కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 5

“ప్రతీ పురుషునికి శిరస్సు క్రీస్తు”

“ప్రతీ పురుషునికి శిరస్సు క్రీస్తు”

“ప్రతీ పురుషునికి శిరస్సు క్రీస్తు.”—1 కొరిం. 11:3.

పాట 12 యెహోవా గొప్ప దేవుడు

ఈ ఆర్టికల్‌లో . . . *

1. పురుషుడు భార్యాపిల్లలతో వ్యవహరించే తీరుపై ఏ విషయాలు ప్రభావం చూపించవచ్చు?

శిరస్సత్వం గురించి మీ అభిప్రాయం ఏంటి? కొంతమంది పురుషులు తమ భార్యాపిల్లలతో వ్యవహరించే తీరుపై వాళ్ల సంస్కృతి, సాంప్రదాయం, కుటుంబ నేపథ్యం వంటివాటి ప్రభావం ఉంటుంది. యూరప్‌లో ఉంటున్న యనీట అనే సహోదరి ఏమంటుందో గమనించండి: “స్త్రీలు పురుషుల కన్నా తక్కువవాళ్లు; వాళ్లను బానిసల్లా చూడాలి అనే అభిప్రాయం మా ప్రాంతంలో బలంగా పాతుకుపోయింది.” అమెరికాలో ఉంటున్న లూక్‌ అనే సహోదరుడు ఇలా చెప్తున్నాడు: “స్త్రీలు చెప్పేదాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, వాళ్ల అభిప్రాయం అంత ముఖ్యం కాదని కొంతమంది తండ్రులు తమ కొడుకులకు నేర్పిస్తారు.” కానీ పురుషులు భార్యలతో అలా ఉండాలని యెహోవా చెప్పట్లేదు. (మార్కు 7:13 తో పోల్చండి.) ఒక పురుషుడు మంచి కుటుంబ శిరస్సుగా ఉండడం ఎలా నేర్చుకోవచ్చు?

2. ఒక కుటుంబ శిరస్సు ఏం తెలుసుకోవాలి? ఎందుకు?

2 పురుషుడు ఒక మంచి కుటుంబ శిరస్సుగా ఉండాలంటే, యెహోవా తన నుండి ఏం కోరుతున్నాడో ఆయన అర్థం చేసుకోవాలి. అంతేకాదు శిరస్సత్వాన్ని యెహోవా ఎందుకు ఏర్పాటు చేశాడో; యెహోవాను, యేసును తాను ఎలా అనుకరించవచ్చో ఆయన తెలుసుకోవాలి. ఒక పురుషుడు ఆ విషయాలు తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? ఎందుకంటే యెహోవా పురుషులకు కొంత అధికారం ఇచ్చాడు, వాళ్లు ఆ అధికారాన్ని చక్కగా ఉపయోగించాలని ఆయన కోరుకుంటున్నాడు.—లూకా 12:48బి.

శిరస్సత్వం అంటే ఏంటి?

3. మొదటి కొరింథీయులు 11:3 శిరస్సత్వం గురించి ఏం చెప్తుంది?

3 మొదటి కొరింథీయులు 11:3 చదవండి. పరలోకంలో, అలాగే భూమ్మీద ఉన్న తన కుటుంబాన్ని యెహోవా ఒక క్రమపద్ధతిలో ఉంచాడని ఈ లేఖనం వివరిస్తుంది. శిరస్సత్వంలో రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవేంటంటే అధికారం, లెక్క అప్పజెప్పాల్సిన బాధ్యత. యెహోవా అందరిపైనా శిరస్సు, ఆయనే సర్వోన్నత అధికారి. ఆయన పిల్లలందరూ అంటే దేవదూతలు, మనుషులు ఆయనకు లెక్క అప్పజెప్పాలి. (రోమా. 14:10; ఎఫె. 3:14, 15) సంఘం మీద యెహోవా యేసుకు అధికారం ఇచ్చాడు. అయితే, ఆ సంఘంలోని వాళ్లతో వ్యవహరించే విషయంలో యేసు యెహోవాకు లెక్క అప్పజెప్పాలి. (1 కొరిం. 15:27) అంతేకాదు, యెహోవా భర్తకు ఆయన భార్యాపిల్లల మీద అధికారం ఇచ్చాడు. అయితే, ఆ కుటుంబంతో వ్యవహరించే విషయంలో భర్త యెహోవాకు, యేసుకు ఇద్దరికీ లెక్క అప్పజెప్పాలి.—1 పేతు. 3:7.

