కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 1

“నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము”

“నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము”

“నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే.”—యెష. 41:9, 10.

పాట 7 యెహోవా, మన బలం

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. (ఎ) యెషయా 41:9, 10⁠లోని మాటలు యోషీకో అనే సహోదరికి ఎలా సహాయం చేశాయి? (బి) ఆ లేఖనంలో ఉన్న మాటల నుండి ఇంకా ఎవరు కూడా ప్రయోజనం పొందవచ్చు?

యోషీకో అనే నమ్మకమైన సహోదరి ఒక చేదు వార్త వింది. ఆమె ఇంకొన్ని నెలల్లో చనిపోతుందని తనకు వైద్యం చేసే డాక్టర్‌ చెప్పింది. అప్పుడు, యోషీకో తనకు ఇష్టమైన యెషయా 41:9, 10 లేఖనాన్ని గుర్తుచేసుకుని, యెహోవా తన చేతిని గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి భయపడట్లేదని డాక్టర్‌తో చెప్పింది. * (చదవండి.) ఆ లేఖనంలో ఉన్న ఊరటనిచ్చే మాటలు, యెహోవాపై పూర్తి నమ్మకం ఉంచేలా మన ప్రియ సహోదరికి సహాయం చేశాయి. మనకు కూడా తీవ్రమైన కష్టాలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండడానికి ఆ లేఖనం సహాయం చేస్తుంది. అదెలాగో అర్థంచేసుకోవడానికి, ముందుగా యెహోవా యెషయాకు ఎందుకు ఆ సందేశం ఇచ్చాడో పరిశీలిద్దాం.

2 త్వరలో బబులోనుకు బందీలుగా వెళ్లబోయే యూదులకు ఊరటనివ్వడానికి యెహోవా ఆ మాటల్ని మొదట రాయించాడు. అయితే కేవలం వాళ్ల కోసమే కాదు, అప్పటినుండి ఇప్పటివరకున్న తన ప్రజలందరి ప్రయోజనం కోసం కూడా యెహోవా ఆ మాటల్ని రాయించాడు. (యెష. 40:8; రోమా. 15:4) మనం ‘ప్రమాదకరమైన, కష్టమైన కాలాల్లో’ జీవిస్తున్నాం కాబట్టి యెషయా పుస్తకంలో ఉన్న ప్రోత్సాహకరమైన మాటలు ముందెప్పటికన్నా ఇప్పుడే చాలా అవసరం.—2 తిమో. 3:1.

3. (ఎ) 2019 వార్షిక వచనమైన యెషయా 41:9, 10⁠లో ఏ అభయాలున్నాయి? (బి) అవి మనకెందుకు అవసరం?

3 యెషయా 41:9, 10 వచనాల్లో, యెహోవా మన విశ్వాసాన్ని బలపర్చే మూడు అభయాలు ఇచ్చాడు. వాటిగురించి ఈ ఆర్టికల్‌లో లోతుగా పరిశీలిస్తాం. అవేంటంటే: (1) యెహోవా మనకు తోడుగా ఉంటాడు, (2) ఆయన మన దేవుడు, (3) ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆ అభయాలు * మనకు చాలా అవసరం. ఎందుకంటే, యోషీకోలాగే మనం కూడా కష్టాలు అనుభవిస్తున్నాం. పైగా, ఈ లోకంలో జరిగే చెడు సంఘటనల వల్ల సమస్యల్ని ఎదుర్కొంటున్నాం. మనలో కొంతమందిమి శక్తివంతమైన ప్రభుత్వాల నుండి వచ్చే హింసల్ని కూడా సహిస్తున్నాం. కాబట్టి, ఇప్పుడు ఆ మూడు అభయాల్ని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం.

“నీకు తోడైయున్నాను”

4. (ఎ) మనం పరిశీలించే మొదటి అభయం ఏంటి? (అధస్సూచి కూడా చూడండి.) (బి) ఏ మాటల ద్వారా యెహోవా మనపట్ల తనకున్న ఆప్యాయతను తెలియజేస్తున్నాడు? (సి) ఆ మాటల్ని చదివినప్పుడు మీకెలా అనిపిస్తుంది?

