కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 11

బైబిలు చదవడం సమస్యల్ని తట్టుకోవడానికి ఎలా సహాయం చేస్తుంది?

బైబిలు చదవడం సమస్యల్ని తట్టుకోవడానికి ఎలా సహాయం చేస్తుంది?

‘సహనాన్ని ఇచ్చే దేవుడు మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను.’—రోమా. 15:5.

పాట 94 దేవుని వాక్యం పట్ల కృతజ్ఞత

ఈ ఆర్టికల్‌లో . . . *

1. యెహోవా ప్రజలకు ఎలాంటి కష్టాలు రావచ్చు?

మీరు ఏదైనా కష్టమైన సమస్యతో పోరాడుతున్నారా? బహుశా సంఘంలో ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటారు. (యాకో. 3:2) లేదా, మీరు యెహోవాను సేవిస్తున్నందుకు మీతో కలిసి పనిచేసేవాళ్లు గానీ కలిసి చదువుకునేవాళ్లు గానీ మిమ్మల్ని ఎగతాళి చేస్తుండవచ్చు. (1 పేతు. 4:3, 4) లేదా, ఇంట్లో వాళ్లు మిమ్మల్ని మీటింగ్స్‌కి వెళ్లనివ్వకుండా, మీ నమ్మకాల గురించి వేరేవాళ్లతో మాట్లాడనివ్వకుండా అడ్డుపడుతుండవచ్చు. (మత్త. 10:35, 36) ఏదైనా సమస్య మరీ కష్టంగా ఉన్నప్పుడు, ఇక దీన్ని భరించడం నావల్ల కాదు అని మీకు అనిపించవచ్చు. కానీ మీరు ఎలాంటి కష్టంలో ఉన్నా, యెహోవా మీకు కావాల్సిన తెలివిని, ఆ సమస్యను తట్టుకోవడానికి కావాల్సిన బలాన్ని ఇస్తాడని మీరు నమ్మకంతో ఉండవచ్చు.

2. రోమీయులు 15:4 ప్రకారం, బైబిలు చదవడం వల్ల మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు?

2 కష్టమైన సమస్యలు వచ్చినప్పుడు అపరిపూర్ణ మనుషులు ఏం చేశారో యెహోవా తన వాక్యమైన బైబిల్లో వివరంగా రాయించాడు. ఎందుకు? మనకు బోధించడం కోసమే ఆయన అలా రాయించాడని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (రోమీయులు 15:4 చదవండి.) బైబిలు ఉదాహరణలు పరిశీలించడం వల్ల మనం ఓదార్పు పొందవచ్చు, నిరీక్షణతో ఉండవచ్చు. అయితే, వాటినుండి ప్రయోజనం పొందాలంటే కేవలం బైబిల్ని చదివితే సరిపోదు. లేఖనాలు మన ఆలోచనల్ని మలచనివ్వాలి, మన హృదయాన్ని తాకనివ్వాలి. ఏదైనా ఒక సమస్య గురించి సలహా వెతుకుతున్నప్పుడు మనం ఏం చేయవచ్చు? ఈ నాలుగు పనులు చేయవచ్చు: (1ప్రార్థించడం, (2ఊహించుకోవడం, (3ధ్యానించడం, (4పాటించడం. వాటిని ఎలా చేయవచ్చో ఇప్పుడు గమనిద్దాం. * తర్వాత, ఆ నాలుగు పనులు చేస్తూ రాజైన దావీదు జీవితంలో, అపొస్తలుడైన పౌలు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల నుండి మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దాం.

1. ప్రార్థించండి

బైబిలు చదవడం మొదలుపెట్టే ముందు, దాని నుండి ఎక్కువ ప్రయోజనం పొందేలా సహాయం చేయమని యెహోవాను అడగండి (3వ పేరా చూడండి)

3. బైబిలు చదవడం మొదలుపెట్టే ముందు ఏం చేయాలి? ఎందుకు?

