కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 38

యెహోవాకు, తోటి సహోదరసహోదరీలకు మరింత దగ్గరవ్వండి

యెహోవాకు, తోటి సహోదరసహోదరీలకు మరింత దగ్గరవ్వండి

“నా తండ్రీ మీ తండ్రీ . . . అయిన ఆయన దగ్గరికి నేను వెళ్తున్నాను.”—యోహా. 20:17.

పాట 3 మా బలం, మా నిరీక్షణ, మా ధైర్యం

ఈ ఆర్టికల్‌లో . . . *

1. మనం యెహోవాను ఏమని పిలవొచ్చు?

యెహోవా ఆరాధకుల కుటుంబంలో “మొత్తం సృష్టిలో మొట్టమొదట పుట్టిన” యేసు, అలాగే కోటానుకోట్ల దేవదూతలు ఉన్నారు. (కొలొ. 1:15; కీర్త. 103:20) యేసు భూమ్మీద ఉన్నప్పుడు, నమ్మకమైన మనుషులు యెహోవాను తండ్రి అని పిలవొచ్చని వాళ్లు అర్థంచేసుకోవడానికి సహాయం చేశాడు. ఆయన తన శిష్యులతో యెహోవా గురించి చెప్తూ, “నా తండ్రీ మీ తండ్రీ” అని అన్నాడు. (యోహా. 20:17) అంతేకాదు మనం యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకున్నప్పుడు సహోదరసహోదరీల కుటుంబంలో ఒకరమౌతాం.—మార్కు 10:29, 30.

2. ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

2 కొంతమందికి యెహోవాను ఒక ప్రేమగల తండ్రిలా భావించడం కష్టంగా ఉంటుంది. ఇంకొంతమందికి తోటి సహోదరసహోదరీల పట్ల ప్రేమ ఎలా చూపించాలో తెలీకపోవచ్చు. మనం యెహోవాను ప్రేమగల తండ్రిలా భావించడంతోపాటు ఆయనకు దగ్గరవ్వడానికి యేసు ఎలా సహాయం చేస్తాడో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. మన సహోదరసహోదరీలతో వ్యవహరించే విషయంలో యెహోవాను ఎలా అనుకరించవచ్చో కూడా నేర్చుకుంటాం.

మీరు తనకు దగ్గరవ్వాలని యెహోవా కోరుకుంటున్నాడు

3. యేసు నేర్పించిన ప్రార్థన మనల్ని యెహోవాకు ఎలా దగ్గర చేస్తుంది?

3 యెహోవా ఒక ప్రేమగల తండ్రి. యెహోవాను తాను చూసినట్లే మనం కూడా చూడాలని యేసు కోరుకుంటున్నాడు. దానర్థం, యెహోవాను ఏ సమయంలోనైనా సమీపించగల, దయగల, ప్రేమగల తండ్రిలా చూడాలేగానీ తాను చెప్పిందే చేయాలని అనుకునే దయలేని వ్యక్తిలా చూడకూడదు. యేసు అలా కోరుకుంటున్నాడని తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన బట్టి తెలుస్తుంది. ఆ ప్రార్థనను, “మా తండ్రీ” అనే మాటలతో ఆయన మొదలుపెట్టాడు. (మత్త. 6:9) యెహోవాను “సర్వశక్తిమంతుడు,” ‘సృష్టికర్త,’ లేదా “యుగయుగాలకు రాజు” అని పిలవమని యేసు మనకు చెప్పొచ్చు. అవన్నీ యెహోవాకు సరిగ్గా సరిపోయే బిరుదులే. ఎందుకంటే ఆయన్ని వర్ణించడానికి బైబిలు ఆ పదాలన్నిటినీ ఉపయోగిస్తుంది. (ఆది. 49:25; యెష. 40:28; 1 తిమో. 1:17) కానీ, వాటికి బదులు యెహోవాను “తండ్రి” అని యేసు పిలవమన్నాడు.

