కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నోవహు, దానియేలు, యోబులా విశ్వాసాన్ని, విధేయతను చూపించండి

నోవహు, దానియేలు, యోబులా విశ్వాసాన్ని, విధేయతను చూపించండి

‘నోవహు, దానియేలు, యోబు తమ నీతిచేత తమ్మును మాత్రమే రక్షించుకుంటారు.’ యెహె. 14:14.

పాటలు: 89, 119

1, 2. (ఎ) నోవహు, దానియేలు, యోబు ఉదాహరణలు పరిశీలించడం ద్వారా ఎందుకు ప్రోత్సాహం పొందుతాం? (బి) యెహెజ్కేలు 14:14లోని మాటల్ని యెహెజ్కేలు ఎలాంటి పరిస్థితుల్లో రాశాడు?

అనారోగ్యంవల్ల, ఆర్థిక ఇబ్బందులవల్ల లేదా హింసవల్ల మీరు కష్టాలు అనుభవిస్తున్నారా? యెహోవా సేవలో సంతోషంగా కొనసాగడం మీకు కొన్నిసార్లు కష్టంగా ఉంటుందా? అలాగైతే నోవహు, దానియేలు, యోబు ఉదాహరణల్ని పరిశీలించడం ద్వారా మీరెంతో ప్రోత్సాహం పొందవచ్చు. వాళ్లు అపరిపూర్ణులు, పైగా నేడు మనకున్నలాంటి సమస్యలతోనే వాళ్లూ పోరాడారు. కొన్నిసార్లు, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఎదుర్కొన్నారు. అయినప్పటికీ యెహోవాకు నమ్మకంగా సేవచేశారు. ఆ విధంగా విశ్వాసం, విధేయత చూపించే విషయంలో ఆదర్శవంతులుగా దేవుని దగ్గర పేరు తెచ్చుకున్నారు.—యెహెజ్కేలు 14:12-14 చదవండి.

2 ఈ ఆర్టికల్‌ ముఖ్య వచనంలోని మాటల్ని యెహెజ్కేలు, యెరూషలేము నాశనమవ్వడానికి కొన్ని సంవత్సరాల ముందు అంటే క్రీ.పూ. 612⁠లో బబులోనులో ఉన్నప్పుడు రాశాడు. * (యెహె. 1:1; 8:1) ఆ కాలంలో కొంతమంది మాత్రమే నోవహు, దానియేలు, యోబులాంటి విశ్వాసాన్ని, విధేయతను చూపించి ఆ నాశనాన్ని తప్పించుకున్నారు. (యెహె. 9:1-5) అలా తప్పించుకున్న వాళ్లలో యిర్మీయా, బారూకు, ఎబెద్మెలెకు, రేకాబీయులు ఉన్నారు.

3. ఈ ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

3 నేడు కూడా యెహోవా దృష్టిలో నీతిమంతులుగా ఉన్నవాళ్లు మాత్రమే అంటే నోవహు, దానియేలు, యోబులాంటి ప్రజలే ఈ దుష్టలోక అంతాన్ని తప్పించుకుంటారు. (ప్రక. 7:9, 14) కాబట్టి యెహోవా ఈ ముగ్గుర్ని నీతిమంతులుగా ఎందుకు దృష్టించాడో తెలుసుకుందాం. మనం ఈ ఆర్టికల్‌లో రెండు ప్రశ్నల్ని పరిశీలిస్తాం: (1) వాళ్లు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? (2) వాళ్ల విశ్వాసాన్ని, విధేయతను మనమెలా అనుకరించవచ్చు?

900 కన్నా ఎక్కువ ఏళ్లు విశ్వాసాన్ని, విధేయతను చూపించిన నోవహు

4, 5. నోవహు ఎదుర్కొన్న కొన్ని సవాళ్లు ఏమిటి? ఆయన చూపించిన సహనం ఎందుకంత ప్రత్యేకమైనది?

