కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ తోటి సహోదరసహోదరీలకు ఎలాంటి సహాయం, ఓదార్పు, బైబిలు నుండి ప్రోత్సాహం అవసరమో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి

మీ సంఘంలో సహాయం చేయగలరా?

మీ సంఘంలో సహాయం చేయగలరా?

పరలోకానికి తిరిగి వెళ్లేముందు యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, ‘మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు.’ (అపొ. 1:8) అయితే వాళ్లు భూమంతటా ఎలా ప్రకటించగలుగుతారు?

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మార్టిన్‌ గుడ్‌మాన్‌ ఇలా చెప్తున్నాడు, “ఇతరులకు బోధించే పనిని ప్రాముఖ్యంగా ఎంచినందుకు క్రైస్తవులు ప్రాచీన రోమా సామ్రాజ్యంలోని యూదులతో సహా ఇతర మతగుంపులకు వేరుగా ఉన్నారు.” యేసు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లి సువార్త ప్రకటించాడు. ఆయన మాదిరిని అనుకరిస్తూ నిజక్రైస్తవులు, ప్రతీచోట “దేవుని రాజ్యసువార్తను” ప్రకటించాలి. అంతేకాదు సత్యం తెలుసుకోవాలనుకుంటున్న ప్రజల కోసం వెదకాలి. (లూకా 4:43) అందుకే మొదటి శతాబ్దంలోని సంఘంలో “అపొస్తలులు” ఉండేవాళ్లు. ఆ పదానికి, ప్రకటించడానికి పంపబడినవాళ్లు అని అర్థం. (మార్కు 3:14-15, NW) యేసు తన అనుచరులను “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని ఆజ్ఞాపించాడు.—మత్త. 28:18-20.

యేసు 12 మంది అపొస్తలులు చనిపోయినప్పటికీ నేడు ఎంతోమంది యెహోవా సేవకులు వాళ్లను ఆదర్శంగా తీసుకుని సువార్త ప్రకటిస్తున్నారు. అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో సేవచేయడానికి వాళ్లను ఆహ్వానించినప్పుడు “నేనున్నాను నన్ను పంపు” అని ముందుకొస్తున్నారు. (యెష. 6:8) ఉదాహరణకు గిలియడ్‌ పాఠశాలలో శిక్షణ పొందిన వేలమంది సహోదరసహోదరీలు సువార్త ప్రకటించడానికి వేరే దేశాలకు వెళ్లారు. ఇంకొందరు తమ దేశంలోనే అవసరం ఎక్కువున్న వేరే ప్రాంతానికి వెళ్లారు. ఎంతోమంది కొత్త భాషను నేర్చుకుని ఆ భాషా సంఘానికి లేదా గుంపుకు సహాయం చేస్తున్నారు. అలా చేయడం అన్నిసార్లు సులభం కాదు. అయినప్పటికీ ఈ సహోదరసహోదరీలు ఇష్టంగా త్యాగాలు చేస్తూ యెహోవా మీద, ప్రజల మీద తమకున్న ప్రేమను చూపిస్తున్నారు. దానికోసం వాళ్లు జాగ్రత్తగా ప్రణాళిక వేసుకుని, తమ సమయాన్ని, శక్తిని, డబ్బును అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి ఉపయోగించారు. (లూకా 14:28-30) వాళ్లు చేస్తున్న ఆ పని చాలా విలువైనది.

మనందరి పరిస్థితులు ఒకేలా ఉండవు కాబట్టి మనలో ప్రతీఒక్కరూ అవసరం ఎక్కువున్న ప్రాంతాలకు వెళ్లలేకపోవచ్చు లేదా కొత్త భాష నేర్చుకోలేకపోవచ్చు. కానీ మనందరం మనం ఉంటున్న సంఘంలోనే మిషనరీలు లాంటి స్ఫూర్తితో సేవచేయవచ్చు.

మీ సంఘంలోనే మిషనరీగా ఉండవచ్చు

ప్రస్తుతం మీకున్న పరిస్థితుల్ని చక్కగా ఉపయోగిస్తూ . . .

మొదటి శతాబ్దంలోని చాలామంది క్రైస్తవులు, మిషనరీలు కాకపోయినా వాళ్లు తమ సొంతపట్టణంలోనే ఉంటూ ప్రకటనాపనిని ఉత్సాహంగా చేశారు. పౌలు తిమోతితో, “సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము” అని చెప్పాడు. (2 తిమో. 4:5) ఈ మాటలు మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులతోపాటు మనకు కూడా వర్తిస్తాయి. రాజ్య సువార్తను ప్రకటించి, శిష్యుల్ని చేయాలనే ఆజ్ఞను క్రైస్తవులందరూ తప్పకుండా పాటించాలి. మనం ఉంటున్న సంఘంలో కూడా మిషనరీల్లా సేవచేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.

ఉదాహరణకు, మిషనరీలు వేరే దేశానికి వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులు వేరుగా ఉంటాయి, వాటికి అలవాటు పడడానికి వాళ్లు కొత్తకొత్త పద్ధతులు ప్రయత్నించాలి. అయితే మనం అవసరం ఎక్కువున్న ప్రాంతాలకు వెళ్లలేకపోయినా, సువార్త ప్రకటించడానికి కొత్తకొత్త పద్ధతుల్ని ఉపయోగిస్తున్నామా? ఉదాహరణకు, మన సంస్థ 1940లో మొట్టమొదటిసారి వారానికి ఒక రోజు వీధి సాక్ష్యం ఇవ్వమని సహోదరసహోదరీలను ప్రోత్సహించింది. వీధి సాక్ష్యం ఇవ్వడానికి మీరు ప్రయత్నించారా? మీరు ఎప్పుడైనా లిటరేచర్‌ కార్టు ఉపయోగించారా? విషయమేమిటంటే, కొత్త పద్ధతుల్లో సువార్త ప్రకటించడానికి మీరు ఇష్టపడుతున్నారా?

