అధ్యయన ఆర్టికల్ 8
కష్టాలు ఎదురైనా ఆనందాన్ని ఎలా కాపాడుకోవచ్చు?
“నా సహోదరులారా, మీకు రకరకాల కష్టాలు ఎదురైనప్పుడు సంతోషించండి.”—యాకో. 1:2.
పాట 111 మన సంతోషానికి కారణాలు
ఈ ఆర్టికల్‌లో . . . *
1-2. మత్తయి 5:11 ప్రకారం, కష్టాలు ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి?
తన అనుచరులు నిజంగా సంతోషంగా ఉంటారని యేసు మాటిచ్చాడు. అయితే, తనను ప్రేమించే వాళ్లు కష్టాల్ని ఎదుర్కొంటారని కూడా ఆయన చెప్పాడు. (మత్త. 10:22, 23; లూకా 6:20-23) క్రీస్తు శిష్యులుగా ఉన్నందుకు మనం ఆనందిస్తాం. కానీ కుటుంబ సభ్యులు వ్యతిరేకించినప్పుడు, ప్రభుత్వం హింసించినప్పుడు, తోటి ఉద్యోగులు లేదా తోటి విద్యార్థులు తప్పు చేయమని ఒత్తిడి చేసినప్పుడు మనకెలా అనిపిస్తుంది? అలాంటి విషయాల గురించి ఆలోచించినప్పుడు మనకు ఆందోళనగా అనిపించవచ్చు.
2 సాధారణంగా ప్రజలు హింస ఎదురైనప్పుడు ఆనందించరు. కానీ హింస ఎదురైనా ఆనందించాలని దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఉదాహరణకు, కష్టాలు వచ్చినప్పుడు మనం ఉక్కిరిబిక్కిరి అయ్యే బదులు ఆనందించాలని యాకోబు రాశాడు. (యాకో. 1:2, 12) హింసలు వచ్చినప్పుడు ఆనందించాలని యేసు కూడా చెప్పాడు. (మత్తయి 5:11 చదవండి.) కష్టాలు ఎదురైనా మనం ఆనందాన్ని ఎలా కాపాడుకోవచ్చు? మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకు యాకోబు రాసిన ఉత్తరాన్ని పరిశీలించడం ద్వారా మనం ఎంతో నేర్చుకోవచ్చు. ముందుగా, ఆ క్రైస్తవులు ఎదుర్కొన్న కష్టాల్ని పరిశీలిద్దాం.
మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ఏ కష్టాల్ని ఎదుర్కొన్నారు?
3. యాకోబు యేసు శిష్యుడిగా మారిన కొంతకాలానికి ఏం జరిగింది?
3 యేసు తమ్ముడైన యాకోబు శిష్యుడిగా మారాడు. ఆయన అలా మారిన కొంతకాలానికే యెరూషలేములోని క్రైస్తవులు హింసను ఎదుర్కొన్నారు. (అపొ. 1:14; 5:17, 18) అంతేకాదు శిష్యుడైన స్తెఫను చంపబడిన తర్వాత, చాలామంది క్రైస్తవులు యెరూషలేమును వదిలేసి “యూదయ, సమరయ అంతటా చెదిరిపోయారు.” చివరికి వాళ్లు దూరాన ఉన్న కుప్ర, అంతియొకయ వరకు వెళ్లిపోయారు. (అపొ. 7:58–8:1; 11:19) నిజంగా శిష్యులు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు! అయినప్పటికీ, వాళ్లు వెళ్లిన ప్రతీచోట ఉత్సాహంగా మంచివార్త ప్రకటించారు. దానివల్ల, రోమా సామ్రాజ్యమంతటా సంఘాలు ఏర్పడ్డాయి. (1 పేతు. 1:1) కానీ ఆ తర్వాత వాళ్లు ఇంకా తీవ్రమైన కష్టాలు ఎదుర్కొన్నారు.
4. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ఇంకా ఏ కష్టాల్ని ఎదుర్కొన్నారు?
