కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రైస్తవ ఐక్యతను పెంచడానికి మీరెలా సహాయం చేయవచ్చు?

క్రైస్తవ ఐక్యతను పెంచడానికి మీరెలా సహాయం చేయవచ్చు?

‘ఆయననుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి, ఒకదానికొకటి సహకరించుకుంటాయి.’ఎఫె. 4:16, NW.

పాటలు: 53, 16

1. మొదటినుండి దేవుని పనులన్నిటిలో ఏం కనిపిస్తుంది?

 యెహోవా, యేసు సృష్టి ప్రారంభం నుండి కలిసి ఉన్నారు. యెహోవా యేసును అన్నిటికన్నా ముందు సృష్టించాడు. ఆ తర్వాత యేసు యెహోవా దగ్గర ‘ప్రధానశిల్పిగా’ ఉంటూ సృష్టిని చేయడంలో ఆయనతో కలిసి పనిచేశాడు. (సామె. 8:30) యెహోవా సేవకులు కూడా తమకు అప్పగించిన పనిచేయడానికి ఒకరికొకరు సహకరించుకున్నారు. ఉదాహరణకు, నోవహు ఆయన కుటుంబం కలిసి ఓడను కట్టారు. ఆ తర్వాత, ఇశ్రాయేలీయులు గుడారాన్ని నిర్మించడానికి కలిసి పనిచేశారు. అంటే దాని భాగాలను వేరుచేయడంలో, దాన్ని ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తీసుకెళ్లడంలో వాళ్లు కలిసి పనిచేశారు. దేవాలయంలో వాళ్లు కలిసి పాటలు పాడుతూ, సంగీతవాద్యాలతో శ్రావ్యమైన సంగీతాన్ని వాయిస్తూ యెహోవాను స్తుతించారు. యెహోవా ప్రజలు ఒకరికొకరు సహకరించుకున్నారు కాబట్టే ఇవన్నీ చేయగలిగారు.—ఆది. 6:14-16, 22; సంఖ్యా. 4:4-32; 1 దిన. 25:1-8.

2. (ఎ) మొదటి శతాబ్దంలోని క్రైస్తవ సంఘం ప్రత్యేకత ఏమిటి? (బి) మనం ఏ ప్రశ్నల్ని చర్చిస్తాం?

2 మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు కూడా ఒకరికొకరు సహకరించుకున్నారు. వాళ్ల సామర్థ్యాలు, నియామకాలు వేరైనా కలిసి పనిచేశారని పౌలు వివరించాడు. వాళ్లందరూ తమ నాయకుడైన యేసుక్రీస్తును అనుసరించారు. పౌలు వాళ్లను, వేర్వేరు అవయవాలతో కలిసి పనిచేసే శరీరంతో పోల్చాడు. (1 కొరింథీయులు 12:4-6, 12 చదవండి.) మరి నేడు మన విషయమేమిటి? ప్రకటనాపనిలో, సంఘంలో, కుటుంబంలో మనం ఒకరికొకరం ఎలా సహకరించుకోవచ్చు?

ప్రకటనాపనిలో సహకరించుకోండి

3. అపొస్తలుడైన యోహాను దర్శనంలో ఏం చూశాడు?