4 నోవహు ఎదుర్కొన్న కొన్ని సవాళ్లు ఏమిటి? నోవహు ముత్తాత అయిన హనోకు కాలంనాటికే ప్రజలు చాలా చెడ్డగా తయారయ్యారు. వాళ్లు యెహోవా గురించి “నీచంగా” మాట్లాడారు. (యూదా 14, 15) ఆ కాలంలో భూమ్మీద దౌర్జన్యం అంతకంతకూ పెరిగిపోయింది. నోవహు కాలంలో, ‘భూమి దౌర్జన్యంతో నిండిపోయింది.’ చెడ్డదూతలు భూమ్మీదకు వచ్చి, మనుషుల శరీరాల్ని ధరించుకుని, స్త్రీలను పెళ్లిచేసుకున్నారు. వాళ్లకు పుట్టిన పిల్లలు క్రూరంగా ప్రవర్తించారు, దౌర్జన్యం చేశారు. (ఆది. 6:2-4, 11, 12, NW) కానీ నోవహు మాత్రం వాళ్లందరికి భిన్నంగా ఉన్నాడు. బైబిలు ఇలా చెప్తుంది, ‘నోవహు యెహోవా ఆమోదం పొందాడు.’ అవును, తన చుట్టూ ఉన్న ప్రజల్లా కాకుండా ఆయన సరైనది చేశాడు. ‘నోవహు సత్యదేవునితో నడిచాడు.’—ఆది. 6:8, 9, NW.

5 ఆ మాటల్నిబట్టి నోవహు గురించి ఏమి అర్థమౌతుంది? మొదటిగా, జలప్రళయం రాకముందు నోవహు ఆ దుష్ట ప్రజల మధ్య ఎన్ని సంవత్సరాలు యెహోవాకు నమ్మకంగా సేవచేశాడో ఆలోచించండి. ఏదో 70, 80 సంవత్సరాలు కాదుగానీ దాదాపు 600 సంవత్సరాలు సేవచేశాడు. (ఆది. 7:11) రెండవదిగా, నోవహు కాలంలో సహాయం చేయడానికి, ప్రోత్సహించడానికి మనకున్నట్లు ఒక సంఘం లేదు. కనీసం తోబుట్టువులు కూడా ఆయనకు సహాయం చేసిన దాఖలాలు లేవు. *

6. నోవహు ఎలా గొప్ప ధైర్యం చూపించాడు?

6 కేవలం ఒక మంచి వ్యక్తిగా జీవిస్తే సరిపోతుందని నోవహు అనుకోలేదు. బదులుగా యెహోవా మీద తనకున్న విశ్వాసం గురించి ఇతరులకు ధైర్యంగా చెప్పాడు. బైబిలు ఆయన్ను “నీతిని ప్రకటించిన నోవహు” అని పిలుస్తుంది. (2 పేతు. 2:5) నోవహు గురించి అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు, “విశ్వాసం ద్వారానే అతను ఈ లోకం నాశనానికి తగినదని చూపించాడు.” (హెబ్రీ. 11:7) అయితే, ప్రజలు నోవహును ఖచ్చితంగా ఎగతాళి చేసివుంటారు, ఆయన పనికి అడ్డుపడివుంటారు. కొడతామని కూడా బహుశా బెదిరించివుంటారు. కానీ నోవహు అస్సలు భయపడలేదు. (సామె. 29:25) నోవహు విశ్వాసాన్ని చూపించాడు కాబట్టి ఆయనకు కావాల్సిన ధైర్యాన్ని యెహోవా ఇచ్చాడు. నేడున్న తన నమ్మకమైన సేవకుల విషయంలో కూడా యెహోవా అలానే చేస్తాడు.

7. ఓడ కట్టేటప్పుడు నోవహు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు?

7 నోవహు 500 కన్నా ఎక్కువ సంవత్సరాలు యెహోవాకు నమ్మకంగా సేవచేశాక, దేవుడు ఆయన్ను ఒక ఓడ కట్టమని చెప్పాడు. కొంతమంది ప్రజల్ని, కొన్ని జంతువుల్ని జలప్రళయం నుండి కాపాడడానికి ఆ ఓడ ఉపయోగపడుతుంది. (ఆది. 5:32; 6:14) అంత పెద్ద ఓడ కట్టడం నోవహుకు చాలా కష్టంగా అనిపించివుంటుంది. అంతేకాదు, ప్రజలు తనను ఇంకా ఎక్కువ ఎగతాళి చేస్తారనీ, తన జీవితాన్ని మరింత కష్టతరం చేస్తారనీ ఆయనకు తెలుసు. కానీ నోవహు యెహోవా మీద విశ్వాసం ఉంచి, విధేయత చూపించాడు. అంతేకాదు ‘దేవుడు చెప్పినట్టే చేశాడు.’—ఆది. 6:22, NW.