4. తనకు దగ్గరవ్వాలని యెహోవా కోరుకుంటున్నాడని మనకెలా తెలుసు?

4 యెహోవాను ఒక ప్రేమగల తండ్రిలా చూడడం మీకు కష్టంగా ఉందా? కొంతమందికి చిన్నతనంలో తండ్రి ప్రేమ దొరక్కపోవచ్చు. దానివల్ల యెహోవాను ఒక ప్రేమగల తండ్రిగా చూడడం వాళ్లకు కష్టమవ్వొచ్చు. అయితే యెహోవా మీ భావాలను పూర్తిగా అర్థంచేసుకుంటాడనే నమ్మకంతో ఉండండి. ఆయన మనకు దగ్గరవ్వాలని అనుకుంటున్నాడు. అందుకే తన వాక్యం ద్వారా ఇలా ప్రోత్సహిస్తున్నాడు: “దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు.” (యాకో. 4:8) యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు. అలాగే, ఎవ్వరూ ఉండనంతా మంచి తండ్రిగా ఉంటానని మాటిస్తున్నాడు.

5. లూకా 10:22 ప్రకారం, యెహోవాకు దగ్గరవ్వడానికి యేసు మనకెలా సహాయం చేయగలడు?

5 యెహోవాకు దగ్గరవ్వడానికి యేసు మనకు సహాయం చేయగలడు. యెహోవా గురించి యేసుకు బాగా తెలుసు. తన తండ్రి లక్షణాలను ఆయన ఎంత పరిపూర్ణంగా అనుకరించాడంటే ఆయనిలా అన్నాడు: “నన్ను చూసిన వ్యక్తి తండ్రిని కూడా చూశాడు.” (యోహా. 14:9) మనం తండ్రికి ఎలా గౌరవం ఇవ్వాలో, ఎలా లోబడాలో, ఆయన్ని ఎలా సంతోషపెట్టాలో, ఆయన ఆమోదం ఎలా పొందాలో యేసు ఒక అన్నలా మనకు నేర్పిస్తున్నాడు. ముఖ్యంగా యేసు ఈ భూమ్మీద జీవించిన విధానాన్ని గమనిస్తే యెహోవాకు ఉన్న ప్రేమ, దయ అర్థమౌతాయి. (లూకా 10:22 చదవండి.) ఇప్పుడు కొన్ని ఉదాహరణల్ని చూద్దాం.

ఒక ప్రేమగల తండ్రిగా తన కుమారుడ్ని బలపర్చడానికి యెహోవా ఒక దేవదూతను పంపించాడు (6వ పేరా చూడండి) *

6. యేసు ప్రార్థనల్ని యెహోవా విన్నాడని మనకెలా తెలుసో ఉదాహరణలు చెప్పండి.

6 యెహోవా తన పిల్లలు చెప్పేది వింటాడు. ఈ భూమ్మీద ఉన్నప్పుడు యేసు చేసిన ఎన్నో ప్రార్థనల్ని యెహోవా విన్నాడు. (లూకా 5:16) ఉదాహరణకు, తన 12 మంది శిష్యుల్ని ఎంచుకోవడం లాంటి ప్రాముఖ్యమైన నిర్ణయాల గురించి యేసు ప్రార్థించినప్పుడు ఆయన విన్నాడు. (లూకా 6:12, 13) యేసు ఆందోళనతో ప్రార్థన చేసినప్పుడు కూడా యెహోవా విన్నాడు. యూదా తనకు నమ్మకద్రోహం చేయడానికి కాస్త ముందు యేసు తాను ఎదుర్కోబోయే వాటిగురించి పట్టుదలగా ప్రార్థించాడు. యెహోవా ఆ ప్రార్థనల్ని వినడంతో పాటు తన ప్రియ కుమారున్ని బలపర్చడానికి ఒక దేవదూతను కూడా పంపించాడు.—లూకా 22:41-44.