3 మొదటి శతాబ్దంలో అపొస్తలుడైన యోహానుకు ఓ దర్శనంలో, ఏడుగురు దేవదూతలు బూరలు ఊదుతూ కనిపించారు. ఐదవ దూత బూర ఊదినప్పుడు, “ఆకాశమునుండి భూమిమీద రాలిన యొక నక్షత్రము” యోహానుకు కనిపించింది. ఆ నక్షత్రం, చీకటిగా ఉన్న ఓ లోతైన అగాధపు తలుపును తాళపు చెవితో తెరవడాన్ని కూడా ఆయన చూశాడు. ముందు, ఆ అగాధం నుండి దట్టమైన పొగ వచ్చింది, తర్వాత ఆ పొగ నుండి ఒక మిడతల దండు వచ్చింది. ఆ మిడతలు చెట్లకు లేదా మొక్కలకు హాని చేసే బదులు “నొసళ్లయందు దేవుని ముద్ర లేని” వాళ్ల మీద దాడి చేశాయి. (ప్రక. 9:1-4) మిడతల దండు చాలా నష్టాన్ని కలిగిస్తాయని యోహానుకు తెలుసు ఎందుకంటే, అవి ఒకప్పుడు మోషే కాలంలో ఈజిప్టులో అలా చేశాయి. (నిర్గ. 10:12-15) యోహాను చూసిన ఆ మిడతల దండు, అబద్ధమతానికి వ్యతిరేకంగా ఓ శక్తిమంతమైన సందేశాన్ని ప్రకటిస్తున్న అభిషిక్త క్రైస్తవులకు సూచనగా ఉంది. అంతేకాదు, భూమ్మీద నిత్యజీవం కోసం ఎదురుచూసే లక్షలమంది ఆ అభిషిక్త క్రైస్తవులకు జత అయ్యారు. వాళ్లందరూ కలిసి ఐక్యంగా ప్రకటనా పనిని చేస్తున్నారు. ఈ పనివల్ల చాలామంది అబద్ధమతాన్ని విడిచిపెట్టి, సాతాను గుప్పిట్లో నుంచి బయటపడ్డారు.

4. యెహోవా ప్రజలపై నేడు ఎలాంటి బాధ్యత ఉంది? వాళ్లు ఏం చేస్తేనే దాన్ని నిర్వర్తించగలరు?

4 అంతం రాకముందే భూమ్మీదున్న ప్రజలందరికీ “సువార్త” ప్రకటించాల్సిన బాధ్యత మనపై ఉంది. అది చాలా పెద్ద పని. (మత్త. 24:14; 28:19, 20) “దప్పిగొనిన” వాళ్లందరినీ “జీవజలము” తాగడానికి మనం ఆహ్వానించాలి. అంటే బైబిల్ని అర్థంచేసుకోవాలని కోరుకునే వాళ్లందరికీ బైబిలు సత్యాల్ని నేర్పించాలి. (ప్రక. 22:17) అయితే, మనం “చక్కగా అమర్చబడి” సంఘంలో ఒకరికొకరం సహకరించుకుంటేనే ఆ పనిని చేయగలం.—ఎఫె. 4:16.

5, 6. మనందరం ఐక్యంగా ఏయే పనులు చేస్తాం?

5 సాధ్యమైనంత ఎక్కువమందికి సువార్త ప్రకటించాలంటే, మనం ప్రకటనా పనిని ఓ పద్ధతి ప్రకారం చేయాలి. అందుకు సహాయం చేసే నిర్దేశాలు సంఘం మనకు ఇస్తుంది. మనం క్షేత్రసేవా కూటం కోసం కలుసుకున్న తర్వాత, దేవుని రాజ్య సువార్తను ప్రజలకు చెప్పడానికి వెళ్తాం. కేవలం చెప్పడమే కాదు వాళ్లకు బైబిలుకు సంబంధించిన పుస్తకాలను, పత్రికలను కూడా ఇస్తాం. నిజానికి, అలా మనం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల ప్రచురణలు పంచిపెట్టాం. కొన్నిసార్లు ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో కూడా పాల్గొంటాం. ఇలా ప్రకటిస్తున్నప్పుడు, ప్రపంచమంతటా ఒకేలాంటి సందేశాన్ని ప్రకటిస్తున్న లక్షలమంది దేవుని ప్రజలతో కలిసి మనం ఐక్యంగా పనిచేస్తున్నట్లే. అంతేకాదు, సువార్తను ప్రకటించడంలో దేవుని ప్రజలకు సహాయం చేస్తున్న దేవదూతలతో కూడా మనం కలిసి పనిచేస్తున్నట్లే.—ప్రక. 14:6.

