కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యౌవనులారా​—బాప్తిస్మానికి మీరెలా సిద్ధపడవచ్చు?

యౌవనులారా​—బాప్తిస్మానికి మీరెలా సిద్ధపడవచ్చు?

“నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము.”కీర్త. 40:8.

పాటలు: 51, 45

1, 2. (ఎ) బాప్తిస్మం తీసుకోవాలనుకోవడం ఎందుకు చాలా పెద్ద నిర్ణయమో వివరించండి. (బి) బాప్తిస్మం తీసుకోవడానికి ముందు ఒక వ్యక్తికి ఏ విషయాలు తెలిసుండాలి? అది ఎందుకు ప్రాముఖ్యం?

 మీరు బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్న యౌవనులా? అలాగైతే మీరు జీవితంలో పొందగల అత్యంత గొప్ప గౌరవం అదే. ముందటి ఆర్టికల్‌లో మనం చర్చించుకున్నట్లు బాప్తిస్మం తీసుకోవాలనుకోవడం చాలా పెద్ద నిర్ణయం. బాప్తిస్మం తీసుకోవడం ద్వారా, మీరు యెహోవాకు సమర్పించుకున్నారని అంటే ఎప్పటికీ యెహోవాను సేవిస్తారనీ, ఆయన చిత్తం చేయడమే మీకు అన్నిటికన్నా చాలా ప్రాముఖ్యమనీ మాటిచ్చినట్లు ఇతరులకు చూపిస్తారు. ఆ మాట చాలా గంభీరమైన విషయం. అందుకే, బాప్తిస్మం తీసుకోవడానికి ముందు మీరు పరిణతి చెందాలి, బాప్తిస్మం తీసుకోవాలనే కోరిక మీ హృదయంలో ఉండాలి, దేవునికి సమర్పించుకోవడం అంటే ఏమిటో మీకు తెలిసుండాలి.

2 అయితే, మీరు బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా లేరని మీకనిపించవచ్చు. లేదా మీరు సిద్ధంగా ఉన్నారని మీకు అనిపించినా, మీ అమ్మానాన్నలు మాత్రం మీకు ఇంకొంచెం వయసు వచ్చాక, జీవితంలో కొంత అనుభవం సంపాదించాక బాప్తిస్మం తీసుకుంటే బాగుంటుందని అనుకోవచ్చు. అప్పుడు మీరేమి చేయాలి? నిరుత్సాహపడకండి. బదులుగా, ఆ సమయాన్ని మీరు ప్రగతి సాధించడానికి ఉపయోగించుకోండి, అలా చేస్తే త్వరలోనే మీరు బాప్తిస్మం తీసుకోవడానికి కావాల్సిన అర్హతలు సంపాదించుకోగలుగుతారు. వాటిని సంపాదించుకోవడానికి మూడు విషయాల్లో ప్రగతి సాధించాలనే లక్ష్యాల్ని పెట్టుకోవచ్చు: (1) మీ నమ్మకాలు, (2) మీ పనులు, (3) మీ కృతజ్ఞత.

మీ నమ్మకాలు

3, 4. తిమోతి నుండి యౌవనులు ఏ పాఠం నేర్చుకోవచ్చు?

3 ఈ ప్రశ్నలకు మీ జవాబులు ఏంటో ఆలోచించండి, దేవుడు ఉన్నాడని నేను ఎందుకు నమ్ముతున్నాను? బైబిల్ని దేవుడే ఇచ్చాడని నేను ఎందుకు నమ్ముతున్నాను? ఈ లోక ప్రమాణాలను పాటించకుండా దేవుని ఆజ్ఞలకు నేను ఎందుకు లోబడుతున్నాను? అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఈ సలహాను పాటించడానికి ఇవి మీకు సహాయం చేస్తాయి, ‘ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోండి.’ (రోమా. 12:2) మీరు ఎందుకలా చేయాలి?