4 మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు రకరకాల కష్టాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉదాహరణకు, దాదాపు క్రీ.శ. 50లో యూదులందరూ రోమును విడిచివెళ్లాలని రోమా చక్రవర్తి అయిన క్లౌదియ ఆజ్ఞాపించాడు. దాంతో, క్రైస్తవులుగా మారిన యూదులు తమ ఇళ్లను వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్లిపోవాల్సి వచ్చింది. (అపొ. 18:1-3) తోటి క్రైస్తవులు అందరిముందు నిందల పాలయ్యారని, చెరసాలలో ఉన్నారని, దోచుకోబడ్డారని అపొస్తలుడైన పౌలు దాదాపు క్రీ.శ. 61లో రాశాడు. (హెబ్రీ. 10:32-34) వాటికితోడు క్రైస్తవులు మిగతా ప్రజల్లాగే పేదరికాన్ని, అనారోగ్యాన్ని కూడా అనుభవించాల్సి వచ్చింది.—రోమా. 15:26; ఫిలి. 2:25-27.
5. ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలకు జవాబులు చూస్తాం?
5 యాకోబు తన ఉత్తరాన్ని క్రీ.శ. 62కు ముందు రాశాడు. కాబట్టి తన సహోదర సహోదరీలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఆయనకు బాగా తెలుసు. కష్టాలు ఎదురైనా ఆనందంగా ఉండడానికి సహాయం చేసే సలహాల్ని ఆ క్రైస్తవులకు రాసేలా యెహోవా యాకోబును ప్రేరేపించాడు. యాకోబు రాసిన ఉత్తరాన్ని పరిశీలిస్తూ ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం: యాకోబు ఏ ఆనందం గురించి రాశాడు? వేటివల్ల ఒక క్రైస్తవుడు ఆ ఆనందాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది? కష్టాలు ఎదురైనా ఆనందాన్ని కాపాడుకోవడానికి తెలివి, విశ్వాసం, ధైర్యం మనకెలా సహాయం చేస్తాయి?
ఒక క్రైస్తవుడికి ఏది ఆనందాన్ని ఇస్తుంది?
6. లూకా 6:22, 23 ప్రకారం, కష్టాలు ఎదురైనప్పుడు ఒక క్రైస్తవుడు ఎందుకు సంతోషించవచ్చు?
6 మంచి ఆరోగ్యం, ఆస్తిపాస్తులు, ప్రశాంతమైన కుటుంబ జీవితం ఉంటేనే ఆనందంగా ఉంటామని ప్రజలు అనుకోవచ్చు. కానీ యాకోబు రాసింది అలాంటి ఆనందం గురించి కాదు. యాకోబు చెప్పిన ఆనందం, దేవుని పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్లో ఒకటి. పైగా అది ఒకవ్యక్తి పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. (గల. 5:22) యెహోవాను సంతోషపెడుతున్నానని, యేసును అనుకరిస్తున్నానని తెలుసుకోవడం వల్ల ఒక క్రైస్తవుని హృదయలోతుల్లో కలిగే సంతోషమే ఆనందం. (లూకా 6:22, 23 చదవండి; కొలొ. 1:10, 11) లాంతరు లోపల వెలుగుతున్న దీపం లాగే, ఈ ఆనందం కూడా క్రైస్తవుని హృదయం లోపల వెలుగుతూ ఉంటుంది. ఆరోగ్యం పాడైనప్పుడు, డబ్బు లేనప్పుడు దాని వెలుగు తగ్గిపోదు. కుటుంబ సభ్యులు, ఇతరులు ఎగతాళి చేసినప్పుడు లేదా వ్యతిరేకించినప్పుడు అది ఆరిపోదు. బదులుగా, దాన్ని ఆర్పేయడానికి వ్యతిరేకులు ప్రయత్నించిన ప్రతీసారి అది ఇంకా ఎక్కువగా వెలుగుతూ ఉంటుంది. మన విశ్వాసం కారణంగా ఎదుర్కొనే కష్టాలు, మనం క్రీస్తుకు నిజమైన శిష్యులమని రుజువు చేస్తాయి. (మత్త. 10:22; 24:9; యోహా. 15:20) మంచి కారణంతోనే యాకోబు ఇలా రాశాడు: “నా సహోదరులారా, మీకు రకరకాల కష్టాలు ఎదురైనప్పుడు సంతోషించండి.”—యాకో. 1:2.
7-8. కష్టాలు ఎదురైనప్పుడు మన విశ్వాసం ఎలా బలపడుతుంది?
