్లో పవిత్రశక్తి సహాయం కోసం అడగవచ్చు?

12 మనం దేవుని పవిత్రశక్తిని విలువైనదిగా ఎంచుతున్నామని చూపించగల మరో విధానం ఏంటి? మన హృదయంలో తప్పుడు ఆలోచనలు గానీ, కోరికలు గానీ ఉన్నాయేమో గుర్తించడానికి పవిత్రశక్తిని సహాయంగా ఇవ్వమని ప్రార్థించడం. (కీర్తన 139:23, 24 చదవండి.) అలా ప్రార్థించినప్పుడు, మనలో ఉన్న తప్పుడు ఆలోచనల్ని, కోరికల్ని గుర్తించడానికి యెహోవా తన పవిత్రశక్తి ద్వారా సహాయం చేస్తాడు. ఒకవేళ అలాంటివి మనలో ఉన్నట్టు గుర్తిస్తే, వాటిని ఎదిరించడానికి కావాల్సిన బలం కోసం పవిత్రశక్తిని ఇవ్వమని యెహోవాకు ప్రార్థించాలి. అలా చేస్తే, తన పవిత్రశక్తిని పొందకుండా చేసే పనులకు మనం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు యెహోవా గుర్తిస్తాడు.—ఎఫె. 4:30.

13. పవిత్రశక్తి పట్ల మనకున్న కృతజ్ఞతను మరింత పెంచుకోవాలంటే ఏం చేయాలి?

13 నేడు పవిత్రశక్తి చేస్తున్న పనులన్నిటి గురించి ఆలోచించినప్పుడు, మన కృతజ్ఞత మరింత పెరుగుతుంది. పునరుత్థానమైన యేసు పరలోకానికి వెళ్లకముందు తన శిష్యులతో ఇలా చెప్పాడు: “పవిత్రశక్తి మీ మీదికి వచ్చినప్పుడు మీరు బలం పొందుతారు; అప్పుడు . . . భూమంతటా మీరు నా గురించి సాక్ష్యమిస్తారు.” (అపొ. 1:8) ఈ మాటలు మనకాలంలో అద్భుతరీతిలో నెరవేరుతున్నాయి. పవిత్రశక్తి సహాయంతో 86 లక్షల కన్నా ఎక్కువమంది యెహోవా ఆరాధకులయ్యారు. అంతేకాదు, మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోదరసహోదరీలతో ఐక్యంగా ఉంటున్నాం. ఎందుకంటే పవిత్రశక్తి సహాయంతో ప్రేమ, సంతోషం, శాంతి, ఓర్పు, దయ, మంచితనం, విశ్వాసం, సౌమ్యత, ఆత్మనిగ్రహం లాంటి చక్కని లక్షణాలు అలవర్చుకున్నాం. (గల. 5:22, 23) నిజంగా, పవిత్రశక్తి ఒక విలువైన బహుమతి!

యెహోవాతో, ఆయన సంస్థలోనిపరలోక భాగంతో కలిసి పనిచేయడం

14. పరిచర్యలో ఉన్నప్పుడు ఎవరెవరు మనకు సహాయం చేస్తున్నారు?

14 కంటికి కనిపించని మరొక సంపద ఏంటంటే, యెహోవాకు, యేసుకు, దేవదూతలకు ‘తోటిపనివాళ్లుగా’ ఉండే అవకాశం. (2 కొరిం. 6:1) పరిచర్యకు వెళ్లిన ప్రతీసారి మనం వాళ్లతో కలిసి పనిచేస్తున్నాం. పౌలు తన గురించి, ప్రకటనా పని చేస్తున్న ఇతరుల గురించి ఇలా చెప్పాడు: “మేము దేవుని తోటి పనివాళ్లం.” (1 కొరిం. 3:9) మనం పరిచర్యలో భాగం వహించిన ప్రతీసారి యేసుతో కూడా కలిసి పనిచేస్తున్నాం. అన్నిదేశాల ప్రజలను శిష్యుల్ని చేయమని చెప్పిన తర్వాత యేసు తన అనుచరులతో ఏమన్నాడో గమనించండి: “నేను ఎప్పుడూ మీతో ఉంటాను.” (మత్త. 28:19, 20) అంతేకాదు, మనం “భూమ్మీద నివసించేవాళ్లకు . . . నిత్యసువార్త” ప్రకటిస్తున్నప్పుడు దేవదూతలు మనల్ని నడిపిస్తారు. కాబట్టి మనం వాళ్లతో కూడా కలిసి పనిచేస్తున్నాం.—ప్రక. 14:6.

