కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సౌమ్యత​—⁠ఈ లక్షణాన్ని అలవర్చుకోవడం ఎందుకు మంచిది?

సౌమ్యత​—⁠ఈ లక్షణాన్ని అలవర్చుకోవడం ఎందుకు మంచిది?

“నేను బిడియస్థురాలిని, ఆత్మవిశ్వాసం కూడా తక్కువే. అందుకే పెత్తనం చెలాయించేవాళ్ల మధ్య, కోపిష్ఠుల మధ్య ఉండాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ సౌమ్యంగా, వినయంగా ఉండే వాళ్లంటే నాకిష్టం. అలాంటివాళ్లతో మనసువిప్పి మాట్లాడగలను, నా సమస్యల గురించి చెప్పగలను. నా బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అందరూ సౌమ్యంగా, వినయంగా ఉండేవాళ్లే” అని దీపిక * చెప్తోంది.

దీపిక చెప్పినదాన్నిబట్టి, సౌమ్యంగా ఉంటేనే ఇతరులు మనతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. యెహోవాకు కూడా అలాంటివాళ్లే నచ్చుతారు. బైబిలు మనల్ని ఇలా ప్రోత్సహిస్తోంది: “సౌమ్యతను . . . అలవర్చుకోండి.” (కొలొ. 3:12) సౌమ్యత అంటే ఏంటి? ఆ లక్షణాన్ని యేసు ఎలా చూపించాడు? సౌమ్యంగా ఉంటే మన జీవితం సంతోషంగా ఉంటుందని ఎందుకు చెప్పవచ్చు?

సౌమ్యత అంటే ఏంటి?

ప్రశాంతంగా ఉండేవాళ్లే సౌమ్యత అనే లక్షణాన్ని చూపిస్తారు. సౌమ్యంగా ఉండే వ్యక్తి ఇతరులతో దయగా ఉంటాడు; చిరాకు కలిగించే పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రశాంతంగా ఉంటాడు.

సౌమ్యంగా ఉండడం ఒక బలహీనత కాదు. ‘సౌమ్యతను’ సూచించే గ్రీకు పదాన్ని, మచ్చిక చేసిన అడవి గుర్రాన్ని సూచించడానికి కూడా ఉపయోగించేవాళ్లు. అడవి గుర్రాన్ని మచ్చిక చేసినంత మాత్రాన దాని బలం తగ్గిపోదు; బదులుగా శిక్షణ ఇచ్చినందువల్ల అది బలాన్ని అదుపు చేసుకోవడం నేర్చుకుంటుంది. అదేవిధంగా, సౌమ్యంగా ఉన్నంత మాత్రాన మనం బలహీనులమని కాదు; బదులుగా, దురుసు స్వభావాన్ని తగ్గించుకుని ఇతరులతో ప్రశాంతంగా మెలగడం నేర్చుకున్నామని అర్థం.

‘నాకు సౌమ్యంగా ఉండే అలవాటు లేదు’ అని మనం అనుకోవచ్చు. నిజమే, నేడు మన చుట్టూ కోపిష్ఠులు, ఓపికలేని వాళ్లే ఎక్కువగా ఉన్నారు కాబట్టి, సౌమ్యంగా ఉండడం మనకు కష్టంగా అనిపించవచ్చు. (రోమా. 7:19) సౌమ్యంగా ఉండడం అలవాటు చేసుకోవాలంటే కృషి అవసరం. అలా కృషి చేస్తూ ఉండడానికి కావాల్సిన బలాన్ని పవిత్రశక్తి మనకిస్తుంది. (గల. 5:22, 23) సౌమ్యంగా ఉండడం ఎందుకు అలవాటు చేసుకోవాలి?

సౌమ్యంగా ఉండేవాళ్లను ఇతరులు ఇష్టపడతారు. దీపికలాగే మనం కూడా సౌమ్యంగా ఉండేవాళ్లతో స్నేహం చేయడానికి ఇష్టపడతాం. సౌమ్యంగా, దయగా ఉండే విషయంలో యేసు మనకు మంచి ఆదర్శం ఉంచాడు. (2 కొరిం. 10:1) సాధారణంగా చిన్నపిల్లలు కొత్తవాళ్ల దగ్గరకు వెళ్లరు, కానీ వాళ్లు కూడా యేసు దగ్గరకు వెళ్లడానికి ఇష్టపడేవాళ్లు.—మార్కు 10:13-16.