7 క్రైస్తవులు తీవ్రమైన కష్టాల్లో కూడా సంతోషంగా ఉంటారు. దానికి గల మరో కారణాన్ని యాకోబు ఇలా తెలియజేశాడు: “ఈ విధంగా పరీక్షించబడిన మీ విశ్వాసం మీలో సహనాన్ని పుట్టిస్తుంది.” (యాకో. 1:3) స్టీల్‌తో కత్తిని తయారు చేసేటప్పుడు దాన్ని మంటల్లో కాలుస్తారు. కష్టాల్ని ఆ మంటతో పోల్చవచ్చు. ఆ కత్తిని మంటల్లో కాల్చి, చల్లార్చినప్పుడు అది ఇంకా గట్టిగా తయారౌతుంది. అదేవిధంగా మనం కష్టాల్ని సహించినప్పుడు మన విశ్వాసం బలంగా తయారౌతుంది. అందుకే యాకోబు ఇలా రాశాడు: “సహనం తన పనిని పూర్తిచేయనివ్వండి. అప్పుడు మీరు అన్ని విషయాల్లో సంపూర్ణులుగా, నిర్దోషులుగా . . . ఉండగలుగుతారు.” (యాకో. 1:4) కష్టాల వల్ల మన విశ్వాసం బలపడుతుందని గ్రహించినప్పుడు, మనం వాటిని ఆనందంగా సహించగలుగుతాం.
8 మన ఆనందాన్ని కోల్పోయేలా చేసే కొన్ని సమస్యల్ని కూడా యాకోబు తన ఉత్తరంలో రాశాడు. అవేంటి? మనం వాటిని ఎలా అధిగమించవచ్చు?
ఆనందాన్ని కోల్పోకుండా ఉండడానికి మనం ఏం చేయాలి?
9. మనకు తెలివి ఎందుకు అవసరం?
9 సమస్య: ఏం చేయాలో తెలియకపోవడం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు యెహోవాను సంతోషపెట్టే, సహోదర సహోదరీలకు మేలు చేసే, మన యథార్థతను కాపాడుకోవడానికి సహాయం చేసే తెలివైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటాం. (యిర్మీ. 10:23) ఏం చేయాలో, మనల్ని వ్యతిరేకించే వాళ్లతో ఎలా మాట్లాడాలో తెలియాలంటే మనకు తెలివి అవసరం. ఏం చేయాలో తెలియకపోతే మనం నిరుత్సాహపడి, ఆనందాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
10. తెలివి కోసం మనం ఏం చేయాలని యాకోబు 1:5 చెప్తుంది?
యాకోబు 1:5 చదవండి.) యెహోవా మన ప్రార్థనలకు వెంటనే జవాబు ఇవ్వలేదని అనిపించినప్పుడు మనం ఏం చేయాలి? మనం “అడుగుతూ ఉండాలి” అని యాకోబు చెప్తున్నాడు. తెలివి కోసం పదేపదే అడిగినప్పుడు యెహోవా విసుక్కోడు, మనమీద కోప్పడడు. కష్టాల్ని సహించడానికి కావాల్సిన తెలివిని ఇవ్వమని అడిగినప్పుడు మన పరలోక తండ్రి “ఉదారంగా ఇస్తాడు.” (కీర్త. 25:12, 13) ఆయన మన కష్టాల్ని చూస్తాడు, మనం బాధపడుతుంటే ఆయన కూడా బాధపడతాడు, మనకు సహాయం చేయాలని కోరుకుంటాడు. అవును, మనం ఆనందించడానికి ఇదొక కారణం! ఇంతకీ యెహోవా మనకు తెలివిని ఎలా ఇస్తాడు?
10 పరిష్కారం: తెలివి కోసం యెహోవాను అడగండి. కష్టాల్ని ఆనందంగా సహించాలంటే, ముందుగా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సిన తెలివిని ఇవ్వమని యెహోవాను అడగాలి. (11. తెలివిని సంపాదించుకోవాలంటే మనం ఇంకా ఏం చేయాలి?
