కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 3

మీ హృదయాన్ని ఎలా కాపాడుకోవచ్చు?

మీ హృదయాన్ని ఎలా కాపాడుకోవచ్చు?

“అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము.”—సామె. 4:23.

పాట 36 మన హృదయాల్ని కాపాడుకుందాం

ఈ ఆర్టికల్‌లో . . . *

1-3. (ఎ) యెహోవా సొలొమోనును ఎందుకు ప్రేమించాడు? సొలొమోను ఎలాంటి దీవెనలు పొందాడు? (బి) మనం ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?

సొలొమోను యువకుడిగా ఉన్నప్పుడే ఇశ్రాయేలుకు రాజయ్యాడు. ఆయన పరిపాలన ఆరంభంలో, యెహోవా కలలో కనిపించి, ‘నేను నీకు ఏమి ఇవ్వాలో కోరుకో’ అన్నాడు. దానికి సొలొమోను, ‘నేను చిన్నవాణ్ణి, అనుభవం లేనివాణ్ణి . . . నీ ప్రజలకు న్యాయం తీర్చేలా నీ సేవకునికి లోబడే హృదయం దయచేయి’ అని అడిగాడు. (1 రాజు. 3:5-10, NW) సొలొమోను లోబడే హృదయం కోసం అడగడం ద్వారా ఎంత అణకువ చూపించాడో కదా! అందుకే యెహోవా సొలొమోనును ప్రేమించాడని అర్థమౌతుంది. (2 సమూ. 12:24) ఆ యువకుడైన రాజు ఇచ్చిన జవాబు విని యెహోవా ఎంత సంతోషించాడంటే ‘తెలివి, అవగాహన గల హృదయాన్ని’ ఆయనకు ఇచ్చాడు.—1 రాజు. 3:12, NW.

2 సొలొమోను యెహోవాకు నమ్మకంగా ఉన్నంతకాలం ఎన్నో దీవెనలు పొందాడు. “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామఘనతకు మందిరమును కట్టే” గొప్ప గౌరవం ఆయనకు దక్కింది. (1 రాజు. 8:20) దేవుడు ఇచ్చిన తెలివిని బట్టి ఆయన చాలా ప్రసిద్ధి చెందాడు. అంతేకాదు పవిత్రశక్తి ప్రేరణతో సొలొమోను చెప్పిన మాటలు బైబిల్లోని మూడు పుస్తకాల్లో నమోదు చేయబడ్డాయి. వాటిలో ఒకటి సామెతల పుస్తకం.

3 సామెతల పుస్తకంలో హృదయం అనే పదం 45 సార్లు ప్రస్తావించబడింది. ఉదాహరణకు, సామెతలు 4:23⁠లో మనమిలా చదువుతాం, “అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము.” ఈ వచనంలో “హృదయము” అనే పదం దేన్ని సూచిస్తుంది? దీనికి జవాబు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం. దాంతోపాటు, సాతాను మన హృదయాన్ని పాడుచేయడానికి ఎలా ప్రయత్నిస్తాడు? మన హృదయాన్ని కాపాడుకోవడానికి ఏం చేయవచ్చు? వంటి మరో రెండు ప్రశ్నలకు కూడా జవాబులు తెలుసుకుంటాం. దేవునికి నమ్మకంగా ఉండాలంటే ఆ ప్రాముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలి.

“హృదయము” దేన్ని సూచిస్తుంది?

4-5. (ఎ) కీర్తన 51:6 బట్టి “హృదయము” అంటే ఏంటి? (బి) మనం లోపల ఎలా ఉన్నామనేది ఎందుకు ప్రాముఖ్యమో అర్థంచేసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్పండి.

4 సామెతలు 4:23⁠లో ప్రస్తావించబడిన “హృదయము” అనే పదం మన అంతరంగాన్ని సూచిస్తుంది. (కీర్తన 51:6 చదవండి.) మరో మాటలో చెప్పాలంటే, “హృదయము” అనే పదం మనలో ఉండే ఆలోచనల్ని, భావాల్ని, ఉద్దేశాల్ని, కోరికల్ని సూచిస్తుంది. అంటే మనం పైకి ఎలా ఉన్నామో కాదుగానీ లోపల ఉండే వ్యక్తిత్వాన్ని అది సూచిస్తుంది.