4 యెహోవా ముందుగా, “నీకు తోడైయున్నాను భయపడకుము” అనే మాటలతో మనకు ఊరట ఇస్తున్నాడు. * ఆయన తన పూర్తి అవధానం మనపై ఉంచడం ద్వారా, ఆప్యాయతను చూపించడం ద్వారా మనకు తోడుగా ఉన్నానని చూపిస్తున్నాడు. “నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను” అని చెప్పడం ద్వారా మనమీద తనకున్న ఆప్యాయతను యెహోవా తెలియజేస్తున్నాడు. (యెష. 43:4) తన సేవకులపై ప్రేమ చూపించకుండా ఈ విశ్వంలో ఏదీ యెహోవాను ఆపలేదు. ఆయన మనపట్ల చెక్కుచెదరని విశ్వసనీయతను చూపిస్తున్నాడు. (యెష. 54:10) ఆయన ప్రేమ, స్నేహం మనకు కొండంత ధైర్యాన్నిస్తాయి. తన స్నేహితుడైన అబ్రామును (అబ్రాహామును) కాపాడినట్లే యెహోవా మనల్ని కూడా కాపాడతాడు. యెహోవా అతనితో ఇలా అన్నాడు, “అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును.”—ఆది. 15:1.

యెహోవా సహాయంతో మనం నదిలాంటి, అగ్నిలాంటి సమస్యల్ని దాటగలం (5-6 పేరాలు చూడండి) *

5-6. (ఎ) యెహోవా మన కష్టాల్లో సహాయం చేయాలనుకుంటున్నాడని ఎలా చెప్పవచ్చు? (బి) యోషీకో ఉదాహరణ నుండి మనమేం నేర్చుకోవచ్చు?

5 యెహోవా మన కష్టాల్లో సహాయం చేయాలనుకుంటున్నాడు. అలాగని ఎలా చెప్పవచ్చు? ఎందుకంటే ఆయన తన ప్రజలకు ఇలా మాటిచ్చాడు, “నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు.” (యెష. 43:2) ఆ మాటలకు అర్థమేంటి?

6 మన జీవితాన్ని కష్టతరం చేసే సమస్యల్ని తీసేస్తానని యెహోవా మాటివ్వట్లేదు. కానీ, ‘నది’ లాంటి సమస్యల్లో మునిగిపోయేలా లేదా “అగ్ని” లాంటి పరీక్షలు మనకు శాశ్వత హాని చేసేలా ఆయన అనుమతించడు. ఆయన మన వెన్నంటే ఉంటూ సమస్యల్ని ‘దాటడానికి’ సహాయం చేస్తానని హామీ ఇస్తున్నాడు. అంటే యెహోవా ఏం చేస్తాడు? మన భయాలు పోగొట్టి, చనిపోవాల్సిన పరిస్థితి వచ్చినా ఆయనకు విశ్వసనీయంగా ఉండేలా సహాయం చేస్తాడు. (యెష. 41:13) ఆ మాటలు నిజమని ముందటి పేరాల్లో ప్రస్తావించబడిన యోషీకో అర్థంచేసుకుంది. ఆమె కూతురు ఇలా చెప్పింది, “మమ్మీ ప్రశాంతంగా ఉండడం చూసి మేం ఆశ్చర్యపోయాం. హృదయలోతుల్లో ప్రశాంతతను అనుభవించేలా యెహోవా ఆమెకు సహాయం చేశాడు. చనిపోయే రోజువరకు నర్సులకు, తోటి పేషెంట్లకు యెహోవా గురించి, ఆయన వాగ్దానాల గురించి మమ్మీ చెప్తూనే ఉంది.” యోషీకో ఉదాహరణ నుండి మనమేం నేర్చుకోవచ్చు? “నేను నీకు తోడైయుందును” అని యెహోవా ఇచ్చిన మాటమీద నమ్మకం ఉంచితే కష్టాల్లో కూడా ధైర్యంగా, స్థిరంగా ఉండగలుగుతాం.

“నేను నీ దేవుడనై యున్నాను”

7-8. (ఎ) మనం పరిశీలించే రెండో అభయం ఏంటి? దాని అర్థమేంటి? (బి) బందీలుగా ఉన్న యూదులతో “దిగులుపడకుము” అని యెహోవా ఎందుకు చెప్పాడు? (సి) యెషయా 46:3, 4⁠లో ఉన్న ఏ మాటలు వాళ్లకు ఊరటను, ప్రోత్సాహాన్ని ఇచ్చివుంటాయి?

7 యెషయా రాసిన రెండో అభయాన్ని గమనించండి: “నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము.” ఈ లేఖనంలో దిగులు లేదా ఆందోళన అంటే ఏంటి? ఆదిమ భాషలో ‘దిగులుపడడం’ లేదా ఆందోళనపడడం అంటే, “ఎవరైనా మనకు హాని చేస్తారేమో అని పదేపదే వెనక్కి తిరిగి చూడడం” లేదా “ప్రమాదకరమైన పరిస్థితిలో ఒకవ్యక్తికి కలిగే భయం.”

