కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 20

నేడు “ఉత్తర రాజు” ఎవరు?

నేడు “ఉత్తర రాజు” ఎవరు?

“అతను నాశనం చేయబడతాడు, అతన్ని రక్షించేవాళ్లెవ్వరూ ఉండరు.”—దాని. 11:45.

పాట 95 వెలుగు అంతకంతకూ ఎక్కువౌతుంది

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

నేడు మనం చివరి రోజుల ముగింపులో జీవిస్తున్నామని అనడానికి లెక్కలేనన్ని రుజువులు మన కళ్లముందు ఉన్నాయి. దేవుని రాజ్యాన్ని వ్యతిరేకిస్తున్న మానవ ప్రభుత్వాలన్నిటినీ అతిత్వరలో యెహోవా, యేసుక్రీస్తు నాశనం చేస్తారు. అప్పటిదాకా ఉత్తర రాజు, దక్షిణ రాజు ఒకరితోఒకరు పోరాడుతూనే ఉంటారు; దేవుని ప్రజల మీద దాడి చేస్తూనే ఉంటారు.

2 ఈ ఆర్టికల్‌లో, దానియేలు 11:40–12:1 వచనాల్లో ఉన్న ప్రవచనాన్ని పరిశీలిస్తాం. నేడు ఎవరు ఉత్తర రాజుగా ఉన్నారో తెలుసుకుంటాం. ఏం జరిగినా భయపడకుండా, యెహోవా మనల్ని కాపాడతాడనే నమ్మకంతో ఎందుకు ఉండవచ్చో చర్చిస్తాం.

ఒక కొత్త ఉత్తర రాజు

3-4. కొత్త ఉత్తర రాజు ఎవరు? వివరించండి.

3 సోవియట్‌ యూనియన్‌ 1991 లో పతనమైన తర్వాత, ఆ విస్తారమైన ప్రాంతంలో నివసిస్తున్న దేవుని ప్రజలు కొంతకాలం పాటు స్వేచ్ఛను ఆనందించారు. అలా ‘వాళ్లకు కొంచెం సహాయం ఇవ్వబడింది.’ (దాని. 11:34) ఫలితంగా వాళ్లు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రకటనా పని చేయగలిగారు. కొంతకాలానికే, ఒకప్పుడు సోవియట్‌ యూనియన్‌ కిందున్న దేశాల్లో ప్రచారకుల సంఖ్య కొన్ని లక్షలకు చేరుకుంది. అయితే కాలం గడుస్తుండగా, రష్యా-దానికి మద్దతిచ్చే దేశాలు కొత్త ఉత్తర రాజు అయ్యాయి. మనం ముందటి ఆర్టికల్‌లో చర్చించుకున్నట్లు ఉత్తర రాజుగా, దక్షిణ రాజుగా ఉండే ప్రభుత్వాలు ఈ మూడు పనులు చేస్తాయి: (1) ఎక్కువమంది దేవుని ప్రజలున్న ప్రాంతాన్ని పరిపాలిస్తాయి లేదా దేవుని ప్రజల్ని హింసిస్తాయి. (2) యెహోవా మీద, ఆయన ప్రజల మీద ఉన్న ద్వేషాన్ని వాటి పనుల్లో చూపిస్తాయి. (3) ఒకదానితో ఒకటి పోరాడతాయి.

4 నేడు రష్యా-దానికి మద్దతిచ్చే దేశాలే ఉత్తర రాజు అని చెప్పడానికి గల కారణాల్ని పరిశీలించండి. (1) ఆ దేశాలు ప్రకటనా పనిని నిషేధించడం ద్వారా, లక్షలమంది సహోదరసహోదరీల్ని హింసించడం ద్వారా దేవుని ప్రజల మీద దాడి చేస్తున్నాయి. (2) ఆ పనుల ద్వారా యెహోవాపై, ఆయన ప్రజలపై ఎంత ద్వేషం ఉందో అవి చూపిస్తున్నాయి. (3) అవి దక్షిణ రాజుతో, అంటే ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యంతో పోటీ పడుతున్నాయి. రష్యా-దానికి మద్దతిచ్చే దేశాలు ఏం చేశాయో, దాన్నిబట్టి అవి ఉత్తర రాజు అని ఎలా చెప్పవచ్చో ఇప్పుడు పరిశీలిద్దాం.