4. యెహోవాకు, యేసుకు ఏ అధికారం ఉంది?

4 పరలోకంలో, అలాగే భూమ్మీద ఉన్న తన కుటుంబానికి యెహోవాయే శిరస్సు. కాబట్టి తన పిల్లలు ఎలా ప్రవర్తించాలనే విషయంలో నియమాలు పెట్టే అధికారం, వాటిని అమలు చేసే అధికారం ఆయనకు ఉంది. (యెష. 33:22) క్రైస్తవ సంఘానికి శిరస్సు అయిన యేసుకు కూడా నియమాలు పెట్టే, వాటిని అమలు చేసే అధికారం ఉంది.—గల. 6:2; కొలొ. 1:18-20.

5. క్రైస్తవ కుటుంబ శిరస్సుకు ఏ అధికారం ఉంటుంది? ఆయన అధికారానికి ఏ హద్దులు ఉన్నాయి?

5 యెహోవాకు, యేసుకు ఉన్నట్టే కుటుంబ శిరస్సుకు కూడా తన కుటుంబం విషయంలో నియమాలు పెట్టే అధికారం ఉంటుంది. (రోమా. 7:2; ఎఫె. 6:4) అయితే ఆయన అధికారానికి కొన్ని హద్దులు ఉన్నాయి. ఉదాహరణకు, ఆయన పెట్టే నియమాలు దేవుని వాక్యంలోని సూత్రాలపై ఆధారపడి ఉండాలి. (సామె. 3:5, 6) తన కుటుంబంలో భాగంకాని వాళ్లకు నియమాలు పెట్టే అధికారం ఆయనకు లేదు. (రోమా. 14:4) అంతేకాదు కొడుకులు, కూతుళ్లు పెద్దవాళ్లు అయ్యి ఇల్లు వదిలి వెళ్లిపోయినప్పుడు వాళ్లు ఆయన్ని గౌరవిస్తూనే ఉంటారు, కానీ ఆయన శిరస్సత్వం కింద ఉండరు.—మత్త. 19:5.

యెహోవా శిరస్సత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు?

6. యెహోవా శిరస్సత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు?

6 యెహోవా తన కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే శిరస్సత్వాన్ని ఏర్పాటు చేశాడు. అది ఆయన ఇచ్చిన బహుమానం. దేవుని కుటుంబంలో శాంతి, క్రమపద్ధతి ఉండడానికి అది సహాయం చేస్తుంది. (1 కొరిం. 14:33, 40) ఒకవేళ శిరస్సత్వ ఏర్పాటు లేకపోతే దేవుని కుటుంబం గజిబిజిగా ఉంటుంది, పైగా ఆ కుటుంబంలో సంతోషం ఉండదు. ఉదాహరణకు చివరి నిర్ణయం ఎవరు తీసుకోవాలో, దాన్ని ఎవరు అమలు చేయాలో తెలియని అయోమయం ఏర్పడుతుంది.

7. ఎఫెసీయులు 5:25, 28 ప్రకారం, భర్తలు భార్యలతో ఎలా వ్యవహరించాలని యెహోవా కోరుతున్నాడు?

7 దేవుడు చేసిన శిరస్సత్వ ఏర్పాటు అంత మంచిదైనప్పుడు, భర్త తమను అణచివేస్తున్నట్టు, ఆధిపత్యం చెలాయిస్తున్నట్టు నేడు చాలామంది స్త్రీలకు ఎందుకు అనిపిస్తోంది? ఎందుకంటే చాలామంది పురుషులు కుటుంబం విషయంలో యెహోవా ప్రమాణాల్ని పట్టించుకోకుండా స్థానిక కట్టుబాట్లను లేదా ఆచారాల్ని పాటిస్తున్నారు. అంతేకాదు, తమ స్వార్థం కోసం భార్యలతో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు, ఒక పురుషుడు తన ఆత్మగౌరవాన్ని పెంచుకోవడానికో, ఇతరుల ముందు తాను మగాడినని చూపించుకోవడానికో భార్య మీద పెత్తనం చెలాయిస్తుండవచ్చు. భార్యకు తన మీద ప్రేమ పుట్టేలా చేయలేకపోయినా, తనకు భయపడేలా చేయగలనని ఆయన అనుకోవచ్చు. ఆయన ఆ భయాన్ని ఉపయోగించుకుని ఆమెను చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి ప్రయత్నించవచ్చు. * అలాంటి తప్పుడు ఆలోచన వల్ల, ప్రవర్తన వల్ల స్త్రీలకు దక్కాల్సిన గౌరవం దక్కట్లేదు. అది యెహోవా చెప్పేదానికి పూర్తి విరుద్ధం.—ఎఫెసీయులు 5:25, 28 చదవండి.