3 (1ప్రార్థించండి. బైబిలు చదవడం మొదలుపెట్టే ముందు, దానినుండి ఎక్కువ ప్రయోజనం పొందేలా సహాయం చేయమని యెహోవాను అడగండి. ఉదాహరణకు, మీకున్న సమస్య గురించి ఏదైనా సలహా వెతుకుతుంటే, దానికి సంబంధించిన సూత్రాల్ని బైబిల్లో కనుగొనేలా సహాయం చేయమని యెహోవాను అడగండి.—ఫిలి. 4:6, 7; యాకో. 1:5.

2. ఊహించుకోండి

బైబిల్లో మీరు ఎవరి గురించి చదువుతున్నారో, ఆ వ్యక్తి స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకోండి (4వ పేరా చూడండి)

4. బైబిల్లో చదివే విషయాలు కళ్లకు కట్టినట్టు ఉండాలంటే ఏం చేయాలి?

4 (2ఊహించుకోండి. యెహోవా మనకు ఊహించుకునే అద్భుతమైన సామర్థ్యాన్ని ఇచ్చాడు. మీరు బైబిల్లో ఒక వ్యక్తి గురించి చదువుతున్నప్పుడు అది కళ్లకు కట్టినట్టు ఉండడానికి ఆ సన్నివేశాన్ని ఊహించుకోండి, ఆ వ్యక్తి స్థానంలో మిమ్మల్ని మీరు పెట్టుకోండి. ఆ వ్యక్తి చూసినవే మీరూ చూసేలా, ఆ వ్యక్తికి అనిపించినట్టే మీకూ అనిపించేలా అందులో లీనమవ్వండి.

3. ధ్యానించండి

చదివిన వాటి గురించి, అవి మీకెలా ఉపయోగపడతాయి అనే దాని గురించి లోతుగా ఆలోచించండి (5వ పేరా చూడండి)

5. ధ్యానించడం అంటే ఏంటి? దాన్ని ఎలా చేయవచ్చు?

5 (3ధ్యానించండి. ధ్యానించడం అంటే చదివినవాటి గురించి, వాటిని ఎలా పాటించవచ్చు అనేదాని గురించి లోతుగా ఆలోచించడం. అంటే చదివిన విషయాలన్నిటిని కలుపుకుని, లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. ధ్యానించడం అనేది ఒక పూర్తి చిత్రాన్ని చూడడానికి, పజిల్‌లో ఉన్న చిన్న ముక్కలన్నిటినీ కలపడం లాంటిది. ఒకవేళ ధ్యానించకుండా బైబిలు చదివితే, ఆ ముక్కల్ని జత చేయకుండా విడివిడిగా చూసినట్టు అవుతుంది. ధ్యానించడానికి మీరు ఇలాంటి ప్రశ్నలు వేసుకుని, వాటికి జవాబులు ఆలోచించవచ్చు: ‘ఇప్పుడు బైబిల్లో నేను చదువుతున్న వ్యక్తి తన సమస్యను తట్టుకోవడానికి ఏం చేశాడు? యెహోవా ఆయనకు ఎలా సహాయం చేశాడు? ఇందులో నేర్చుకున్న పాఠాల్ని బట్టి, కష్టాల్ని తట్టుకోవడానికి నేను ఏం చేయవచ్చు?’

4. పాటించండి

నేర్చుకున్న వాటిని పాటించండి, అప్పుడు మీరు ఇంకా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, మనశ్శాంతిగా ఉంటారు, మీ విశ్వాసం బలపడుతుంది (6వ పేరా చూడండి)

6. మనం నేర్చుకున్నవాటిని ఎందుకు పాటించాలి?