7. యెహోవా మీ ప్రార్థనల్ని వింటున్నాడని తెలుసుకున్నప్పుడు మీకెలా అనిపిస్తుంది?

7 నేడు మనం చేసే ప్రార్థనల్ని కూడా యెహోవా వింటున్నాడు. అలాగే సరైన సమయంలో, సరైన విధంగా జవాబు ఇస్తున్నాడు. (కీర్త. 116:1, 2) యెహోవా తన ప్రార్థనలకు ఎలా జవాబిచ్చాడో ఇండియాలో ఉంటున్న ఒక సహోదరి అర్థంచేసుకుంది. ఆమె ఆందోళనతో సతమతం అవుతున్నప్పుడు దాని గురించి తన హృదయంలో ఉన్నదంతా ప్రార్థనలో యెహోవాకు చెప్పుకుంది. ఆమె ఇలా అంటుంది: “2019, మే నెల JW బ్రాడ్‌కాస్టింగ్‌ కార్యక్రమంలో ఆందోళన నుండి ఎలా బయటపడవచ్చో వివరించారు. నాకది చాలా అవసరమైన సమాచారం, అలాగే అది నా ప్రార్థనలకు దొరికిన జవాబు.”

8. యెహోవా ఏయే విధాలుగా యేసు మీద ప్రేమ చూపించాడు?

8 యేసు ఈ భూమ్మీద ఉన్నప్పుడు ఆయన్ని శ్రద్ధగా చూసుకున్నట్టే, మనల్ని కూడా యెహోవా చూసుకుంటాడు. (యోహా. 5:20) యేసు తన విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి యెహోవా సహాయం చేశాడు. ఆయన ఆందోళనలో ఉన్నప్పుడు ప్రోత్సహించాడు. ఆయన జీవించడానికి అవసరమైనవాటిని సమకూర్చాడు. అంతేకాదు తన కుమారున్ని ప్రేమిస్తున్నానని, తనని చూసి ఆనందిస్తున్నానని చెప్పడానికి యెహోవా వెనకాడలేదు. (మత్త. 3:16, 17) తన ప్రియ పరలోకపు తండ్రి ఎల్లప్పుడూ తనకు తోడుంటాడని, సహాయం చేస్తాడని యేసుకు తెలుసు కాబట్టి ఆయనకు ఎప్పుడూ ఒంటరిగా అనిపించలేదు.—యోహా. 8:16.

9. యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని మనకెలా తెలుసు?

9 యేసులాగే మనం కూడా యెహోవా ప్రేమను ఎన్నో విధాలుగా చూశాం. యెహోవా మనల్ని తన స్నేహితులు అయ్యేలా ఆకర్షించాడు. అలాగే మనం సంతోషంగా ఉండడానికి, బాధలో ఉన్నప్పుడు మనల్ని ప్రోత్సహించడానికి ఎంతోమంది ప్రేమగల సహోదరసహోదరీలను ఆయన ఇచ్చాడు. (యోహా. 6:44) మన విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి కావాల్సిన ఆధ్యాత్మిక ఆహారాన్ని కూడా ఇస్తున్నాడు. మన రోజువారీ అవసరాలు తీరేలా ఆయన సహాయం చేస్తున్నాడు. (మత్త. 6:31, 32) యెహోవా మనమీద ఎలా ప్రేమ చూపిస్తున్నాడో ఆలోచించినప్పుడు మనకు ఆయన మీదున్న ప్రేమ పెరుగుతుంది.

తోటి సహోదరసహోదరీలతో యెహోవా వ్యవహరించినట్టే వ్యవహరించండి

10. యెహోవా మన సహోదరసహోదరీల మీద ప్రేమ చూపించడం నుండి మనమేం నేర్చుకోవచ్చు?