మంచి కుటుంబ శిరస్సుగా ఉండడం ఎలా నేర్చుకోవచ్చు?

8. ఒక పురుషుడు మంచి కుటుంబ శిరస్సుగా ఉండడం ఎలా నేర్చుకోవచ్చు?

8 ఒక పురుషుడు శిరస్సత్వాన్ని ఉపయోగించే విషయంలో యెహోవాను, యేసును అనుకరించడం ద్వారా, మంచి కుటుంబ శిరస్సుగా ఉండడం నేర్చుకోవచ్చు. యెహోవా, యేసు చూపించే లక్షణాల్లో కేవలం రెండిటిని ఇప్పుడు పరిశీలిద్దాం. ఆ లక్షణాల్ని ఒక కుటుంబ శిరస్సు తన భార్యాపిల్లలతో వ్యవహరిస్తున్నప్పుడు ఎలా చూపించవచ్చో కూడా తెలుసుకుందాం.

9. యెహోవా ఎలా వినయం చూపిస్తున్నాడు?

9 వినయం. యెహోవా ఈ విశ్వంలోనే అత్యంత తెలివైన వ్యక్తి. అయినప్పటికీ ఆయన తన సేవకుల అభిప్రాయాల్ని వింటాడు. (ఆది. 18:23, 24, 32) తన అధికారం కింద ఉన్నవాళ్లు తమ ఆలోచనల్ని చెప్పేలా యెహోవా అనుమతించాడు. (1 రాజు. 22:19-22) యెహోవా పరిపూర్ణుడు, అయినప్పటికీ ప్రస్తుతం ఆయన మన నుండి పరిపూర్ణతను ఆశించట్లేదు. బదులుగా తనను సేవిస్తున్న అపరిపూర్ణ మనుషులు విజయం సాధించేలా ఆయన సహాయం చేస్తాడు. (కీర్త. 113:6, 7) నిజానికి, బైబిలు ఆయన్ని “సహాయకుడు” అని వర్ణిస్తోంది. (కీర్త. 27:9; హెబ్రీ. 13:6) యెహోవా వినయం చూపించి తనకు సహాయం చేయడం వల్లే, తనకు అప్పగించిన గొప్ప పనిని పూర్తి చేయగలిగానని దావీదు రాజు గుర్తించాడు.—2 సమూ. 22:36.

10. యేసు ఎలా వినయం చూపించాడు?

10 యేసు ఉంచిన ఆదర్శాన్ని పరిశీలించండి. యేసు తన శిష్యులకు ప్రభువు, యజమాని అయినప్పటికీ వాళ్ల కాళ్లు కడిగాడు. యెహోవా ఈ సంఘటనను బైబిల్లో రాయించడానికి ఒక కారణం ఏంటి? కుటుంబ శిరస్సులతో సహా ప్రతీ ఒక్కరు ఎలా ఉండాలో చూపించడానికి యెహోవా దాన్ని రాయించాడు. యేసే స్వయంగా ఇలా అన్నాడు: “నేను మీకు చేసినట్టే మీరు కూడా చేయాలని మీకు ఆదర్శం ఉంచాను.” (యోహా. 13:12-17) యేసుకు ఎంతో అధికారం ఉన్నప్పటికీ, ఇతరులు తనకు సేవ చేయాలని అనుకోలేదు గానీ ఆయనే ఇతరులకు సేవ చేశాడు.—మత్త. 20:28.

కుటుంబ శిరస్సు ఇంటిపనులు చేయడం ద్వారా, కుటుంబ సభ్యుల ఆధ్యాత్మిక అవసరాలు తీర్చడం ద్వారా వినయం, ప్రేమ చూపించవచ్చు (11, 13 పేరాలు చూడండి)

11. వినయం చూపించే విషయంలో కుటుంబ శిరస్సు యెహోవా నుండి, యేసు నుండి ఏం నేర్చుకోవచ్చు?