6 (4పాటించండి. నేర్చుకున్నవాటిని పాటించని వ్యక్తి, ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వ్యక్తి లాంటివాడని యేసు చెప్పాడు. అతను కష్టపడి ఇల్లు కట్టుకుంటాడు, కానీ అతని శ్రమంతా వృథా అయిపోతుంది. ఎందుకు? ఎందుకంటే పెద్ద వర్షం కురిసి, వరదలు వచ్చినప్పుడు ఆ ఇల్లు కూలిపోతుంది. (మత్త. 7:24-27) అదేవిధంగా మనం ప్రార్థించి, ఊహించుకుని, ధ్యానించి, చివరికి నేర్చుకున్నవాటిని పాటించకపోతే, మన శ్రమంతా వృథా అయిపోతుంది. కష్టాలు లేదా హింసలు వచ్చినప్పుడు మన విశ్వాసం బలంగా ఉండదు. అలా కాకుండా మనం బైబిల్ని చదివి, నేర్చుకున్నవాటిని పాటిస్తే ఇంకా మంచి నిర్ణయాలు తీసుకుంటాం, మనశ్శాంతితో ఉంటాం, మన విశ్వాసం బలంగా ఉంటుంది. (యెష. 48:17, 18) పైన చెప్పిన నాలుగు పనులు చేస్తూ, దావీదు రాజు జీవితంలో జరిగిన ఒక సంఘటన నుండి ఏం నేర్చుకోవచ్చో ఇప్పుడు గమనిద్దాం.

దావీదు రాజు నుండి మీరు ఏం నేర్చుకోవచ్చు?

7. ఇప్పుడు మనం బైబిల్లోని ఏ సంఘటనల గురించి పరిశీలిస్తాం?

7 మీ స్నేహితులు గానీ, కుటుంబ సభ్యులు గానీ మీకు నమ్మకద్రోహం చేశారా? అలాగైతే, దావీదు రాజు కొడుకైన అబ్షాలోము గురించి పరిశీలించడం వల్ల మీరు ప్రయోజనం పొందవచ్చు. అబ్షాలోము తన తండ్రికి నమ్మకద్రోహం చేశాడు, ఆయన సింహాసనాన్ని లాక్కోవాలని చూశాడు.—2 సమూ. 15:5-14, 31; 18:6-14.

8. యెహోవా సహాయాన్ని పొందడానికి మీరు ఏం చేయవచ్చు?

8 (1ప్రార్థించండి. ఆ లేఖనాల్ని మనసులో ఉంచుకుని, మీకు జరిగిన అన్యాయం గురించి మీకెలా అనిపిస్తుందో యెహోవాకు చెప్పండి. (కీర్త. 6:6-9) మీకు ఏమనిపిస్తుందో స్పష్టంగా చెప్పండి. తర్వాత, మీ సమస్యను తట్టుకోవడానికి ఉపయోగపడే సూత్రాల్ని కనుగొనేలా సహాయం చేయమని యెహోవాను అడగండి.

9. దావీదు, అబ్షాలోము మధ్య జరిగిన సంఘటనల్ని మీరెలా వివరిస్తారు?

9 (2ఊహించుకోండి. చదివిన బైబిలు భాగంలో ఉన్న సంఘటనల గురించి ఆలోచించండి, దావీదు రాజు పరిస్థితిని ఊహించుకోండి. దావీదు కొడుకైన అబ్షాలోము ప్రజల్ని తనవైపుకు తిప్పుకోవడానికి కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాడు. (2 సమూ. 15:7) అబ్షాలోము సరైన సమయం చూసుకుని, ఇశ్రాయేలు అంతటా వేగులవాళ్లను పంపించి, తనను రాజుగా అంగీకరించేలా ప్రజల్ని సిద్ధం చేశాడు. ఆఖరికి దావీదుకు దగ్గరి స్నేహితుడు, సలహాదారుడు అయిన అహీతోపెలును కూడా తనతో చేతులు కలిపేలా ఒప్పించాడు. అబ్షాలోము తనను రాజుగా ప్రకటించుకున్నాడు. తర్వాత దావీదును పట్టుకుని చంపడానికి ప్రయత్నించాడు. బహుశా ఆ సమయంలో దావీదు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుండవచ్చు. (కీర్త. 41:1-9) ఆ కుట్ర గురించి తెలుసుకున్న దావీదు యెరూషలేమును విడిచి పారిపోయాడు. చివరికి, అబ్షాలోము సైన్యం దావీదు సైన్యంతో తలపడింది. ఆ పోరాటంలో తిరుగుబాటుదారులు ఓడిపోయారు, దావీదు కొడుకైన అబ్షాలోము చంపబడ్డాడు.

10. కావాలనుకుంటే దావీదు ఏం చేయవచ్చు?