8. తన కుటుంబ అవసరాలు యెహోవా చూసుకుంటాడనే నమ్మకాన్ని నోవహు ఎలా చూపించాడు?

8 నోవహుకు మరో సవాలు ఎదురైంది. ఆయన తన భార్యాపిల్లల్ని కూడా పోషించాలి. జలప్రళయం రాకముందు, ప్రజలు ఆహారాన్ని పండించడానికి ఎంతో ప్రయాసపడాల్సి వచ్చేది. నోవహు కూడా ఆ కష్టాన్ని అనుభవించాడు. (ఆది. 5:28, 29) కానీ ఆయన తన కుటుంబ అవసరాల గురించి అతిగా చింతించే బదులు, యెహోవా సేవకే మొదటి స్థానమిచ్చాడు. దాదాపు 40 లేదా 50 సంవత్సరాలు నోవహు ఓడ కట్టడంలో బిజీగా ఉన్నప్పటికీ యెహోవా సేవను నిర్లక్ష్యం చేయలేదు. జలప్రళయం తర్వాత కూడా ఆయన మరో 350 సంవత్సరాలు యెహోవా సేవచేశాడు. (ఆది. 9:28) విశ్వాసానికి, విధేయతకు నోవహు ఎంత చక్కని ఆదర్శమో కదా!

9, 10. (ఎ) నోవహు విశ్వాసాన్ని, విధేయతను మనమెలా అనుకరించవచ్చు? (బి) దేవుని నియమాల్ని పాటిస్తే మీరు ఏ నమ్మకంతో ఉండవచ్చు?

9 నోవహు విశ్వాసాన్ని, విధేయతను మనమెలా అనుకరించవచ్చు? దేవుని నీతి సూత్రాలను పాటించడం ద్వారా, సాతాను లోకానికి దూరంగా ఉండడం ద్వారా, యెహోవాకే మొదటిస్థానం ఇవ్వడం ద్వారా మనం నోవహును అనుకరించవచ్చు. (మత్త. 6:33; యోహా. 15:19) అలా ఉంటున్నందుకు లోకం మనల్ని ద్వేషిస్తుంది. ఉదాహరణకు సెక్స్‌, పెళ్లి విషయాల్లో దేవుని నియమాలను పాటిస్తున్నందుకు ప్రజలు మనగురించి మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయవచ్చు. (మలాకీ 3:17, 18 చదవండి.) కానీ నోవహులాగే మనం కూడా మనుషులకు కాకుండా యెహోవాకే భయపడతాం. ఆయన మాత్రమే శాశ్వత జీవితం ఇవ్వగలడని మనకు తెలుసు.—లూకా 12:4, 5.

10 మిమ్మల్ని ఇలా ప్రశ్నించుకోండి, ‘ఇతరులు నన్ను ఎగతాళి చేసినా లేదా విమర్శించినా దేవుని దృష్టిలో సరైనది చేస్తూ ఉంటానా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నా కుటుంబాన్ని యెహోవా పోషిస్తాడనే నమ్మకం నాకుందా?’ నోవహులా యెహోవా మీద విశ్వాసం ఉంచి, విధేయత చూపిస్తే ఆయన మిమ్మల్ని తప్పకుండా చూసుకుంటాడనే నమ్మకంతో ఉండండి.—ఫిలి. 4:6, 7.

చెడ్డ ప్రజలున్న నగరంలో కూడా విశ్వాసాన్ని, విధేయతను చూపించిన దానియేలు

11. దానియేలు, ఆయన ముగ్గురు స్నేహితులు బబులోనులో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? (ప్రారంభ చిత్రం చూడండి.)

11 దానియేలు ఎదుర్కొన్న కొన్ని సవాళ్లు ఏమిటి? దానియేలును బబులోనుకు బందీగా తీసుకెళ్లారు. ఆ నగరమంతా విగ్రహారాధనతో, అభిచారంతో నిండివుండేది. అక్కడి ప్రజలు యూదులను ద్వేషించేవాళ్లు. యెహోవాను, ఆయన ఆరాధకులను ఎగతాళి చేసేవాళ్లు. (కీర్త. 137:1, 3) యెహోవాను ప్రేమించే దానియేలుకు, ఇతర యూదులకు అదెంతో బాధ కలిగించివుంటుంది. దానియేలును ఆయన ముగ్గురు స్నేహితులైన హనన్యా, మిషాయేలు, అజర్యాలను చాలామంది గమనిస్తూ ఉండేవాళ్లు. ఎందుకంటే ఈ నలుగురికి, బబులోను రాజు దగ్గర పనిచేసేందుకు కావాల్సిన శిక్షణ ఇవ్వబోతున్నారు. అందులో భాగంగా వాళ్లు రాజు తినే భోజనాన్ని తినాలి. కానీ ఆ ఆహారంలో యెహోవా తినొద్దని చెప్పిన పదార్థాలు ఉండేవి. కానీ దానియేలు ఆ ఆహారంతో ‘తనను అపవిత్రపరచుకోలేదు.’—దాని. 1:5-8, 14-17.

