ద్వేషాన్ని లేకుండా చేయడం సాధ్యమే!
ఎవరైనా మిమ్మల్ని ద్వేషించారా?
ఒకవేళ అలాంటి అనుభవం మీకు ఎదురై ఉండకపోతే మంచిదే. కానీ ఏదో ఒక రూపంలో ద్వేషానికి గురైనవాళ్లను మాత్రం ఖచ్చితంగా చూసే ఉంటారు. అంతెందుకు న్యూస్ పెడితే చాలు దేశం, జాతి, మతం ఆధారంగా జరుగుతున్న దాడుల గురించి ఎప్పుడూ ఏదోక వార్త వస్తూనే ఉంటుంది. వీటికి ఎలాగైనా ముగింపు పలకాలనే ఉద్దేశంతో చాలా ప్రభుత్వాలు కొత్త చట్టాలు కూడా తయారుచేస్తున్నాయి.
సమస్య ఏంటంటే, ద్వేషం అంటువ్యాధి లాంటిది. ద్వేషానికి గురైనవాళ్లు పగ-ప్రతీకారాలతో రగిలిపోతారు. తమను ద్వేషించేవాళ్లను తిరిగి ద్వేషిస్తారు. ఈ విషచక్రం ఇలా కొనసాగుతూనే ఉంటుంది.
మనసులో గూడు కట్టుకున్న ద్వేషాన్ని వివక్ష, బెదిరింపు, ఎగతాళి రూపంలో బయటపెట్టడం మీరు ఇప్పటికే చూసి ఉంటారు. అయితే దాన్ని వీటికన్నా క్రూరమైన విధాలుగా కూడా చూపిస్తారు. మనిషి మీద దాడి చేయడం, ఆస్తుల్ని ధ్వంసం చేయడం, రేప్ చేయడం, హత్య చేయడం, ఏదైనా జాతి వాళ్లందరినీ చంపేయడం ఇవన్నీ ఆ కోవకే చెందుతాయి.
ఈ పత్రిక, ద్వేషాన్ని ఎలా తీసేసుకోవచ్చో వివరించడంతో పాటు కిందున్న ప్రశ్నలకు జవాబు కూడా ఇస్తుంది:
ప్రపంచంలో ద్వేషం ఎందుకింత ఎక్కువగా ఉంది?
ద్వేషమనే విషచక్రాన్ని ఎలా ఆపవచ్చు?
ద్వేషమే లేని ప్రపంచాన్ని చూడడం సాధ్యమేనా?