10 తర్వాత, ఇదంతా జరుగుతున్నప్పుడు దావీదుకు ఎలా అనిపించిందో ఊహించుకోండి. ఆయన అబ్షాలోమును ప్రేమించాడు, అహీతోపెలును నమ్మాడు. కానీ వాళ్లిద్దరూ ఆయనకు నమ్మకద్రోహం చేశారు. వాళ్లు ఆయన్ని ఎంతగానో బాధపెట్టారు, ఆఖరికి చంపడానికి కూడా ప్రయత్నించారు. అప్పుడు దావీదు మిగతా స్నేహితుల మీద కూడా నమ్మకం కోల్పోయి, వాళ్లూ అబ్షాలోముతో చేతులు కలిపారేమో అని సందేహించవచ్చు. ఆయన తన గురించి మాత్రమే ఆలోచించుకుని, దేశం నుండి ఒంటరిగా పారిపోవాలని అనుకోవచ్చు. లేదా నిరుత్సాహంలో కూరుకుపోవచ్చు. కానీ దావీదు అవేవీ చేయలేదు. ఆయన ఈ కష్టమైన సమస్యను తట్టుకున్నాడు. ఎలా?

11. కష్టమైన పరిస్థితిలో దావీదు ఏం చేశాడు?

11 (3ధ్యానించండి. ఈ బైబిలు భాగం నుండి మీరు ఏ సూత్రాలు నేర్చుకోవచ్చు? “దావీదు తన సమస్యను పరిష్కరించుకోవడానికి ఏం చేశాడు?” అనే ప్రశ్నకు జవాబు ఆలోచించండి. దావీదు భయపడిపోలేదు, ఆవేశపడి తెలివితక్కువ నిర్ణయాలు తీసుకోలేదు. ఆయన బెదిరిపోయి, ఊరికే ఏం చేయకుండా ఉండిపోలేదు. బదులుగా సహాయం కోసం యెహోవాకు ప్రార్థించాడు, స్నేహితుల సహాయం కూడా తీసుకున్నాడు. ఆయన చేయాలనుకున్నవి వెంటనే చేశాడు. అబ్షాలోము, అహీతోపెలు తనను ఎంతో బాధపెట్టినా దావీదు ఇతరుల్ని నమ్మడం మానలేదు, కోపం పెంచుకోలేదు. ఆయన యెహోవాను, తన స్నేహితుల్ని నమ్ముతూనే ఉన్నాడు.

12. యెహోవా దావీదుకు ఎలా సహాయం చేశాడు?

12 యెహోవా దావీదుకు ఎలా సహాయం చేశాడు? మీరు కొంత పరిశోధన చేస్తే, ఈ సమస్యను తట్టుకోవడానికి కావాల్సిన బలాన్ని యెహోవా దావీదుకు ఇచ్చాడని తెలుసుకుంటారు. (కీర్త. 3:1-8; పైవిలాసం) దావీదు తీసుకున్న నిర్ణయాల్ని యెహోవా దీవించాడు. అంతేకాదు దావీదు స్నేహితులు తమ రాజును కాపాడుకోవడానికి పోరాడుతున్నప్పుడు యెహోవా వాళ్లకు మద్దతిచ్చాడు.

13. ఎవరైనా మిమ్మల్ని బాగా బాధపెడితే, మీరు దావీదును ఎలా అనుకరించవచ్చు? (మత్తయి 18:15-17)

13 (4పాటించండి. ‘నేను దావీదును ఎలా అనుకరించవచ్చు?’ అని ఆలోచించండి. సమస్యను పరిష్కరించుకోవడానికి వెంటనే చర్య తీసుకోండి. మీ పరిస్థితుల్ని బట్టి, మీరు మత్తయి 18వ అధ్యాయంలో యేసు చెప్పిన మాటల్ని లేదా అందులో ఉన్న సూత్రాన్ని పాటించవచ్చు. (మత్తయి 18:15-17 చదవండి.) కానీ మీరు ఆవేశంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రశాంతంగా ఉండడానికి సహాయం చేయమని, సమస్యను పరిష్కరించుకోవడానికి కావాల్సిన తెలివిని ఇవ్వమని మీరు యెహోవాకు ప్రార్థించాలి. స్నేహితుల మీద నమ్మకం కోల్పోకండి, వాళ్ల సహాయం తీసుకోవడానికి వెనకాడకండి. (సామె. 17:17) అన్నిటికన్నా ముఖ్యంగా, బైబిలు ద్వారా యెహోవా ఇస్తున్న సలహాల్ని పాటించండి.—సామె. 3:5, 6.

