కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ద్వేషమనే విషచక్రం నుండి ఎలా బయటపడవచ్చు?

2 | పగ తీర్చుకోకండి

2 | పగ తీర్చుకోకండి

బైబిలు సలహా:

“ఎవరైనా మీకు చెడు చేస్తే, తిరిగి వాళ్లకు చెడు చేయకండి. . . . సాధ్యమైతే, మీకు చేతనైనంత వరకు మనుషులందరితో శాంతిగా మెలగండి. . . . మీకు మీరే పగతీర్చుకోకండి, . . . ఎందుకంటే లేఖనాల్లో ఇలా ఉంది: ‘“పగతీర్చుకోవడం, ప్రతిఫలం ఇవ్వడం నా పని” అని యెహోవా అంటున్నాడు.’”రోమీయులు 12:17-19.

దానర్థం:

మనకు అన్యాయం జరిగినప్పుడు కోపం రావడం సహజమే. కానీ పగ తీర్చుకోవద్దని, ఓపిక చూపించమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే, అన్యాయానికి గురైన వాళ్లందరికీ త్వరలో న్యాయం చేస్తానని ఆయన అంటున్నాడు.—కీర్తన 37:7, 10.

మనం ఏం చేయవచ్చు?

మనుషులు ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే సమస్య తీరకపోగా, అదింకా పెద్దదౌతుంది. ద్వేషం తరతరాలు కొనసాగుతుంది. అందుకే, ఎవరైనా మనకు చెడు చేస్తే దెబ్బకు దెబ్బ తీయాలని అనుకోకూడదు. ఆవేశాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. కొన్ని విషయాల్ని మనసులోకి తీసుకోకుండా వదిలేయడమే మంచిది. (సామెతలు 19:11) కాకపోతే, కొన్నిటిని మాత్రం అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఉదాహరణకు, మీ మీద ఎవరైనా దాడి చేస్తే దాని గురించి పోలీసులకు, సంబంధిత అధికారులకు చెప్పాల్సి రావచ్చు.

పగ-ప్రతీకారాలు మనల్నే నాశనం చేస్తాయి

ఒక సమస్యను ప్రశాంతంగా పరిష్కరించుకునే మార్గమే కనిపించకపోతే ఏం చేయాలి? లేదా, ప్రశాంతంగా పరిష్కరించుకోవడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోతే అప్పుడేం చేయాలి? అప్పుడు కూడా పగ పెంచుకోకూడదు; లేదంటే పరిస్థితి ఇంకా చేయి దాటిపోతుంది. దానికి బదులు, అపార్థాలను తొలగించుకుని ద్వేషానికి అడ్డుకట్ట వేయాలి. అంతేకాదు, దేవుడే ఒక పరిష్కారం చూపిస్తాడని నమ్మాలి. ‘ఆయన మీద ఆధారపడితే, ఆయనే మీ తరఫున చర్య తీసుకుంటాడు.’—కీర్తన 37:3-5.