12. (ఎ) దానియేలు ఎలాంటి చక్కని లక్షణాలు చూపించాడు? (బి) యెహోవా దానియేలును ఎలాంటి వ్యక్తిగా ఎంచాడు?

12 దానియేలుకు మరో సవాలు ఎదురైంది, మొదట్లో అది ఆయనకు పెద్ద సవాలుగా అనిపించి ఉండకపోవచ్చు. అదేమిటంటే, దానియేలుకున్న తెలివితేటలు. వాటివల్ల రాజు ఆయనకు ప్రత్యేకమైన బాధ్యతలు అప్పగించాడు. (దాని. 1:19, 20) కానీ దానియేలు గర్వం చూపించలేదు లేదా తన ఆలోచనే సరైనదని అనుకోలేదు. బదులుగా వినయాన్ని, అణకువను చూపించాడు, తన విజయం వెనుక యెహోవా ఉన్నాడని చెప్పేవాడు. (దాని. 2:30) ఒకసారి ఆలోచించండి: యెహోవా ఆదర్శవంతులైన నోవహు, యోబు పేర్లను ప్రస్తావించేటప్పుడు దానియేలు పేరును కూడా ప్రస్తావించాడు. నిజానికి నోవహు, యోబు చనిపోయేవరకు నమ్మకంగా సేవచేశారు. కానీ దానియేలు ఇంకా యువకుడే. అయినాసరే దేవుడు ఆయన పేరును ప్రస్తావించడం ద్వారా, దానియేలు చివరివరకు యథార్థంగా ఉంటాడనే నమ్మకాన్ని యెహోవా వ్యక్తం చేశాడు. దానియేలు కూడా యెహోవా నమ్మకాన్ని వమ్ము చేయలేదు, ఆయన చివరివరకు దేవునికి నమ్మకంగా సేవచేశాడు. దానియేలుకు దాదాపు 100 సంవత్సరాలు ఉన్నప్పుడు, దేవదూత ఈ మాటల్ని చెప్పాడు, “దానియేలూ, నీవు బహు ప్రియుడవు.”—దాని. 10:11.

13. దానియేలు ఉన్నతాధికారి స్థానాన్ని చేరుకోవడానికి యెహోవా ఎందుకు సహాయం చేసుంటాడు?

13 యెహోవా సహాయంతో దానియేలు ముందుగా బబులోను సామ్రాజ్యంలో, తర్వాత మాదీయ-పారసీక సామ్రాజ్యంలో ఉన్నతాధికారి స్థానానికి చేరుకున్నాడు. (దాని. 1:21; 6:1, 2) బహుశా ఆయన ఆ స్థానానికి చేరుకునేలా యెహోవాయే సహాయం చేసుంటాడు. ఎందుకంటే ఐగుప్తులో యోసేపు, పారసీక దేశంలో ఎస్తేరు, మొర్దెకైలు దేవుని ప్రజలకు సహాయపడినట్లే దానియేలు కూడా తనవాళ్లకు సహాయపడాలని దేవుడు ఉద్దేశించి ఉంటాడు. * (దాని. 2:48) యెహోవా దానియేలును ఉపయోగించుకుని బందీలుగా ఉన్న యెహెజ్కేలుకు, ఇతర యూదులకు సహాయం చేసినప్పుడు వాళ్లెంతో ప్రోత్సాహం పొందివుంటారు.

యథార్థంగా ఉండేవాళ్లను యెహోవా విలువైన వ్యక్తులుగా చూస్తాడు (14, 15 పేరాలు చూడండి)

14, 15. (ఎ) మనం దానియేలు లాంటి పరిస్థితుల్లో ఉన్నామని ఎలా చెప్పవచ్చు? (బి) దానియేలు అమ్మానాన్నల నుండి నేడున్న తల్లిదండ్రులు ఏమి నేర్చుకోవచ్చు?