సౌమ్యత ఉంటే మనకు, మన చుట్టూ ఉన్నవాళ్లకు మేలు జరుగుతుంది. మనం సౌమ్యంగా ఉంటే త్వరగా చిరాకుపడం, చిన్నచిన్న వాటికి కోపం తెచ్చుకోం. (సామె. 16:32) అది మనకే మంచిది, ఎందుకంటే ఇతరుల్ని, ముఖ్యంగా మనకిష్టమైన వాళ్లను ఏదోకటి అని ఆ తర్వాత బాధపడే పరిస్థితి తెచ్చుకోం. మనకు సౌమ్యత ఉంటే ఇతరులకు కూడా మేలు జరుగుతుంది, ఎందుకంటే కోపాన్ని అదుపులో ఉంచుకోవడం నేర్చుకుని ఉంటాం కాబట్టి మనం వాళ్లతో దురుసుగా ప్రవర్తించం.

యేసు ఉంచిన ఆదర్శం

ఎన్ని బరువైన బాధ్యతలు ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా యేసు అందరితో సౌమ్యంగా ఉన్నాడు. ఆయన కాలంలోని చాలామంది ప్రజలు కష్టాలతో సతమతమౌతూ జీవితాన్ని భారంగా గడుపుతున్నారు, వాళ్లకు సేదదీర్పు అవసరమైంది. అలాంటివాళ్లతో యేసు ఇలా అన్నాడు: “మీరంతా నా దగ్గరికి రండి . . . నేను సౌమ్యుడిని, వినయస్థుడిని.” ఆ మాటలు వాళ్లకు ఖచ్చితంగా ఓదార్పు ఇచ్చివుంటాయి!—మత్త. 11:28, 29.

యేసులా మనం కూడా సౌమ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ముందుగా, బైబిల్ని చదివి యేసు ప్రజలతో ఎలా ప్రవర్తించాడో, కష్టమైన పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొన్నాడో తెలుసుకోవాలి. ఆ తర్వాత, చిరాకు కలిగించే పరిస్థితులు ఎదురైనప్పుడు యేసులా సౌమ్యంగా ఉండడానికి కృషిచేయాలి. (1 పేతు. 2:21) సౌమ్యంగా ఉండేలా యేసుకు సహాయం చేసిన మూడు విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

యేసు వినయం గలవాడు. “నేను సౌమ్యుడిని, వినయస్థుడిని” అని యేసు అన్నాడు. (మత్త. 11:29) సౌమ్యతకు, వినయానికి దగ్గర సంబంధం ఉంది, అందుకే బైబిలు వాటిని కలిపి ప్రస్తావిస్తోంది.—ఎఫె. 4:1-3.

వినయం ఉంటే మన గురించి మనం గొప్పగా అనుకోం, ఎవరైనా ఒక చిన్నమాట అంటే అతిగా బాధపడం. యేసును “తిండిబోతు, తాగుబోతు” అని అన్యాయంగా విమర్శించినప్పుడు ఆయన ఎలా స్పందించాడు? ఆయన తన ప్రవర్తన ద్వారా ఆ విమర్శకులకు జవాబిచ్చాడు, “ఒక వ్యక్తి చేసే నీతి పనులే అతను తెలివిగలవాడని చూపిస్తాయి” అని సౌమ్యంగా చెప్పాడు.—మత్త. 11:19.

ఎవరైనా మీ గురించి, మీ జాతి గురించి, నేపథ్యం గురించి అనాలోచితంగా మాట్లాడితే, సౌమ్యంగా జవాబివ్వడానికి ప్రయత్నించండి. దక్షిణ ఆఫ్రికాలో సంఘపెద్దగా సేవచేస్తున్న పీటర్‌ ఇలా చెప్తున్నాడు: “ఎవరి మాటలైనా నాకు చిరాకు తెప్పిస్తే, ‘నా పరిస్థితుల్లో యేసు ఉంటే ఎలా ప్రవర్తిస్తాడు’ అని ఆలోచించుకుంటాను. నా గురించి నేను గొప్పగా అనుకోకూడదని తెలుసుకున్నాను.”