పౌలు నుండి మీరు ఏం నేర్చుకోవచ్చు?

14. ఎలాంటి పరిస్థితుల్లో 2 తిమోతి 1:12-16; 4:6-11, 17-22 వచనాలు మీకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి?

14 మీరు యెహోవాను సేవిస్తున్నందుకు ఇంట్లోవాళ్లు మిమ్మల్ని ఇబ్బందిపెడుతున్నారా? లేదా మీ దేశంలో మన పని మీద ఆంక్షలు గానీ, నిషేధం గానీ ఉన్నాయా? అలాగైతే 2 తిమోతి 1:12-16; 4:6-11, 17-22 వచనాలు చదవడం ద్వారా మీరు ప్రయోజనం పొందవచ్చు. * పౌలు ఆ మాటల్ని జైల్లో ఉన్నప్పుడు రాశాడు.

15. మీరు యెహోవాను ఏం అడగవచ్చు?

15 (1ప్రార్థించండి. ఆ లేఖనాల్ని చదివే ముందు మీ సమస్య ఏంటో, మీకు ఎలా అనిపిస్తుందో యెహోవాకు చెప్పండి. మీకు ఏమనిపిస్తుందో స్పష్టంగా చెప్పండి. తర్వాత, పౌలు గురించి మీరు చదువుతున్న లేఖనాల్లో, మీ సమస్యను తట్టుకోవడానికి ఉపయోగపడే సూత్రాల్ని కనుగొనేలా సహాయం చేయమని యెహోవాను అడగండి.

16. పౌలు పరిస్థితిని మీరెలా వివరిస్తారు?

16 (2ఊహించుకోండి. మీరు పౌలు స్థానంలో ఉన్నట్టు ఊహించుకోండి. ఆయన్ని రోములోని జైల్లో సంకెళ్లతో బంధించారు. ఆయన అంతకుముందు కూడా జైల్లో ఉన్నాడు, కానీ ఈసారి మాత్రం తనను చంపేస్తారని పౌలుకు తెలుసు. కొంతమంది స్నేహితులు ఆయన్ని విడిచి వెళ్లిపోయారు, పైగా ఆయన బలం కూడా తగ్గిపోయింది.—2 తిమో. 1:15.

17. కావాలనుకుంటే పౌలు ఏం చేయవచ్చు?

17 గతాన్నే తలుచుకుంటూ, వేరే నిర్ణయాలు తీసుకునివుంటే ఇలా జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా అని పౌలు అనుకోవచ్చు. ఆసియాలో కొంతమంది సహోదరులు తనను వదిలేసినందుకు పౌలు కోపం పెంచుకోవచ్చు. మిగతా స్నేహితుల్ని నమ్మడం కూడా ఆయన ఆపేయవచ్చు. కానీ పౌలు అవేవీ చేయలేదు. స్నేహితులు తనకు నమ్మకంగా ఉంటారని, యెహోవా తనకు ప్రతిఫలం ఇస్తాడని ఆయన నమ్మాడు. ఎందుకు?

18. కష్టమైన పరిస్థితిలో పౌలు ఏం చేశాడు?