8 బబులోనుకు బందీలుగా వెళ్లబోయే యూదులతో “దిగులుపడకుము” అని యెహోవా ఎందుకు చెప్పాడు? ఎందుకంటే, ఆ దేశప్రజలు త్వరలోనే భయపడతారని యెహోవాకు తెలుసు. వాళ్లెందుకు భయపడతారు? బందీలుగా ఉన్న 70 ఏళ్ల చివర్లో, శక్తివంతమైన మాదీయ-పారసీక సైన్యాలు బబులోనుపై దాడి చేస్తాయి. యెహోవా ఆ సైన్యాన్ని ఉపయోగించుకుని తన ప్రజల్ని బబులోను చెర నుండి విడిపిస్తాడు. (యెష. 41:2-4) బబులోనీయులు అలాగే అక్కడ నివసిస్తున్న ఇతర జనాంగాల ప్రజలు, తమ శత్రువులు దాడిచేయడానికి వస్తున్నారని తెలుసుకున్నప్పుడు, భయపడకుండా ఉండడానికి ఒకరితోఒకరు, ‘ధైర్యంగా ఉండు’ అని చెప్పుకున్నారు. అంతేకాదు వాళ్లు ఇంకా ఎక్కువ విగ్రహాలు చేసుకుని, అవి వాళ్లను రక్షిస్తాయని నమ్మారు. (యెష. 41:5-7, NW) ఈలోపు బందీలుగా ఉన్న యూదులను యెహోవా ధైర్యపరిచాడు. చుట్టుపక్కల జనాంగాల్లా కాకుండా, వాళ్లు తనను సేవిస్తున్నారు కాబట్టి, “నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము” అని ఆయన చెప్పాడు. (యెష. 41:8-10) యెహోవా ఇక్కడ, “నేను నీ దేవుడనై యున్నాను” అని చెప్పాడని గమనించండి. తన నమ్మకమైన ఆరాధకుల్ని ఆయన మర్చిపోలేదని ఆ మాటల ద్వారా అభయమిచ్చాడు. అంటే ఆయన ఇంకా వాళ్ల దేవుడే, వాళ్లూ ఆయన ప్రజలే! ఆయన వాళ్లకిలా చెప్పాడు, “నిన్ను . . . ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.” ఆ మాటలు, బందీలుగా ఉన్న యూదులకు ఖచ్చితంగా ఊరటను, ప్రోత్సాహాన్ని ఇచ్చివుంటాయి.—యెషయా 46:3, 4 చదవండి.

9-10. మనమెందుకు భయపడాల్సిన అవసరంలేదు? ఉదాహరణ చెప్పండి.

9 నేడు లోకంలోని పరిస్థితులు అంతకంతకూ ఘోరంగా మారడం చూసి ప్రజలు ఎక్కువ ఆందోళనపడుతున్నారు. నిజమే, ఆ పరిస్థితుల ప్రభావం మనమీద కూడా ఉంది. కానీ మనం భయపడాల్సిన అవసరంలేదు. ఎందుకంటే, “నేను నీ దేవుడనై యున్నాను” అని యెహోవా చెప్తున్నాడు. మనం ప్రశాంతంగా ఉండడానికి ఆ మాటలు ఒక శక్తివంతమైన కారణమని ఎందుకు చెప్పవచ్చు?

10 ఈ ఉదాహరణ పరిశీలించండి: జిమ్‌, బెన్‌ అనే ఇద్దరు వ్యక్తులు విమానంలో ప్రయాణిస్తున్నారు. అయితే, బలమైన గాలులు వాళ్ల విమానాన్ని కుదిపేయడంవల్ల, విమానం అదుపు తప్పి పైకీ కిందికి ఊగుతోంది. ఇంతలో పైలట్‌, “మీ సీటు బెల్ట్‌ పెట్టుకోండి. కాసేపు మన విమానం అస్తవ్యస్తంగా వెళ్తుంది” అని ప్రకటన చేశాడు. జిమ్‌ చాలా ఆందోళనపడుతున్నాడు. కానీ పైలట్‌, “ఆందోళనపడకండి. నేనున్నాను!” అని చెప్పాడు. అప్పుడు, జిమ్‌ తల ఊపుతూ “ఆయనేం మాట్లాడుతున్నాడు? అసలు ఆందోళనపడకుండా ఎలా ఉంటాం?” అన్నాడు. బెన్‌ మాత్రం నింపాదిగా ఉన్నట్లు జిమ్‌ గమనించి, “నువ్వు ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నావ్‌?” అని అడిగాడు. దానికి బెన్‌ చిరునవ్వుతో “ఎందుకంటే, ఈ పైలట్‌ గురించి నాకు బాగా తెలుసు. ఆయన మా నాన్న! ఆయన గురించి, విమానం నడపగల ఆయన సామర్థ్యం గురించి తెలుసుకుంటే నువ్వు కూడా ప్రశాంతంగా ఉంటావ్‌. ఆయన గురించి చెప్తాను విను” అన్నాడు.