మనుషులు అపరిపూర్ణులని యేసు అర్థంచేసుకున్నాడు. యేసు శిష్యులకు సరైనది చేయాలనే కోరిక ఉండేది, కానీ అపరిపూర్ణత వల్ల కొన్నిసార్లు పొరపాట్లు చేసేవాళ్లు. ఉదాహరణకు తాను చనిపోవడానికి ముందు రాత్రి యేసు పేతురుకు, యాకోబుకు, యోహానుకు మేల్కొని ఉండమని చెప్పాడు, అయినా వాళ్లు నిద్రపోయారు. యేసు వాళ్ల పరిస్థితిని అర్థంచేసుకుని, “మనసు సిద్ధమే కానీ శరీరమే బలహీనం” అన్నాడు. (మత్త. 26:40, 41) ఆయన అపొస్తలుల అపరిపూర్ణతను అర్థంచేసుకున్నాడు కాబట్టే వాళ్ల మీద చిరాకుపడలేదు.

మయూరి అనే సహోదరికి ఇతరులను బాగా విమర్శించే అలవాటు ఉండేది. కానీ ఇప్పుడు ఆమె యేసులా సౌమ్యంగా ఉండడానికి కృషిచేస్తోంది. ఆమె ఇలా చెప్తోంది: “మనుషులందరూ అపరిపూర్ణులని గుర్తుపెట్టుకోవడానికి, యెహోవాలా ఇతరుల్లోని మంచి లక్షణాలను చూడడానికి నేను ప్రయత్నిస్తున్నాను.” మీరు కూడా యేసులాగే మనుషుల అపరిపూర్ణతను అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఇతరులతో సౌమ్యంగా ఉండగలరు.

దేవుని మీద యేసు నమ్మకం ఉంచాడు. యేసు భూమ్మీద ఉన్నప్పుడు అన్యాయాన్ని ఎదుర్కొన్నాడు. చాలామంది ఆయన్ని అపార్థం చేసుకున్నారు, ద్వేషించారు, హింసించారు. అయినాసరే ఆయన వాళ్లను కోప్పడలేదు, ఎందుకంటే “నీతిగా తీర్పుతీర్చే దేవునికే తనను తాను అప్పగించుకున్నాడు.” (1 పేతు. 2:23) తాను సహించడానికి కావాల్సిన సహాయాన్ని తన పరలోక తండ్రి ఇస్తాడని, తనకు జరుగుతున్న అన్యాయాలకు సరైన సమయంలో జవాబిస్తాడని యేసు నమ్మాడు.

మనకు అన్యాయం జరిగినప్పుడు కోపంగా స్పందిస్తే పరిస్థితి ఇంకా ఘోరంగా తయారవ్వచ్చు. అందుకే లేఖనాలు మనకిలా గుర్తుచేస్తున్నాయి: “కోపంగా ఉన్న వ్యక్తి దేవుని దృష్టిలో సరైనది చేయడు.” (యాకో. 1:20) ఆ సందర్భంలో మనకు కోపం రావడం న్యాయమే అనిపించవచ్చు, కానీ మన అపరిపూర్ణత వల్ల మనం తప్పుగా స్పందించే ప్రమాదం ఉంది.

‘నిన్ను నువ్వు సమర్థించుకోకపోతే, ఇంకెవరు సమర్థిస్తారు’ అని జర్మనీలో ఉండే జెస్సికా అనుకునేది. కానీ యెహోవా మీద నమ్మకం ఉంచడం నేర్చుకున్నాక ఆమె ఆలోచన మారింది. “ప్రతీసారి నన్ను నేను సమర్థించుకోవాల్సిన అవసరం లేదు. లోకంలో జరిగే తప్పులన్నిటినీ యెహోవా సరిచేస్తాడని ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి, నేను వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.” మీకెప్పుడైనా అన్యాయం జరిగితే, యేసులా యెహోవా మీద నమ్మకం ఉంచండి; అప్పుడు మీరు సౌమ్యంగా ఉంటారు.

“సౌమ్యులు సంతోషంగా ఉంటారు”

సౌమ్యత ఉంటే ఎలాంటి సందర్భంలోనైనా ప్రశాంతంగా ఉంటాం

“సౌమ్యులు సంతోషంగా ఉంటారు” అని యేసు అన్నాడు. (మత్త. 5:5) సంతోషంగా ఉండాలంటే సౌమ్యంగా ఉండడం తప్పనిసరి అని ఆయన మాటల భావం. సౌమ్యంగా ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో పరిశీలించండి.

