ద్వేషమనే విషచక్రానికి కారణం ఏంటి?
ఈ విషచక్రంలో ప్రపంచమంతా చిక్కుకోవడానికి కారణం ఏంటి? అది తెలియాలంటే అసలు ద్వేషం అంటే ఏంటో, అది ఎందుకు మొదలౌతుందో, అది ఒకరి నుండి ఒకరికి ఎలా వ్యాపిస్తుందో తెలుసుకోవాలి.
ద్వేషం అంటే ఏంటి?
ఒకరి మీద లేదా ఎక్కువమంది మీద కలిగే విపరీతమైన అయిష్టాన్ని ద్వేషం అంటారు. కోపం కాసేపు ఉండి తగ్గిపోతుంది కానీ, ద్వేషం మనసులో గూడు కట్టుకుని ఉండిపోతుంది.
అసలు ద్వేషం ఎందుకు మొదలౌతుంది?
దానికి చాలా కారణాలు ఉంటాయి. ఉదాహరణకు ఒకటి చూద్దాం. కొంతమందిని వాళ్లేదో చేశారని కాదు గానీ, వాళ్లు ఫలానా జాతికి చెందినవాళ్లు అనే ఒకేఒక్క కారణంతో ద్వేషిస్తారు. వాళ్లను చెడ్డవాళ్లుగా, సమాజానికి హాని చేసేవాళ్లుగా, మారడానికి ఇష్టపడని మొండివాళ్లుగా చూస్తారు. వాళ్లను చిన్నచూపు చూడడంతో పాటు, వాళ్ల వల్ల ఇతరులకు ప్రమాదమని, చాలా సమస్యలకు వాళ్లే కారణమని కూడా భావిస్తారు. మరి ద్వేషానికి గురౌతున్న ఆ జాతివాళ్లకు ఎలా అనిపిస్తుంది? మనసుకు శరీరానికి తగిలిన గాయాలు, తమకు జరిగిన అన్యాయం, ఎదురైన చేదు అనుభవాలు అన్నీ కలిసి వాళ్లలో పగను ప్రతీకారాన్ని పెంచుతాయి.
ద్వేషం ఎలా వ్యాపిస్తుంది?
జీవితంలో ఒక్కసారి కూడా కలవనివాళ్లను, అసలు పరిచయమే లేనివాళ్లను ద్వేషించడం సాధ్యమేనా? సాధ్యమే! ఎలా అని ఆశ్చర్యపోతున్నారా? సాధారణంగా మన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎవరినైతే గౌరవిస్తారో, ఇష్టపడతారో మనం కూడా వాళ్లనే గౌరవిస్తాం, ఇష్టపడతాం. అది మనకు తెలియకుండానే జరిగిపోతుంది. అదేవిధంగా వాళ్లు ఎవరినైతే ద్వేషిస్తారో వాళ్ల మీద మనకు కూడా ఒక తెలియని అయిష్టత ఏర్పడుతుంది, మెల్లగా అది ద్వేషంగా మారుతుంది.
ఇది ఒకరి నుండి ఒకరికి ఇంత సులువుగా వ్యాపిస్తుంది కాబట్టే, దాని జాడ ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా కనిపిస్తుంది. అయితే, ద్వేషమనే విషచక్రం నుంచి ప్రపంచం బయటపడాలంటే, మొట్టమొదటిసారి ద్వేషం ఎక్కడ మొదలైందో, ఎలా మొదలైందో ముందు తెలుసుకోవాలి. ఆ విషయాలన్నీ బైబిల్లో ఉన్నాయి.
ద్వేషానికి పునాది ఎక్కడ పడిందో బైబిలు తెలియజేస్తుంది
ద్వేషం మొదలవ్వడానికి కారణం మనుషులు కాదు. పరలోకంలో ఉండే ఒక దేవదూత దేవునికి ఎదురుతిరిగాడు. ఆ చెడ్డ దేవదూతను సాతాను అని పిలుస్తారు. ద్వేషం మొదలవ్వడానికి కారణం అతనే. ఈ దుష్టుణ్ణి ‘హంతకుడు, అబద్ధాలకోరు, అబద్ధానికి తండ్రి’ అని బైబిలు పిలుస్తుంది. ఎందుకంటే మనుషుల్లో కోపాన్ని, ద్వేషాన్ని పెంచి పోషిస్తోంది ఇతనే. (యోహాను 8:44; 1 యోహాను 3: 11, 12) ఈ సాతాను క్రూరుడు, కోపిష్ఠి అని కూడా బైబిలు చెప్తుంది.—యోబు 2:7; ప్రకటన 12:9, 12, 17.
మనుషుల్లో ఉన్న బలహీనతల కారణంగా వాళ్లలో ద్వేషం తేలిగ్గా మొదలౌతుంది. మొదటి మనిషైన ఆదాము సాతాను అడుగుజాడల్లో నడిచి తప్పు చేశాడు. మనందరం ఆదాము నుండి వచ్చినవాళ్లమే. తండ్రి ఆస్తి పిల్లలకు వారసత్వంగా వచ్చినట్టు, ఆదాము నుండి పాపం, బలహీనతలు మనుషులందరికీ వారసత్వంగా వచ్చాయి. (రోమీయులు 5:12) ఆదాము మొదటి కుమారుడైన కయీను తన సొంత తమ్ముడైన హేబెలు మీద ద్వేషం పెంచుకొని అతన్ని హత్య చేశాడు. (1 యోహాను 3:12) దానర్థం మనుషులందరూ చెడ్డవాళ్లని, ఎవ్వరికీ ప్రేమాకనికరాలు లేవని కాదు. కాకపోతే వారసత్వంగా వచ్చిన పాపం వల్ల ఎక్కువశాతం మందిలో స్వార్థం, అసూయ, గర్వం ఉంటున్నాయి. ఈ లక్షణాలన్నీ ద్వేషానికి దారితీస్తాయి.—2 తిమోతి 3:1-5.
అయిష్టత చాలా సులువుగా ద్వేషంగా మారుతుంది. ప్రజలు కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నా, సాటిమనిషికి హాని తలపెట్టాలని ఆలోచిస్తున్నా, ఆఖరికి హాని తలపెడుతున్నా పట్టించుకునేవాళ్లు ఎవ్వరూ లేరు. దానివల్ల ప్రజల్లో ద్వేషం రోజురోజుకూ పెరుగుతుంది. ఈ లోకమంతా దుష్టుడైన సాతాను గుప్పిట్లో ఉంది. అందుకే వేరే అభిప్రాయాలు-నమ్మకాలు ఉన్నవాళ్లను చూసి సహించలేకపోవడం, వివక్ష చూపించడం, మాటలతో గాయపర్చడం, ఏడ్పించడం, ఆస్తి ధ్వంసం చేయడం లాంటివి రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి.—1 యోహాను 5:19.
అయితే బైబిలు, ద్వేషానికి కారణాన్ని తెలియజేయడంతో పాటు దాన్ని మనసులో నుండి తీసేసుకునే మార్గాన్ని కూడా వివరిస్తుంది.