14 దానియేలు విశ్వాసాన్ని, విధేయతను మనమెలా అనుకరించవచ్చు? మనం జీవిస్తున్న లోకం అనైతికతతో, అబద్ధమతంతో నిండిపోయింది. ప్రజలు ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహాబబులోను గుప్పిట్లో ఉన్నారు. మహాబబులోనును ‘చెడ్డదూతల నివాస స్థలం’ అని బైబిలు పిలుస్తుంది. (ప్రక. 18:2) మనం ఈ లోకంలో పరదేశుల్లా ఉన్నాం. అందుకే, మనం లోకానికి చాలా వేరుగా ఉన్నామని ప్రజలు గమనించి, మనల్ని ఎగతాళి చేయవచ్చు. (మార్కు 13:13) అయినప్పటికీ దానియేలులా మనం యెహోవాకు దగ్గరౌదాం. వినయాన్ని, విశ్వాసాన్ని, విధేయతను చూపిస్తే మనల్ని కూడా యెహోవా విలువైన వ్యక్తులుగా చూస్తాడు.—హగ్గ. 2:7.

15 దానియేలు అమ్మానాన్నల నుండి నేడున్న తల్లిదండ్రులు ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు. దానియేలు యూదాలోని చెడ్డ ప్రజల మధ్య పెరిగాడు. అయినప్పటికీ ఆయన యెహోవా మీద ప్రేమ పెంచుకున్నాడు. ఆ ప్రేమ దానంతటదే పుట్టలేదు. ఆయన అమ్మానాన్నలే యెహోవా గురించి నేర్పించివుంటారు. (సామె. 22:6) అంతేకాదు దానియేలు పేరుకు, ‘దేవుడే నా న్యాయమూర్తి’ అని అర్థం. దీన్నిబట్టి దానియేలు అమ్మానాన్నలకు యెహోవా మీద ఎంత ప్రేమ ఉందో అర్థమౌతుంది. (దాని. 1:6) కాబట్టి తల్లిదండ్రులారా, మీ పిల్లలకు యెహోవా గురించి ఓపిగ్గా, పట్టుదలగా నేర్పించండి. (ఎఫె. 6:4) వాళ్లతో కలిసి ప్రార్థించండి, వాళ్ల కోసం ప్రార్థించండి. మీ పిల్లల హృదయాల్లో బైబిలు సత్యాల్ని నాటడానికి శతవిధాల ప్రయత్నించండి. మీ ప్రయత్నాల్ని యెహోవా తప్పకుండా దీవిస్తాడు.—కీర్త. 37:5.

ఐశ్వర్యంలోనూ, పేదరికంలోనూ విశ్వాసాన్ని, విధేయతను చూపించిన యోబు

16, 17. యోబు తన జీవితంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు?

16 యోబు ఎదుర్కొన్న కొన్ని సవాళ్లు ఏమిటి? యోబు జీవితంలో ఎన్నో పెద్దపెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. మొదట్లో యోబు, ‘తూర్పు దిక్కు జనులందరిలో గొప్పవాడు.’ (యోబు 1:3) అవును, ఆయన చాలా ధనవంతుడు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన గురించి తెలియనివాళ్లే లేరు, అందరూ ఆయన్ని ఎంతో గౌరవించేవాళ్లు. (యోబు 29:7-16) అంతమాత్రాన, తానే అందరికన్నా గొప్పవాడినని లేదా తనకు దేవుని అవసరం లేదని యోబు అనుకోలేదు. అది మనకెలా తెలుసు? ఎలాగంటే, యెహోవా ఆయన్ని “నా సేవకుడైన యోబు” అని పిలిచాడు. అంతేకాదు ఆయన గురించి యెహోవా ఇలా చెప్పాడు, “అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు.”—యోబు 1:8.

17 కానీ ఒక్కసారిగా యోబు జీవితం తలక్రిందులైంది. ఆయన అన్నీ కోల్పోయాడు, ఆ బాధ తట్టుకోలేక చనిపోవాలనుకున్నాడు. కానీ యోబు సమస్యలకు సాతానే కారణమని నేడు మనకు తెలుసు. యోబు కేవలం స్వార్థంతోనే యెహోవాను ఆరాధిస్తున్నాడని సాతాను నిందించాడు. (యోబు 1:9, 10 చదవండి.) ఆ అపనిందను యెహోవా తేలిగ్గా తీసుకోలేదు. సాతాను పచ్చి అబద్ధాల కోరని నిరూపించడానికి దేవుడు ఏమి చేశాడు? యోబుకు తనపట్ల ఉన్న యథార్థతను, నిస్వార్థమైన ప్రేమను నిరూపించుకునే అవకాశాన్ని ఇచ్చాడు.