5 మనం లోపల ఎలా ఉన్నామనేది ఎందుకు ప్రాముఖ్యమో అర్థంచేసుకోవడానికి ఈ ఉదాహరణ పరిశీలించండి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మొదటిగా పౌష్టికాహారం తీసుకోవాలి, క్రమంగా వ్యాయామం చేయాలి. అదేవిధంగా మనం ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండాలంటే, మంచి ఆధ్యాత్మిక ఆహారం తీసుకోవాలి అలాగే యెహోవా మీద విశ్వాసం చూపిస్తూ ఉండాలి. నేర్చుకున్నవాటిని పాటించడం ద్వారా, మన నమ్మకాల గురించి ఇతరులతో మాట్లాడడం ద్వారా మన విశ్వాసాన్ని చూపిస్తాం. (రోమా. 10:8-10; యాకో. 2:26) రెండోదిగా, మనం పైకి ఆరోగ్యంగానే ఉన్నామని అనుకోవచ్చు కానీ లోపల ఏదో జబ్బు ఉండవచ్చు. అదేవిధంగా మనం రోజూ చేసే ఆధ్యాత్మిక కార్యకలాపాల్ని బట్టి, మన విశ్వాసం బలంగా ఉందని అనుకోవచ్చు కానీ మనలో తప్పుడు కోరికలు పెరుగుతుండవచ్చు. (1 కొరిం. 10:12; యాకో. 1:14, 15) సాతాను మన ఆలోచనల్ని పాడుచేయడానికి ప్రయత్నిస్తాడని గుర్తుపెట్టుకోవాలి. సాతాను మన ఆలోచనల్ని ఎలా పాడుచేస్తాడు? మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు?

సాతాను మన హృదయాన్ని పాడుచేయడానికి ఎలా ప్రయత్నిస్తాడు?

6. సాతాను లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అతను ఎలా ప్రయత్నిస్తాడు?

6 సాతాను, యెహోవా ప్రమాణాల్ని పట్టించుకోని తిరుగుబాటుదారుడు, స్వార్థపరుడు. మనం కూడా అతనిలాగే తయారవ్వాలని సాతాను కోరుకుంటున్నాడు. తనలా ఆలోచించమని, ప్రవర్తించమని సాతాను మనల్ని బలవంతం చేయలేడు. కాబట్టి వేరే మార్గాల్లో తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఉదాహరణకు, ఇప్పటికే తన గుప్పిట్లో ఉన్న ప్రజలు మన చుట్టూ ఉండేలా చేస్తాడు. (1 యోహా. 5:19) చెడు సహవాసాలు మన ఆలోచనల్ని, ప్రవర్తనను ‘పాడుచేస్తాయని’ మనకు తెలుసు. అయినా, అలాంటివాళ్లతో సమయం గడపాలనే కోరిక మనకు ఏదోక రోజు కలుగుతుందని సాతాను ఆశిస్తాడు. (1 కొరిం. 15:33) అతని ఉచ్చులో సొలొమోను రాజు చిక్కుకున్నాడు. ఆయన చాలామంది అన్యస్త్రీలను పెళ్లిచేసుకున్నాడు. వాళ్లు సొలొమోను మీద ఎంత ప్రభావం చూపించారంటే, మెల్లమెల్లగా యెహోవానుండి ఆయన ‘హృదయమును త్రిప్పివేశారు.’—1 రాజు. 11:3.

సాతాను తన ఆలోచనలతో మన హృదయాన్ని పాడుచేయడానికి ప్రయత్నించినప్పుడు మనం దాన్నెలా కాపాడుకోవచ్చు? (7వ పేరా చూడండి) *

7. సాతాను తన ఆలోచనా విధానాన్ని వ్యాప్తి చేయడానికి వేటిని కూడా ఉపయోగిస్తాడు? వాటి విషయంలో మనమెందుకు జాగ్రత్తగా ఉండాలి?