ఉత్తర రాజు, దక్షిణ రాజు మధ్య పోరాటం కొనసాగుతూనే ఉంది

5. దానియేలు 11:40-43 వచనాలు దేని గురించి మాట్లాడుతున్నాయి?

5 దానియేలు 11:40-43 చదవండి. ప్రవచనంలోని ఈ భాగం అంత్యకాలంలో జరిగే విషయాల గురించి మాట్లాడుతుంది. ఈ వచనాలు ఉత్తర రాజుకు, దక్షిణ రాజుకు మధ్యున్న శత్రుత్వాన్ని వర్ణిస్తున్నాయి. దానియేలు ప్రవచనం చెప్పినట్టుగానే, అంత్యకాలంలో దక్షిణ రాజు ఉత్తర రాజుతో “పోరాటం చేస్తాడు.”—దాని. 11:40.

6. ఉత్తర, దక్షిణ రాజులు ఒకరితో ఒకరు పోరాడుతూనే ఉన్నారని ఎలా చెప్పవచ్చు?

6 ఉత్తర రాజు, దక్షిణ రాజు ఆధిపత్యం కోసం చేస్తున్న పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఉదాహరణకు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, అప్పటి ఉత్తర రాజు అయిన సోవియట్‌ యూనియన్‌-దానికి మద్దతిచ్చిన దేశాలు యూరప్‌లోని చాలా ప్రాంతాలపై ఆధిపత్యం చెలాయించడం మొదలుపెట్టాయి. దాంతో దక్షిణ రాజు మిగతా దేశాలతో చేతులు కలిపి ఒక అంతర్జాతీయ సైనిక కూటమిని ఏర్పాటు చేసుకున్నాడు. ఫలితంగా నాటో (NATO) అనే సంస్థ ఏర్పడింది. ఉత్తర రాజు ఎంతో డబ్బు ఖర్చుపెట్టి ఆయుధాల్ని, సైనిక బలగాన్ని పెంచుకోవడం ద్వారా దక్షిణ రాజుతో పోటీ పడుతున్నాడు. అంతేకాదు ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికాల్లో జరిగిన యుద్ధాలకు, ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు పరోక్షంగా మద్దతివ్వడం ద్వారా ఉత్తర రాజు తన శత్రువైన దక్షిణ రాజుతో పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. ఈమధ్య కాలంలో, రష్యా-దానికి మద్దతిచ్చే దేశాల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఉత్తర రాజు సైబర్‌ యుద్ధాల్ని ఉపయోగించుకుని కూడా దక్షిణ రాజుతో పోరాడుతున్నాడు. కొన్ని రకాల కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లు ఉపయోగించి తమ ఆర్థిక వ్యవస్థను, ప్రభుత్వాన్ని దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని వాళ్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. వీటితోపాటు, ఉత్తర రాజు దేవుని ప్రజల మీద కూడా దాడి చేస్తూనే ఉంటాడని దానియేలు ప్రవచనం చెప్తోంది.—దాని. 11:41.

ఉత్తర రాజు “సుందరమైన దేశంలోకి” ప్రవేశిస్తాడు

7. “సుందరమైన దేశం” దేన్ని సూచిస్తోంది?

