కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా తన ప్రజలను జీవమార్గంలో నడిపిస్తాడు

యెహోవా తన ప్రజలను జీవమార్గంలో నడిపిస్తాడు

“ఇదే త్రోవ దీనిలో నడువుడి.”యెష. 30:21.

పాటలు: 32, 48

1, 2. (ఎ) ఏ హెచ్చరిక చాలామంది ప్రాణాల్ని కాపాడింది? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) తమ ప్రాణాల్ని కాపాడుకునేలా నేడు యెహోవా తన ప్రజల్ని ఎలా నడిపిస్తున్నాడు?

 “ఆగండి, చూడండి, వినండి.” 100 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం ఉత్తర అమెరికాలో, ఈ మూడు మాటలు రాసివున్న పెద్దపెద్ద బోర్డుల్ని రైల్వే క్రాసింగుల దగ్గర పెట్టారు. ఎందుకో తెలుసా? వాహనాల్లో వెళ్తున్నవాళ్లు, వేగంగా వస్తున్న రైలును గమనించకుండా పట్టాలు దాటుతూ యాక్సిడెంట్‌ పాలవ్వకూడదనే ఉద్దేశంతో ఆ బోర్డులు పెట్టారు. ఆ హెచ్చరికల్ని పాటించడంవల్ల ఎంతోమంది తమ ప్రాణాలు కాపాడుకున్నారు.

2 అయితే యెహోవా ప్రాణాల్ని కాపాడే హెచ్చరికల్ని ఇవ్వడం మాత్రమే కాదు, తన ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉంటూ నిత్యజీవాన్ని సొంతం చేసుకునేలా వాళ్లను నడిపిస్తున్నాడు కూడా. ఓ ప్రేమగల కాపరి తన గొర్రెల్ని ప్రమాదాల్లో పడకుండా హెచ్చరిస్తూ వాటిని నడిపించినట్లే యెహోవా కూడా తన ప్రజల్ని నడిపిస్తున్నాడు.—యెషయా 30:20, 21 చదవండి.

యెహోవా మొదటినుండి తన ప్రజల్ని నడిపిస్తున్నాడు

3. మనుషులందరూ ఎందుకు చనిపోతున్నారు?

3 మానవ చరిత్ర ప్రారంభం నుండి, యెహోవా తన ప్రజలకు స్పష్టమైన సూచనల్ని లేదా నిర్దేశాల్ని ఇస్తున్నాడు. ఉదాహరణకు మనుషులందరికీ శాశ్వతమైన జీవాన్నీ సంతోషాన్నీ ఇచ్చే స్పష్టమైన సూచనలు యెహోవా ఏదెను తోటలో ఇచ్చాడు. (ఆది. 2:15-17) కానీ తమ ప్రేమగల తండ్రి ఇచ్చిన నిర్దేశాల్ని ఆదాముహవ్వలు పట్టించుకోలేదు. బదులుగా సాతాను పామును ఉపయోగించి ఇచ్చిన సలహాను హవ్వ విన్నది, ఆ తర్వాత ఆమె చెప్పిన మాటల్ని ఆదాము విన్నాడు. దానివల్ల ఏం జరిగింది? ఇద్దరూ కష్టాలపాలై, ఏ నిరీక్షణ లేకుండా చనిపోయారు. అంతేకాదు వాళ్లు దేవుని మాట వినకపోవడంవల్ల మనుషులందరూ చనిపోతున్నారు.

4. (ఎ) జలప్రళయం తర్వాత ప్రజలకు కొత్త నిర్దేశాలు ఎందుకు అవసరమయ్యాయి? (బి) కొత్త పరిస్థితులు దేవుని అభిప్రాయాలను ఎలా తెలియజేశాయి?