11 యెహోవా తన వాక్యమైన బైబిలు ద్వారా మనకు తెలివిని ఇస్తాడు. (సామె. 2:6) తెలివిని సంపాదించుకోవాలంటే మనం బైబిల్ని, బైబిలు ప్రచురణల్ని అధ్యయనం చేయాలి. అయితే, కేవలం జ్ఞానం సంపాదించుకుంటే సరిపోదు. దేవుడు ఇస్తున్న సలహాల్ని మన జీవితంలో పాటించాలి. యాకోబు ఇలా రాశాడు: “వాక్యాన్ని వినేవాళ్లుగా మాత్రమే ఉండకండి, దాన్ని పాటించేవాళ్లుగా ఉండండి.” (యాకో. 1:22) మనం దేవుని సలహాలు పాటించినప్పుడు మరింత శాంతిగా ఉంటాం, అర్థం చేసుకునే వాళ్లుగా ఉంటాం, కరుణ చూపిస్తాం. (యాకో. 3:17) ఎలాంటి కష్టం ఎదురైనా మన ఆనందాన్ని కోల్పోకుండా ఉండడానికి ఆ లక్షణాలు సహాయం చేస్తాయి.
12. బైబిల్ని ఎక్కువగా తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
12 దేవుని వాక్యం అద్దంలా పనిచేస్తుంది, అంటే మనం ఏ మార్పులు చేసుకోవాలో గుర్తించడానికి, వాటిని సరిచేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. (యాకో. 1:23-25) ఉదాహరణకు, దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత మన కోపాన్ని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉందని మనం గుర్తించవచ్చు. మనకు కోపం తెప్పించే ప్రజలతో లేదా సమస్యలతో వ్యవహరిస్తున్నప్పుడు యెహోవా సహాయంతో సౌమ్యంగా ఉండడం నేర్చుకోవచ్చు. సౌమ్యంగా ఉన్నప్పుడు మనకు ఎదురయ్యే ఒత్తిళ్లతో ఇంకా బాగా వ్యవహరించగలుగుతాం, మరింత స్పష్టంగా ఆలోచించగలుగుతాం, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. (యాకో. 3:13) బైబిల్ని ఎక్కువగా తెలుసుకోవడం ఎంత ప్రాముఖ్యమో కదా!
13. బైబిల్లో ఉన్న ఉదాహరణల్ని మనం ఎందుకు పరిశీలించాలి?
13 కొన్నిసార్లు ఏదైనా పొరపాటు చేసిన తర్వాతే మనం పాఠాలు నేర్చుకుంటాం. అయితే, నేర్చుకోవడానికి అలాంటి కష్టమైన పద్ధతి కాకుండా సులువైన పద్ధతి కూడా ఉంది. అదేంటంటే, వేరేవాళ్లు చేసిన మంచి పనుల్ని, పొరపాట్లను పరిశీలించి వాటినుండి నేర్చుకోవడం. అందుకే బైబిల్లో ఉన్న అబ్రాహాము, రాహాబు, యోబు, ఏలీయా వంటివాళ్ల ఉదాహరణల్ని పరిశీలించమని యాకోబు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. (యాకో. 2:21-26; 5:10, 11, 17, 18) వాళ్లు తమ ఆనందాన్ని కోల్పోయేలా చేసే కష్టాల్ని సహించారు. యెహోవా సహాయంతో మనం కూడా వాటిని సహించగలమని ఆ ఉదాహరణలు చూపిస్తున్నాయి.
14-15. మనం సందేహాల్ని ఎందుకు తీసేసుకోవాలి?
14 సమస్య: తీరని సందేహాలు. అప్పుడప్పుడు బైబిలు చెప్తున్న కొన్ని విషయాల్ని అర్థం చేసుకోవడం మనకు కష్టంగా ఉండవచ్చు. లేదా మనం కోరుకున్నట్టుగా యెహోవా మన ప్రార్థనలకు జవాబు ఇవ్వకపోవచ్చు. అప్పుడు మన మనసులో సందేహాలు మొదలయ్యే అవకాశం ఉంది. ఆ సందేహాల్ని అలాగే వదిలేస్తే అవి మన విశ్వాసాన్ని బలహీనపరుస్తాయి, యెహోవాతో మనకున్న సంబంధాన్ని పాడుచేస్తాయి. (యాకో. 1:7, 8) అంతేకాదు భవిష్యత్తు విషయంలో మనకున్న నిరీక్షణను కోల్పోయేలా కూడా అవి చేయగలవు.