7 ఉత్తర రాజు “సుందరమైన దేశంలోకి” ప్రవేశిస్తాడని దానియేలు 11:41 చెప్తోంది. ఆ సుందరమైన దేశం ఏంటి? ప్రాచీన కాలంలో ఇశ్రాయేలు దేశం, ‘దేశాలన్నిట్లో అతి సుందరమైన దేశంగా’ పరిగణించబడేది. (యెహె. 20:6) ముఖ్యంగా, అక్కడ సత్యారాధన జరిగేది కాబట్టి అది ప్రత్యేకమైన ప్రాంతంగా ఉండేది. అయితే క్రీ.శ. 33 పెంతెకొస్తు రోజు నుండి “సుందరమైన దేశం” అనే మాట ఒక దేశాన్నో, ప్రాంతాన్నో సూచించడం లేదు. ఎందుకంటే యెహోవాను ఆరాధించే ప్రజలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. మరి, “సుందరమైన దేశం” అనే మాట నేడు దేన్ని సూచిస్తోంది? సత్యారాధనలో భాగంగా జరిగే కూటాలు, పరిచర్యతో సహా యెహోవా ప్రజల కార్యకలాపాలన్నిటినీ అది సూచిస్తోంది.

8. ఉత్తర రాజు ఏవిధంగా “సుందరమైన దేశంలోకి” ప్రవేశించాడు?

8 చివరి రోజుల్లో ఉత్తర రాజు “సుందరమైన దేశంలోకి” ఎన్నోసార్లు ప్రవేశించాడు. ఉదాహరణకు, నాజీ జర్మనీ ఉత్తర రాజుగా ఉన్నప్పుడు, ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం సమయంలో దేవుని ప్రజల్ని హింసించడం ద్వారా, చంపడం ద్వారా “సుందరమైన దేశంలోకి” ప్రవేశించాడు. ఆ యుద్ధం తర్వాత సోవియట్‌ యూనియన్‌ ఉత్తర రాజుగా ఉన్నప్పుడు, దేవుని ప్రజల్ని హింసించి, వాళ్లను సైబీరియాకు బందీలుగా పంపించడం ద్వారా “సుందరమైన దేశంలోకి” ప్రవేశించాడు.

9. ఈ మధ్యకాలంలో రష్యా-దానికి మద్దతిచ్చే దేశాలు ఏవిధంగా “సుందరమైన దేశంలోకి” ప్రవేశించాయి?

9 ఈ మధ్యకాలంలో, రష్యా-దానికి మద్దతిచ్చే దేశాలు కూడా “సుందరమైన దేశంలోకి” ప్రవేశించాయి. ఏవిధంగా? 2017 లో రష్యా ప్రభుత్వం యెహోవా ప్రజల పనిపై నిషేధం విధించింది, కొంతమంది సహోదరసహోదరీల్ని జైల్లో వేసింది. అంతేకాదు మన ప్రచురణల్ని, కొత్త లోక అనువాదం బైబిల్ని నిషేధించింది. దానితోపాటు, రష్యాలోని మన బ్రాంచి కార్యాలయాన్ని, రాజ్యమందిరాల్ని, సమావేశ హాళ్లను స్వాధీనం చేసుకుంది. వీటన్నిటినీ చూశాక, రష్యా-దానికి మద్దతిచ్చే దేశాలే కొత్త ఉత్తర రాజు అని 2018 లో పరిపాలక సభ గుర్తించింది. అయితే, యెహోవా ప్రజలు ఎన్ని తీవ్రమైన హింసలు ఎదురైనా ప్రభుత్వానికి ఎదురు తిరగరు, వేరే ప్రభుత్వం రావాలని పోరాటాలు చేయరు. దానికి బదులుగా బైబిలు సలహాను పాటిస్తూ, “ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లందరి కోసం” ప్రార్థిస్తారు. ముఖ్యంగా, ఆరాధన విషయంలో తమకున్న స్వేచ్ఛపై ప్రభావం చూపించే నిర్ణయాల్ని అధికారులు తీసుకుంటున్నప్పుడు వాళ్లు అలా ప్రార్థిస్తారు.—1 తిమో. 2:1, 2.

ఉత్తర రాజు దక్షిణ రాజును నాశనం చేస్తాడా?

10. ఉత్తర రాజు దక్షిణ రాజును నాశనం చేస్తాడా? వివరించండి.