10 యెహోవా మన సహోదరసహోదరీలను ప్రేమిస్తున్నాడు. కానీ మనం వాళ్లను ప్రేమించడం, ఆ ప్రేమను వ్యక్తం చేయడం అన్నిసార్లు తేలిక కాకపోవచ్చు. ఎందుకంటే మన సంస్కృతులు వేరు, పెరిగిన పరిస్థితులు వేరు. అలాగే మనందరం పొరపాట్లు చేస్తాం. వాటివల్ల ఇతరులకు చిరాకు, బాధ కలగవచ్చు. అయినప్పటికీ మన సహోదరసహోదరీల పట్ల ప్రేమను పెంచుకోవడానికి బాగా కృషి చేయొచ్చు. వాళ్ల మీద ప్రేమ చూపించే విషయంలో మన తండ్రిని అనుకరించడం ద్వారా అలా చేయొచ్చు. (ఎఫె. 5:1, 2; 1 యోహా. 4:19) యెహోవా నుండి మనమేం నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

11. యెహోవాకున్న గొప్ప కనికరాన్ని యేసు ఎలా చూపించాడు?

11 యెహోవా “గొప్ప కనికరం” చూపిస్తాడు. (లూకా 1:78) కనికరంగల వ్యక్తి ఇతరుల బాధను చూసి తాను కూడా బాధపడతాడు. ఏదోక విధంగా వాళ్లకు సహాయం చేయడానికి, వాళ్లను ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు. యేసు ప్రజలతో వ్యవహరిస్తున్నప్పుడు యెహోవా లాంటి కనికరాన్ని చూపించాడు. (యోహా. 5:19) యేసు ప్రజల్ని చూసినప్పుడు “వాళ్లమీద జాలిపడ్డాడు, ఎందుకంటే వాళ్లు కాపరిలేని గొర్రెల్లా అణచివేయబడి, నిర్లక్ష్యం చేయబడ్డారని ఆయన గమనించాడు.” (మత్త. 9:36) ఆయన కనికరం చూపించడంతో పాటు సహాయం కూడా చేశాడు. ఆయన రోగుల్ని బాగుచేశాడు అలాగే “భారం మోస్తూ అలసిపోయిన” వాళ్లకు సేదదీర్పు ఇచ్చాడు.—మత్త. 11:28-30; 14:14.

తోటి సహోదరసహోదరీల పట్ల కనికరం, ఉదారత చూపిస్తూ యెహోవాను అనుకరించండి (12-14 పేరాలు చూడండి) *

12. తోటి సహోదరసహోదరీల మీద మనమెలా కనికరం చూపించవచ్చు?

12 మన సహోదరసహోదరీలు ఎలాంటి కష్టాల్లో ఉన్నారో ఆలోచించినప్పుడు వాళ్ల మీద కనికరం చూపించగల్గుతాం. ఉదాహరణకు, ఒక సహోదరి తీవ్రమైన ఆనారోగ్య సమస్యతో బాధపడుతుండవచ్చు. ఆమె తన సమస్య గురించి ఎప్పుడూ చెప్పకపోయినా, ఎవరైనా సహాయం చేస్తే సంతోషిస్తుంది. ఆమెకు ఇంటిపనులు చేసుకోవడం కష్టంగా ఉండొచ్చు. తన కుటుంబం కోసం భోజనం వండే విషయంలో లేదా ఇంటిని శుభ్రం చేసుకునే విషయంలో సహాయం చేయగలమా? ఒక సహోదరుడు తన ఉద్యోగం కోల్పోయి ఉండొచ్చు. ఆయనకు మరో ఉద్యోగం దొరికేవరకు, మనం ఇస్తున్నామని తెలీకుండా కొంత డబ్బు సహాయంగా ఇవ్వొచ్చు.

13-14. యెహోవాను అనుకరిస్తూ మనమెలా ఉదారత చూపించవచ్చు?