4 యెహోవా నోవహుకు ప్రాణాల్ని కాపాడే నిర్దేశాల్ని ఇచ్చాడు. జలప్రళయం తర్వాత, తన ప్రజలు రక్తం తినకూడదు లేదా తాగకూడదు అని యెహోవా ఆజ్ఞాపించాడు. ఎందుకు? ఎందుకంటే అప్పటినుండి ప్రజలు, మాంసాన్ని తినడానికి ఆయన అనుమతించాడు. ఈ కొత్త పరిస్థితులవల్ల వాళ్లకు ఈ కొత్త నిర్దేశాలు అవసరమయ్యాయి: “మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు; రక్తమే దాని ప్రాణము.” (ఆది. 9:1-4) తనకు చెందే జీవం విషయంలో యెహోవా అభిప్రాయమేమిటో తెలుసుకోవడానికి ఈ ఆజ్ఞ మనకు సహాయం చేస్తుంది. యెహోవా సృష్టికర్త, ఆయనే మనకు జీవాన్నిచ్చాడు కాబట్టి, జీవం విషయంలో నియమాలు ఇవ్వడానికి ఆయనకు మాత్రమే హక్కు ఉంది. ఉదాహరణకు, హత్య చేయకూడదని ఆయన మనుషుల్ని ఆజ్ఞాపించాడు. ఆయన జీవాన్ని, రక్తాన్ని పవిత్రంగా చూస్తున్నాడు. వాటిని గౌరవించనివాళ్లను ఆయన శిక్షిస్తాడు.—ఆది. 9:5, 6.

5. ఈ ఆర్టికల్‌లో దేన్ని పరిశీలిస్తాం? ఎందుకు?

5 నోవహు కాలం తర్వాత యెహోవా తన ప్రజల్ని నడిపిస్తూనే ఉన్నాడు. ఆయన వాళ్లను ఎలా నడిపించాడో తెలిపే కొన్ని ఉదాహరణల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిద్దాం. మనల్ని కొత్తలోకంలోకి నడిపించడానికి యెహోవా ఇచ్చే నిర్దేశాల్ని పాటించాలనే మన నిర్ణయాన్ని ఈ ఆర్టికల్‌ మరింత బలపరుస్తుంది.

కొత్త జనాంగం, కొత్త నిర్దేశాలు

6. మోషే ద్వారా యెహోవా ఇచ్చిన నియమాల్ని ఆ కాలంలోని దేవుని ప్రజలు ఎందుకు తప్పనిసరిగా పాటించాల్సి వచ్చింది? ఆ నియమాల్ని వాళ్లు ఎలా చూడాలి?

6 మోషే కాలంలోని తన ప్రజలు ఎలా ప్రవర్తించాలి, ఎలా ఆరాధించాలి వంటి విషయాల్లో యెహోవా స్పష్టమైన నిర్దేశాల్ని ఇచ్చాడు. ఎందుకు? ఎందుకంటే పరిస్థితులు మళ్లీ మారాయి. ఇశ్రాయేలీయులు 200 కన్నా ఎక్కువ సంవత్సరాలు ఈజిప్టులో బానిసలుగా జీవించారు. అక్కడ వాళ్ల చుట్టూ ఉన్న ప్రజలు చనిపోయినవాళ్లను, విగ్రహాలను ఆరాధించేవాళ్లు. అంతేకాదు దేవున్ని అగౌరవపర్చే ఎన్నో పనులు చేసేవాళ్లు. కాబట్టి బానిసత్వం నుండి విడుదలయ్యాక దేవుని ప్రజలకు కొత్త నిర్దేశాలు అవసరమయ్యాయి. వాళ్లు యెహోవా ధర్మశాస్త్రాన్ని మాత్రమే పాటించే జనాంగంగా ఉంటారు. “ధర్మశాస్త్రం” అనే పదం, హీబ్రూలో “నడిపించడం, నిర్దేశించడం, నేర్పించడం” అని అర్థమిచ్చే పదాలకు సంబంధించినదని కొన్ని రెఫరెన్సు పుస్తకాలు చెప్తున్నాయి. అయితే యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రం, ఇశ్రాయేలీయుల్ని వాళ్ల చుట్టూ ఉన్న చెడు ప్రవర్తన, అబద్ధారాధన నుండి కాపాడింది. ఇశ్రాయేలీయులు దేవుని నిర్దేశాల్ని పాటించినప్పుడు దీవెనలు పొందారు. కానీ వాటిని పాటించనప్పుడు ఘోరమైన పర్యవసానాలను అనుభవించారు.—ద్వితీయోపదేశకాండము 28:1, 2, 15 చదవండి.