10 దానియేలు 11:40-45 లోని ప్రవచనం ఉత్తర రాజు పనుల గురించే ఎక్కువగా మాట్లాడుతోంది. అంటే, అతను దక్షిణ రాజును నాశనం చేస్తాడని దానర్థమా? కాదు. హార్‌మెగిద్దోను యుద్ధంలో యెహోవా, యేసు కలిసి మానవ ప్రభుత్వాలన్నిటినీ నాశనం చేసే సమయానికి దక్షిణ రాజు ‘ఇంకా బ్రతికే’ ఉంటాడు. (ప్రక. 19:20) అంత ఖచ్చితంగా ఎలా చెప్పవచ్చు? దానియేలు, ప్రకటన గ్రంథాల్లో ఉన్న ప్రవచనాలు ఏం చెప్తున్నాయో పరిశీలించండి.

చిత్రంలో ఉన్న రాయి దేవుని రాజ్యాన్ని సూచిస్తుంది, భారీ ప్రతిమ మనుషుల పరిపాలనను సూచిస్తుంది. హార్‌మెగిద్దోను సమయంలో ఆ రాయి భారీ ప్రతిమను ఢీ కొడుతుంది. అంటే దేవుని రాజ్యం మనుషుల పరిపాలనను అంతం చేస్తుంది (11వ పేరా చూడండి)

11. దానియేలు 2:43-45 బట్టి ఏం చెప్పవచ్చు? (ముఖచిత్రం చూడండి.)

11 దానియేలు 2:43-45 చదవండి. వేర్వేరు కాలాల్లో దేవుని ప్రజల మీద ప్రభావం చూపించే కొన్ని మానవ ప్రభుత్వాల గురించి దానియేలు ప్రవక్త వివరించాడు. ఆయన ఆ ప్రభుత్వాల్ని రకరకాల లోహాలతో చేయబడిన భారీ ప్రతిమలోని వేర్వేరు భాగాలతో పోల్చాడు. ఆ ప్రతిమ పాదాలు ఇనుము-బంకమట్టితో చేయబడ్డాయి. ఆ పాదాలు, దానియేలు ప్రవచించిన మానవ ప్రభుత్వాల్లో చివరిదాన్ని అంటే, ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యాన్ని సూచిస్తున్నాయి. ఈ ప్రవచనం బట్టి, దేవుని రాజ్యం అనే రాయి మానవ ప్రభుత్వాల్ని నాశనం చేసే సమయానికి ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యం ఇంకా ఉనికిలోనే ఉంటుందని చెప్పవచ్చు.

12. క్రూరమృగం ఏడో తల దేన్ని సూచిస్తోంది? మనం ఏ ముఖ్యమైన విషయాన్ని గమనించాలి?

12 అపొస్తలుడైన యోహాను కూడా, వేర్వేరు కాలాల్లో యెహోవా ప్రజలపై ప్రభావం చూపించిన కొన్ని ప్రపంచాధిపత్యాల గురించి మాట్లాడాడు. ఆయన ఆ ప్రభుత్వాల్ని ఏడు తలలు ఉన్న క్రూరమృగంతో పోల్చాడు. దాని ఏడో తల ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యాన్ని సూచిస్తోంది. అయితే, ఆ ఏడో తల తర్వాత మరో తల వచ్చినట్టు యోహాను చెప్పడం లేదనే ముఖ్యమైన విషయాన్ని గమనించండి. దీన్నిబట్టి క్రీస్తు తన పరలోక సైన్యంతో వచ్చి క్రూరమృగాన్ని నాశనం చేసే సమయానికి ఆ ఏడో తల ఇంకా అధికారంలో ఉంటుందని చెప్పవచ్చు. *ప్రక. 13:1, 2; 17:13, 14.

అతిత్వరలో ఉత్తర రాజు ఏం చేస్తాడు?

13-14. “మాగోగు దేశం వాడైన గోగు” అంటే ఎవరు? దేవుని ప్రజలపై గోగు చేసే దాడికి ఏది కారణం కావచ్చు?

13 ఉత్తర రాజు, దక్షిణ రాజు నాశనమవ్వడానికి ముందు ఎలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందో అర్థం చేసుకోవడానికి యెహెజ్కేలు ప్రవచనం సహాయం చేస్తుంది. యెహెజ్కేలు 38:10-23; దానియేలు 2:43-45; 11:44–12:1; ప్రకటన 16:13-16, 21 వచనాల్లో ఉన్న ప్రవచనాలు, ఒకే కాలవ్యవధిలో జరిగే సంఘటనల గురించి మాట్లాడుతున్నాయని అనిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే, ఎలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం.