13 యెహోవా ఉదార స్వభావం గలవాడు. (మత్త. 5:45) మన సహోదరసహోదరీల పట్ల కనికరం చూపించడానికి వాళ్లు అడిగేదాక ఎదురుచూడాల్సిన పనిలేదు. మనుషులు అడగకముందే యెహోవా వాళ్లకు మంచివాటిని ఇస్తాడు. ఉదాహరణకు, మనందరికీ సూర్యుని వెలుగు అవసరం. అయితే మనం అడగకముందే యెహోవా మనకోసం ప్రతీరోజు సూర్యుడు ఉదయించేలా చేస్తున్నాడు. ఆయన పట్ల కృతజ్ఞతలేని వాళ్లమీద కూడా సూర్యుడు ఉదయించేలా చేస్తున్నాడు. దీన్నిబట్టి యెహోవాకు ఎంత ప్రేమ, ఉదారత ఉన్నాయో స్పష్టంగా తెలుస్తుంది. మనం కూడా యెహోవాను అనుకరిస్తూ సహోదరసహోదరీలు అడగకముందే సహాయం చేయాలి.

14 యెహోవాను అనుకరిస్తూ మన సహోదరసహోదరీల్లో చాలామంది ఇతరుల పట్ల ఉదారత చూపిస్తున్నారు. ఉదాహరణకు, 2013లో హయాన్‌ అనే పెద్ద తుఫాను వల్ల ఫిలిప్పీన్స్‌లో భారీ నష్టం జరిగింది. చాలామంది సహోదరసహోదరీలు తమ ఇళ్లను, వస్తువులను కోల్పోయారు. అయితే ప్రపంచవ్యాప్తంగా సహోదరసహోదరీలు వాళ్లకు వెంటనే సహాయం చేయడానికి ముందుకొచ్చారు. చాలామంది డబ్బును విరాళంగా ఇచ్చారు లేదా ఒక సంవత్సరంలోనే దాదాపు 750 ఇళ్లను తిరిగి కట్టడంలో, మరమ్మతులు చేయడంలో సహాయం చేశారు. కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో తోటి సహోదరసహోదరీలకు సహాయం చేయడానికి చాలామంది యెహోవాసాక్షులు కష్టపడ్డారు. మన సహోదరసహోదరీలకు సహాయం చేయడానికి వెంటనే ముందుకు వచ్చినప్పుడు మనకు వాళ్ల మీద ప్రేమ ఉందని చూపిస్తాం.

15-16. మన పరలోక తండ్రిని అనుకరించాలంటే ఏం చేయాలని లూకా 6:36 చెప్తుంది?

15 యెహోవా కరుణ గలవాడు, క్షమించేవాడు. (లూకా 6:36 చదవండి.) ప్రతీరోజు మన పరలోక తండ్రి కరుణ చూపిస్తూ మనందర్నీ క్షమిస్తున్నాడు. (కీర్త. 103:10-14) యేసు కూడా కరుణ చూపించాడు. తన అనుచరులు ఎన్ని తప్పులు చేసినా వాళ్లను క్షమించాడు. మన పాపాలకు క్షమాపణ దొరకడానికి ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. (1 యోహా. 2:1, 2) యెహోవా, యేసు చూపిస్తున్న కరుణ, క్షమించే గుణం వల్ల మనం వాళ్లకు మరింత దగ్గరౌతాం.