7. (ఎ) యెహోవా తన ప్రజలకు నిర్దేశాలు ఇవ్వడానికి మరో కారణం ఏమిటో వివరించండి. (బి) ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకు ఏవిధంగా ఓ ‘బాలశిక్షకునిగా’ పనిచేసింది?

7 కొత్త నిర్దేశాలు అవసరమవ్వడానికి మరో కారణం కూడా ఉంది. అదేంటంటే, ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయుల్ని దేవుని సంకల్పానికి సంబంధించిన ఓ ప్రాముఖ్యమైన సంఘటన కోసం అంటే మెస్సీయ లేదా యేసుక్రీస్తు రాకడ కోసం సిద్ధం చేసింది. తాము అపరిపూర్ణులమనే విషయాన్ని ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకు గుర్తుచేసేది. అంతేకాదు వాళ్లకు విమోచన క్రయధనం, అంటే వాళ్ల పాపాల్ని పూర్తిగా కడిగేసే ఓ పరిపూర్ణ బలి అవసరమని అర్థంచేసుకోవడానికి కూడా అది వాళ్లకు సహాయం చేసింది. (గల. 3:19; హెబ్రీ. 10:1-10) వాటితోపాటు, మెస్సీయ వచ్చే వంశావళిని కాపాడడానికి, మెస్సీయను గుర్తుపట్టడానికి ఆ ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకు సహాయం చేసింది. అవును, ధర్మశాస్త్రం కొంతకాలంపాటు వాళ్లను నడిపించే నిర్దేశకునిగా లేదా ‘బాలశిక్షకునిగా’ పనిచేసింది.—గల. 3:23, 24.

8. ధర్మశాస్త్రంలోని సూత్రాల ప్రకారం మనమెందుకు నడవాలి?

8 క్రైస్తవులముగా మనం కూడా, ధర్మశాస్త్రంలో యెహోవా ఇచ్చిన నిర్దేశాల నుండి ప్రయోజనం పొందవచ్చు. ఎలా? మనం ఆగి, ధర్మశాస్త్రం ఏ సూత్రాల మీద ఆధారపడి ఉందో చూడాలి. నిజమే, ఇప్పుడు మనం ఆ ధర్మశాస్త్రం కింద లేము. అయినాసరే అందులో ఉన్న ఎన్నో నియమాల్ని మన రోజువారీ జీవితంలో, అలాగే యెహోవా ఆరాధనలో ఓ గైడ్‌లా ఇప్పటికీ ఉపయోగించవచ్చు. ధర్మశాస్త్రంలోని నియమాల నుండి మనం ప్రయోజనం పొందేలా, సూత్రాలను పాటించేలా, అందులోని ఉన్నత నైతిక ప్రమాణాల పట్ల కృతజ్ఞత చూపించేలా యెహోవా వాటిని బైబిల్లో రాయించాడు. యేసు చెప్పినదాన్ని వినండి: “వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా; నేను మీతో చెప్పునదేమనగా—ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.” కాబట్టి మనం వ్యభిచారానికి మాత్రమే కాదు చెడు ఆలోచనలకు, కోరికలకు కూడా దూరంగా ఉండాలి.—మత్త. 5:27, 28.

9. ఎలాంటి కొత్త పరిస్థితుల వల్ల మళ్లీ కొత్త నిర్దేశాలు అవసరమయ్యాయి?

9 యేసు మెస్సీయగా భూమ్మీదకు వచ్చిన తర్వాత యెహోవా మళ్లీ కొత్త నిర్దేశాల్ని ఇచ్చాడు. అంతేకాదు తన సంకల్పం గురించి మరిన్ని వివరాలు వెల్లడిచేశాడు. ఎందుకు? సా.శ. 33లో యెహోవా ఇశ్రాయేలు జనాంగాన్ని తిరస్కరించి, క్రైస్తవ సంఘంలోని వాళ్లను తన ప్రజలుగా ఎన్నుకున్నాడు. కాబట్టి దేవుని ప్రజల పరిస్థితులు మళ్లీ మారాయి.