14 మహాశ్రమ మొదలైన కొంతకాలానికి, ‘భూమంతటా ఉన్న రాజులు’ కలిసి ఒక గుంపుగా ఏర్పడతారు. (ప్రక. 16:13, 14; 19:19) ఆ దేశాల గుంపునే “మాగోగు దేశం వాడైన గోగు” అని బైబిలు పిలుస్తోంది. (యెహె. 38:2) ఆ దేశాల గుంపు దేవుని ప్రజలందరిపై దాడిచేసి వాళ్లను పూర్తిగా తుడిచిపెట్టేందుకు ప్రయత్నిస్తుంది. దానికిగల కారణం ఏంటి? అపొస్తలుడైన యోహాను ఆ దాడి జరిగే సమయం గురించి మాట్లాడుతూ, ఇంతకుముందెన్నడూ చూడనంత పెద్దపెద్ద వడగండ్లు దేవుని శత్రువుల మీద పడడం చూశానని అన్నాడు. ఆ వడగండ్లు, యెహోవా ప్రజలు ప్రకటించే కఠినమైన తీర్పు సందేశం కావచ్చు. దేవుని ప్రజలందర్నీ పూర్తిగా నాశనం చేయాలనే ఉద్దేశంతో మాగోగు దేశం వాడైన గోగు చేసే దాడికి కారణం ఈ తీర్పు సందేశమే కావచ్చు.—ప్రక. 16:21.

15-16. (ఎ) దానియేలు 11:44, 45 వచనాలు దేని గురించి మాట్లాడుతుండవచ్చు? (బి) మాగోగు దేశం వాడైన గోగుకు, అందులో భాగమైన ఉత్తర రాజుకు ఏమౌతుంది?

15 దానియేలు 11:44, 45 వచనాలు కూడా దేవుని ప్రజలు ప్రకటించే కఠినమైన తీర్పు సందేశం గురించి, దేవుని శత్రువులు చేసే చివరి దాడి గురించి మాట్లాడుతుండవచ్చు. (చదవండి.) “తూర్పు నుండి, ఉత్తరం నుండి వచ్చిన నివేదికలు” ఉత్తర రాజుకు ఆందోళన కలిగిస్తాయని, అప్పుడతను “విపరీతమైన కోపంతో బయల్దేరతాడు” అని దానియేలు చెప్తున్నాడు. ఉత్తర రాజు ఆ సమయంలో ‘చాలామందిని నాశనం చేయాలని’ చూస్తాడు. “చాలామంది” అనే మాట యెహోవా ప్రజల్ని సూచిస్తుండవచ్చు. * దేవుని ప్రజలపై జరిగే చివరి దాడి గురించే దానియేలు ఇక్కడ మాట్లాడుతుండవచ్చు.

16 ప్రపంచంలోని మిగతా ప్రభుత్వాలన్నిటితో కలిసి ఉత్తర రాజు దాడి చేసినప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు చర్య తీసుకోవడానికి లేస్తాడు, దాంతో హార్‌మెగిద్దోను యుద్ధం మొదలౌతుంది. (ప్రక. 16:14, 16) ఆ యుద్ధంలో మాగోగు దేశం వాడైన గోగు నాశనమౌతాడు. అంటే దేశాల గుంపు నాశనమౌతుంది; అందులో భాగమైన ఉత్తర రాజు కూడా నాశనమౌతాడు. అప్పుడు ఉత్తర రాజును “రక్షించేవాళ్లెవ్వరూ ఉండరు.”—దాని. 11:45.