11 మనమేం నేర్చుకోవచ్చు? ఒక కుటుంబ శిరస్సు ఎన్నో విధాలుగా వినయం చూపించవచ్చు. ఉదాహరణకు, ఆయన తన భార్యాపిల్లల నుండి పరిపూర్ణతను ఆశించడు. ఆయన కుటుంబ సభ్యుల అభిప్రాయాలు వింటాడు, అవి తన అభిప్రాయానికి వేరుగా ఉన్నా సరే వాటిని వింటాడు. అమెరికాలో ఉంటున్న మార్లీ ఇలా అంటుంది: “కొన్నిసార్లు నా అభిప్రాయం, నా భర్త అభిప్రాయం కలవవు. కానీ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, ఆయన నా అభిప్రాయం కూడా అడిగి, దాని గురించి జాగ్రత్తగా ఆలోచిస్తాడు. దానివల్ల ఆయన నాకు విలువిస్తున్నాడని, గౌరవిస్తున్నాడని అనిపిస్తుంది.” అంతేకాదు, వినయం గల భర్త ఇంటిపనులు చేయడానికి వెనకాడడు. తన సమాజంలో ‘ఆడవాళ్లు చేసే పనులు’ అని అనుకునే వాటిని చేయడానికి కూడా ఆయన వెనకాడడు. అది కష్టంగా ఉండవచ్చు. ఎందుకు? రేచల్‌ అనే సహోదరి ఇలా చెప్తోంది: “నేను పుట్టిపెరిగిన ప్రాంతంలో భర్త అంట్లు కడగడంలో, ఇల్లు శుభ్రం చేయడంలో భార్యకు సహాయం చేస్తే, ‘మగాడివై ఉండి ఇలాంటి పనులు చేస్తున్నావేంటి’ అని పొరుగువాళ్లు, బంధువులు అంటారు. ఆయన భార్యను అదుపులో పెట్టుకోలేకపోతున్నాడని వాళ్లు అనుకుంటారు.” ఒకవేళ మీరు ఉంటున్న ప్రాంతంలో కూడా అలాంటి ఆలోచనే ఉంటే, యేసు తన శిష్యుల కాళ్లు కడిగాడని గుర్తుంచుకోండి. అది సేవకుడు చేసే పని అని చాలామంది అనుకున్నా, యేసు ఆ పని చేశాడు. ఒక మంచి కుటుంబ శిరస్సుకు తన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అనేదాని కన్నా, తన భార్యాపిల్లలు ఏమనుకుంటున్నారు అనేదే ముఖ్యం. ఒక మంచి కుటుంబ శిరస్సుకు వినయంతో పాటు ఇంకా ఏ లక్షణం అవసరం?

12. ఏం చేసేలా ప్రేమ యెహోవాను, యేసును కదిలిస్తుంది?

12 ప్రేమ. యెహోవా ఏది చేసినా ప్రేమతోనే చేస్తాడు. (1 యోహా. 4:7, 8) ఆయన తన వాక్యమైన బైబిలు ద్వారా, తన సంస్థ ద్వారా మన ఆధ్యాత్మిక అవసరాల్ని ప్రేమతో తీరుస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నానని భరోసా ఇవ్వడం ద్వారా మన భావోద్వేగ అవసరాలు కూడా తీరుస్తున్నాడు. మరి మన భౌతిక అవసరాల సంగతేంటి? “మనం ఆస్వాదిస్తున్న వాటన్నిటిని పుష్కలంగా” ఇచ్చింది యెహోవాయే. (1 తిమో. 6:17) పొరపాటు చేసినప్పుడు ఆయన మనల్ని సరిదిద్దుతాడు, అంతేగానీ మనల్ని ప్రేమించడం ఆపడు. మనమీద ప్రేమతోనే యెహోవా విమోచన క్రయధనాన్ని ఏర్పాటు చేశాడు. యేసుకు కూడా మనమీద ఎంత ప్రేమ ఉందంటే, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. (యోహా. 3:16; 15:13) నమ్మకమైన సేవకుల మీద ప్రేమ చూపించకుండా యెహోవాను, యేసును ఏదీ ఆపలేదు.—యోహా. 13:1; రోమా. 8:35, 38, 39.