6 ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రకటనాపనికి వచ్చిన ఫలితాలను వార్షిక పుస్తకంలో చూసి మనం ఎంతో సంతోషిస్తాం. అయితే, ప్రజల్ని మన సమావేశాలకు ఆహ్వానిస్తున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనందరం ఎలా ఐక్యంగా ఉంటామో ఆలోచించండి. సమావేశాల్లో అందరం ఒకే సమాచారాన్ని వింటాం. యెహోవాకు శ్రేష్ఠమైనది ఇచ్చేలా ప్రసంగాలు, డ్రామాలు, ప్రదర్శనలు మనందర్నీ ప్రోత్సహిస్తాయి. అంతేకాదు, మనం ప్రతీ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన సహోదరసహోదరీలతో ఐక్యంగా ఉన్నట్టే. (1 కొరిం. 11:23-26) ఆ ఆచరణ కోసం మనందరం ప్రతీ సంవత్సరం నీసాను 14న, సూర్యుడు అస్తమించిన తర్వాత కలుసుకొని యెహోవా మనకోసం చేసిన దానికి కృతజ్ఞత చూపిస్తాం, యేసు ఆజ్ఞను పాటిస్తాం. అంతేకాదు ఆ ఆచరణకు కొన్ని వారాల ముందు, ఈ ప్రాముఖ్యమైన కూటానికి సాధ్యమైనంత ఎక్కువమందిని పిలవడానికి కలిసి పనిచేస్తాం.

7. మనం కలిసి పనిచేయడం వల్ల ఏం సాధించగలుగుతున్నాం?

7 ఎలాగైతే ఒక్క మిడత ఎక్కువ నష్టాన్ని కలిగించలేదో, మనం కూడా ఒంటరిగా ప్రజలందరికీ ప్రకటించలేం. కానీ మనందరం కలిసి పనిచేస్తున్నాం కాబట్టే, లక్షలమందికి యెహోవా గురించి చెప్పగలుగుతున్నాం, ఆయన్ని స్తుతించి ఘనపరిచేలా కొంతమందికి సహాయం చేయగలుగుతున్నాం.

సంఘంలో సహకరించుకోండి

8, 9. (ఎ) క్రైస్తవులు ఐక్యంగా ఉండాలని చెప్పడానికి పౌలు ఏ ఉదాహరణ ఉపయోగించాడు? (బి) మనం సంఘంలో ఒకరికొకరం ఎలా సహకరించుకోవచ్చు?

8 సంఘం క్రమపద్ధతిలో ఎలా పనిచేస్తుందో పౌలు ఎఫెస్సులోని క్రైస్తవులకు వివరిస్తూ, సంఘంలో ఉన్నవాళ్లందరూ ‘అన్ని విషయాల్లో ఎదగాలి’ అని చెప్పాడు. (ఎఫెసీయులు 4:15, 16 చదవండి.) పౌలు ఒక శరీరాన్ని ఉదాహరణగా తీసుకొని సంఘమంతా ఐక్యంగా ఉండేలా, మన నాయకుడైన యేసును అనుసరించేలా ప్రతీ క్రైస్తవుడు ఏవిధంగా సహాయం చేయవచ్చో వివరించాడు. శరీరంలోని అవయవాలన్నీ ‘ప్రతి కీలువలన అతుకబడి’ ఒకదానికొకటి సహకరించుకుంటాయని ఆయన చెప్పాడు. యౌవనులమైనా-వృద్ధులమైనా, బలవంతులమైనా-బలహీనులమైనా సంఘం ఐక్యంగా, ఆధ్యాత్మికంగా బలంగా ఉండడానికి మనమందరం ఎలా సహాయపడవచ్చు?

9 సంఘాన్ని నడిపించడానికి యేసు పెద్దలను నియమించాడు, మనం వాళ్లను గౌరవించాలనీ వాళ్లు ఇచ్చే నిర్దేశాలను పాటించాలనీ ఆయన కోరుకుంటున్నాడు. (హెబ్రీ. 13:7, 17) అలా చేయడం అన్నిసార్లు తేలిక కాదు. కానీ సహాయం చేయమని మనం యెహోవాను అడగవచ్చు. పెద్దలు ఇచ్చే ఎలాంటి నిర్దేశాలనైనా పాటించడానికి ఆయన పవిత్రశక్తి మనకు సహాయం చేస్తుంది. మనం వినయంగా ఉంటూ పెద్దలకు సహకరిస్తే సంఘానికి ఎంత సహాయపడవచ్చో కూడా ఆలోచించండి. అప్పుడు మన సంఘం ఐక్యంగా ఉంటుంది అలాగే మన మధ్య ఉన్న ప్రేమ మరింత పెరుగుతుంది.