15 భవిష్యత్తు విషయంలో మనకున్న నిరీక్షణను అపొస్తలుడైన పౌలు ఒక లంగరుతో పోల్చాడు. (హెబ్రీ. 6:19) తుఫాను సమయంలో ఓడ కొట్టుకుపోకుండా, రాళ్లకు గుద్దుకోకుండా లంగరు కాపాడుతుంది. అయితే అలా కాపాడాలంటే, ఓడకు-లంగరుకు మధ్య ఉన్న గొలుసు బలంగా ఉండాలి. తుప్పు ఆ గొలుసును తినేసినట్టే, తీరని సందేహాలు మన విశ్వాసాన్ని బలహీనపరుస్తాయి. వ్యతిరేకత ఎదురైనప్పుడు, సందేహాలు ఉన్న వ్యక్తి యెహోవా తన వాగ్దానాల్ని నెరవేరుస్తాడనే విశ్వాసాన్ని కోల్పోతాడు. విశ్వాసాన్ని కోల్పోతే నిరీక్షణను కూడా కోల్పోతాడు. యాకోబు చెప్తున్నట్టు, “సందేహించే వ్యక్తి, గాలిచేత రేపబడి ఎగసిపడే సముద్ర కెరటం లాంటివాడు.” (యాకో. 1:6) అలాంటి వ్యక్తి ఏమాత్రం ఆనందంగా ఉండలేడు.
16. సందేహాలు ఉంటే మనం ఏం చేయాలి?
16 పరిష్కారం: సందేహాల్ని తీసేసుకోండి; మీ విశ్వాసాన్ని బలపర్చుకోండి. ఎటూ తేల్చుకోలేని వాళ్లుగా ఉండకండి. ఏలీయా ప్రవక్త రోజుల్లో యెహోవా ప్రజలు ఎటూ తేల్చుకోలేకపోయారు. ఏలీయా వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు ఎంతకాలం రెండు అభిప్రాయాల మధ్య ఊగిసలాడుతుంటారు? యెహోవా సత్యదేవుడైతే ఆయన్ని అనుసరించండి; ఒకవేళ బయలు సత్యదేవుడైతే అతన్ని అనుసరించండి!” (1 రాజు. 18:21) నేడు మనం కూడా వెంటనే చర్య తీసుకోవాలి. యెహోవాయే దేవుడని, బైబిలు ఆయన వాక్యమని, యెహోవాసాక్షులు ఆయన ప్రజలని నమ్మకం కుదుర్చుకోవడానికి కొంత పరిశోధన చేయాలి. (1 థెస్స. 5:21) అవన్నీ చేస్తే మన సందేహాలు పోతాయి, మన విశ్వాసం బలపడుతుంది. సందేహాలు తీసేసుకోవడానికి సహాయం అవసరమైతే, మనం సంఘ పెద్దల్ని అడగవచ్చు. యెహోవా సేవలో ఆనందాన్ని కాపాడుకోవాలంటే మనం వెంటనే చర్య తీసుకోవాలి!
17. మనం ధైర్యం కోల్పోతే ఏం జరుగుతుంది?
17 సమస్య: నిరుత్సాహం. దేవుని వాక్యం ఇలా చెప్తుంది: “కష్టం వచ్చిన రోజున నిరుత్సాహపడితే నీ శక్తి తగ్గిపోతుంది.” (సామె. 24:10) “నిరుత్సాహపడితే” అని అనువదించబడిన హీబ్రూ పదానికి “ధైర్యం కోల్పోతే” అనే అర్థం కూడా ఉంది. ఒకవేళ మీరు ధైర్యం కోల్పోతే, మీ ఆనందాన్ని త్వరగా పోగొట్టుకుంటారు.
18. సహించడం అంటే ఏంటి?
18 పరిష్కారం: సహించడానికి కావల్సిన ధైర్యం కోసం యెహోవా మీద ఆధారపడండి. కష్టాల్ని సహించాలంటే మనకు ధైర్యం అవసరం. (యాకో. 5:11) “సహనం” కోసం యాకోబు ఉపయోగించిన పదం, ఒక వ్యక్తి తన స్థానంలో స్థిరంగా నిలబడి ఉండడాన్ని సూచిస్తుంది. శత్రువుతో పోరాడుతున్నప్పుడు అతను ఎంత తీవ్రంగా దాడిచేస్తున్నా, ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గకుండా స్థిరంగా, ధైర్యంగా నిలబడే సైనికుడిని అది మనకు గుర్తుచేస్తుంది.