4 ఈ విషయాన్ని అర్థంచేసుకోవడానికి తిమోతి ఉదాహరణ మీకు సహాయం చేస్తుంది. ఆయనకు బైబిలు గురించి బాగా తెలుసు ఎందుకంటే చిన్నప్పటినుండి వాళ్ల అమ్మ, అమ్మమ్మ ఆయనకు సత్యం నేర్పించారు. అయితే పౌలు తిమోతికి ఇలా చెప్పాడు, “నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్న . . . వాటియందు నిలుకడగా ఉండుము.” (2 తిమో. 3:14, 15) ఇక్కడ “రూఢియని” అనే పదానికి “ఏదైనా ఒక విషయం సత్యమని ఖచ్చితంగా తెలుసుకోవడం, నమ్మడం” అని అర్థం. తాను తెలుసుకున్నది సత్యమని తిమోతి నమ్మాడు. అయితే, వాళ్ల అమ్మ, అమ్మమ్మ చెప్పినందువల్ల కాదుగానీ ఆయన నేర్చుకున్న విషయాలను పరీక్షించి తెలుసుకున్నాడు కాబట్టే అలా నమ్మాడు.—రోమీయులు 12:1, 2 చదవండి.

5, 6. ‘ఆలోచనా సామర్థ్యాన్ని’ ఉపయోగించడం చిన్నప్పటినుండే ఎందుకు నేర్చుకోవాలి?

5 మరి మీ సంగతేంటి? బహుశా మీకు చాలాకాలం నుండి సత్యం తెలిసుండవచ్చు. అలాగైతే మీ నమ్మకాలకుగల కారణాలను ఆలోచించాలనే లక్ష్యం పెట్టుకోండి. అలా చేయడంవల్ల మీ విశ్వాసం బలపడుతుంది. అంతేకాదు తోటివాళ్ల ఒత్తిడివల్ల, లోకస్థుల ఆలోచనలవల్ల, లేదా మీ సొంత ఆలోచనలవల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండగలుగుతారు.

6 మీరు చిన్నప్పటినుండే మీ ‘ఆలోచనా సామర్థ్యాన్ని’ ఉపయోగించడం నేర్చుకోవాలి. అలా చేస్తే, మీ తోటివాళ్లు మిమ్మల్ని, ‘దేవుడు ఉన్నాడని నీకు ఖచ్చితంగా ఎలా తెలుసు? దేవుడు మనల్ని ప్రేమిస్తుంటే చెడు సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? దేవుడు ఎప్పటి నుండో ఉనికిలో ఉండడం ఎలా సాధ్యం?’ అని ప్రశ్నించినప్పుడు వాళ్లకు జవాబివ్వగలుగుతారు. మీరు సిద్ధపడి ఉంటే ఇలాంటి ప్రశ్నలు మీ మనసులో అనుమానాల్ని సృష్టించవు, బదులుగా బైబిల్ని మరింత జాగ్రత్తగా చదవాలనే కోరికను కలిగిస్తాయి.

7-9. మన వెబ్‌సైట్‌లో “బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది” అనే శీర్షిక కింద ఉన్న స్టడీ గైడ్‌లు మీ నమ్మకాలను బలపర్చుకోవడానికి ఎలా సహాయం చేస్తాయో వివరించండి.

7 శ్రద్ధగా వ్యక్తిగత అధ్యయనం చేయడంవల్ల మీ ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి, సందేహాలు తీరతాయి, మీ నమ్మకాలు బలపడతాయి. (అపొ. 17:11) అందుకు సహాయం చేసే ఎన్నో ప్రచురణలను సంస్థ ప్రచురించింది. సృష్టికర్త గురించి, ఆయన చేసిన సృష్టి గురించి వివరించే ప్రచురణలు చదవడం వల్ల చాలామంది ప్రయోజనం పొందారు. దానితోపాటు jw.org వెబ్‌సైట్‌లోని “ బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?” అనే శీర్షిక కింద ఉన్న ఎన్నో ఆర్టికల్స్‌ నుండి కూడా చాలామంది యౌవనులు ప్రయోజనం పొందారు. ఈ ఆర్టికల్స్‌ను మీరు “బైబిలు బోధలు” కింద “టీనేజర్లు” అనే సెక్షన్‌లో చూడవచ్చు. అందులో ఉన్న ప్రతీ స్టడీ గైడ్‌ బైబిలు అంశాల మీద మీ నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది.