10. సంఘం ఐక్యంగా ఉండడానికి పరిచర్య సేవకులు ఏవిధంగా సహాయపడతారు? (ప్రారంభ చిత్రం చూడండి.)

10 సంఘం ఐక్యంగా ఉండడానికి పరిచర్య సేవకులు కూడా సహాయం చేస్తారు. వాళ్లు పెద్దలకు సహాయపడుతూ చాలా కష్టపడతారు, వాళ్లు చేస్తున్న వాటన్నిటికీ మనం కృతజ్ఞత చూపిస్తాం. ఉదాహరణకు పరిచర్య సేవకులు, ప్రీచింగ్‌కి అవసరమయ్యే ప్రచురణలు సరిపడా ఉండేలా చూస్తారు అలాగే మన కూటాలకు వచ్చే కొత్తవాళ్లను ఆహ్వానిస్తారు. రాజ్యమందిరాన్ని మంచి స్థితిలో ఉంచడానికి కష్టపడి పనిచేస్తారు. ఈ సహోదరులకు సహకరించినప్పుడు మనం ఐక్యంగా ఉంటాం అలాగే ఒక క్రమపద్ధతిలో యెహోవాకు సేవ చేయగలుగుతాం.—అపొస్తలుల కార్యములు 6:3-6, పోల్చండి.

11. సంఘం ఐక్యంగా ఉండడానికి యౌవనులు ఏయే పనులు చేయవచ్చు?

11 కొంతమంది పెద్దలు చాలా సంవత్సరాలు సంఘంలో ఎంతో కష్టపడి పనిచేశారు. కానీ ఇప్పుడు వయస్సు పెరుగుతుండడంతో ఒకప్పటిలా సేవ చేయలేకపోవచ్చు. కాబట్టి యువ సహోదరులు వాళ్లకు సహాయం చేయవచ్చు. ఒకవేళ యౌవన సహోదరులకు శిక్షణ ఇస్తే సంఘంలో మరిన్ని బాధ్యతలు చేపట్టగలుగుతారు. అంతేకాదు పరిచర్య సేవకులు కష్టపడి పనిచేసినప్పుడు, వాళ్లు ముందుముందు పెద్దలుగా సేవచేసే అవకాశం దొరుకుతుంది. (1 తిమో. 3:1, 10) పెద్దలుగా సేవచేస్తున్న కొంతమంది యౌవన సహోదరులు ఎంతో ప్రగతి సాధించారు. వాళ్లు ఇప్పుడు ప్రాంతీయ పర్యవేక్షకులుగా సేవచేస్తూ చాలా సంఘాల్లోని సహోదరసహోదరీలకు సహాయం చేస్తున్నారు. యౌవనులు, సహోదరసహోదరీలకు సేవచేయడానికి ముందుకు వచ్చినప్పుడు మనం ఎంతో కృతజ్ఞత చూపిస్తాం.—కీర్తన 110:3; ప్రసంగి 12:1 చదవండి.

కుటుంబంలో సహకరించుకోండి

12, 13. కుటుంబంలో ప్రతీఒక్కరూ సహకరించుకోవాలంటే ఏం చేయవచ్చు?

12 మన కుటుంబంలో ప్రతీఒక్కరూ సహకరించుకోవాలంటే మనమేమి చేయవచ్చు? ప్రతీవారం చేసుకునే కుటుంబ ఆరాధన అందుకు సహాయం చేస్తుంది. తల్లిదండ్రులు, పిల్లలు కలిసి యెహోవా గురించి నేర్చుకుంటూ సమయం గడిపినప్పుడు, వాళ్ల మధ్య ఉన్న ప్రేమ మరింత బలపడుతుంది. కుటుంబ ఆరాధన చేసుకుంటున్నప్పుడు ప్రీచింగ్‌లో ఏం మాట్లాడాలో ప్రాక్టీస్‌ చేయవచ్చు, ప్రీచింగ్‌లో చక్కగా మాట్లాడడానికి అది వాళ్లను సిద్ధంచేస్తుంది. తమ కుటుంబసభ్యులు సత్యం గురించి మాట్లాడడం విన్నప్పుడు, కుటుంబంలోని అందరూ యెహోవాను ప్రేమిస్తున్నారనీ ఆయనను సంతోషపెట్టాలని కోరుకుంటున్నారనీ చూసినప్పుడు వాళ్లు ఒకరికొకరు మరింత దగ్గరౌతారు.