ఆధ్యాత్మిక ఇశ్రాయేలుకు నిర్దేశాలు

10. క్రైస్తవ సంఘానికి యెహోవా కొత్త నిర్దేశాల్ని ఎందుకు ఇచ్చాడు? ఇశ్రాయేలీయులకు ఇచ్చిన నిర్దేశాలకు, వీటికి ఉన్న తేడా ఏమిటి?

10 తన ప్రజలు ఎలా జీవించాలో, తనను ఎలా ఆరాధించాలో నేర్పించడానికి యెహోవా ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మొదటి శతాబ్దంలోని దేవుని ప్రజలు వేర్వేరు జనాంగాల నుండి, నేపథ్యాల నుండి వచ్చారు. ఇప్పుడు వాళ్లను ఆధ్యాత్మిక ఇశ్రాయేలు అని పిలుస్తున్నాం. వాళ్లు క్రైస్తవ సంఘంగా ఏర్పడి, కొత్త నిబంధన కింద జీవించారు. వాళ్లు ఎలా జీవించాలో, ఆరాధించాలో చెప్తూ యెహోవా వాళ్లకు కొత్త నిర్దేశాలు ఇచ్చాడు. అవును “దేవుడు పక్షపాతి కాడు . . . ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” (అపొ. 10:34, 35) వాగ్దాన దేశంలోని ప్రాచీన ఇశ్రాయేలీయులు, యెహోవా మోషేకు రాతి పలకల మీద ఇచ్చిన నియమాల్ని పాటించేవాళ్లు. కానీ ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులు, వాళ్ల హృదయాలపై రాయబడిన సూత్రాల ఆధారంగా ఉన్న ‘క్రీస్తు నియమాన్ని’ పాటించారు. క్రైస్తవులు ఎక్కడ ఉంటున్నప్పటికీ వాళ్లందరూ దాన్ని పాటించి ప్రయోజనం పొందవచ్చు.—గల. 6:2.

11. క్రైస్తవుల జీవితంలోని ఏ రెండు విషయాలపై “క్రీస్తు నియమం” ప్రభావం చూపిస్తుంది?

11 యేసు ద్వారా యెహోవా ఇచ్చిన నడిపింపు నుండి ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులు చాలా ప్రయోజనం పొందారు. యేసు తన శిష్యులతో కొత్త నిబంధన చేయడానికి ముందు, వాళ్లకు ముఖ్యమైన రెండు ఆజ్ఞల్ని ఇచ్చాడు. మొదటిది ప్రకటనా పని గురించి. రెండవది క్రైస్తవులు ఎలా ప్రవర్తించాలి, ఒకరితో ఒకరు ఎలా వ్యవహరించాలి అనే దానిగురించి. ఆయన ఈ నిర్దేశాల్ని క్రైస్తవులందరి కోసం ఇచ్చాడు. కాబట్టి మనం పరలోక నిరీక్షణ ఉన్నవాళ్లమైనా లేదా భూమ్మీద నిత్యం జీవించే నిరీక్షణ ఉన్నవాళ్లమైనా నేడు అవి మనందరికీ ఉపయోగపడతాయి.

12. ప్రకటనాపనిలో ఎలాంటి కొత్త మార్పులు వచ్చాయి?

12 ప్రాచీన కాలంలో యెహోవాను ఆరాధించాలంటే ప్రజలు ఇశ్రాయేలుకు రావాల్సి వచ్చేది. (1 రాజు. 8:41-43) అయితే కొంతకాలం తర్వాత యేసు తన శిష్యుల్ని ప్రజలందరి దగ్గరకు ‘వెళ్లమని’ ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞ మత్తయి 28:19, 20 వచనాల్లో ఉంది. (చదవండి.) ప్రపంచంలోని ప్రజలందరికీ సువార్త చేరాలని కోరుకుంటున్నట్లు సా.శ. 33 పెంతెకొస్తు రోజున యెహోవా చూపించాడు. ఆ రోజున, కొత్తగా ఏర్పడ్డ సంఘంలోని దాదాపు 120 మంది పవిత్రశక్తితో నిండుకొని యూదులతో, యూదామత ప్రవిష్టులతో వేర్వేరు భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టారు. (అపొ. 2:4-11) కొంతకాలానికి, సమరయులకు కూడా సువార్త ప్రకటించాలని యెహోవా చెప్పాడు. ఆ తర్వాత సా.శ. 36లో సున్నతి పొందని అన్యులకు కూడా సువార్త ప్రకటించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. అంటే క్రైస్తవులు ప్రపంచంలోని ప్రతీఒక్కరికి ప్రకటించాలని దానర్థం.