15. మన పరిచర్యలో యెహోవాకున్న ముఖ్యమైన పాత్రను వివరించే ఒక ఉదాహరణ చెప్పండి.

15 మనం పరలోకం నుండి పొందుతున్న సహాయం వల్ల ఎలాంటి ఫలితాలు సాధిస్తున్నాం? మనం రాజ్య సందేశం అనే విత్తనాలు చల్లినప్పుడు, మంచినేల లాంటివాళ్లు స్పందిస్తారు. (మత్త. 13:18, 23) వాళ్ల హృదయంలో పడిన విత్తనాలు మొలకెత్తి ఫలించేలా ఎవరు చేస్తారు? “తండ్రి ఆకర్షిస్తేనే తప్ప” ఎవ్వరూ తనకు అనుచరులు కాలేరని యేసు వివరించాడు. (యోహా. 6:44) అది నిజమని నిరూపించే ఒక ఉదాహరణ బైబిల్లో ఉంది. పౌలు ఫిలిప్పీ నగర ద్వారం బయట కొంతమంది స్త్రీలకు ప్రకటించిన సందర్భాన్ని గుర్తుతెచ్చుకోండి. ఆ స్త్రీలలో ఒకరైన లూదియ గురించి బైబిలు ఇలా చెప్తుంది: “పౌలు చెప్తున్నవాటిని శ్రద్ధగా విని, అంగీకరించేలా యెహోవా ఆమె హృదయాన్ని తెరిచాడు.” (అపొ. 16:13-15) లూదియను ఆకర్షించినట్టే, యెహోవా ఎన్నో లక్షలమందిని ఆకర్షించాడు.

16. ప్రకటనా పనిలో మనం సాధించే ఫలితాలకు అసలు కారణం ఎవరు?

16 పరిచర్యలో మనం సాధించే ఫలితాలకు అసలు కారణం ఎవరు? దీనికి జవాబు పౌలు కొరింథు సంఘానికి రాసిన ఉత్తరంలో ఉంది. “నేను నాటాను, అపొల్లో నీళ్లు పోశాడు, కానీ పెరిగేలా చేసింది దేవుడే; నాటేవాడిది ఏమీలేదు, నీళ్లు పోసేవాడిది ఏమీలేదు, పెరిగేలా చేసిన దేవునిదే గొప్పతనమంతా” అని పౌలు రాశాడు. (1 కొరిం. 3:6, 7) మనం పరిచర్యలో ఎన్ని మంచి ఫలితాలు సాధించినా, గొప్పతనమంతా యెహోవాదే అని పౌలులాగే మనం కూడా ఎల్లప్పుడూ గుర్తించాలి.

17. యెహోవాకు, యేసుకు, దేవదూతలకు ‘తోటి పనివాళ్లుగా’ ఉండే అవకాశాన్ని విలువైనదిగా ఎంచుతున్నామని ఎలా చూపించవచ్చు?

17 యెహోవాకు, యేసుకు, దేవదూతలకు ‘తోటి పనివాళ్లుగా’ ఉండే అవకాశాన్ని విలువైనదిగా ఎంచుతున్నామని ఎలా చూపించవచ్చు? ఇతరులకు మంచివార్త ప్రకటించే అవకాశాల కోసం ఉత్సాహంగా వెదకడం ద్వారా అలా చూపించవచ్చు. బహిరంగ సాక్ష్యం, ఇంటింటి పరిచర్యతో పాటు ఇంకా ఎన్నో ఇతర విధాల్లో మనం పరిచర్య చేయవచ్చు. (అపొ. 20:20) చాలామంది అనియత సాక్ష్యం కూడా ఇస్తారు. ఎవరైనా కనిపించినప్పుడు, చిరునవ్వుతో పలకరించి వాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. వాళ్లు కూడా మాట్లాడడానికి ఇష్టపడితే వివేచన ఉపయోగించి రాజ్య సందేశం గురించి చెప్తారు.

(18వ పేరా చూడండి) *

18-19. (ఎ) సత్యమనే విత్తనాలకు నీళ్లు పోయాలంటే ఏం చేయాలి? (బి) స్టడీ తీసుకుంటున్న ఒక వ్యక్తికి యెహోవా ఎలా సహాయం చేశాడు?