కుటుంబ ఆరాధనవల్ల తల్లిదండ్రులూ పిల్లలూ ఒకరికొకరు మరింత దగ్గరౌతారు (12, 15 పేరాలు చూడండి)

13 భార్యాభర్తలు ఒకరికొకరు సహకరించుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. వాళ్లిద్దరూ యెహోవాను ప్రేమిస్తూ కలిసి ఆయన్ను సేవిస్తే సంతోషంగా, ఐక్యంగా ఉంటారు. అబ్రాహాము-శారా, ఇస్సాకు-రిబ్కా, ఎల్కానా-హన్నా ఒకరిపట్ల ఒకరు ప్రేమాప్యాయతలు చూపించుకున్నట్లే భార్యాభర్తలు కూడా చూపించుకోవాలి. (ఆది. 26:8; 1 సమూ. 1:5, 8; 1 పేతు. 3:5, 6) అలా చేసినప్పుడు, వాళ్లు ఐక్యంగా ఉండడంతోపాటు యెహోవాకు మరింత దగ్గరౌతారు.—ప్రసంగి 4:12 చదవండి.

14. భర్త లేదా భార్య ఎవరో ఒక్కరు మాత్రమే యెహోవాను సేవిస్తుంటే, వివాహబంధాన్ని బలంగా ఉంచుకోవడానికి ఏమి చేయవచ్చు?

14 యెహోవాను ఆరాధించని వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదని బైబిలు స్పష్టంగా చెప్తుంది. (2 కొరిం. 6:14) అయినా, యెహోవాసాక్షికాని వాళ్లను పెళ్లి చేసుకున్న సహోదరసహోదరీలు కొందరు ఉన్నారు. మరికొంతమంది పెళ్లయ్యాక సత్యం తెలుసుకున్నారు, కానీ భార్యాభర్తల్లో ఎవరో ఒక్కరే యెహోవాసాక్షి అయ్యారు. ఇంకొంతమంది యెహోవాసాక్షినే పెళ్లి చేసుకున్నా, ఆ తర్వాత వాళ్లలో ఒకరు అంటే భర్తగానీ భార్యగానీ సంఘం నుండి బయటకు వెళ్లిపోయారు. ఇలాంటి సందర్భాలన్నిటిలో, తమ వివాహబంధాన్ని బలంగా ఉంచుకోవడానికి క్రైస్తవులందరూ బైబిలు ఇస్తున్న ఉపదేశాన్ని పాటిస్తూ చేయగలినదంతా చేస్తారు. అయితే అలా చేయడం అన్నిసార్లు తేలిక కాదు. ఉదాహరణకు డేవిడ్‌, మేరీ అనే దంపతుల అనుభవం పరిశీలించండి. వాళ్లిద్దరూ యెహోవాసాక్షులే కానీ, కొంతకాలానికి డేవిడ్‌ మీటింగ్స్‌కు వెళ్లడం మానేశాడు. అయినా, మేరీ మాత్రం ఓ మంచి భార్యగా ఉంటూ క్రైస్తవ లక్షణాలను చూపించడానికి ప్రయత్నించింది. ఆమె తన ఆరుగురు పిల్లలకు కూడా సత్యం నేర్పించింది. ఆమె మీటింగ్స్‌కు, సమావేశాలకు క్రమంగా వెళ్లేది. కొన్ని సంవత్సరాల తర్వాత, పిల్లలు పెద్దయ్యి వేరేచోటుకు వెళ్లిపోయారు. అప్పుడు మేరీకి ఒంటరిగా అనిపించింది కానీ ఎంత కష్టమైనా యెహోవాను సేవించడం మానేయలేదు. కొంతకాలానికి ఆమె తన భర్త కోసం పెట్టిన పత్రికల్ని అతను చదవడం మొదలుపెట్టాడు. తర్వాత మళ్లీ మీటింగ్స్‌కు రావడం మొదలుపెట్టాడు. డేవిడ్‌ కోసం అతని ఆరేళ్ల మనవడు ఎప్పుడూ సీటు ఉంచేవాడు. ఒకవేళ డేవిడ్‌ రాకపోతే ఆ పిల్లవాడు, “తాతయ్య, ఈ రోజు మీటింగ్‌లో నిన్ను మిస్‌ అయ్యాను” అనేవాడు. 25 ఏళ్ల తర్వాత డేవిడ్‌ యెహోవా దగ్గరకు తిరిగి వచ్చాడు. ఇప్పుడు మళ్లీ కలిసి యెహోవాను సేవిస్తున్నందుకు డేవిడ్‌ మేరీలు సంతోషంగా ఉన్నారు.