7 తన ఆలోచనా విధానాన్ని వ్యాప్తిచేయడానికి సాతాను సినిమాల్ని, టీవీ కార్యక్రమాల్ని ఉపయోగిస్తాడు. అలాంటి కథలు వినోదాన్ని ఇవ్వడమే కాకుండా మనమెలా ఆలోచించాలో, భావించాలో, ప్రవర్తించాలో కూడా నేర్పిస్తాయని సాతానుకు తెలుసు. నిజానికి, యేసు బోధిస్తున్నప్పుడు కథల్ని చక్కగా ఉపయోగించాడు. ఉదాహరణకు పొరుగువాడైన సమరయుని కథను, తప్పిపోయిన కుమారుని కథను యేసు చెప్పాడు. (మత్త. 13:34; లూకా 10:29-37; 15:11-32) అయితే, సాతాను ఆలోచనలతో కలుషితమైనవాళ్లు మాత్రం మన ఆలోచనల్ని పాడుచేయడానికి కథల్ని ఉపయోగించే అవకాశం ఉంది. అందుకే మనం వివేచన చూపించాలి. సినిమాలు, టీవీ కార్యక్రమాలు మన ఆలోచనల్ని కలుషితం చేయకుండానే వినోదాన్ని, విద్యను ఇవ్వగలవు. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వినోదాన్ని ఎంచుకునేటప్పుడు, ఈ ప్రశ్నలు వేసుకోవాలి: ‘ఈ సినిమా లేదా టీవీ కార్యక్రమం, శరీర కోరికలకు లొంగిపోవడం తప్పేమీ కాదని నేర్పిస్తోందా?’ (గల. 5:19-21; ఎఫె. 2:1-3) ఏదైన కార్యక్రమం సాతాను ఆలోచనల్ని వ్యాప్తి చేస్తుందని మీరు గుర్తిస్తే ఏం చేయాలి? ఒక అంటువ్యాధికి దూరంగా ఉన్నట్టే, ఆ కార్యక్రమానికి కూడా దూరంగా ఉండండి!

8. సాతాను పిల్లల హృదయాన్ని పాడుచేయకుండా తల్లిదండ్రులు వాళ్లనెలా కాపాడుకోవచ్చు?

8 సాతాను పిల్లల హృదయాల్ని కూడా పాడుచేయడానికి ప్రయత్నిస్తాడు. అతని ప్రయత్నాల నుండి వాళ్లను కాపాడాల్సిన ముఖ్యమైన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. మీ పిల్లల్ని జబ్బుల నుండి కాపాడడానికి మీరు చేయగలిగినదంతా చేస్తారు. అంటే మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారు, మీ పిల్లల ఆరోగ్యాన్ని పాడుచేయగల ప్రతీదాన్ని బయట పడేస్తారు. అదేవిధంగా, సాతాను తన ఆలోచనలతో మీ పిల్లల హృదయాల్ని పాడుచేయగల సినిమాలు, టీవీ కార్యక్రమాలు, వీడియో గేమ్స్‌, వెబ్‌సైట్ల నుండి మీ పిల్లల్ని కాపాడుకోవాలి. వాళ్లను తనకు స్నేహితులుగా చేయాల్సిన బాధ్యత యెహోవా మీకిచ్చాడు. (సామె. 1:8; ఎఫె. 6:1, 4) కాబట్టి బైబిలు ప్రమాణాల ఆధారంగా మీ కుటుంబంలో నియమాలు పెట్టడానికి వెనకాడకండి. మీకు చిన్నపిల్లలు ఉంటే, వాళ్లు వేటిని చూడవచ్చో, వేటిని చూడకూడదో చెప్పండి. అంతేకాదు ఫలానా నియమం ఎందుకు పెట్టారో వాళ్లు అర్థంచేసుకునేలా సహాయం చేయండి. (మత్త. 5:37) మీ పిల్లలు పెద్దవాళ్లౌతుండగా, యెహోవా ప్రమాణాల ప్రకారం తప్పొప్పుల్ని సొంతగా గుర్తించేలా శిక్షణనివ్వండి. (హెబ్రీ. 5:14) అలాగే, పిల్లలు మీరు చెప్పేవాటి నుండి కన్నా మీరు చేసేవాటి నుండే ఎక్కువ నేర్చుకుంటారని గుర్తుపెట్టుకోండి.—ద్వితీ. 6:6, 7; రోమా. 2:21.