8 మీకు బైబిల్లోని విషయాలు ఇప్పటికే తెలుసు కాబట్టి స్టడీ గైడ్‌లో ఉన్న కొన్ని ప్రశ్నలకు జవాబులు మీకు తెలిసివుండవచ్చు. అయితే మీరు ఆ జవాబుల్ని నమ్ముతున్నారా? వివిధ లేఖనాల గురించి జాగ్రత్తగా ఆలోచించడానికి, మీరు ఫలానా విషయాన్ని నమ్మడానికిగల కారణాలను రాయడానికి స్టడీ గైడ్‌లు సహాయం చేస్తాయి. మీ నమ్మకాలను ఇతరులకు ఎలా వివరించాలో తెలుసుకోవడానికి అవి మీకు సహాయం చేస్తాయి. మీకు ఒకవేళ మన వెబ్‌సైట్‌లోని “బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?” అనే అంశంతో వచ్చే ఆర్టికల్స్‌ చూసే అవకాశం ఉంటే, వాటిని మీ వ్యక్తిగత అధ్యయనంలో ఉపయోగించవచ్చు. మీ నమ్మకాలను బలపర్చుకోవడానికి అవి మీకు సహాయం చేస్తాయి.

9 మీ నమ్మకాలను బలపర్చుకుంటే బాప్తిస్మం అనే ప్రాముఖ్యమైన చర్య తీసుకుంటారు. టీనేజీలో ఉన్న ఓ సహోదరి ఇలా చెప్తుంది, “నేను బాప్తిస్మం తీసుకోవాలనే నిర్ణయానికి రాకముందు, బైబిల్ని చదివి ఇదే నిజమైన మతమని గుర్తించాను. రోజురోజుకీ నా నమ్మకం బలపడుతూనే ఉంది.”

మీ పనులు

10. బాప్తిస్మం తీసుకున్నవాళ్లు తమ విశ్వాసానికి తగినట్లు ఎందుకు ప్రవర్తించాలి?

10 “విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును” అని బైబిలు చెప్తుంది. (యాకో. 2:17) మీరు తెలుసుకున్న వాటిని బలంగా నమ్మితే, ఆ నమ్మకాన్ని క్రియల్లో చూపిస్తారు. అంటే బైబిలు చెప్తున్నట్లు, “మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను” ఉంటారు.—2 పేతురు 3:11, 12 చదవండి.

11. “పరిశుద్ధమైన ప్రవర్తన” అంటే ఏమిటో వివరించండి.

11 “పరిశుద్ధమైన ప్రవర్తన” అంటే ఏమిటి? మీ ప్రవర్తన లేదా పనులు పరిశుద్ధంగా ఉంటే మీరు నైతికంగా పరిశుభ్రంగా ఉంటారు. ఉదాహరణకు, గడిచిన ఆరు నెలల్ని ఓసారి గుర్తుచేసుకోండి. తప్పు చేయాలనే శోధన ఎదురైనప్పుడు ఏది తప్పో, ఏది సరైనదో జాగ్రత్తగా ఆలోచించారా? (హెబ్రీ. 5:14) మీరు శోధనలకు లేదా తోటివాళ్ల ఒత్తిడికి లొంగిపోకుండా ఉన్న సందర్భాలు ఏమైనా గుర్తున్నాయా? స్కూల్లో మీ ప్రవర్తన ఇతరులకు ఆదర్శంగా ఉందా? యెహోవాకు నమ్మకంగా ఉన్నారా లేదా మీ స్నేహితులు ఎగతాళి చేస్తారనే భయంతో వాళ్లలో ఒకరిలా ప్రవర్తిస్తున్నారా? (1 పేతు. 4:3, 4) నిజమే మనలో ఎవ్వరం పరిపూర్ణులం కాదు. యెహోవాను ఎంతోకాలంగా సేవిస్తున్నవాళ్లు కూడా ప్రీచింగ్‌లో మాట్లాడడానికి కొన్నిసార్లు సిగ్గుపడవచ్చు, భయపడవచ్చు. కానీ దేవునికి సమర్పించుకున్న ఓ వ్యక్తి తాను యెహోవాసాక్షిగా ఉన్నందుకు గర్వపడుతున్నానని తన మంచి ప్రవర్తన ద్వారా చూపిస్తాడు.

