కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ద్వేషమనే విషచక్రం నుండి ఎలా బయటపడవచ్చు?

3 | మనసులో నుండి ద్వేషాన్ని తీసేయండి

3 | మనసులో నుండి ద్వేషాన్ని తీసేయండి

బైబిలు సలహా:

“మీ ఆలోచనాతీరులో మార్పులు చేసుకుంటూ మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోండి. అలా మీరు మంచిది, ఆమోదయోగ్యమైనది, సంపూర్ణమైనది అయిన దేవుని ఇష్టాన్ని పరీక్షించి తెలుసుకోగలుగుతారు.”రోమీయులు 12:2.

దానర్థం:

మన ఆలోచనలు ఎలా ఉన్నాయో దేవుడు చూస్తాడు, వాటిని పట్టించుకుంటాడు. (యిర్మీయా 17:10) ద్వేషాన్ని మాటల్లో, చేతల్లో చూపించకుండా ఉంటే సరిపోదు; మన ఆలోచనల్లో కూడా దానికి చోటివ్వకూడదు. సాధారణంగా ద్వేషానికి బీజం మనసులో, హృదయంలో పడుతుంది. కాబట్టి అలాంటి ఆలోచనలు గానీ, ఫీలింగ్స్‌ గానీ వస్తుంటే వెంటనే వాటిని వేళ్లతో సహా తీసేసుకోవాలి. అప్పుడే మన వ్యక్తిత్వాన్ని “పూర్తిగా మార్చుకోగలుగుతాం,” ద్వేషమనే విషచక్రం నుండి బయటపడతాం.

మనం ఏం చేయవచ్చు?

ఇతరుల మీద, ముఖ్యంగా వేరే దేశం వాళ్లమీద మనకు ఎలాంటి అభిప్రాయం ఉందో నిజాయితీగా పరిశీలించుకోవాలి. ఉదాహరణకు మనం ఇలా ఆలోచించవచ్చు: ‘వాళ్లు ఎలాంటివాళ్లని నేను అనుకుంటున్నాను? వాళ్లగురించి నాకు తెలిసిన దాన్నిబట్టే నేనలా అనుకుంటున్నానా? లేదా వాళ్లు ఆ దేశం వాళ్లు కాబట్టి అలాంటి వాళ్లే అయ్యుంటారని అనుకుంటున్నానా? సోషల్‌ మీడియాలో వచ్చే కొన్ని వీడియోలు, ఆర్టికల్స్‌ అలాగే కొన్ని సినిమాలు ద్వేషాన్ని, హింసను నూరిపోస్తాయి. అలాంటి వాటికి దూరంగా ఉండాలి.

మనసులో, హృదయంలో పాతుకుపోయిన ద్వేషాన్ని తీసేసుకోవడానికి దేవుని వాక్యం సహాయం చేస్తుంది

మనల్ని మనం నిజాయితీగా పరిశీలించుకోవడం అంత సులభం కాదు. కానీ మన “హృదయంలోని ఆలోచనల్ని, ఉద్దేశాల్ని” పరిశీలించుకోవడానికి దేవుని వాక్యం సహాయం చేస్తుంది. (హెబ్రీయులు 4:12) అందుకే బైబిలు ఏం చెప్తుందో తెలుసుకోవాలి. మన ఆలోచనలు బైబిలు చెప్తున్న వాటికి అనుగుణంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఒకవేళ అలా లేకపోతే వాటిని సరిచేసుకోవడానికి చేయగలిగినదంతా చేయాలి. మనసులో, హృదయంలో ‘బలమైన కోటలా’ పాతుకుపోయిన ద్వేషాన్ని తీసేసుకోవడానికి సైతం దేవుని వాక్యం సహాయం చేస్తుంది.—2 కొరింథీయులు 10:4, 5.