18. (ఎ) యోబులో మీకు ఏ విషయం నచ్చింది? (బి) యోబుతో వ్యవహరించిన తీరు నుండి యెహోవా గురించి మనమేమి తెలుసుకోవచ్చు?

18 సాతాను కుయుక్తితో యోబుపై పదేపదే దాడిచేశాడు. తనకు వచ్చే కష్టాలన్నీ యెహోవాయే తెస్తున్నాడనుకోవాలని సాతాను పన్నాగం పన్నాడు. (యోబు 1:13-21) ఆ తర్వాత యోబు ముగ్గురు కపట స్నేహితులు ఆయన దగ్గరకు వచ్చి కఠినంగా మాట్లాడారు. యోబు చెడ్డవాడని, అందుకే దేవుడు ఆయన్ని శిక్షిస్తున్నాడని అన్నారు. (యోబు 2:11; 22:1, 5-10) ఇన్ని జరిగినా యోబు యెహోవాకు యథార్థంగా ఉన్నాడు. నిజమే, యోబు కొన్నిసార్లు అనాలోచితంగా మాట్లాడాడు. (యోబు 6:1-3) కానీ తాను పడుతున్న బాధ, వేదన వల్లే యోబు అలా మాట్లాడాడని యెహోవా అర్థంచేసుకున్నాడు. సాతాను తనపై పదేపదే దాడిచేసి, ఎగతాళి చేసినప్పటికీ యోబు మాత్రం యెహోవాను అంటిపెట్టుకుని ఉన్నాడు. సాతాను దాడిచేయడం ఆపేశాక, యెహోవా యోబుపై రెట్టింపు ఆశీర్వాదాలు కుమ్మరించాడు, మరో 140 సంవత్సరాల జీవితాన్ని ప్రసాదించాడు. (యాకో. 5:11) ఆ సంవత్సరాలన్నిటిలో యోబు హృదయపూర్వకంగా యెహోవాను ఆరాధించాడు. అది మనకెలా తెలుసు? ఎలాగంటే, ఈ ఆర్టికల్‌ ముఖ్య వచనం యెహెజ్కేలు 14:14⁠లోని మాటలు యోబు చనిపోయిన వందల సంవత్సరాల తర్వాత రాయబడ్డాయి.

19, 20. (ఎ) యోబు విశ్వాసాన్ని, విధేయతను మనమెలా అనుకరించవచ్చు? (బి) మనం యెహోవాలా ఇతరులపట్ల ఎలా కనికరం చూపించవచ్చు?

19 యోబు విశ్వాసాన్ని, విధేయతను మనమెలా అనుకరించవచ్చు? మన పరిస్థితులు ఎలాంటివైనా యెహోవాయే మన జీవితంలో అందరికన్నా ముఖ్యమైన వ్యక్తిగా ఉండాలి. యెహోవాపై పూర్తి విశ్వాసం ఉంచాలి, ఆయనకు హృదయపూర్వకంగా విధేయత చూపించాలి. నిజానికి, అలాంటి విధేయత చూపించడానికి యోబుకున్న కారణాల కన్నా నేడు మనకు ఎక్కువ కారణాలే ఉన్నాయి. నేడు మనకు ఎన్ని విషయాలు తెలుసో ఆలోచించండి. మనకు సాతాను గురించి, అతని కుయుక్తుల గురించి చాలా విషయాలు తెలుసు. (2 కొరిం. 2:11) దేవుడు బాధల్ని ఎందుకు అనుమతిస్తున్నాడో బైబిలు ద్వారా, ముఖ్యంగా యోబు పుస్తకం ద్వారా తెలుసుకున్నాం. దానియేలు గ్రంథం ద్వారా దేవుని రాజ్యం, యేసుక్రీస్తు పరిపాలించే నిజమైన ప్రభుత్వమని తెలుసుకున్నాం. (దాని. 7:13, 14) ఆ రాజ్యం త్వరలోనే భూమంతటినీ పరిపాలిస్తుందని, మన బాధలన్నిటినీ తీసివేస్తుందని కూడా మనకు తెలుసు.