19. అపొస్తలుడైన పౌలు ఉంచిన ఆదర్శం నుండి మనమేం నేర్చుకోవచ్చు?
19 ధైర్యం, సహనం చూపించే విషయంలో అపొస్తలుడైన పౌలు మంచి ఆదర్శం ఉంచాడు. ఆయనకు కొన్నిసార్లు బలహీనంగా ఉన్నట్టు అనిపించింది. కానీ, ఆయన బలం కోసం యెహోవా మీద ఆధారపడ్డాడు కాబట్టి కష్టాల్ని సహించగలిగాడు. (2 కొరిం. 12:8-10; ఫిలి. 4:13) మనకు యెహోవా సహాయం అవసరమని వినయంగా గుర్తిస్తే బలాన్ని, ధైర్యాన్ని పొందుతాం.—యాకో. 4:10.
దేవునికి దగ్గరవ్వండి, మీ ఆనందాన్ని కాపాడుకోండి
20-21. మీరు ఏ నమ్మకంతో ఉండవచ్చు?
20 మనం అనుభవిస్తున్న కష్టాలు యెహోవా నుండి వచ్చిన శిక్ష కాదని ఖచ్చితంగా నమ్మవచ్చు. యాకోబు ఇలా రాశాడు: “కష్టం వచ్చినప్పుడు ఎవ్వరూ, ‘దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు’ అని అనకూడదు. ఎందుకంటే, చెడ్డవాటితో ఎవ్వరూ దేవుణ్ణి పరీక్షించలేరు, దేవుడు కూడా అలా ఎవ్వర్నీ పరీక్షించడు.” (యాకో. 1:13) ఆ వాస్తవాన్ని నమ్మినప్పుడు, మన ప్రేమగల పరలోక తండ్రికి మరింత దగ్గరౌతాం.—యాకో. 4:8.
21 యెహోవా “మారిపోడు.” (యాకో. 1:17) మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకు కష్టాలు ఎదురైనప్పుడు, ఆయన వాళ్లకు మద్దతిచ్చాడు. నేడు కూడా మనలో ప్రతీ ఒక్కరికీ ఆయన సహాయం చేస్తాడు. తెలివిని, విశ్వాసాన్ని, ధైర్యాన్ని సంపాదించుకోవడానికి సహాయం చేయమని యెహోవాను పట్టుదలగా అడగండి. ఆయన మీ ప్రార్థనలు వింటాడు. కష్టాలు ఎదురైనా, ఆనందాన్ని కాపాడుకోవడానికి యెహోవా మీకు సహాయం చేస్తాడనే నమ్మకంతో మీరు ఉండవచ్చు!
పాట 128 అంతం వరకు సహిద్దాం
^ పేరా 5 కష్టాలు ఎదురైనప్పుడు ఏం చేయాలో తెలియజేసే ఎన్నో సలహాలు యాకోబు రాసిన ఉత్తరంలో ఉన్నాయి. యాకోబు ఇస్తున్న కొన్ని సలహాల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. యెహోవా సేవలో ఆనందాన్ని కోల్పోకుండా కష్టాల్ని సహించడానికి ఆ సలహాలు మనకు సహాయం చేస్తాయి.
^ పేరా 59 చిత్రాల వివరణ: పోలీసులు ఒక సహోదరుని ఇంటికి వచ్చి ఆయన్ని అరెస్టు చేశారు. వాళ్లు ఆయన్ని తీసుకెళ్తుంటే ఆయన భార్య, కూతురు చూస్తున్నారు. ఆ సహోదరుడు జైల్లో ఉన్నప్పుడు తోటి విశ్వాసులు ఆ సహోదరితో, ఆమె కూతురితో కలిసి యెహోవాను ఆరాధిస్తున్నారు. కష్టాన్ని సహించడానికి కావల్సిన బలాన్ని ఇవ్వమని ఆ తల్లి, కూతురు యెహోవాను పట్టుదలగా అడుగుతున్నారు. యెహోవా వాళ్లకు మనశ్శాంతిని, ధైర్యాన్ని ఇచ్చాడు. దానివల్ల వాళ్ల విశ్వాసం బలపడింది, ఆ కష్టాన్ని ఆనందంగా సహించగలుగుతున్నారు.