11. ఇద్దరు ప్రయాణికుల ఉదాహరణ నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?

11 ఆ ఉదాహరణ నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు? బెన్‌లాగే నేడు మనం కూడా ప్రశాంతంగా ఉన్నాం. ఎందుకంటే మన పరలోక తండ్రైన యెహోవా గురించి మనకు బాగా తెలుసు. అంతేకాదు, ఈ చివరి రోజుల్లో వచ్చే పెద్దపెద్ద సమస్యల్ని తట్టుకోవడానికి ఆయన సహాయం చేస్తాడని కూడా మనకు తెలుసు. (యెష. 35:4) మనం యెహోవా మీద నమ్మకం ఉంచుతాం కాబట్టి ఈ లోకం భయం గుప్పిట్లో ఉన్నా, మనం మాత్రం ప్రశాంతంగా ఉంటాం. (యెష. 30:15) దేవుని మీద మనం ఎందుకు నమ్మకం ఉంచుతున్నామో పొరుగువాళ్లకు చెప్పినప్పుడు మనం కూడా బెన్‌లాగే ప్రవర్తించిన వాళ్లమౌతాం. అప్పుడు, వాళ్లు కూడా ఎలాంటి కష్టాలు ఎదురైనా యెహోవా సహాయం చేస్తాడనే నమ్మకంతో ఉంటారు.

‘నేను నిన్ను బలపరుస్తాను, సహాయం చేస్తాను’

12. (ఎ) మనం పరిశీలించే మూడో అభయం ఏంటి? (బి) యెహోవా ‘బాహువు ఏలుతుంది’ అనే మాట మనకేం గుర్తుచేస్తుంది?

12 యెషయా రాసిన మూడో అభయాన్ని గమనించండి: “నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే.” యెహోవా తన ప్రజల్ని ఎలా బలపరుస్తాడో యెషయా ముందే వివరించాడు. అతనిలా రాశాడు, “తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తిసంపన్నుడై వచ్చును.” (యెష. 40:10) “బాహువు” అనే పదం బైబిల్లో తరచూ శక్తిని సూచిస్తుంది. కాబట్టి యెహోవా ‘బాహువు ఏలుతుంది’ అనే మాట, యెహోవా ఒక శక్తిమంతుడైన రాజని మనకు గుర్తుచేస్తుంది. గతంలో తన సేవకులకు మద్దతివ్వడానికి, వాళ్ల తరఫున పోరాడడానికి యెహోవా తనకున్న అసాధారణ శక్తిని ఉపయోగించాడు. నేడు కూడా తన మీద నమ్మకం ఉంచేవాళ్లను బలపర్చడానికి, కాపాడడానికి తన శక్తిని ఉపయోగిస్తున్నాడు.—ద్వితీ. 1:30, 31; యెష. 43:10.

రక్షించే యెహోవా బలమైన చేతి ముందు ఏ ఆయుధం వర్ధిల్లదు (12-16 పేరాలు చూడండి) *

13. (ఎ) మనల్ని బలపరుస్తానని యెహోవా ఇచ్చిన మాట ముఖ్యంగా ఎప్పుడు నిలబెట్టుకుంటాడు? (బి) మనకు బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చే ఏ హామీ యెహోవా ఇచ్చాడు?

13 ముఖ్యంగా శత్రువులు మనల్ని హింసించినప్పుడు, “నేను నిన్ను బలపరతును” అని ఇచ్చిన మాటను యెహోవా నిలబెట్టుకుంటాడు. నేడు కొన్ని దేశాల్లో, మన ప్రకటనా పనిని ఆపడానికి లేదా మన సంస్థను మూసేయడానికి శత్రువులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ, వాటిని చూసి మనం అతిగా ఆందోళనపడం. ఎందుకంటే “నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు” అని యెహోవా హామీ ఇచ్చాడు. అది మనకెంతో బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. (యెష. 54:17) అయితే, ఆ మాటలు మనకు మూడు ప్రాముఖ్యమైన వాస్తవాల్ని గుర్తుచేస్తాయి.