18 (3ధ్యానించండి. “పౌలు తన సమస్యను పరిష్కరించుకోవడానికి ఏం చేశాడు?” అనే ప్రశ్న గురించి ఆలోచించండి. తాను త్వరలో చనిపోతానని తెలిసినా, పౌలు చాలా ముఖ్యమైన విషయం మీద అంటే యెహోవాను మహిమపర్చడం మీద మనసుపెట్టాడు. అంతేకాదు, ఆ కష్టాల్లో కూడా ఆయన ఇతరుల్ని ప్రోత్సహించడం గురించి ఆలోచించాడు. క్రమంగా ప్రార్థించడం ద్వారా యెహోవా మీద ఆధారపడ్డాడు. (2 తిమో. 1:3) తనను విడిచి వెళ్లిపోయిన వాళ్ల గురించి అతిగా బాధపడే బదులు, తనను అంటిపెట్టుకుని ప్రేమగా సహాయం చేసిన స్నేహితుల పట్ల కృతజ్ఞతతో ఉన్నాడు. అంతేకాదు పౌలు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం మానలేదు. (2 తిమో. 3:16, 17; 4:13) అన్నిటికన్నా ముఖ్యంగా యెహోవా, యేసు తనను ప్రేమిస్తున్నారనే గట్టి నమ్మకంతో ఆయన ఉన్నాడు. వాళ్లు ఆయన్ని విడిచిపెట్టలేదు, ఆయన నమ్మకంగా చేసిన సేవకు ప్రతిఫలం ఇచ్చారు.

19. యెహోవా పౌలుకు ఎలా సహాయం చేశాడు?

19 క్రైస్తవునిగా ఉన్నందుకు పౌలు హింసలు అనుభవించాల్సి వస్తుందని యెహోవా ముందే చెప్పాడు. (అపొ. 21:11-13) యెహోవా పౌలుకు ఎలా సహాయం చేశాడు? యెహోవా పౌలు ప్రార్థనలకు జవాబిచ్చాడు, అంతేకాదు సమయం గడుస్తుండగా ఆయనకు శక్తిని ఇచ్చాడు. (2 తిమో. 4:17) పౌలు ఏ ప్రతిఫలం కోసమైతే ఇంతలా కష్టపడ్డాడో, ఆ ప్రతిఫలాన్ని ఆయన తప్పకుండా పొందుతాడని యెహోవా చెప్పాడు. అంతేకాదు నమ్మకమైన స్నేహితుల ద్వారా యెహోవా పౌలుకు సహాయం చేశాడు.

20. రోమీయులు 8:38, 39 ప్రకారం, మీరు పౌలును ఎలా అనుకరించవచ్చు?

20 (4పాటించండి. ‘నేను పౌలును ఎలా అనుకరించవచ్చు?’ అని ఆలోచించండి. మన విశ్వాసం కారణంగా, పౌలులాగే మనకు కూడా హింసలు వస్తాయి. (మార్కు 10:29, 30) పరీక్షలు వచ్చినప్పుడు మనం యెహోవాకు నమ్మకంగా ఉండాలంటే, ప్రార్థన ద్వారా ఆయన మీద ఆధారపడాలి, క్రమంగా బైబిల్ని అధ్యయనం చేయాలి. మనం చేయగల అత్యంత ప్రాముఖ్యమైన పని, యెహోవాను మహిమపర్చడం అని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. యెహోవా మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడని, ఏం జరిగినా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడని నమ్మకంతో ఉండవచ్చు.—రోమీయులు 8:38, 39 చదవండి; హెబ్రీ. 13:5, 6.

ఇతర బైబిలు ఉదాహరణల నుండి కూడా నేర్చుకోండి

21. సమస్యల్ని తట్టుకోవడానికి ఐయాకు, హెక్టర్‌కు ఏది సహాయం చేసింది?

21 మన పరిస్థితులు ఏవైనా, బైబిలు ఉదాహరణల నుండి మనం బలం పొందవచ్చు. జపాన్‌లో ఉంటున్న ఐయా అనే పయినీరు సహోదరి, తనకు బహిరంగ సాక్ష్యం ఇవ్వడమంటే భయమని, ఆ భయాన్ని తీసేసుకోవడానికి యోనా ఉదాహరణ తనకు సహాయం చేసిందని చెప్తోంది. ఇండోనేషియాలో ఉంటున్న హెక్టర్‌ అనే యువ సహోదరుడు ఒంటరిగా సత్యంలో ఉన్నాడు. యెహోవా గురించి తెలుసుకుని, ఆయన్ని సేవించేలా రూతు ఉదాహరణ తనకు సహాయం చేసిందని హెక్టర్‌ చెప్తున్నాడు.