హార్‌మెగిద్దోను యుద్ధంలో యేసుక్రీస్తు, ఆయన పరలోక సైన్యం కలిసి సాతాను లోకాన్ని నాశనం చేస్తారు, దేవుని ప్రజల్ని కాపాడతారు (17వ పేరా చూడండి)

17. దానియేలు 12:1 లో ఉన్న “గొప్ప అధిపతైన మిఖాయేలు” ఎవరు? ఆయన ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? అతి త్వరలో ఏం చేస్తాడు?

17 దానియేలు ప్రవచనంలోని తర్వాతి వచనం, ఉత్తర రాజు అలాగే అతనికి మద్దతిచ్చేవాళ్లు ఎలా నాశనమౌతారో, మనమెలా కాపాడబడతామో వివరంగా తెలియజేస్తుంది. (దానియేలు 12:1 చదవండి.) ఈ వచనం అర్థమేంటి? ప్రస్తుతం రాజుగా మనల్ని పరిపాలిస్తున్న క్రీస్తు యేసుకు మరో పేరు మిఖాయేలు. 1914 లో పరలోకంలో దేవుని రాజ్యం స్థాపించబడినప్పటి నుండి ఆయన దేవుని ప్రజల “పక్షాన నిలబడుతూ” ఉన్నాడు. అతిత్వరలో కూడా ఆయన వాళ్ల పక్షాన “నిలబడతాడు,” అంటే హార్‌మెగిద్దోను యుద్ధంలో తన శత్రువుల్ని నాశనం చేస్తాడు. ఆ ప్రవచనం చెప్తున్న “అప్పటివరకు కలగని శ్రమల కాలం” ఆ యుద్ధంతో ముగింపుకొస్తుంది. ప్రకటన గ్రంథం హార్‌మెగిద్దోను యుద్ధానికి దారితీసే సంఘటనల్ని, అలాగే ఆ యుద్ధం జరిగే కాలమంతటినీ కలిపి “మహాశ్రమ” అని పిలుస్తోంది.—ప్రక. 6:2; 7:14.

మీ పేరు “గ్రంథంలో” రాయబడుతుందా?

18. మన భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు?

18 యెహోవాను, యేసును సేవించేవాళ్లు మహా శ్రమను తప్పించుకుంటారని దానియేలు, యోహాను చెప్పిన ప్రవచనాలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి మన భవిష్యత్తు ఎలా ఉంటుందోనని భయపడాల్సిన అవసరం లేదు. ఎవరెవరి పేర్లు “గ్రంథంలో రాయబడ్డాయో” వాళ్లు తప్పించుకుంటారని దానియేలు చెప్తున్నాడు. (దాని. 12:1) మన పేర్లు గ్రంథంలో రాయబడాలంటే ఏం చేయాలి? దేవుని గొర్రెపిల్ల అయిన యేసు మీద మనకు విశ్వాసం ఉందని నిరూపించుకోవాలి. (యోహా. 1:29) మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని బాప్తిస్మం తీసుకోవాలి. (1 పేతు. 3:21) అంతేకాదు, ఇతరులు యెహోవా గురించి నేర్చుకునేలా సహాయం చేయడం ద్వారా దేవుని రాజ్యానికి మద్దతివ్వాలి.

19. మనం ఇప్పుడే ఏం చేయాలి? ఎందుకు?

19 యెహోవా మీద, నమ్మకమైన సేవకులు గల ఆయన సంస్థ మీద విశ్వాసం పెంచుకోవడానికి ఇదే సరైన సమయం. దేవుని రాజ్యానికి మద్దతివ్వడానికి కూడా ఇదే సరైన సమయం. ఇవి చేస్తే ఉత్తర రాజును, దక్షిణ రాజును దేవుని రాజ్యం నాశనం చేసినప్పుడు మనం సురక్షితంగా ఉంటాం.

పాట 149 విజయగీతం

^ పేరా 5 నేడు “ఉత్తర రాజు” ఎవరు? అతను ఎలా నాశనం చేయబడతాడు? వీటికి జవాబులు తెలుసుకోవడం వల్ల మన విశ్వాసం మరింత బలపడుతుంది, అతిత్వరలో రానున్న మహాశ్రమ సమయంలో జరిగేవాటికి సిద్ధంగా ఉంటాం.