12. “భక్తితో” చేసే కొన్ని పనులు ఏమిటి? వాటిని మీరెలా చూడాలి?

12 “భక్తితో” చేసే పనులు అంటే ఏమిటి? సంఘంలో మీరు చేసే పనులన్నీ, అంటే మీటింగ్స్‌కి వెళ్లడం, ప్రీచింగ్‌ చేయడం వంటివన్నీ భక్తితో చేసే పనులే. అయితే కేవలం అవే కాదు, మీరు వ్యక్తిగతంగా యెహోవాకు చేసే ప్రార్థన, అధ్యయనం కూడా అందులో ఉన్నాయి. యెహోవాకు తమ జీవితాన్ని సమర్పించుకున్న ఎవ్వరూ వీటిని చేయడం భారంగా అనుకోరు. బదులుగా, రాజైన దావీదు అనుకున్నట్లే వాళ్లూ అనుకుంటారు. ఆయనిలా అన్నాడు, “నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.”—కీర్త. 40:8.

13, 14. “భక్తితో” పనులు చేయడానికి మీకు సహాయం చేసే ఎలాంటి ఏర్పాటు ఉంది? దాన్నుండి కొంతమంది యౌవనులు ఎలా ప్రయోజనం పొందారు?

13 ఈ ప్రశ్నల గురించి ఆలోచించడం వల్ల మీకు ప్రయోజనం ఉండవచ్చు: “ప్రతీ విషయం గురించి మీరు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారా? అవి యెహోవాపట్ల మీకున్న ప్రేమను ఎలా చూపిస్తున్నాయి?” “మీ వ్యక్తిగత అధ్యయనంలో వేటిని కూడా పరిశీలిస్తారు?” “ఒకవేళ మీ అమ్మానాన్నలు ప్రీచింగ్‌కి వెళ్లకపోయినా మీరు వెళ్తున్నారా?” [1] వీటికి జవాబుల్ని ఓ పేపరు మీద రాసుకోండి. మీ ప్రార్థనలు, వ్యక్తిగత అధ్యయనం, ప్రీచింగ్‌ వంటివాటిని మరింత మెరుగుపర్చుకోవాలనే లక్ష్యాల్ని పెట్టుకోవడానికి అవి మీకు సహాయం చేస్తాయి.

14 ఇలాంటి ప్రశ్నలకు జవాబుల్ని ఓ పేపరు మీద రాసుకోవడం వల్ల బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్న కొంతమంది యౌవనులు ప్రయోజనం పొందారు. టిల్డ అనే ఓ యువ సహోదరి, అలాంటి ప్రశ్నలకు జవాబులు రాసిపెట్టుకోవడం వల్ల లక్ష్యాల్ని పెట్టుకోగలిగిందని చెప్పింది. అంతేకాదు ఆమె ఆ లక్ష్యాలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి చేరుకోగలిగింది కూడా. అలా ఓ సంవత్సరం తర్వాత బాప్తిస్మానికి కూడా అర్హత సంపాదించుకుంది. పాట్రిక్‌ అనే యువ సహోదరునికి కూడా అలాంటి అనుభవమే ఉంది. ఆయనిలా చెప్తున్నాడు, “నా లక్ష్యాలు ఏంటో నాకు తెలుసు. కానీ అవేంటో రాసుకోవడం ద్వారా వాటిని చేరుకోవడానికి ఇంకా ఎక్కువ కష్టపడగలిగాను.”