9. సాతాను వ్యాప్తి చేస్తున్న ఒక ఆలోచన ఏంటి? అది ఎందుకు ప్రమాదకరమైనది?

9 మనం యెహోవా ఆలోచనల్ని కాకుండా మనుషుల ఆలోచనల్ని నమ్మేలా చేయడం ద్వారా కూడా సాతాను మన హృదయాన్ని పాడుచేయవచ్చు. (కొలొ. 2:8) ఉదాహరణకు, ఎక్కువ డబ్బు సంపాదించడమే జీవితంలో అన్నిటికన్నా ముఖ్యం అనే ఆలోచనను సాతాను వ్యాప్తి చేస్తున్నాడు. అతను వ్యాప్తిచేసే ఆలోచనల్లో ఇది ఒకటి మాత్రమే. ఎక్కువ డబ్బు సంపాదించాలని అనుకునేవాళ్లు ధనవంతులు అవ్వవచ్చు, అవ్వకపోవచ్చు. ఏదేమైనా వాళ్లు ప్రమాదంలో ఉన్నట్లే. ఎందుకు? ఎందుకంటే వాళ్లు డబ్బు సంపాదించడం కోసం తమ ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడానికి, కుటుంబ బాంధవ్యాలను, ఆఖరికి దేవునితో తమకున్న స్నేహాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడతారు. (1 తిమో. 6:10) కానీ, డబ్బు విషయంలో సరైన ఆలోచన కలిగివుండేలా మనకు సహాయం చేస్తున్నందుకు జ్ఞానవంతుడైన మన పరలోక తండ్రికి కృతజ్ఞులమై ఉండవచ్చు.—ప్రసం. 7:12; లూకా 12:15.

మన హృదయాన్ని కాపాడుకోవడానికి ఏం చేయవచ్చు?

సాతాను తన ఆలోచనలతో మీ హృదయాన్ని పాడుచేయకూడదంటే ప్రాచీనకాలంలో ఉన్న కావలివాళ్లు, ద్వారపాలకుల్లాగే మీరు అప్రమత్తంగా ఉంటూ, వెంటనే స్పందించాలి (10-11 పేరాలు చూడండి) *

10-11. (ఎ) మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? (బి) ప్రాచీనకాలాల్లో, కావలివాళ్లు ఏం చేసేవాళ్లు? మన మనస్సాక్షి ఒక కావలివానిగా ఎలా పనిచేయవచ్చు?

10 మన హృదయాన్ని కాపాడుకోవాలంటే ప్రమాదాన్ని పసిగట్టి, వెంటనే స్పందించాలి. సామెతలు 4:23⁠లో “కాపాడుకొనుము” అని అనువదించబడిన పదం, ఒక కావలివాడు చేసే పనిని గుర్తుచేస్తుంది. సొలొమోను రాజు కాలంలో, కావలివాళ్లు కాపలా కాయడానికి నగర గోడలమీద నిలబడేవాళ్లు. ఒకవేళ ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుందని గమనిస్తే వెంటనే హెచ్చరించేవాళ్లు. మనం ఆ సన్నివేశాన్ని మనసులో ఊహించుకున్నప్పుడు, సాతాను మన ఆలోచనల్ని పాడుచేయకుండా ఉండాలంటే ఏం చేయాలో అర్థమౌతుంది.

11 ప్రాచీనకాలాల్లో, కావలివాళ్లు ద్వారపాలకులతో కలిసి పనిచేసేవాళ్లు. (2 సమూ. 18:24-26) శత్రువులు నగర సరిహద్దుల దగ్గరకు వచ్చినప్పుడల్లా, కావలివాళ్లు హెచ్చరించడంతో ద్వారపాలకులు నగర ద్వారాల్ని మూసేసేవాళ్లు. అలా వాళ్లు నగరాన్ని కాపాడేవాళ్లు. (నెహె. 7:1-3) మన బైబిలు శిక్షిత మనస్సాక్షి * కూడా ఒక కావలివానిలా పనిచేయవచ్చు. సాతాను మన హృదయంపై అంటే మన ఆలోచనలపై, భావాలపై, ఉద్దేశాలపై, లేదా కోరికలపై దాడిచేయడానికి ప్రయత్నించినప్పుడు మనస్సాక్షి మనల్ని హెచ్చరిస్తుంది. అలా హెచ్చరించిన ప్రతీసారి, అది చెప్పేది వినాలి, ప్రమాదాన్ని తప్పించుకోవడానికి చేయగలిగినదంతా చేయాలి. 