20 బాధల్లో ఉన్న మన సహోదరులపట్ల కనికరం చూపించాలని కూడా యోబు అనుభవం నుండి నేర్చుకోవచ్చు. బహుశా వాళ్లు అనాలోచితంగా మాట్లాడవచ్చు. (ప్రసం. 7:7) అంతమాత్రాన వాళ్ల గురించి మనం తప్పుగా అనుకోకూడదు లేదా వాళ్లను నిందించకూడదు. బదులుగా వాళ్లను అర్థంచేసుకోవడానికి ప్రయత్నించాలి. అలాచేస్తే ప్రేమ, దయగల మన తండ్రైన యెహోవాను అనుకరించిన వాళ్లమౌతాం.—కీర్త. 103:8.

యెహోవా ‘మిమ్మల్ని బలపరుస్తాడు’

21. నోవహు, దానియేలు, యోబు జీవితాలు 1 పేతురు 5:10­లోని మాటల్ని ఎలా గుర్తుచేస్తాయి?

21 నోవహు, దానియేలు, యోబు వేర్వేరు కాలాల్లో, వేర్వేరు పరిస్థితుల్లో జీవించారు. అయినప్పటికీ వాళ్లందరూ తమకు ఎదురైన సవాళ్లను నమ్మకంగా సహించారు. వాళ్ల జీవితాలు, అపొస్తలుడైన పేతురు చెప్పిన మాటల్ని గుర్తుచేస్తాయి, “మీరు కొంతకాలం బాధలు అనుభవించిన తర్వాత, . . . దేవుడు మీకు ఇచ్చే శిక్షణను ముగిస్తాడు. ఆయన అన్నివిధాలా అపారదయను ప్రసాదించే దేవుడు. ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, గట్టి పునాది మీద మిమ్మల్ని నిలబెడతాడు.”—1 పేతు. 5:10.

22. తర్వాతి ఆర్టికల్‌లో ఏమి తెలుసుకుంటాం?

22 మొదటి పేతురు 5:10⁠లోని మాటలు నేడున్న దేవుని ప్రజల విషయంలో కూడా నిజమౌతున్నాయి. తన సేవకులు స్థిరంగా, బలంగా ఉండేలా సహాయం చేస్తానని యెహోవా మనకు అభయాన్నిస్తున్నాడు. ఆయన మనందర్నీ బలపర్చాలని కోరుకుంటాం. అంతేకాదు మనం స్థిరంగా ఉంటూ, ఆయనకు నమ్మకంగా ఉండాలని కోరుకుంటాం. అందుకే నోవహు, దానియేలు, యోబు విశ్వాసాన్ని, విధేయతను అనుకరించాలనుకుంటాం. ఈ ముగ్గురికి యెహోవా గురించి నిజంగా తెలుసు కాబట్టే నమ్మకంగా ఉండగలిగారని తర్వాతి ఆర్టికల్‌లో తెలుసుకుంటాం. నిజానికి, యెహోవా తమ నుండి కోరుకునే ప్రతీది వాళ్లు ‘అర్థంచేసుకోగలిగారు.’ (సామె. 28:5, NW) మనం కూడా అదే చేయాలి.

^ పేరా 2 యెహెజ్కేలు క్రీ.పూ. 617⁠లో బబులోనుకు బందీగా వెళ్లాడు. యెహెజ్కేలు 8:1–19:14 వచనాల్లోని మాటల్ని క్రీ.పూ. 612⁠లో అంటే ఆయన బబులోనుకు వెళ్లిన ‘ఆరవ సంవత్సరంలో’ రాశాడు.

^ పేరా 5 నోవహు తండ్రైన లెమెకు యెహోవా మీద విశ్వాసం ఉంచాడు, కానీ జలప్రళయం రావడానికి దాదాపు ఐదు సంవత్సరాల ముందు ఆయన చనిపోయాడు. ఒకవేళ నోవహు తల్లి, ఆయన తోబుట్టువులు జలప్రళయం వచ్చిన సమయానికి బ్రతికే ఉన్నా, వాళ్లు దాన్ని తప్పించుకోలేదు.

^ పేరా 13 హనన్యా, మిషాయేలు, అజర్యా విషయంలో కూడా యెహోవా ఉద్దేశం అదే అయ్యుంటుంది.—దాని. 2:49.