13, 14. (ఎ) యేసు ఇచ్చిన “క్రొత్త ఆజ్ఞ” ప్రకారం క్రైస్తవులు ఏమి చేయాలి? (బి) యేసు ఉంచిన ఆదర్శం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

13 తోటి సహోదరసహోదరీలతో ఎలా వ్యవహరించాలనే విషయంలో కూడా యేసు ఓ “క్రొత్త ఆజ్ఞ” ఇచ్చాడు. (యోహాను 13:34, 35 చదవండి.) ఆ ఆజ్ఞ ప్రకారం, మనకు వాళ్లపట్ల ఉన్న ప్రేమను ప్రతీరోజు చూపించాలి. అంతేకాదు వాళ్లకోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అయితే అలా ప్రాణం పెట్టేంత ప్రేమ చూపించాలని మోషే ధర్మశాస్త్రం చెప్పట్లేదు.—మత్త. 22:39; 1 యోహా. 3:16.

14 ఇతరుల నుండి ఏదీ ఆశించకుండా ప్రేమ చూపించే విషయంలో యేసే అత్యుత్తమ ఆదర్శం. ఆయన తన శిష్యుల్ని ఎంత ప్రేమించాడంటే, వాళ్లకోసం ఇష్టంగా చనిపోయాడు. తన అనుచరులందరూ కూడా అలాంటి ప్రేమే చూపించాలని యేసు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం కష్టాల్ని సహించడానికి, మన సహోదరసహోదరీల కోసం ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధంగా ఉండాలి.—1 థెస్స. 2:8.

ఇప్పటి కాలానికి, భవిష్యత్తుకు నిర్దేశాలు

15, 16. నేడు మనం ఎలాంటి కొత్త పరిస్థితుల్లో జీవిస్తున్నాం? దేవుడు మనల్ని ఏవిధంగా నడిపిస్తున్నాడు?

15 తన అనుచరులకు “తగినవేళ” ఆధ్యాత్మిక ఆహారం పెట్టడానికి యేసు ‘నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసున్ని’ నియమించాడు. (మత్త. 24:45-47) పరిస్థితులు మారినప్పుడు ఇచ్చే ముఖ్యమైన నిర్దేశాలు కూడా ఆ ఆధ్యాత్మిక ఆహారంలో భాగమే. అయితే మనం కొత్త పరిస్థితుల్లో జీవిస్తున్నామని ఎలా చెప్పవచ్చు?

16 మనం “అంత్యదినములలో” జీవిస్తున్నాం, పైగా ముందెన్నడూ రాని శ్రమలు మనకు అతిత్వరలో ఎదురౌతాయి. (2 తిమో. 3:1; మార్కు 13:19) అంతేకాదు సాతాను, అతని చెడ్డ దూతలు పరలోకం నుండి భూమ్మీదకు పడద్రోయబడడంతో మన కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. (ప్రక. 12:9, 12) దానితోపాటు మనం యేసు ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తూ, మునుపెన్నడూ లేనంతగా ప్రపంచమంతటా ఉన్న ఎంతోమంది ప్రజలకు ఎన్నో భాషల్లో సువార్త ప్రకటిస్తున్నాం.

17, 18. దేవుడు ఇస్తున్న నిర్దేశాలకు మనమెలా స్పందించాలి?

17 ప్రకటనా పనికి ఉపయోగపడే ఎన్నో ఉపకరణాలను దేవుని సంస్థ మనకు ఇస్తోంది. వాటిని మీరు ఉపయోగిస్తున్నారా? ఆ ఉపకరణాలను మరింత బాగా ఉపయోగించడానికి సహాయం చేసే నిర్దేశాల్ని మనం మీటింగ్స్‌లో వింటున్నాం. ఆ నిర్దేశాలు యెహోవాయే ఇస్తున్నాడని మీరు నమ్ముతున్నారా?