12-13. తోటివాళ్లు అనైతిక విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు ఏం చేయాలని అనిపించవచ్చు? కానీ మనం ఏం చేయాలి?

12 సాతాను ఆలోచనల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చో ఈ ఉదాహరణ పరిశీలించండి. “లైంగిక పాపాలు, అన్నిరకాల అపవిత్రత, . . . వీటి ప్రస్తావన కూడా మీ మధ్య” రానివ్వకూడదని యెహోవా మనకు చెప్పాడు. (ఎఫె. 5:3) కానీ ఉద్యోగస్థలంలో లేదా స్కూల్లో మీ తోటివాళ్లు అనైతిక విషయాల గురించి మాట్లాడడం మొదలుపెడితే మీరేం చేస్తారు? ‘భక్తిలేని ప్రవర్తనకు దూరంగా ఉండాలని, లోకంలోని చెడు కోరికలను తిరస్కరించాలని’ మనకు తెలుసు. (తీతు 2:12) కావలివానిగా పనిచేసే మన మనస్సాక్షి, రాబోయే ప్రమాదం గురించి మనల్ని హెచ్చరించవచ్చు. (రోమా. 2:15) మరి ఆ హెచ్చరికను వింటామా? బహుశా అలాంటి సమయంలో తోటివాళ్ల మాటలు వినాలని లేదా వాళ్లు చూపిస్తున్న చిత్రాలు చూడాలని మనకు అనిపించవచ్చు. కానీ నగర ద్వారాలు మూసేయాల్సిన సమయం అదే, అంటే ప్రమాదాన్ని తప్పించుకోవడానికి సంభాషణను మార్చాలి లేదా అక్కడి నుండి వెళ్లిపోవాలి.

13 చెడ్డవాటి గురించి ఆలోచించమని లేదా చెడుపనులు చేయమని తోటివాళ్లు ఒత్తిడి చేసినప్పుడు, దాన్ని ఎదిరించడానికి మనకు ధైర్యం అవసరం. మనం చేసే కృషిని యెహోవా చూస్తాడని, సాతాను ఆలోచనల్ని తిప్పికొట్టడానికి కావాల్సిన బలాన్ని, తెలివిని ఇస్తాడని మనం నమ్మవచ్చు. (2 దిన. 16:9; యెష. 40:29; యాకో. 1:5) మన హృదయాన్ని కాపాడుకోవడానికి ఇంకా ఏం చేయవచ్చు?

అప్రమత్తంగా ఉండండి

14-15. (ఎ) మన హృదయాన్ని ఎప్పుడు తెరవాలి? దానికోసం ఏం చేయవచ్చు? (బి) మనం బైబిలు చదువుతున్నప్పుడు ఎక్కువ ప్రయోజనం పొందడానికి సామెతలు 4:20-22 ఎలా సహాయం చేస్తుంది? (“ ఎలా ధ్యానించాలి?” అనే బాక్సు కూడా చూడండి.)

14 మన హృదయాన్ని కాపాడుకోవాలంటే, చెడు ప్రభావాలకు లొంగిపోకుండా హృదయపు ద్వారాలను మూసేయడమే కాదు మంచి విషయాల కోసం వాటిని తెరవాలి కూడా. ప్రాకారాలున్న నగరం గురించిన ఉదాహరణను మళ్లీ ఆలోచించండి. శత్రువులు నగరంలోకి రాకుండా ద్వారపాలకుడు ద్వారాలు మూసేసేవాడు. కానీ ఆహారం, ఇతర పదార్థాలు నగరంలోకి తీసుకొస్తున్నప్పుడు మాత్రం ద్వారాలు తెరిచేవాడు. ఒకవేళ అప్పుడు కూడా అతను ద్వారాలు తెరవకపోతే నగరంలో ప్రజలు ఆకలితో అలమటిస్తారు. అదేవిధంగా, క్రమంగా దేవుని ఆలోచనలు మన మీద ప్రభావం చూపించాలంటే మన హృదయాల్ని తెరిచివుంచాలి.