22. బైబిలు డ్రామాల నుండి, “వాళ్లలా విశ్వాసం చూపించండి” ఆర్టికల్స్‌ నుండి ఎక్కువ ప్రయోజనం పొందాలంటే ఏం చేయాలి?

22 మీకు బలాన్నిచ్చే బైబిలు ఉదాహరణలు ఎక్కడ దొరుకుతాయి? మన వీడియోలు, ఆడియో డ్రామాలు, “వాళ్లలా విశ్వాసం చూపించండి” ఆర్టికల్స్‌ బైబిలు సంఘటనల్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. * ఎంతో పరిశోధన చేసి తయారుచేసిన ఆ సమాచారాన్ని మీరు చూసే ముందు, వినే ముందు, లేదా చదివే ముందు మరిముఖ్యంగా మీకు ఉపయోగపడే అంశాల్ని కనుగొనేలా సహాయం చేయమని యెహోవాను అడగండి. బైబిల్లో మీరు ఎవరి గురించి పరిశీలిస్తున్నారో ఆ వ్యక్తి స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఆ నమ్మకమైన సేవకులు ఏం చేశారో, యెహోవా వాళ్లకు ఎలా సహాయం చేశాడో ధ్యానించండి. నేర్చుకున్న విషయాల్ని పాటించండి. యెహోవా ఇప్పటికే మీకు చేస్తున్న సహాయాన్ని బట్టి కృతజ్ఞతతో ఉండండి. ఇతరుల్ని ప్రోత్సహించే, మద్దతిచ్చే అవకాశాల కోసం వెతకడం ద్వారా ఆ కృతజ్ఞతను చేతల్లో చూపించండి.

23. యెషయా 41:10, 13 ప్రకారం, యెహోవా మనకు ఏమని మాటిస్తున్నాడు?

23 సాతాను గుప్పిట్లో ఉన్న ఈ లోకంలో కష్టమైన పరిస్థితులు వస్తాయి, కొన్నిసార్లు ఏం చేయాలో కూడా మనకు తెలీదు. (2 తిమో. 3:1) కానీ మనం కంగారుపడాల్సిన, భయపడాల్సిన అవసరం లేదు. మన సమస్యలేంటో యెహోవాకు తెలుసు. సహాయం అవసరమైనప్పుడు, తన కుడిచేతితో మనల్ని గట్టిగా పట్టుకుంటానని ఆయన మాటిస్తున్నాడు. (యెషయా 41:10, 13 చదవండి.) ఆయన సహాయం చేస్తాడన్న పూర్తి నమ్మకంతో మనం లేఖనాల నుండి బలం పొందవచ్చు, ఎలాంటి కష్టాన్నైనా తట్టుకోవచ్చు.

పాట 96 దేవుడిచ్చిన గ్రంథం ఒక నిధి

^ పేరా 5 యెహోవా తన సేవకుల్ని ప్రేమిస్తాడని, ఏ కష్టంలోనైనా వాళ్లకు తోడుంటాడని బైబిల్లో ఉన్న చాలా ఉదాహరణలు చూపిస్తున్నాయి. బైబిల్ని ఎలా చదివితే దాని నుండి ఎక్కువ ప్రయోజనం పొందవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

^ పేరా 2 బైబిలు చదవడానికి ఇక్కడ చెప్పింది ఒక పద్ధతి మాత్రమే. ఇంకొన్ని పద్ధతులు తెలుసుకోవడానికి యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకంలో, “బైబిలు” అనే అంశం కింద “బైబిలును చదవడం, అర్థం చేసుకోవడం” చూడండి.

^ పేరా 14 సంఘంలో కావలికోట అధ్యయనం జరుగుతున్నప్పుడు ఈ వచనాలు చదవకండి.

^ పేరా 22 jw.orgలో “వాళ్లలా విశ్వాసం చూపించండి—బైబిల్లోని స్త్రీపురుషులు” చూడండి. (బైబిలు బోధలు > దేవుని మీద విశ్వాసం కింద చూడండి.)