16 మనం ఒకరినొకరం ‘మనస్ఫూర్తిగా క్షమించుకున్నప్పుడు’ మన మధ్య ప్రేమ ఇంకా పెరుగుతుంది. (ఎఫె. 4:32) కొన్నిసార్లు ఒకరినొకరం క్షమించుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి దాని విషయంలో కృషి చేయాలి. “ఒకరినొకరు మనస్ఫూర్తిగా క్షమించుకోండి” అనే కావలికోట ఆర్టికల్‌ * ఒక సహోదరికి అలా చేయడానికి సహాయం చేసింది. ఆమె ఇలా చెప్తుంది: “ఇతరులను క్షమించడం వల్ల నేనెలా ప్రయోజనం పొందుతానో అర్థంచేసుకోవడానికి ఈ ఆర్టికల్‌ నాకు సహాయం చేసింది. ఆ కావలికోట వివరిస్తున్నట్లు, మనం ఇతరులను క్షమిస్తున్నాం అంటే వాళ్లు ఏ తప్పు చేయలేదని లేదా వాళ్లవల్ల మనకు బాధ కలగలేదని కాదు. కానీ వాళ్లమీద కోపాన్ని తీసేసుకొని ప్రశాంతంగా ఉంటామని అర్థం.” మన సహోదరసహోదరీలను మనస్ఫూర్తిగా క్షమించినప్పుడు మనం వాళ్లను ప్రేమిస్తున్నామని, యెహోవాను అనుకరిస్తున్నామని చూపిస్తాం.

యెహోవా కుటుంబంలో ఒకరిగా ఉన్నందుకు కృతజ్ఞత కలిగి ఉండండి

వయసుతో పనిలేకుండా చిన్నవాళ్లు-పెద్దవాళ్లు తోటి సహోదరసహోదరీల మీద ప్రేమ చూపించారు (17వ పేరా చూడండి) *

17. మత్తయి 5:16 ప్రకారం, మన పరలోక తండ్రిని మనమెలా మహిమపర్చవచ్చు?

17 ఒకరినొకరు ప్రేమించుకునే సహోదరసహోదరీల ప్రపంచవ్యాప్త కుటుంబం మనకున్నందుకు మనమెంతో కృతజ్ఞులం. వీలైనంత ఎక్కువమంది మనతో కలిసి యెహోవాను ఆరాధించాలని మనం కోరుకుంటాం. కాబట్టి యెహోవాకు, ఆయన ప్రజలకు చెడ్డపేరు తెచ్చే ఏ పనీ చేయకుండా మనం జాగ్రత్తపడాలి. ప్రజలు యెహోవా గురించి తెలుసుకొని, ఆయన్ని ఆరాధించేలా మన ప్రవర్తన ఉండాలి.—మత్తయి 5:16 చదవండి.

18. ధైర్యంగా ప్రకటించడానికి మనకేది సహాయం చేస్తుంది?

18 మన పరలోక తండ్రికి లోబడినప్పుడు కొంతమంది మనల్ని ఎగతాళి చేయొచ్చు లేదా హింసించొచ్చు. మన నమ్మకాల గురించి ఇతరులకు చెప్తున్నప్పుడు మనకు భయమేస్తే ఏం చేయాలి? యెహోవా, యేసు ఖచ్చితంగా సహాయం చేస్తారనే ధైర్యంతో ఉండొచ్చు. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో కంగారుపడాల్సిన అవసరంలేదని యేసు తన శిష్యులకు చెప్పాడు. యేసు ఇంకా ఇలా అన్నాడు: “మీరు ఏమి మాట్లాడాలో ఆ సమయంలోనే మీకు తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు మీ అంతట మీరే మాట్లాడరు కానీ, మీ తండ్రి ఇచ్చే పవిత్రశక్తి సహాయంతో మాట్లాడతారు.”—మత్త. 10:19, 20.

19. రాబర్ట్‌ ఎలా ధైర్యంగా సాక్ష్యం ఇచ్చాడో చెప్పండి.