14. శత్రువులు దాడి చేసినప్పుడు మనమెందుకు ఆశ్చర్యపోం?

14 మొదటిది, క్రీస్తు అనుచరులుగా ఉన్నందుకు ప్రజలు మనల్ని ద్వేషిస్తారని మనకు తెలుసు. (మత్త. 10:22) చివరి రోజుల్లో తన శిష్యులు తీవ్రమైన హింసలు ఎదుర్కొంటారని యేసు ముందే చెప్పాడు. (మత్త. 24:9; యోహా. 15:20) రెండోది, మన శత్రువులు మనల్ని ద్వేషించడం కన్నా ఎక్కువే చేస్తారనీ; శత్రువులు మనపై వివిధ రకాల ఆయుధాలు ప్రయోగిస్తారనీ యెషయా ప్రవచనం హెచ్చరిస్తుంది. ఉదాహరణకు, శత్రువులు అబద్ధాల్ని నిజాలుగా నమ్మించవచ్చు, మన గురించి లేనిపోని అబద్ధాలు చెప్పవచ్చు, మనల్ని తీవ్రంగా హింసించవచ్చు. (మత్త. 5:11) శత్రువులు మనపై అలాంటి ఆయుధాలు ప్రయోగించకుండా యెహోవా అడ్డుకోడు. (ఎఫె. 6:12; ప్రక. 12:17) అంతమాత్రాన మనం భయపడాల్సిన అవసరంలేదు. ఎందుకు?

15-16. (ఎ) మనం గుర్తుంచుకోవాల్సిన మూడో వాస్తవం ఏంటి? యెషయా 25:3-5 వచనాలు ఆ వాస్తవాన్ని ఎలా బలపరుస్తున్నాయి? (బి) యెషయా 41:11, 12 ప్రకారం మన శత్రువులు పొందే చివరి ఫలితం ఏంటి?

15 మూడో వాస్తవం ఏంటంటే, మనకు విరోధంగా రూపొందించబడిన ‘ఏ ఆయుధం వర్ధిల్లదు’ అని యెహోవా చెప్తున్నాడు. పెద్ద గాలివాన నుండి ఒక గోడ మనల్ని కాపాడినట్లే, “భీకరుల ఊపిరి” లేదా నిరంకుశ పాలకుల కోపం నుండి యెహోవా మనల్ని కాపాడతాడు. (యెషయా 25:3-5 చదవండి.) శత్రువులు ఎన్నడూ మనకు శాశ్వత హాని చేయలేరు.—యెష. 65:17.

16 మనమీద “కోపపడినవారందరు” పొందబోయే ఫలితం గురించి వివరించడం ద్వారా తన మీద మనకున్న నమ్మకాన్ని యెహోవా మరింత బలపరుస్తున్నాడు. (యెషయా 41:11, 12 చదవండి.) మన శత్రువులు ఎంత బలంగా పోరాడినా లేదా వాళ్లు చేసే యుద్ధం ఎంత తీవ్రంగా ఉన్నా, వాళ్లు చివరికి పొందే ఫలితం మాత్రం ఒక్కటే. అదేంటంటే, దేవుని ప్రజల శత్రువులందరూ “మాయమై నశించిపోవుదురు.”

యెహోవా మీదున్న నమ్మకాన్ని బలపర్చుకోండి

బైబిల్ని క్రమంగా చదవడం ద్వారా యెహోవాపై నమ్మకాన్ని బలపర్చుకోవచ్చు (17-18 పేరాలు చూడండి) *

17-18. (ఎ) బైబిలు చదవడం వల్ల దేవుని మీదున్న నమ్మకం ఎలా బలపడుతుంది? ఉదాహరణ చెప్పండి. (బి) 2019 వార్షిక వచనాన్ని లోతుగా ఆలోచించడం వల్ల ఏ ప్రయోజనం ఉంటుంది?

17 యెహోవా గురించి ఎక్కువ తెలుసుకోవడం వల్ల ఆయన మీద మనకున్న నమ్మకాన్ని బలపర్చుకుంటాం. దేవుని గురించి బాగా తెలుసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం బైబిల్ని శ్రద్ధగా చదవడం, చదివిన వాటిగురించి లోతుగా ఆలోచించడం. యెహోవా తన ప్రజల్ని గతంలో ఎలా కాపాడాడో తెలియజేసే నమ్మదగిన ఆధారాలు బైబిల్లో ఉన్నాయి. వాటినిబట్టి యెహోవా ఇప్పుడు కూడా మనల్ని పట్టించుకుంటాడనే ధైర్యంతో ఉండవచ్చు.