15. వృద్ధ దంపతులు, యువ దంపతులకు ఎలా సహాయం చేయవచ్చు?

15 నేడు సాతాను కుటుంబాలనే గురిగా చేసుకున్నాడు. అందుకే యెహోవాను సేవించే భార్యాభర్తలు ఒకరికొకరు సహకరించుకోవాలి. మీకు పెళ్లయి ఎంతకాలమైనా సరే, వివాహబంధాన్ని బలంగా ఉంచుకోవడానికి మీరేమి చేయగలరనే దాని గురించి ఆలోచించండి. ఒకవేళ మీరు వృద్ధ దంపతులైతే, యువ దంపతులకు ఆదర్శంగా ఉండవచ్చు. బహుశా ఒక యువ జంటను మీ కుటుంబ ఆరాధనకు ఆహ్వానించవచ్చు. పెళ్లయి ఎంతకాలం గడిచినా, భార్యాభర్తలు ఒకరిపట్ల ఒకరు ప్రేమాప్యాయతలు చూపించుకోవాలని, ఐక్యంగా ఉండాలని ఆ యువ జంట నేర్చుకుంటుంది.—తీతు 2:3-8.

‘యెహోవా పర్వతానికి మనం వెళ్దాం’

16, 17. ఐక్యంగా ఉన్న దేవుని సేవకులు దేని కోసం ఎదురుచూడవచ్చు?

16 ఇశ్రాయేలీయులు పండుగలకు యెరూషలేముకు వెళ్లినప్పుడు, ఒకరికొకరు సహకరించుకునేవాళ్లు. వాళ్ల ప్రయాణానికి అవసరమైన ప్రతీదీ సిద్ధం చేసుకునేవాళ్లు. తర్వాత, వాళ్లు కలిసి ప్రయాణం చేస్తూ ఒకరికొకరు సహాయం చేసుకునేవాళ్లు. దేవాలయంలో, కలిసి యెహోవాను స్తుతించేవాళ్లు, ఆరాధించేవాళ్లు. (లూకా 2:41-44) నేడు, కొత్తలోకంలో జీవితం కోసం సిద్ధపడుతుండగా మనం ఐక్యంగా ఉండాలి, అలాగే ఒకరికొకరు సహకరించుకోవడానికి చేయగలిగినదంతా చేయాలి. అందుకు మీరు ఇంకా ఏం చేయగలరో ఆలోచించండి.

17 లోకంలోని ప్రజలు ఒకరితోఒకరు ఏకీభవించరు, చాలా విషయాల్లో గొడవపడతారు కూడా. కానీ మనం మాత్రం సమాధానంగా ఉండడానికి, సత్యాన్ని అర్థంచేసుకోవడానికి సహాయం చేసినందుకు యెహోవాకు ఎంతో కృతజ్ఞత చూపిస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని ప్రజలు ఆయన కోరుకున్న విధంగా ఆరాధిస్తున్నారు. ముఖ్యంగా ఈ చివరిరోజుల్లో, యెహోవా ప్రజలు ఎప్పటికన్నా మరింత ఐక్యంగా ఉన్నారు. యెషయా, మీకా ప్రవక్తలు ముందే చెప్పినట్టు, మనం కలిసి ‘యెహోవా పర్వతానికి’ వెళ్తున్నాం. (యెష. 2:2-4; మీకా 4:2-4 చదవండి.) భవిష్యత్తులో భూమ్మీదున్న ప్రజలందరూ “చక్కగా అమర్చబడి,” యెహోవాను ఆరాధించడానికి ఒకరికొకరు సహకరించుకోవడం చూసినప్పుడు మనకు ఎంత సంతోషంగా ఉంటుందో కదా!