18 యెహోవా ఆశీర్వాదం పొందాలంటే, సంఘం ద్వారా ఆయనిచ్చే నిర్దేశాలన్నిటినీ మనం శ్రద్ధగా వినాలి. ఇప్పుడు వాటిని వింటే, సాతాను దుష్ట వ్యవస్థను నాశనం చేసే ‘మహాశ్రమల’ సమయంలో వచ్చే నిర్దేశాల్ని పాటించడం మనకు తేలికౌతుంది. (మత్త. 24:21) ఆ తర్వాత, సాతాను ప్రభావం ఏమాత్రంలేని కొత్తలోకంలో జీవించడానికి మనకు కొత్త నిర్దేశాలు అవసరమౌతాయి.

పరదైసులో మనమెలా జీవించాలో తెలియజేసే కొత్త నిర్దేశాలు ఉన్న గ్రంథాలను కొత్తలోకంలో యెహోవా మనకు ఇస్తాడు (19, 20 పేరాలు చూడండి)

19, 20. ఏ గ్రంథాలు విప్పబడతాయి? వాటివల్ల మనమెలాంటి ప్రయోజనం పొందుతాం?

19 మోషే కాలంలో, ఇశ్రాయేలు జనాంగానికి కొత్త నిర్దేశాలు అవసరమైనప్పుడు యెహోవా వాళ్లకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత మొదటి శతాబ్దంలోని సంఘం ‘క్రీస్తు నియమాన్ని’ పాటించారు. అదేవిధంగా కొత్తలోకంలో, మనకు కొత్త నిర్దేశాలున్న కొత్త గ్రంథాలను దేవుడిస్తాడని బైబిలు చెప్తుంది. (ప్రకటన 20:12 చదవండి.) బహుశా ఆ గ్రంథాల్లో, మనుషులు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడనే విషయాలు ఉండవచ్చు. వాటిని జాగ్రత్తగా చదవడం వల్ల పునరుత్థానం అయినవాళ్లతో సహా ప్రజలందరూ దేవుడు తమ నుండి ఏం కోరుకుంటున్నాడో తెలుసుకుంటారు. యెహోవా ఆలోచనా విధానం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఆ గ్రంథాలు మనకు సహాయం చేస్తాయి. కొత్తలోకంలో మనం బైబిల్ని మరింత బాగా అర్థంచేసుకుంటాం కాబట్టి అప్పుడు ప్రతీఒక్కరూ ఒకర్నొకరు ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ, ఘనపరుచుకుంటూ ఉంటారు. (యెష. 26:9) రాజైన యేసుక్రీస్తు నడిపింపు కింద మనం ఎన్ని విషయాలు నేర్చుకుంటామో, బోధిస్తామో ఒక్కసారి ఊహించండి.

20 “గ్రంథములయందు వ్రాయబడియున్న” నిర్దేశాలను మనం పాటిస్తూ, చివరి పరీక్షలో మనం యెహోవాకు నమ్మకంగా ఉంటే, అప్పుడాయన ‘జీవగ్రంథంలో’ మన పేర్లను శాశ్వతంగా రాస్తాడు. అప్పుడు మనం నిత్యజీవాన్ని సొంతం చేసుకుంటాం. కాబట్టి మనం బైబిలు ఏం చెప్తుందో చదవడానికి ఆగాలి, దాని నుండి మనం ఏం నేర్చుకోవచ్చో చూడాలి, ఇప్పుడు దేవుడు ఇస్తున్న నిర్దేశాల్ని పాటిస్తూ ఆయన మాట వినాలి. ఇవన్నీ చేస్తే, మనం మహాశ్రమల్ని తప్పించుకుంటాం, జ్ఞానవంతుడూ ప్రేమాస్వరూపీ అయిన యెహోవా దేవుని గురించి శాశ్వతంగా నేర్చుకుంటూ ఉండే అవకాశాన్ని పొందుతాం.—ప్రసం. 3:11; రోమా. 11:33.