18 యెహోవా మనల్ని ఎలా కాపాడతాడో వివరించడానికి యెషయా ఉపయోగించిన చక్కని పద చిత్రాన్ని పరిశీలించండి. యెషయా, యెహోవాను ఒక గొర్రెల కాపరితో, ఆయన సేవకుల్ని గొర్రెపిల్లలతో పోల్చాడు. యెహోవా గురించి అతనిలా రాశాడు, “తన బాహువుతో గొఱ్ఱెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును.” (యెష. 40:11) యెహోవా తన బలమైన చేతులతో మనల్ని ఎత్తుకొని మోస్తున్నాడని బైబిల్లో చదివినప్పుడు మనకు సురక్షితంగా, ప్రశాంతంగా అనిపిస్తుంది కదా! సమస్యల్లో కూడా మనం ప్రశాంతతను అనుభవించేలా సహాయం చేయడానికి, పరిపాలక సభ యెషయా 41:9, 10 వచనాల ఆధారంగా “నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము” అనే మాటల్ని 2019 వార్షిక వచనంగా ఎంపిక చేసింది. ధైర్యాన్నిచ్చే ఆ మాటల గురించి లోతుగా ఆలోచించండి. ముందుముందు మీరు ఎదుర్కోబోయే సమస్యల్లో అవి మీకు బలాన్నిస్తాయి.

పాట 38 ఆయనే నిన్ను బలపరుస్తాడు

^ పేరా 5 ఈ లోకంలో చెడు సంఘటనలు జరుగుతున్నప్పటికీ, మనకు కష్టాలు ఎదురౌతున్నప్పటికీ ప్రశాంతంగా ఉండడానికిగల మూడు కారణాల్ని 2019 వార్షిక వచనంలో చూడవచ్చు. ఆ కారణాల గురించి ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం. మన ఆందోళనను తగ్గించుకొని, యెహోవాపై నమ్మకాన్ని పెంచుకోవడానికి ఈ ఆర్టికల్‌ సహాయం చేస్తుంది. వార్షిక వచనం గురించి లోతుగా ఆలోచించండి. వీలైతే దాన్ని కంఠస్థం చేయండి. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల్ని తట్టుకునేలా అది మిమ్మల్ని బలపరుస్తుంది.

^ పేరా 3 పదాల వివరణ: అభయం అంటే ఫలానా పని తప్పకుండా జరుగుతుందని మాటివ్వడం. మనకు ఎదురయ్యే సమస్యల గురించి అతిగా చింతించకుండా యెహోవా ఇచ్చిన అభయాలు సహాయం చేస్తాయి.

^ పేరా 4 అధస్సూచి: “భయపడకుము” అనే మాట యెషయా 41:9, 10, 13, 14 వచనాల్లో మూడుసార్లు ఉపయోగించబడింది. ఆ వచనాల్లో, “నేను” (యెహోవాను సూచిస్తుంది) అనే పదం కూడా ఎక్కువగా ప్రస్తావించబడింది. యెహోవా యెషయాతో “నేను” అనే పదాన్ని ఎందుకు అన్నిసార్లు రాయించాడు? ఎందుకంటే, తన మీద నమ్మకం ఉంచినప్పుడు మాత్రమే మన భయాలు పోతాయనే వాస్తవాన్ని యెహోవా నొక్కి చెప్పాలనుకున్నాడు.

^ పేరా 52 చిత్రాల వివరణ : ఉద్యోగ స్థలంలో, ఆరోగ్యం విషయంలో, పరిచర్యలో, స్కూల్‌లో సమస్యలు ఎదుర్కొంటున్న ఒక కుటుంబం.

^ పేరా 54 చిత్రాల వివరణ : సాక్షులు ఒక ఇంట్లో కలుసుకుని మీటింగ్‌ జరుపుకుంటున్నప్పుడు పోలీసులు దాడిచేశారు, కానీ సహోదరసహోదరీలు ధైర్యంగా ఉన్నారు.

^ పేరా 56 చిత్రాల వివరణ : క్రమంగా కుటుంబ ఆరాధన చేసుకున్నప్పుడు సహించడానికి కావాల్సిన బలం వస్తుంది.