సౌమ్యత ఉంటే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. “నా మాటలు నా భార్యను చాలాసార్లు బాధపెట్టాయి. కానీ నేను కావాలని అలా మాట్లాడలేదు. ఏదేమైనా, కోపంలో ఒక్కసారి నోరుజారాక మాటల్ని వెనక్కి తీసుకోలేం. నా మాటలు తనను ఎంత గాయపర్చాయో అర్థమయ్యాక చాలా బాధనిపించింది” అని ఆస్ట్రేలియాలో ఉంటున్న రాబర్ట్‌ అనే సహోదరుడు చెప్తున్నాడు.

మాట్లాడే విషయంలో “మనందరం తరచూ పొరపాట్లు చేస్తుంటాం.” దానివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు రావచ్చు. (యాకో. 3:2) అలాంటి సందర్భాల్లో అనాలోచితంగా మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండడానికి సౌమ్యత సహాయం చేస్తుంది.—సామె. 17:27.

ప్రశాంతంగా ఉండడానికి, కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి రాబర్ట్‌ చాలా కృషిచేశాడు. ఫలితం? “నాకూ, నా భార్యకు మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు, తను ఏం చెప్తుందో శ్రద్ధగా వినడానికి ప్రయత్నిస్తున్నాను, త్వరగా కోపం తెచ్చుకోకుండా సౌమ్యంగా మాట్లాడడానికి కృషిచేస్తున్నాను. ఇప్పుడు మేము ఒకరికొకరం చాలా దగ్గరయ్యాం” అని రాబర్ట్‌ అంటున్నాడు.

సౌమ్యత ఉంటే నలుగురితో కలవడం సులభమౌతుంది. చిన్నచిన్న విషయాలకు కూడా బాధపడేవాళ్లకు ఎక్కువమంది స్నేహితులు ఉండరు. అయితే ‘శాంతియుతంగా మెలుగుతూ ఐక్యతను కాపాడుకోవడానికి’ సౌమ్యత సహాయం చేస్తుంది. (ఎఫె. 4:2, 3) ముందు పేరాల్లో ప్రస్తావించబడిన జెస్సికా ఇలా చెప్తుంది, “కొంతమందితో స్నేహం చేయడం కష్టంగా అనిపిస్తుంది, కానీ సౌమ్యంగా ఉండడం నేర్చుకున్నాక అందరితో కలిసిమెలిసి ఉండగలుగుతున్నాను.”

సౌమ్యత ఉంటే ప్రశాంతంగా ఉంటాం. బైబిలు, ‘పరలోకం నుండి వచ్చే తెలివిని’ సౌమ్యతతో, శాంతితో ముడిపెడుతోంది. (యాకో. 3:13, 17) సౌమ్యంగా ఉండే వ్యక్తికి “ప్రశాంతమైన హృదయం” ఉంటుంది. (సామె. 14:30) సౌమ్యంగా ఉండడం అలవాటు చేసుకోవడానికి తీవ్రంగా కృషిచేసిన మనోజ్‌ ఇలా చెప్తున్నాడు: “ఇప్పుడు నేను మొండిపట్టు పట్టడం లేదు, త్వరగా కోపం తెచ్చుకోవడం లేదు. అందుకే చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉంటున్నాను.”

నిజమే, సౌమ్యంగా ఉండడం అలవాటు చేసుకోవాలంటే చాలా కృషి అవసరం. ఒక సహోదరుడు ఇలా అంటున్నాడు: “నిజం చెప్పాలంటే, కొన్నిసార్లు కోపంతో నా రక్తం మరిగిపోతుంది.” కానీ సౌమ్యంగా ఉండమని మనల్ని ప్రోత్సహిస్తున్న యెహోవా, మనం ఆ కోపాన్ని అణచుకోవడానికి సహాయం చేస్తాడు. (యెష. 41:10; 1 తిమో. 6:11) ఆయన మనకిచ్చే “శిక్షణను పూర్తిచేస్తాడు;” మనల్ని “బలపరుస్తాడు.” (1 పేతు. 5:10) ఈలోపు అపొస్తలుడైన పౌలులాగే మనం కూడా, “క్రీసులాంటి సౌమ్యతతో, దయతో” ఉండడానికి కృషిచేద్దాం.—2 కొరిం. 10:1.

^ పేరా 2 అసలు పేర్లు కావు.