15 బైబిల్లో యెహోవా ఆలోచనలు ఉంటాయి కాబట్టి దాన్ని చదివిన ప్రతీసారి, ఆయన ఆలోచనలు మన ఆలోచనలమీద, భావాలమీద, పనులమీద ప్రభావం చూపించడానికి అనుమతిస్తాం. మనం బైబిలు చదువుతున్నప్పుడు ఎక్కువ ప్రయోజనం పొందాలంటే ఏం చేయవచ్చు? ప్రార్థన చాలా ముఖ్యం. ఒక సహోదరి ఇలా చెప్తుంది: “నేను బైబిలు చదివే ముందు, యెహోవాకు ప్రార్థన చేసుకుంటాను. బైబిల్లో ఉన్న ‘ఆశ్చర్యమైన సంగతులను’ స్పష్టంగా చూడగలిగేలా సహాయం చేయమని అడుగుతాను.” (కీర్త. 119:18) అయితే మనం చదివిన వాటిగురించి ధ్యానించాలి కూడా. ప్రార్థించినప్పుడు, చదివినప్పుడు, ధ్యానించినప్పుడు దేవుని వాక్యం మన హృదయ లోతుల్లోకి చేరుతుంది. అప్పుడు యెహోవా ఆలోచనల్ని ప్రేమించగలుగుతాం.—సామెతలు 4:20-22 చదవండి; కీర్త. 119:97.

16. JW బ్రాడ్‌కాస్టింగ్‌ చూడడం వల్ల మనమెలాంటి ప్రయోజనం పొందవచ్చు? ఒక ఉదాహరణ చెప్పండి.

16 JW బ్రాడ్‌కాస్టింగ్‌® చూడడం ద్వారా కూడా దేవుని ఆలోచనలు మనమీద ప్రభావం చూపించేలా అనుమతించవచ్చు. ఒక జంట ఇలా చెప్తుంది: “ప్రతీనెల వచ్చే కార్యక్రమాల ద్వారా యెహోవా మా ప్రార్థనలకు జవాబిస్తున్నాడు! మాకు బాధగా, ఒంటరిగా అనిపించినప్పుడు అవి మమ్మల్ని బలపర్చాయి, ప్రోత్సాహాన్నిచ్చాయి. బ్రాడ్‌కాస్టింగ్‌లో వచ్చే పాటల్ని మా ఇంట్లో తరచూ వింటుంటాం. వంట చేస్తున్నప్పుడు, క్లీనింగ్‌ చేస్తున్నప్పుడు లేదా టీ తాగుతున్నప్పుడు మేం వాటిని వింటుంటాం.” ఈ కార్యక్రమాలన్నీ మన హృదయాన్ని కాపాడుకోవడానికి సహాయం చేస్తాయి. అంతేకాదు యెహోవాలా ఎలా ఆలోచించాలో, సాతానులా ఆలోచించాలనే ఒత్తిడిని ఎలా ఎదిరించాలో అవి నేర్పిస్తాయి.

17-18. (ఎ) 1 రాజులు 8:61 ప్రకారం సరైనది చేయడంవల్ల ఏమౌతుంది? (బి) రాజైన హిజ్కియా ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (సి) కీర్తన 139:23, 24⁠లో ఉన్న దావీదు ప్రార్థన ప్రకారం మనం దేనికోసం ప్రార్థించవచ్చు?

17 సరైనది చేయడం వల్ల పొందే ప్రయోజనాల్ని రుచిచూసిన ప్రతీసారి మన విశ్వాసం పెరుగుతుంది. (యాకో. 1:2, 3) మనం తన పిల్లలమని యెహోవా గర్వంగా చెప్పుకునేలా చేశామనే సంతృప్తి మనకుంటుంది. అంతేకాదు ఆయన్ని సంతోషపెట్టాలనే కోరిక ఇంకా బలపడుతుంది. (సామె. 27:11) అప్పుడు మనకు పరీక్ష ఎదురైన ప్రతీసారి, యెహోవాను అర్ధహృదయంతో సేవించట్లేదని చూపిస్తాం. (కీర్త. 119:113) అంతేకాదు ఆయన ఆజ్ఞల్ని పాటిస్తూ, ఆయన ఇష్టాన్ని చేయాలని దృఢంగా నిశ్చయించుకున్న పూర్ణ హృదయంతో యెహోవాను ప్రేమిస్తున్నామని నిరూపిస్తాం.—1 రాజులు 8:61 చదవండి.