18 దేవుని ‘తోటి పనివాళ్లమైన’ మనం సత్యమనే విత్తనాల్ని కేవలం చల్లడమే కాదు, వాటికి నీళ్లు కూడా పోయాలి. ఎవరైనా ఆసక్తి చూపిస్తే వాళ్లను ఇంకోసారి కలిసి మాట్లాడడానికి శాయశక్తులా ప్రయత్నించాలి; లేదా వాళ్లను కలిసి బైబిలు స్టడీ ప్రారంభించేలా ఇంకెవరినైనా పంపించడానికి ఏర్పాటు చేయాలి. స్టడీ కొనసాగుతుండగా, ఆ వ్యక్తి తన ఆలోచనల్లో, భావాల్లో మార్పులు చేసుకోవడానికి యెహోవా ఎలా సహాయం చేస్తున్నాడో గుర్తించినప్పుడు మనకు సంతోషంగా ఉంటుంది.

19 దక్షిణ ఆఫ్రికాలో భూతవైద్యునిగా పనిచేసిన ఒక వ్యక్తి అనుభవం పరిశీలించండి. ఆయనకు బైబిలు స్టడీలో నేర్చుకుంటున్న విషయాలు నచ్చాయి. అయితే చనిపోయిన పూర్వీకులతో మాట్లాడకూడదనే ఆజ్ఞకు లోబడడం ఆయనకు చాలా కష్టంగా అనిపించింది. (ద్వితీ. 18:10-12) కానీ మెల్లమెల్లగా తన ఆలోచనల్ని దేవుని ఇష్టానికి తగ్గట్టు మలచుకున్నాడు. కొంతకాలానికి, తన జీవనోపాధి అయిన భూతవైద్యాన్ని మానేశాడు. ప్రస్తుతం 60 ఏళ్ల వయసులో ఉన్న ఆ వ్యక్తి ఇలా చెప్తున్నాడు: “నేను ఇంకో ఉద్యోగం సంపాదించుకునేలా, ఇంకా ఎన్నో విధాలుగా సహాయం చేసిన యెహోవాసాక్షులకు ఎప్పుడూ కృతజ్ఞత కలిగివుంటాను. ముఖ్యంగా నేను యెహోవాకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఆయన సహాయం వల్లే నేను మారగలిగాను, బాప్తిస్మం తీసుకుని ఇతరులకు మంచివార్త ప్రకటించగలుగుతున్నాను.”

20. మీరు ఏమని నిర్ణయించుకున్నారు?

20 ఈ ఆర్టికల్‌లో కంటికి కనిపించని నాలుగు సంపదల్ని పరిశీలించాం. వాటిలో అత్యంత విలువైనది, యెహోవా దేవునితో స్నేహం. ఎందుకంటే యెహోవాకు స్నేహితులుగా ఉంటేనే మిగతా మూడు సంపదల నుండి ప్రయోజనం పొందగలం. అంటే ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడగలం; పవిత్రశక్తి సహాయాన్ని పొందగలం; ఆయనతో, యేసుతో, దేవదూతలతో కలిసి పనిచేయగలం. కంటికి కనిపించని ఈ సంపదల పట్ల మనకున్న కృతజ్ఞతను మరింత పెంచుకోవాలని నిర్ణయించుకుందాం. ఒక మంచి స్నేహితునిగా ఉంటున్న యెహోవా పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞత చూపిద్దాం.

పాట 145 పరదైసు—దేవుని వాగ్దానం

^ పేరా 5 ముందటి ఆర్టికల్‌లో, దేవుడిచ్చిన కంటికి కనిపించే సంపదల గురించి చర్చించాం. ఈ ఆర్టికల్‌లో కంటికి కనిపించని సంపదల గురించి పరిశీలిస్తాం. అంతేకాదు ఆ సంపదల పట్ల, వాటిని ఇచ్చిన యెహోవా దేవుని పట్ల ఎలా కృతజ్ఞత చూపించవచ్చో తెలుసుకుంటాం.

^ పేరా 58 చిత్రాల వివరణ: (1) ఒక సహోదరి యెహోవా చేసిన సృష్టిని చూస్తూ, ఆయనతో తనకున్న స్నేహం గురించి ధ్యానిస్తోంది.

^ పేరా 60 చిత్రాల వివరణ: (2) ఆ సహోదరి తన పక్కనున్న స్త్రీకి మంచివార్త చెప్పే ధైర్యం ఇవ్వమని యెహోవాకు ప్రార్థిస్తోంది.

^ పేరా 62 చిత్రాల వివరణ: (3) పవిత్రశక్తి సహాయంతో ఆ స్త్రీకి అనియత సాక్ష్యం ద్వారా మంచివార్త ప్రకటిస్తోంది.

^ పేరా 64 చిత్రాల వివరణ: (4) తర్వాత ఆ స్త్రీతో బైబిలు స్టడీ చేస్తోంది. ఆ సహోదరి దేవదూతల మద్దతుతో ప్రకటించే పనిని, శిష్యుల్ని చేసే పనిని చక్కగా చేస్తోంది.