13. కుటుంబ శిరస్సు తన కుటుంబ సభ్యుల మీద ప్రేమ చూపించడం ఎందుకు ప్రాముఖ్యం? (“ కొత్తగా పెళ్లయిన వ్యక్తి తన భార్య గౌరవాన్ని ఎలా సంపాదించుకోవచ్చు?” బాక్సు కూడా చూడండి.)

13 మనమేం నేర్చుకోవచ్చు? కుటుంబ శిరస్సు ఏం చేసినా, ప్రేమతోనే చేయాలి. అది ఎందుకు ప్రాముఖ్యం? అపొస్తలుడైన యోహాను ఇలా జవాబిస్తున్నాడు: “తాను చూసే సహోదరుణ్ణి [కుటుంబాన్ని] ప్రేమించని వ్యక్తి, తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు.” (1 యోహా. 4:11, 20) కుటుంబాన్ని ప్రేమిస్తూ యెహోవాను, యేసును అనుకరించాలని కోరుకునే కుటుంబ శిరస్సు తన కుటుంబ సభ్యుల ఆధ్యాత్మిక, భావోద్వేగ, భౌతిక అవసరాల్ని తీరుస్తాడు. (1 తిమో. 5:8) ఆయన తన పిల్లలకు శిక్షణ ఇస్తాడు, వాళ్లను సరిదిద్దుతాడు. అంతేకాదు యెహోవాను ఘనపర్చే నిర్ణయాల్ని, తన కుటుంబానికి ప్రయోజనం చేకూర్చే నిర్ణయాల్ని ఎలా తీసుకోవాలో నేర్చుకుంటూ ఉంటాడు. ఇప్పుడు వాటిలో ఒక్కో విషయాన్ని పరిశీలిస్తూ కుటుంబ శిరస్సు యెహోవాను, యేసును ఎలా అనుకరించవచ్చో గమనిద్దాం.

కుటుంబ శిరస్సు ఏం చేయాలి?

14. కుటుంబ శిరస్సు తన కుటుంబ సభ్యుల ఆధ్యాత్మిక అవసరాలు ఎలా తీరుస్తాడు?

14 కుటుంబ సభ్యుల ఆధ్యాత్మిక అవసరాలు తీర్చాలి. యెహోవాలాగే యేసు కూడా తన సంరక్షణ కింద ఉన్నవాళ్ల ఆధ్యాత్మిక అవసరాలు తీర్చడానికి కృషిచేశాడు. (మత్త. 5:3, 6; మార్కు 6:34) అదేవిధంగా, ఒక కుటుంబ శిరస్సు కుటుంబ సభ్యుల ఆధ్యాత్మిక అవసరాలు తీర్చడాన్ని అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఎంచాలి. (ద్వితీ. 6:6-9) తాను, తన కుటుంబ సభ్యులు దేవుని వాక్యాన్ని చదివేలా, అధ్యయనం చేసేలా, మీటింగ్స్‌కు వెళ్లేలా, మంచివార్త ప్రకటించేలా, యెహోవాతో స్నేహాన్ని పెంపొందించుకుని దాన్ని కాపాడుకునేలా ఆయన చూసుకోవాలి. అలా ఆయన వాళ్ల ఆధ్యాత్మిక అవసరాలు తీరుస్తాడు.

15. కుటుంబ శిరస్సు తన కుటుంబ సభ్యుల భావోద్వేగ అవసరాల్ని తీర్చే ఒక విధానం ఏంటి?

15 కుటుంబ సభ్యుల భావోద్వేగ అవసరాలు తీర్చాలి. యేసు మీద తనకున్న ప్రేమను యెహోవా మాటల్లో తెలియజేశాడు. (మత్త. 3:17) శిష్యుల మీద ఉన్న ప్రేమను యేసు చాలాసార్లు మాటల్లో, చేతల్లో చూపించాడు. శిష్యులు కూడా ఆయన మీద ఉన్న ప్రేమను తెలియజేశారు. (యోహా. 15:9, 12, 13; 21:16) కుటుంబ శిరస్సు భార్యాపిల్లలతో బైబిల్ని అధ్యయనం చేయడం ద్వారా, ఇతర పనుల ద్వారా వాళ్లను ప్రేమిస్తున్నానని చూపించవచ్చు. అంతేకాదు ఆయన వాళ్లను ప్రేమిస్తున్నానని, విలువైనవాళ్లుగా చూస్తున్నానని మాటల్లో చెప్పాలి, అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి ఇతరుల ముందు వాళ్లను పొగడాలి.—సామె. 31:28, 29.