19 సహోదరుడు రాబర్ట్‌ ఉదాహరణ గమనించండి. ఆయన కొన్నేళ్ల క్రితం కొత్తగా బైబిలు స్టడీ మొదలుపెట్టినప్పుడు దక్షిణ ఆఫ్రికాలోని మిలిటరీ కోర్టుకు వెళ్లాల్సివచ్చింది. ఆయన తన సహోదరులను ప్రేమిస్తున్నాడు కాబట్టి సైన్యంలో చేరాలనుకోవట్లేదని ధైర్యంగా కోర్టులో వివరించాడు. సహోదరసహోదరీల కుటుంబంలో తాను ఒకడిగా ఉన్నందుకు ఎంతో సంతోషించాడు. హఠాత్తుగా ఒక జడ్జి ఆయన్ని, “నీ సహోదరులు ఎవరు?” అని అడిగాడు. జడ్జి అలా అడుగుతాడని రాబర్ట్‌ అస్సలు ఊహించలేదు. కానీ, ఆయనకు వెంటనే ఆరోజు దినవచనం మత్తయి 12:50 గుర్తొచ్చింది. అక్కడ ఇలా ఉంది: “పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి.” రాబర్ట్‌ బైబిలు స్టడీ మొదలుపెట్టి కొంతకాలమే అయినా ఆ ప్రశ్నకు ఆలాగే వేరే ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి యెహోవా పవిత్రశక్తి ఆయనకు సహాయం చేసింది. రాబర్ట్‌ను చూసి యెహోవా గర్వపడి ఉంటాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ప్రకటించడానికి యెహోవా మీద ఆధారపడితే ఆయన మనల్ని చూసి కూడా గర్వపడతాడు.

20. మనం ఏం తీర్మానించుకోవాలి? (యోహాను 17:11, 15)

20 ప్రేమగల కుటుంబంలో ఒకరిగా ఉన్నందుకు మనమెప్పుడూ కృతజ్ఞత కలిగివుందాం. ఈ విశ్వంలోనే గొప్ప తండ్రైన యెహోవా అలాగే మనల్ని ప్రేమించే ఎంతోమంది సహోదరసహోదరీలు మనకున్నారు. వాళ్లను ఎప్పుడూ విలువైనవాళ్లలా చూడాలి. యెహోవా ప్రేమను సందేహపడేలా చేయడానికి, మన ఐక్యతను దెబ్బతీయడానికి సాతాను, అతని అనుచరులు ప్రయత్నిస్తారు. అందుకే మన ఆధ్యాత్మిక కుటుంబం ఎప్పుడూ ఐక్యంగా ఉండేలా చూడమని యేసు మన తండ్రిని అడిగాడు. (యోహాను 17:11, 15 చదవండి.) యెహోవా ఇప్పటికే ఆ ప్రార్థనకు జవాబు ఇస్తున్నాడు. మనం యేసులా ఉంటూ యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడో లేదో, మనకు సహాయం చేస్తాడో లేదో అని ఎన్నడూ సందేహించకూడదు. యెహోవాకు తోటి సహోదరసహోదరీలకు మరింత దగ్గరవ్వాలని తీర్మానించుకుందాం.

పాట 99 వేవేల సహోదరులు

^ పేరా 5 మన సహోదరసహోదరీలు ఉన్న ప్రేమగల కుటుంబంలో ఒకరిగా ఉన్నందుకు చాలా సంతోషిస్తాం. మనకు ఒకరిపట్ల ఒకరికున్న ప్రేమను బలపర్చుకోవాలని అనుకుంటాం. దాన్ని మనమెలా చేయవచ్చు? యెహోవా మనపట్ల చూపించిన ప్రేమను అనుకరించడం ద్వారా, యేసు అలాగే తోటి సహోదరసహోదరీల ఆదర్శాన్ని అనుకరించడం ద్వారా అలా చేయవచ్చు.

^ పేరా 57 చిత్రాల వివరణ: గెత్సేమనే తోటలో యేసును బలపర్చడానికి యెహోవా ఒక దేవదూతను పంపించాడు.

^ పేరా 59 చిత్రాల వివరణ: కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో అవసరంలో ఉన్న తోటి సహోదరసహోదరీలకు ఆహారాన్ని అందించడానికి చాలామంది కష్టపడ్డారు.

^ పేరా 61 చిత్రాల వివరణ: జైల్లో ఉన్న ఒక సహోదరున్ని ప్రోత్సహించడానికి ఒక పాప ఉత్తరం రాస్తుంటే ఆమె తల్లి సహాయం చేస్తుంది.