18 మనం పొరపాట్లు చేస్తామా? చేస్తాం; ఎందుకంటే మనం అపరిపూర్ణులం. ఒకవేళ మనం విశ్వాసంలో తడబడితే, రాజైన హిజ్కియా ఉదాహరణను గుర్తుచేసుకోవాలి. ఆయన పొరపాట్లు చేశాడు. కానీ తర్వాత పశ్చాత్తాపపడి, చివరివరకు యెహోవాను ‘సంపూర్ణ హృదయంతో’ సేవించాడు. (యెష. 38:3-6, NW; 2 దిన. 29:1, 2; 32:25, 26) కాబట్టి సాతాను ఆలోచనల్ని తిరస్కరించి మన హృదయాల్ని కాపాడుకుందాం. ‘లోబడే హృదయాన్ని’ వృద్ధి చేసుకునేలా సహాయం చేయమని యెహోవాకు ప్రార్థిద్దాం. (1 రాజు. 3:9, NW; కీర్తన 139:23, 24 చదవండి.) అన్నిటికన్నా ముఖ్యంగా మన హృదయాన్ని కాపాడుకుంటే, చివరివరకు యెహోవాకు నమ్మకంగా ఉండగలుగుతాం.

పాట 54 “ఇదే త్రోవ”

^ పేరా 5 మనం యెహోవాకు నమ్మకంగా ఉంటామా లేదా సాతాను ప్రభావానికి లొంగిపోయి దేవునికి దూరమౌతామా? ఈ ప్రశ్నకు జవాబు, మనకెంత తీవ్రమైన పరీక్ష ఎదురైంది అనే దానిమీద కాదుగానీ మన హృదయాన్ని ఎంత బాగా కాపాడుకుంటాం అనే దానిమీదే ఆధారపడివుంటుంది. “హృదయము” అనే పదం దేన్ని సూచిస్తుంది? సాతాను మన హృదయాన్ని పాడుచేయడానికి ఎలా ప్రయత్నిస్తాడు? మన హృదయాన్ని కాపాడుకోవడానికి ఏం చేయవచ్చు? ఈ ప్రాముఖ్యమైన ప్రశ్నలకు ఈ ఆర్టికల్‌లో జవాబులు తెలుసుకుంటాం.

^ పేరా 11 పదాల వివరణ: మన ఆలోచనల్ని, భావాల్ని, పనుల్ని పరిశీలించుకొని, తీర్పుతీర్చుకునే సామర్థ్యాన్ని యెహోవా మనకు ఇచ్చాడు. ఆ సామర్థ్యాన్నే మనస్సాక్షి అని బైబిలు పిలుస్తుంది. (రోమా. 2:15; 9:1) బైబిల్లో ఉన్న యెహోవా ప్రమాణాల ఆధారంగా, బైబిలు శిక్షిత మనస్సాక్షి మన ఆలోచనలు, పనులు మంచివో చెడ్డవో తీర్పుతీరుస్తుంది.

^ పేరా 56 చిత్రాల వివరణ : బాప్తిస్మం తీసుకున్న ఒక సహోదరుడు టీవీ చూస్తున్నప్పుడు అశ్లీలచిత్రాలు కనిపించాయి. ఇప్పుడు ఏం చేయాలో ఆ సహోదరుడు నిర్ణయించుకోవాలి.

^ పేరా 58 చిత్రాల వివరణ : నగరం మీదకు ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ఒక కావలివాడు చూసి ద్వారపాలకులకు చెప్పినప్పుడు, వాళ్లు వెంటనే ద్వారాలు మూసేసి, లోపల నుండి తాళం వేస్తున్నారు.