యెహోవాను సంతోషపెట్టాలంటే, ఒక కుటుంబ శిరస్సు తన కుటుంబ సభ్యుల భౌతిక అవసరాలు తీర్చాలి (16వ పేరా చూడండి)

16. ఒక కుటుంబ శిరస్సు ఇంకా ఏం చేయాలి? ఆయన ఏం చేయకూడదు?

16 కుటుంబ సభ్యుల భౌతిక అవసరాలు తీర్చాలి. అవిధేయత వల్ల ఇశ్రాయేలీయులు శిక్ష అనుభవిస్తున్న సమయంలో కూడా యెహోవా వాళ్ల కనీస అవసరాల్ని తీర్చాడు. (ద్వితీ. 2:7; 29:5) నేడు మన కనీస అవసరాల్ని కూడా ఆయన తీరుస్తున్నాడు. (మత్త. 6:31-33; 7:11) అదేవిధంగా, యేసు తనను అనుసరించేవాళ్లకు ఆహారం పెట్టాడు. (మత్త. 14:17-20) అంతేకాదు, ఆయన వాళ్ల ఆరోగ్యాన్ని పట్టించుకున్నాడు. (మత్త. 4:24) యెహోవాను సంతోషపెట్టాలంటే ఒక కుటుంబ శిరస్సు తన కుటుంబ సభ్యుల భౌతిక అవసరాలు తీర్చాలి. అయితే, ఆయన సమతుల్యత చూపించాలి. అంటే, కుటుంబాన్ని పోషించాలి కదా అని ఉద్యోగంలోనే మునిగిపోయి వాళ్ల ఆధ్యాత్మిక, భావోద్వేగ అవసరాల్ని నిర్లక్ష్యం చేయకూడదు.

17. శిక్షణ, క్రమశిక్షణ ఇచ్చే విషయంలో యెహోవా, యేసు ఎలాంటి ఆదర్శం ఉంచారు?

17 శిక్షణ ఇవ్వాలి. యెహోవా మన మంచి కోసమే శిక్షణను, క్రమశిక్షణను ఇస్తాడు. (హెబ్రీ. 12:7-9) యెహోవాలాగే యేసు కూడా, తన అధికారం కింద ఉన్నవాళ్లకు ప్రేమతో శిక్షణ ఇస్తాడు. (యోహా. 15:14, 15) ఆయన గట్టిగా సలహా ఇవ్వాల్సి వచ్చినా, దాన్ని దయతో ఇస్తాడు. (మత్త. 20:24-28) మనం అపరిపూర్ణులమని, పొరపాట్లు చేస్తామని ఆయన అర్థం చేసుకుంటాడు.—మత్త. 26:41.

18. మంచి కుటుంబ శిరస్సు ఏం గుర్తుంచుకుంటాడు?

18 యెహోవాను, యేసును అనుకరించే కుటుంబ శిరస్సు తన భార్యాపిల్లలు అపరిపూర్ణులని గుర్తుంచుకుంటాడు. ఆయన వాళ్లమీద “విపరీతమైన కోపం” చూపించడు. (కొలొ. 3:19) బదులుగా ఆయన కూడా అపరిపూర్ణుడనే విషయం గుర్తుంచుకుని, గలతీయులు 6:1⁠లో ఉన్న సూత్రాన్ని పాటిస్తూ వాళ్లను “సౌమ్యంగా” సరైన దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. యేసులాగే వాళ్లకు నేర్పించడానికి సరైన పద్ధతి తన ఆదర్శమేనని ఆయన గుర్తిస్తాడు.—1 పేతు. 2:21.

19-20. నిర్ణయాలు తీసుకునే విషయంలో కుటుంబ శిరస్సు యెహోవాను, యేసును ఎలా అనుకరించవచ్చు?