మీ అమ్మానాన్నలు యెహోవాను సేవించకపోయినా మీరు సేవిస్తారా? (15వ పేరా చూడండి)

15. సమర్పించుకోవాలని ఎవరికి వాళ్లే ఎందుకు నిర్ణయించుకోవాలో వివరించండి.

15 ఓ ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, “మీ అమ్మానాన్నలు, స్నేహితులు యెహోవాను సేవించడం మానేసినా మీరు సేవిస్తూనే ఉంటారా?” మీ జీవితాన్ని యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకుంటే, యెహోవాకూ మీకూ మధ్య ఓ స్నేహబంధం ఏర్పడుతుంది. అందుకే మీరు యెహోవా కోసం ఏమి చేస్తారనేది మీ అమ్మానాన్నల మీద లేదా ఇతరుల మీద ఆధారపడి ఉండకూడదు. మీ దగ్గర సత్యం ఉందని, మీరు దేవుని ప్రమాణాలను పాటించాలని అనుకుంటున్నారని, మీ “పరిశుద్ధమైన ప్రవర్తన,” “భక్తితో” చేసే పనులు చూపిస్తాయి. అప్పుడు త్వరలోనే మీరు బాప్తిస్మం తీసుకోవడానికి అర్హత సంపాదించుకుంటారు.

మీ కృతజ్ఞత

16, 17. (ఎ) ఓ వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలంటే ఏమి అవసరం? (బి) విమోచన క్రయధనం పట్ల కృతజ్ఞతను ఓ ఉదాహరణతో ఎలా వివరించవచ్చు?

16 ఓ రోజు, ధర్మశాస్త్రం బాగా తెలిసిన ఒకతను యేసు దగ్గరకు వచ్చి, “ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది” అని అడిగాడు. అందుకు యేసు, “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను” అని జవాబిచ్చాడు. (మత్త. 22:35-37) యెహోవా మీద ప్రేమతోనే ఓ వ్యక్తి బాప్తిస్మం తీసుకుని, క్రైస్తవుడిగా అవుతాడని యేసు వివరించాడు. మనుషులకు దేవుడిచ్చిన అత్యంత గొప్ప బహుమానమైన విమోచన క్రయధనం గురించి జాగ్రత్తగా ఆలోచించడం ద్వారా యెహోవా మీద మీకున్న ప్రేమ బలపడుతుంది. (2 కొరింథీయులు 5:14, 15; 1 యోహాను 4:9, 19 చదవండి.) అప్పుడు, అంత అద్భుతమైన బహుమానం ఇచ్చినందుకు యెహోవాకు కృతజ్ఞత చూపించాలనే కోరిక మీలో కలుగుతుంది.

17 విమోచన క్రయధనంపట్ల మీకెలాంటి కృతజ్ఞత ఉండాలో వివరించే ఈ ఉదాహరణను పరిశీలించండి. మీరు నీళ్లలో మునిగిపోతున్నప్పుడు ఒకాయన వచ్చి మిమ్మల్ని రక్షించాడనుకోండి. మీరు ఇంటికెళ్లి, ఒళ్లు తుడుచుకుని, ఆ వ్యక్తి చేసింది మర్చిపోతారా? లేదు. మీ ప్రాణాల్ని కాపాడిన వ్యక్తికి జీవితాంతం కృతజ్ఞత చూపిస్తారు కదా! అదేవిధంగా విమోచన క్రయధనం ఇచ్చినందుకు యెహోవాపట్ల, యేసుపట్ల ఎంతో కృతజ్ఞతను చూపించాలి. మనం జీవితాంతం వాళ్లకు రుణపడి ఉన్నాం. వాళ్లు మనల్ని పాపమరణాల నుండి కాపాడారు. మనమీద వాళ్లు చూపించిన ప్రేమవల్లే, మనం పరదైసులో నిత్యం జీవిస్తామనే నిరీక్షణతో ఉన్నాం.

18, 19. (ఎ) యెహోవాకు సమర్పించుకోవడానికి మీరు ఎందుకు భయపడాల్సిన అవసరంలేదు? (బి) యెహోవాను సేవించడం వల్ల మీ జీవితం బాగుంటుందని ఎలా చెప్పవచ్చు?

18 యెహోవా మీకోసం చేసినదానిపట్ల కృతజ్ఞత కలిగివున్నారా? అలాగైతే, సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవడమే సరైన పని. సమర్పించుకోవడం అంటే ఎప్పటికీ ఆయన చిత్తం చేస్తామని యెహోవాకు మాటిస్తున్నట్లు, అంతమాత్రాన ఆ మాటివ్వడానికి మీరు భయపడాలా? లేదు. యెహోవా మీకు శ్రేష్ఠమైనది ఇవ్వాలనుకుంటాడు, తన చిత్తం చేసేవాళ్లకు ఆయన తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. (హెబ్రీ. 11:6) మీరు దేవునికి సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకుంటే మీ జీవితం పాడవ్వదు, బదులుగా ఇంకా బాగుంటుంది. 24 ఏళ్ల ఓ సహోదరుడు, టీనేజీ వయసు రాకముందే బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయనిలా చెప్తున్నాడు, “పెద్దయ్యాక బాప్తిస్మం తీసుకుంటే లేఖనాలను ఇంకా బాగా అర్థంచేసుకుని ఉండేవాడినేమో, కానీ చిన్నప్పుడే యెహోవాకు సమర్పించుకోవడం వల్ల ఈ లోకంలోని వాటికోసం ప్రాకులాడకుండా ఆయన నన్ను కాపాడాడు.”

19 యెహోవా మీకు శ్రేష్ఠమైనది ఇవ్వాలనుకుంటాడు. కానీ సాతాను స్వార్థపరుడు, మీ మంచి కోరడు. అతన్ని అనుసరిస్తే మంచిదేదీ మీకు ఇవ్వలేడు. నిజానికి తన దగ్గర లేనిది మీకెలా ఇవ్వగలడు? సాతాను దగ్గర మంచివార్త లేదు, అతనికి ఏ నిరీక్షణా లేదు. కేవలం చెడ్డ భవిష్యత్తు మాత్రమే అతను మీకు ఇవ్వగలడు, ఎందుకంటే సాతానుకు కూడా అదే భవిష్యత్తు ఉంది.—ప్రక. 20:10.

 20. సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకునేలా ప్రగతి సాధించాలంటే యౌవనులు ఏమి చేయవచ్చు? (“ ప్రగతి సాధించేందుకు ఉపయోగపడే సలహాలు” అనే బాక్స్‌ చూడండి.)

20 యెహోవాకు సమర్పించుకోవాలని మీరు తీసుకునే నిర్ణయమే, మీ జీవితంలో అత్యంత శ్రేష్ఠమైన నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉంటే యెహోవాకు సమర్పించుకోవడానికి భయపడకండి. కానీ ఒకవేళ మీరు సిద్ధంగా లేరని అనిపిస్తే, ఈ ఆర్టికల్‌లో ఉన్న సలహాలను పాటించి ప్రగతి సాధిస్తూ ఉండండి. అలా చేయమని ఫిలిప్పీలో ఉన్న సహోదరులకు పౌలు సలహా ఇచ్చాడు. (ఫిలి. 3:16) మీరు ఆ సలహా పాటిస్తే, త్వరలోనే యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవాలనే కోరిక మీలో కలుగుతుంది.

^ [1](13వ పేరా) కొంతమంది యౌవనులు, యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మక సమాధానాలు (ఇంగ్లీషు), అనే పుస్తకం 2వ సంపుటిలోని 308-309 పేజీల్లో ఉన్న కొన్ని వర్క్‌షీట్ల నుండి ప్రయోజనం పొందారు.