ఇతరులు ‘సువార్తికుని పనిచేసేలా’ ప్రోత్సహించండి

మీరు సానుకూలంగా ఆలోచిస్తే పరిచర్యను ఉత్సాహంగా, ఆసక్తిగా చేయగలుగుతారు. అవసరం ఎక్కువ ఉన్న ప్రాంతాలకు వెళ్లేవాళ్లు లేదా కొత్త భాష నేర్చుకునేవాళ్లు ఎక్కువశాతం అర్హులైన ప్రచారకులే, వాళ్లు సంఘానికి ఎంతో సహాయం చేయగలరు. ఉదాహరణకు, వాళ్లు పరిచర్యను ముందుండి నడిపిస్తారు. స్థానిక సహోదరులు అర్హతలు సాధించేంతవరకు కొన్నిసార్లు మిషనరీలే సంఘ బాధ్యతల్ని నిర్వర్తిస్తారు. మీరు బాప్తిస్మం తీసుకున్న సహోదరుడైతే, పరిచర్య సేవకునిగా లేదా పెద్దగా సేవచేయడానికి కావాల్సిన అర్హతలు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా?—1 తిమో. 3:1.

బలపర్చేవాళ్లుగా ఉండండి

అవసరమైన సహాయం చేయండి

మన సంఘంలో మరితర మార్గాల్లో కూడా సహాయం చేయవచ్చు. యౌవనులు-వృద్ధులు, సహోదరులు-సహోదరీలు ఎవరమైనా సరే, అవసరంలో ఉన్న తోటి సహోదరసహోదరీలను ‘బలపర్చు’ వారిగా ఉండవచ్చు.—కొలొ. 4:11, NW, అధస్సూచి.

మనం తోటి సహోదరసహోదరీలకు సహాయం చేయాలంటే వాళ్ల గురించి మనకు బాగా తెలిసుండాలి. కూటాల్లో కలుసుకున్నప్పుడు మన సహోదరసహోదరీల అవసరాల గురించి ‘ఆలోచించాలని’ బైబిలు మనల్ని ప్రోత్సహిస్తుంది. (హెబ్రీ. 10:24, 25) అంటే, మనం వేరేవాళ్ల సొంత విషయాల గురించి అతిగా ఆసక్తి చూపించాలని కాదుగానీ మన సహోదరసహోదరీలకు ఏమి అవసరమో అర్థంచేసుకోవడానికి ప్రయత్నించాలని దానర్థం. వాళ్లకు వీలైన సహాయమో, ఓదార్పుకరమైన మాటలో, బైబిలు నుండి ప్రోత్సాహమో అవసరంకావచ్చు. కొన్ని సందర్భాల్లో పరిచర్య సేవకులు లేదా పెద్దలు మాత్రమే సహాయం చేయగల విషయాలు ఉండవచ్చు. (గల. 6:1) కానీ మనందరం వయసు పైబడిన సహోదరసహోదరీలకు, కష్టాలు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సహాయం చేయవచ్చు.

▪ సమస్యలతో సతమతమౌతున్న వాళ్లతో ఓదార్పుగా మాట్లాడండి

సాల్వాటోరె అనే సహోదరుడు అలాంటి సహాయాన్నే పొందాడు. ఆ సహోదరునికి ఎదురైన తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులవల్ల తన వ్యాపారాన్ని, ఇంటిని, చాలా వస్తువుల్ని అమ్మేశాడు. ఆయన తన కుటుంబం గురించి చాలా ఆందోళనపడ్డాడు. అదే సంఘంలో ఉంటున్న ఓ కుటుంబం సాల్వాటోరె కుటుంబానికి సహాయం అవసరమని గుర్తించి, వాళ్లకు కొంత డబ్బును ఇచ్చారు. దాంతోపాటు సాల్వాటోరె, ఆయన భార్య ఉద్యోగం సంపాదించుకునేందుకు సహాయం చేశారు. అంతేకాదు ఆ కుటుంబంతో ఎన్నో సాయంత్రాలు సమయం గడిపి, వాళ్లు చెప్పే విషయాలు విన్నారు, కావాల్సిన ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఆ రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. కష్టకాలాల్లో వాళ్లు కలిసి గడిపిన సమయం ఆ రెండు కుటుంబాలకు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.

నిజక్రైస్తవులు తమ నమ్మకాల గురించి ఇతరులకు ధైర్యంగా చెప్తారు. మనం యేసును అనుకరిస్తూ దేవుడు చేసిన అద్భుతమైన వాగ్దానాల గురించి అందరికీ చెప్పాలి. అంతేకాదు వేరే ప్రాంతానికి వెళ్లగలిగినా, వెళ్లలేకపోయినా మనం ఉంటున్న సంఘంలోనే ఇతరులకు సహాయం చేయడానికి చేయగలిగినదంతా చేయవచ్చు. (గల. 6:10) ఇతరులకు ఇచ్చినప్పుడు మనం సంతోషాన్ని పొందుతాం, “ప్రతి సత్కార్యములో సఫలులు” అవుతాం.—కొలొ. 1:9-12; అపొ. 20:35.