19 స్వార్థం చూసుకోకుండా, కుటుంబ సభ్యులకు మంచి చేసే నిర్ణయాలు తీసుకోవాలి. యెహోవా ఇతరులకు మంచి చేసే నిర్ణయాలు తీసుకుంటాడు. ఉదాహరణకు, ఆయన తన ప్రయోజనం కోసం కాదుగానీ, జీవించడంలో ఉన్న ఆనందాన్ని మనతో పంచుకోవడం కోసం జీవకోటిని సృష్టించాడు. మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా తన కుమారుణ్ణి ఇవ్వమని ఎవ్వరూ ఆయన్ని ఒత్తిడి చేయలేదు. ఆయనే ఇష్టపూర్వకంగా మన ప్రయోజనం కోసం తన కుమారుణ్ణి అర్పించడానికి సిద్ధపడ్డాడు. యేసు కూడా ముఖ్యంగా వేరేవాళ్లకు మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నాడు. (రోమా. 15:3) ఉదాహరణకు, విశ్రాంతి తీసుకునే సమయాన్ని కూడా త్యాగం చేసి ఒక పెద్ద సమూహానికి బోధించాడు.—మార్కు 6:31-34.

20 ఒక మంచి కుటుంబ శిరస్సు తాను చేయాల్సిన కష్టమైన పనుల్లో ఒకటి, తన కుటుంబం కోసం తెలివైన నిర్ణయాలు తీసుకోవడం అని గుర్తిస్తాడు. ఆయన ఆ బాధ్యతను చాలా ప్రాముఖ్యంగా ఎంచుతాడు. ఆయన అనాలోచితంగా గానీ, ఆ క్షణానికి అనిపించిన దాన్నిబట్టి గానీ నిర్ణయాలు తీసుకోడు. బదులుగా యెహోవా తనకు శిక్షణ ఇచ్చేలా అనుమతిస్తాడు. * (సామె. 2:6, 7) ఆ విధంగా, తన ప్రయోజనం గురించి కాకుండా ఇతరుల ప్రయోజనం గురించి ఆయన ఆలోచిస్తాడు.—ఫిలి. 2:4.

21. తర్వాతి ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

21 యెహోవా కుటుంబ శిరస్సులకు కష్టమైన నియామకం ఇచ్చాడు, దాని విషయంలో వాళ్లు యెహోవాకు లెక్క అప్పజెప్పాలి. కానీ భర్త యెహోవాను, యేసును అనుకరించడానికి కృషిచేస్తే మంచి కుటుంబ శిరస్సు అవుతాడు. భార్య కూడా తాను చేయాల్సింది చేస్తే వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది. భార్య శిరస్సత్వాన్ని ఎలా చూడాలి? ఆ విషయంలో ఆమెకు ఎదురయ్యే సవాళ్లు ఏంటి? తర్వాతి ఆర్టికల్‌లో ఆ ప్రశ్నలకు జవాబులు చూస్తాం.

పాట 16 అభిషిక్త కుమారుణ్ణి బట్టి యెహోవాను స్తుతించండి

^ పేరా 5 పెళ్లయిన తర్వాత పురుషుడు ఒక కొత్త కుటుంబానికి శిరస్సు అవుతాడు. శిరస్సత్వం అంటే ఏంటో, యెహోవా దాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడో, యెహోవా అలాగే యేసు ఆదర్శం నుండి పురుషులు ఏం నేర్చుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. భార్యాభర్తలు యేసు నుండి, ఇతర బైబిలు ఉదాహరణల నుండి ఏం నేర్చుకోవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం. చివరిగా మూడో ఆర్టికల్‌లో, సంఘంలో శిరస్సత్వం గురించి పరిశీలిస్తాం.

^ పేరా 7 భార్యలతో కఠినంగా వ్యవహరించడం, ఆఖరికి వాళ్లను కొట్టడం తప్పేమీ కాదన్నట్టు సినిమాల్లో, నాటకాల్లో, కార్టూన్‌ పుస్తకాల్లో చూపిస్తున్నారు. భర్త భార్య మీద పెత్తనం చెలాయించడం సరైనదే అనే ఆలోచన పెరగడానికి అది కూడా ఒక కారణం కావచ్చు.

^ పేరా 20 మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించిన మరింత సమాచారం కోసం, ఏప్రిల్‌ 15, 2011 కావలికోట 13-17 పేజీల్లో వచ్చిన “దేవుణ్ణి ఘనపర్చే నిర్ణయాలు తీసుకోండి” అనే ఆర్టికల్‌ చూడండి.