కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇతరులకు మేలు చేస్తే మంచి భవిష్యత్తు పొందుతామా?

ఇతరులకు మేలు చేస్తే మంచి భవిష్యత్తు పొందుతామా?

మంచి పనులు చేస్తే, వేరేవాళ్లకు సహాయం చేస్తే పుణ్యం వస్తుందని, మంచి భవిష్యత్తు పొందుతారని వందల సంవత్సరాలుగా ప్రజలు నమ్ముతున్నారు. కన్‌ఫ్యూషియస్‌ (పుట్టుక: క్రీ.పూ. 551-మరణం: క్రీ.పూ. 479) అనే ఒక పేరుపొందిన బోధకుడు ఇలా చెప్పాడు: “ఇతరులు మీకు ఏమి చేయకూడదని మీరు కోరుకుంటారో, అది మీరు ఇతరులకు చేయకండి.” ఆసియాలో ఉండే చాలామంది ఆయన చెప్పిన ఈ మాటల్ని గౌరవిస్తారు.

చాలామంది ఎంచుకునే మార్గం

ఇతరులతో మంచిగా ఉంటే, వాళ్లకు కూడా తిరిగి మంచి జరుగుతుందని జీవితం బాగుంటుందని ఇప్పటికీ చాలామంది నమ్ముతున్నారు. అందుకే వాళ్లు ఇతరులతో మర్యాదగా నడుచుకోవడానికి, బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించడానికి, ఎవరి మనసును నొప్పించకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు. వియత్నాంలో ఉంటున్న లిన్‌ ఇలా చెప్పింది: “నేను నిజాయితీగా, ఏ తప్పు చేయకుండా ఉంటే నాకు అంతా మంచే జరుగుతుందని నమ్మాను.”

ఇంకొంతమంది, సాటిమనిషికి మంచి చేయమని తమ మతం చెప్తున్న మాటను పాటిస్తూ, ఇతరులకు వీలైన సహాయం చేస్తుంటారు. తైవాన్‌లో ఉంటున్న షుయూన్‌ అనే వ్యక్తి ఇలా చెప్పాడు: ‘మనం బ్రతికున్నప్పుడు మంచి పనులు చేస్తే చనిపోయాక స్వర్గంలో సంతోషంగా ఉంటామని, చెడ్డపనులు చేస్తే నరకంలో నిత్యం బాధలు పడతామని నాకు నేర్పించారు.’

ఫలితం

ఇతరులకు మేలు చేసినప్పుడు మనకు కూడా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఇతరులకు మేలు చేసిన ప్రతీసారి, వాళ్లు మనకు తిరిగి మేలు చేయకపోవచ్చని చాలామంది గుర్తించారు. హాంగ్‌కాంగ్‌లో ఉంటున్న సియూ-పింగ్‌ జీవితంలో అదే జరిగింది. ఆమె ఇలా చెప్పింది: “నేను నా కుటుంబాన్ని చాలా బాగా చూసుకున్నాను. కానీ నాకు మాత్రం మంచి జరగలేదు. నా భర్త నన్నూ, మా అబ్బాయిని వదిలేసి వెళ్లిపోయాడు.”

మతనమ్మకాలు పాటించే వాళ్లందరూ మంచిగా ఉండకపోవచ్చని చాలామంది తెలుసుకున్నారు. ఉదాహరణకు జపాన్‌లో ఉంటున్న ఎట్‌సుకో అనే ఆవిడ ఇలా చెప్పింది: “నేను ