కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 12

ద్వేషాన్ని సహించడానికి ప్రేమ సహాయం చేస్తుంది

ద్వేషాన్ని సహించడానికి ప్రేమ సహాయం చేస్తుంది

“మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని మీకు ఈ విషయాలు ఆజ్ఞాపిస్తున్నాను. లోకం మిమ్మల్ని ద్వేషిస్తే, అది మీకన్నా ముందు నన్ను ద్వేషించిందని గుర్తుంచుకోండి.”—యోహా. 15:17, 18.

పాట 129 సహనం చూపిస్తూ ఉందాం

ఈ ఆర్టికల్‌లో . . . *

1. మత్తయి 24:9 ప్రకారం, లోకం మనల్ని ద్వేషించినప్పుడు ఎందుకు ఆశ్చర్యపోకూడదు?

ఇతరుల్ని ప్రేమించేలా, వాళ్ల ప్రేమను పొందేలా యెహోవా మనల్ని సృష్టించాడు. అందుకే ఎవరైనా మనల్ని ద్వేషించినప్పుడు మనకు బాధగా ఉంటుంది, కొన్నిసార్లు భయమేస్తుంది. ఉదాహరణకు, యూరప్‌లో ఉంటున్న జార్జినా * అనే సహోదరి ఇలా అంటుంది: “నాకు 14 ఏళ్లు ఉన్నప్పుడు యెహోవాను సేవించడం మొదలుపెట్టాను. దాంతో మా అమ్మ నన్ను ద్వేషించింది. నేను ఎవరికీ అక్కర్లేదని, నేను మంచిదాన్ని కాదేమో అని నాకు అనిపించింది.” డానియెల్‌ అనే సహోదరుడు ఇలా అంటున్నాడు: “యెహోవాసాక్షిగా ఉన్నందుకు సైనికులు నన్ను కొట్టారు, ఎగతాళి చేశారు, బెదిరించారు. అప్పుడు నాకు భయమేసింది, అవమానంగా అనిపించింది.” ఎవరైనా మనల్ని ద్వేషించినప్పుడు బాధగా ఉంటుంది. కానీ అలా జరిగితే మనం ఆశ్చర్యపోం. ఎందుకంటే, లోకం మనల్ని ద్వేషిస్తుందని యేసు ముందే చెప్పాడు.—మత్తయి 24:9 చదవండి.

2-3. లోకం యేసు అనుచరుల్ని ఎందుకు ద్వేషిస్తుంది?

2 ఈ లోకం యేసు అనుచరుల్ని ద్వేషిస్తుంది. ఎందుకు? ఒక కారణం ఏంటంటే, యేసులాగే మనం ‘లోకానికి చెందినవాళ్లం కాదు.’ (యోహా. 15:17-19) మనం ఈ లోక ప్రభుత్వాల్ని గౌరవిస్తాం కానీ రాజకీయాల్లో తలదూర్చం, జెండా వందనం చేయం, లేదా జాతీయ గీతం పాడం. మనం యెహోవాను మాత్రమే ఆరాధిస్తాం. మనుషుల్ని పరిపాలించే హక్కు దేవునికి ఉందని మనం నమ్ముతాం, కానీ సాతాను, అతని “సంతానం” దాన్ని ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. (ఆది. 3:1-5, 15) దేవుని రాజ్యం మాత్రమే మనుషుల కష్టాల్ని తీసేస్తుందని, దాన్ని వ్యతిరేకించే వాళ్లందర్నీ త్వరలోనే నాశనం చేస్తుందని మనం ప్రకటిస్తాం. (దాని. 2:44; ప్రక. 19:19-21) ఆ సందేశం సాత్వికులకు మంచివార్త, కానీ దుష్టులకు చెడ్డవార్త.—కీర్త. 37:10, 11.

3 లోకం మనల్ని ద్వేషించడానికి ఇంకో కారణం ఏంటంటే, మనం దేవుని నీతి ప్రమాణాల ప్రకారం జీవిస్తాం. అవి ఈ లోకంలోని దిగజారిపోయిన నైతిక విలువలకు పూర్తి వేరుగా ఉన్నాయి. ఘోరమైన లైంగిక పాపాలు చేసినందుకు దేవుడు సొదొమ, గొమొర్రా ప్రజల్ని నాశనం చేశాడు. అవే పనుల్ని ఇప్పుడు చాలామంది ప్రజలు తప్పు కాదన్నట్టు చూస్తున్నారు. (యూదా 7) నైతిక విషయాల్లో బైబిలు ప్రమాణాల్ని పాటిస్తున్నందుకు కొంతమంది మనల్ని ఎగతాళి చేస్తారు, మనం వేరేవాళ్ల అభిప్రాయాల్ని గౌరవించట్లేదని నిందిస్తారు.—1 పేతు. 4:3, 4.

4. ద్వేషాన్ని తట్టుకోవడానికి ఏ లక్షణాలు మనకు సహాయం చేస్తాయి?

4 ప్రజలు మనల్ని ద్వేషించి, అవమానించినప్పుడు దాన్ని తట్టుకోవడానికి మనకు ఏ లక్షణాలు సహాయం చేస్తాయి? యెహోవా సహాయం చేస్తాడనే బలమైన విశ్వాసం మనకు ఉండాలి. డాలులాంటి మన విశ్వాసం ‘దుష్టుడి అగ్ని బాణాలన్నిటినీ ఆర్పేయగలుగుతుంది.’ (ఎఫె. 6:16) అయితే మనకు విశ్వాసం ఒక్కటే సరిపోదు, ప్రేమ కూడా ఉండాలి. ఎందుకు? ఎందుకంటే ప్రేమ “త్వరగా కోపం తెచ్చుకోదు.” మనకు బాధ కలిగించే వాటన్నిటినీ అది భరిస్తుంది, సహిస్తుంది. (1 కొరిం. 13:4-7, 13) ద్వేషాన్ని సహించడానికి యెహోవా మీద, తోటి విశ్వాసుల మీద, ఆఖరికి మన శత్రువుల మీద ఉన్న ప్రేమ ఎలా సహాయం చేస్తుందో ఇప్పుడు చూద్దాం.

ద్వేషాన్ని సహించడానికి యెహోవా మీద ఉన్న ప్రేమ సహాయం చేస్తుంది

5. యెహోవా మీద ఉన్న ప్రేమ వల్ల యేసు ఏం చేశాడు?

5 శత్రువుల చేతిలో చంపబడే ముందు రోజు రాత్రి, యేసు తన నమ్మకమైన అనుచరులతో ఇలా అన్నాడు: ‘నేను తండ్రిని ప్రేమిస్తున్నాను, [అందుకే] తండ్రి నాకు ఆజ్ఞాపించినట్టే చేస్తున్నాను.’ (యోహా. 14:31) యెహోవా మీద ఉన్న ప్రేమ వల్లే యేసు తీవ్రమైన కష్టాల్ని సహించగలిగాడు. యెహోవా మీద ప్రేమ ఉంటే మనమూ అలా చేయగలం.

6. రోమీయులు 5:3-5 ప్రకారం, లోకం ద్వేషించినప్పుడు యెహోవా సేవకులు ఏం చేస్తారు?

6 యెహోవా మీద ఉన్న ప్రేమ వల్లే దేవుని సేవకులు గతంలో, అలాగే ఇప్పుడు హింసల్ని సహిస్తున్నారు. ఉదాహరణకు, శక్తివంతమైన యూదుల మహాసభ అపొస్తలుల్ని కొట్టి, ప్రకటించవద్దని ఆజ్ఞాపించింది. కానీ, దేవుని మీద ఉన్న ప్రేమ వల్ల వాళ్లు ‘మనుషులకు కాకుండా దేవునికి లోబడ్డారు.’ (అపొ. 5:29; 1 యోహా. 5:3) అలాంటి బలమైన ప్రేమ వల్లే నేడు మన సహోదరులు క్రూరమైన, శక్తివంతమైన ప్రభుత్వాలు హింసిస్తున్నా నమ్మకంగా ఉంటున్నారు. లోకం ద్వేషించినప్పుడు మనం నిరుత్సాహపడే బదులు ఆనందిస్తాం.—అపొ. 5:41; రోమీయులు 5:3-5 చదవండి.

7. కుటుంబ సభ్యులు వ్యతిరేకించినప్పుడు మనం ఏం చేయం? కానీ ఏం చేస్తాం?

7 కుటుంబ సభ్యులు ద్వేషించినప్పుడు దాన్ని సహించడం మనకు చాలా కష్టంగా ఉండవచ్చు. మనం సత్యం నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు, మనల్ని ఎవరో తప్పుదారి పట్టిస్తున్నారని వాళ్లు అనుకోవచ్చు లేదా మనకు పిచ్చిపట్టిందని అనుకోవచ్చు. (మార్కు 3:21 తో పోల్చండి.) ఆఖరికి వాళ్లు మనల్ని తిట్టొచ్చు, కొట్టొచ్చు కూడా. అలా జరిగినప్పుడు మనం ఆశ్చర్యపోకూడదు. ఎందుకంటే, “ఒక మనిషి ఇంటివాళ్లే అతనికి శత్రువులు అవుతారు” అని యేసు చెప్పాడు. (మత్త. 10:36) కుటుంబ సభ్యులు మనతో ఎలా ప్రవర్తించినా మనం మాత్రం వాళ్లను శత్రువులుగా చూడం. బదులుగా, యెహోవా మీద ప్రేమ పెరిగేకొద్దీ వాళ్లను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాం. (మత్త. 22:37-39) కానీ మనుషుల్ని సంతోషపెట్టడం కోసం బైబిలు నియమాలు, సూత్రాల విషయంలో మనం ఎన్నడూ రాజీపడం.

కొంతకాలం బాధపడాల్సి వచ్చినా, యెహోవా ఎప్పుడూ మన పక్కనే ఉండి ఓదారుస్తాడు, బలపరుస్తాడు (8-10 పేరాలు చూడండి)

8-9. తీవ్రమైన వ్యతిరేకతను తట్టుకోవడానికి ఒక సహోదరికి ఏది సహాయం చేసింది?

8 ముందు చెప్పిన జార్జినా అనుభవం పరిశీలించండి. వాళ్ల అమ్మ తీవ్రంగా వ్యతిరేకించినా ఆమె సహించింది. జార్జినా ఇలా అంటుంది: “నేను, మా అమ్మ ఒకేసారి స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాం. కానీ ఆరునెలల తర్వాత నేను మీటింగ్స్‌కి వెళ్లాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు, అమ్మ నన్ను వ్యతిరేకించడం మొదలుపెట్టింది. ఆమె మతభ్రష్టుల మాటలు వింటూ, వాళ్లు చెప్పిన తప్పుడు బోధలు ఉపయోగించి నాతో వాదిస్తోందని గమనించాను. ఆమె నన్ను హేళన చేసేది, జుట్టు పీకేది, గొంతు నొక్కేసేది, నా ప్రచురణల్ని పారేసేది. 15 ఏళ్లు వచ్చినప్పుడు నేను బాప్తిస్మం తీసుకున్నాను. యెహోవా సేవ చేయనివ్వకుండా ఆపాలని, మా అమ్మ నన్ను మొండిగా ప్రవర్తించే అమ్మాయిల్ని ఉంచే సెంటర్‌లో చేర్పించింది. అక్కడ కొంతమంది డ్రగ్స్‌ తీసుకునేవాళ్లు, నేరాలు చేసేవాళ్లు. ప్రేమించాల్సిన, పట్టించుకోవాల్సిన వాళ్లే మనల్ని వ్యతిరేకిస్తే దాన్ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది.”

9 జార్జినా ఆ సమస్యను ఎలా తట్టుకుంది? ఆమె ఇలా అంటుంది: “మా అమ్మ ఏ రోజైతే నన్ను వ్యతిరేకించడం మొదలుపెట్టిందో, ఆ రోజు కల్లా నేను మొత్తం బైబిలు చదవడం పూర్తిచేశాను. ఇదే సత్యం అని నాకు నమ్మకం కుదిరింది, యెహోవాకు చాలా దగ్గరైనట్టు అనిపించింది. నేను పదేపదే ఆయనకు ప్రార్థించాను, ఆయన నా ప్రార్థనలు విన్నాడు. నేను ఆ సెంటర్‌లో ఉన్నప్పుడు ఒక సహోదరి నన్ను వాళ్ల ఇంటికి పిలిచింది. మేమిద్దరం కలిసి బైబిల్ని అధ్యయనం చేశాం. కష్టమైన ఆ సమయంలో, సహోదర సహోదరీలు నన్ను బలపర్చారు. వాళ్లందరూ నన్ను తమ ఇంట్లో మనిషిలా చూసుకున్నారు. మన వ్యతిరేకులు ఎవరైనా సరే, వాళ్ల కన్నా యెహోవా బలవంతుడని నేను కళ్లారా చూశాను.”

10. యెహోవా ఏం చేస్తాడని మనం నమ్మకంతో ఉండవచ్చు?

10 “మన ప్రభువైన క్రీస్తుయేసు ద్వారా దేవుడు చూపించే ప్రేమ నుండి” మనల్ని ఏదీ వేరుచేయలేదని అపొస్తలుడైన పౌలు రాశాడు. (రోమా. 8:38, 39) మనం కొంతకాలం బాధపడాల్సి వచ్చినా యెహోవా ఎప్పుడూ మన పక్కనే ఉండి మనల్ని ఓదారుస్తాడు, బలపరుస్తాడు. అంతేకాదు, జార్జినా అనుభవం చూపిస్తున్నట్టు ఆయన మన సహోదర సహోదరీల ద్వారా మనకు సహాయం చేస్తాడు.

ద్వేషాన్ని సహించడానికి తోటి విశ్వాసుల మీద ఉన్న ప్రేమ సహాయం చేస్తుంది

11. యోహాను 15:12, 13 లో యేసు చెప్పినలాంటి ప్రేమ, శిష్యులకు ఎలా సహాయం చేసింది? ఒక ఉదాహరణ చెప్పండి.

11 యేసు తాను చనిపోవడానికి ముందు రోజు రాత్రి, తన శిష్యులు ఒకరినొకరు ప్రేమించుకోవాలని గుర్తుచేశాడు. (యోహాను 15:12, 13 చదవండి.) ప్రాణం పెట్టేంత గొప్ప ప్రేమ ఉంటే వాళ్లు ఐక్యంగా ఉంటారు, లోకం ద్వేషించినా దాన్ని తట్టుకుంటారు అని ఆయనకు తెలుసు. థెస్సలొనీకలోని సంఘం ఉదాహరణ పరిశీలించండి. ఆ సంఘం ఏర్పడిన దగ్గరనుండి అక్కడి క్రైస్తవులు హింసలు అనుభవించారు. అప్పటికే వాళ్లు సహనం, ప్రేమ చూపించడంలో ఆదర్శంగా నిలిచారు. (1 థెస్స. 1:3, 6, 7) అయినప్పటికీ, ఇంకా “పూర్తిస్థాయిలో” ప్రేమ చూపిస్తూ ఉండమని పౌలు వాళ్లను ప్రోత్సహించాడు. (1 థెస్స. 4:9, 10) కృంగినవాళ్లకు ఊరటనిచ్చేలా, బలహీనులకు మద్దతిచ్చేలా ఆ ప్రేమ వాళ్లను కదిలిస్తుంది. (1 థెస్స. 5:14) వాళ్లు పౌలు ఇచ్చిన సలహాను పాటించారని తెలుస్తోంది. ఎందుకంటే, దాదాపు ఒక సంవత్సరం తర్వాత పౌలు వాళ్లకు రెండో ఉత్తరం రాసినప్పుడు ఇలా అన్నాడు: ‘మీ అందరికీ ఒకరిపట్ల ఒకరికి ఉన్న ప్రేమ పెరుగుతోంది.’ (2 థెస్స. 1:3-5) కష్టాల్ని, హింసల్ని సహించడానికి ఆ ప్రేమే వాళ్లకు సహాయం చేసింది.

ద్వేషాన్ని సహించడానికి సహోదర సహోదరీల మీద ఉన్న ప్రేమ మనకు సహాయం చేస్తుంది (12వ పేరా చూడండి) *

12. యుద్ధం జరుగుతున్న సమయంలో ఒక దేశంలోని సహోదర సహోదరీలు ఎలా ప్రేమ చూపించుకున్నారు?

12 ముందు చెప్పిన డానియెల్‌, ఆయన భార్య అనుభవం పరిశీలించండి. వాళ్ల పట్టణం యుద్ధంలో చిక్కుకున్నప్పుడు కూడా వాళ్లు మీటింగ్స్‌కి వెళ్లారు, సాధ్యమైనప్పుడల్లా ప్రీచింగ్‌ చేశారు, అలాగే తమ దగ్గరున్న ఆహారాన్ని సహోదర సహోదరీలతో పంచుకున్నారు. డానియెల్‌ ఇలా అంటున్నాడు: “ఒకరోజు కొంతమంది సైనికులు తుపాకులు పట్టుకుని మా ఇంటికి వచ్చారు. నేను ఇక యెహోవాసాక్షిగా ఉండనని రాసివ్వమన్నారు. అందుకు ఒప్పుకోనప్పుడు నన్ను కొట్టారు, తల మీద తుపాకి పెట్టి కాలుస్తామన్నట్టుగా బెదిరించారు. వెళ్లిపోయే ముందు, ఈసారి వచ్చినప్పుడు నా భార్యను మానభంగం చేస్తామని బెదిరించారు. కానీ సహోదరులు వెంటనే మమ్మల్ని రైలు ఎక్కించి వేరే పట్టణానికి పంపించారు. ఆ సహోదరులు చూపించిన ప్రేమను నేను ఎప్పటికీ మర్చిపోలేను. మేము కొత్త పట్టణానికి వెళ్లాక అక్కడి సహోదరులు మాకు ఆహారం ఇచ్చారు, మాకు ఒక ఉద్యోగం, ఇల్లు చూసిపెట్టారు. దానివల్ల, యుద్ధం జరుగుతున్న చోటు నుండి పారిపోయి వస్తున్న ఇతర సహోదరులకు మేము ఆశ్రయం ఇవ్వగలిగాం.” ద్వేషాన్ని సహించడానికి, తోటి విశ్వాసుల మీద ఉన్న ప్రేమ సహాయం చేస్తుందని ఇలాంటి అనుభవాలు చూపిస్తున్నాయి.

ద్వేషాన్ని సహించడానికి శత్రువుల మీద ఉన్న ప్రేమ సహాయం చేస్తుంది

13. ప్రజలు మనల్ని ద్వేషించినా యెహోవా సేవలో కొనసాగడానికి పవిత్రశక్తి ఎలా సహాయం చేస్తుంది?

13 శత్రువుల్ని ప్రేమించమని యేసు తన అనుచరులకు చెప్పాడు. (మత్త. 5:44, 45) అలా చేయడం తేలికా? కానే కాదు! అయితే దేవుని పవిత్రశక్తి సహాయంతో మనం అలా చేయగలం. పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్లో ప్రేమతోపాటు ఓర్పు, దయ, సౌమ్యత, ఆత్మనిగ్రహం కూడా ఉన్నాయి. (గల. 5:22, 23) ద్వేషాన్ని సహించడానికి ఆ లక్షణాలు మనకు సహాయం చేస్తాయి. యెహోవాసాక్షి అయిన తమ భర్త, భార్య, పిల్లవాడు, లేదా పొరుగువాళ్లు అలాంటి లక్షణాలు చూపించినందుకు చాలామంది వ్యతిరేకులు మనసు మార్చుకున్నారు. కొంతమందైతే సత్యంలోకి కూడా వచ్చారు. మీరు యెహోవాను సేవిస్తున్నారన్న ఒకేఒక్క కారణంతో ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తున్నారా? వాళ్లను ప్రేమించడం మీకు కష్టంగా ఉంటే, పవిత్రశక్తి కోసం ప్రార్థించండి. (లూకా 11:13) అంతేకాదు, దేవునికి లోబడడమే ఎప్పుడూ సరైనదనే పూర్తి నమ్మకంతో ఉండండి.—సామె. 3:5-7.

14-15. భర్త తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, ఆయన మీద ప్రేమ చూపించడానికి రోమీయులు 12:17-21 వచనాలు యాస్మీన్‌కు ఎలా సహాయం చేశాయి?

14 యాస్మీన్‌ అనే సహోదరి అనుభవం పరిశీలించండి. ఆమె యెహోవాసాక్షి అయినప్పుడు ఎవరో ఆమెను తప్పుదారి పట్టించారని ఆమె భర్త అనుకున్నాడు, అందుకే యెహోవాను సేవించకుండా ఆమెను ఆపడానికి ప్రయత్నించాడు. ఆమెను అవమానించాడు. బంధువుల్ని, మతగురువుని, మాంత్రికుణ్ణి తీసుకొచ్చి ఆమెను బెదిరించాడు, కుటుంబాన్ని విడదీస్తుందని నిందించాడు. అంతేకాదు, ఒకసారి మీటింగ్‌ జరుగుతున్నప్పుడు సహోదరుల మీద గట్టిగా అరిచాడు! భర్త తనతో అంత కఠినంగా ప్రవర్తిస్తున్నందుకు యాస్మీన్‌ తరచూ ఏడ్చేది.

15 రాజ్యమందిరంలో యాస్మీన్‌ ఆధ్యాత్మిక కుటుంబం, అంటే సహోదర సహోదరీలు ఆమెను ఓదార్చారు, బలపర్చారు. రోమీయులు 12:17-21 లో ఉన్న సలహాను పాటించమని సంఘ పెద్దలు ఆమెను ప్రోత్సహించారు. (చదవండి.) యాస్మీన్‌ ఇలా అంటుంది: “అది నాకు చాలా కష్టంగా అనిపించింది. కానీ సహాయం చేయమని యెహోవాను అడిగాను. బైబిలు చెప్తున్నదాన్ని పాటించడానికి చేయగలిగినదంతా చేశాను. కాబట్టి, నా భర్త కావాలనే వంట గదిలో చెత్త వేసినప్పుడు నేను శుభ్రం చేశాను. ఆయన నన్ను అవమానించినా సౌమ్యంగానే మాట్లాడాను. అంతేకాదు ఆయనకు ఒంట్లో బాలేనప్పుడు దగ్గరుండి చూసుకున్నాను.”

మనల్ని హింసించే వాళ్లను కూడా ప్రేమిస్తే, వాళ్ల మనసు మారవచ్చు (16-17 పేరాలు చూడండి) *

16-17. యాస్మీన్‌ ఉదాహరణ నుండి మీరు ఏం నేర్చుకున్నారు?

16 భర్త మీద ప్రేమ చూపిస్తూనే ఉన్నందుకు యాస్మీన్‌ మంచి ఫలితాలు పొందింది. ఆమె ఇలా అంటుంది: “నేను ఎప్పుడూ అబద్ధం చెప్పనని తెలుసు కాబట్టి నా భర్తకు నా మీద నమ్మకం పెరిగింది. నా నమ్మకాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన గౌరవపూర్వకంగా వినడం మొదలుపెట్టాడు. అంతేకాదు ఇంట్లో ఎప్పుడూ గొడవ పెట్టుకోనని మాటిచ్చాడు. మీటింగ్స్‌కి వెళ్లమని ఇప్పుడు ఆయనే నాకు చెప్తున్నాడు. మేము ఒకరికొకరం బాగా దగ్గరయ్యాం, ఇప్పుడు ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. ఏదోక రోజు నా భర్త సత్యం తెలుసుకుని, నాతో కలిసి యెహోవాను ఆరాధిస్తాడనే ఆశతో ఉన్నాను.”

17 “ప్రేమ అన్నిటినీ భరిస్తుంది, . . . అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ సహిస్తుంది” అని యాస్మీన్‌ అనుభవం చూపిస్తుంది. (1 కొరిం. 13:4, 7) ద్వేషం శక్తివంతమైనదే కావచ్చు, కానీ ప్రేమ అంతకన్నా శక్తివంతమైనది. ద్వేషం మనసుల్ని బాధపెడుతుంది, కానీ ప్రేమ హృదయాల్ని గెల్చుకుంటుంది. అంతేకాదు, అది యెహోవా హృదయాన్ని సంతోషపెడుతుంది. ఒకవేళ ప్రజలు మారకుండా మనల్ని ద్వేషిస్తూనే ఉన్నా మనం సంతోషంగా ఉండవచ్చు. అదెలా?

ప్రజలు మిమ్మల్ని ద్వేషించినా సంతోషంగా ఉండండి

18. ప్రజలు ద్వేషించినా మనం ఎందుకు సంతోషంగా ఉండవచ్చు?

18 యేసు ఇలా అన్నాడు: ‘ప్రజలు మిమ్మల్ని ద్వేషించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు.’ (లూకా 6:22) ప్రజలు మనల్ని ద్వేషించాలని, చంపాలని మనం కోరుకోం. మరి వాళ్లు ద్వేషిస్తున్నప్పుడు మనం ఎందుకు సంతోషంగా ఉండవచ్చు? మూడు కారణాలు పరిశీలించండి. మొదటిగా, మనం ద్వేషాన్ని సహిస్తే యెహోవా సంతోషిస్తాడు. (1 పేతు. 4:13, 14) రెండవదిగా, మన విశ్వాసం శుద్ధిచేయబడి ఇంకా బలంగా తయారౌతుంది. (1 పేతు. 1:7) మూడవదిగా, మనం వెలకట్టలేని బహుమానాన్ని అంటే శాశ్వత జీవితాన్ని పొందుతాం.—రోమా. 2:6, 7.

19. అపొస్తలులు దెబ్బలు తిన్నా ఎందుకు సంతోషించారు?

19 యేసు పునరుత్థానమైన కొన్ని రోజులకే, అపొస్తలులు ఆయన చెప్పిన సంతోషాన్ని అనుభవించారు. మహాసభ వాళ్లను కొట్టి ప్రకటించవద్దని ఆజ్ఞాపించినప్పుడు, ‘వాళ్లు యేసు పేరు కోసం అవమానించబడే గొప్ప అవకాశం తమకు దక్కిందని సంతోషించారు.’ (అపొ. 5:40-42) శత్రువుల మీద ఉన్న భయం కన్నా, వాళ్ల ప్రభువైన యేసు మీద వాళ్లకున్న ప్రేమే గొప్పది. వాళ్లు “మానకుండా” మంచివార్త ప్రకటించడం ద్వారా ఆ ప్రేమను చూపించారు. నేడు చాలామంది సహోదరులు కష్టాలొచ్చినా నమ్మకంగా యెహోవా సేవలో కొనసాగుతున్నారు. ఎందుకంటే వాళ్ల కృషిని, తన పేరు విషయంలో వాళ్లు చూపించిన ప్రేమను యెహోవా ఎప్పుడూ మర్చిపోడని వాళ్లకు తెలుసు.—హెబ్రీ. 6:10.

20. తర్వాతి ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

20 అంతం వచ్చే వరకు ఈ లోకం మనల్ని ద్వేషిస్తూనే ఉంటుంది. (యోహా. 15:19) కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం తర్వాతి ఆర్టికల్‌లో చూడబోతున్నట్టుగా, యెహోవా తన నమ్మకమైన సేవకుల్ని ‘బలపరుస్తాడు, కాపాడతాడు.’ (2 థెస్స. 3:3) కాబట్టి యెహోవాను, మన సహోదర సహోదరీల్ని, ఆఖరికి మన శత్రువుల్ని కూడా ప్రేమిస్తూ ఉందాం. అలా చేస్తే మనం ఐక్యంగా ఉంటాం, ఆధ్యాత్మికంగా బలంగా ఉంటాం, యెహోవాకు మహిమ తెస్తాం, ద్వేషం కన్నా ప్రేమ ఎంతో శక్తివంతమైనదని రుజువు చేస్తాం.

పాట 106 ప్రేమను అలవర్చుకుందాం

^ పేరా 5 ద్వేషాన్ని సహించడానికి యెహోవా మీద, తోటి విశ్వాసుల మీద, ఆఖరికి మన శత్రువుల మీద ఉన్న ప్రేమ మనకు ఎలా సహాయం చేస్తుందో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. ఇతరులు మనల్ని ద్వేషిస్తున్నా సంతోషంగా ఉండవచ్చు అని యేసు ఎందుకు అన్నాడో కూడా తెలుసుకుంటాం.

^ పేరా 1 అసలు పేర్లు కావు.

^ పేరా 58 చిత్రాల వివరణ: సైనికులు డానియెల్‌ని బెదిరించిన తర్వాత సహోదరులు ఆయనకు సహాయం చేశారు. ఆయన్ని, ఆయన భార్యను వేరే పట్టణానికి పంపించారు. అక్కడి సహోదరులు కూడా వాళ్లను ప్రేమగా చూసుకున్నారు.

^ పేరా 60 చిత్రాల వివరణ: యాస్మీన్‌ భర్త ఆమెను వ్యతిరేకించాడు, కానీ సంఘ పెద్దలు ఆమెకు చక్కని సలహా ఇచ్చారు. ఆమె మంచి భార్యగా నిరూపించుకుంది, ఆయనకు ఒంట్లో బాలేనప్పుడు శ్రద్ధగా చూసుకుంది.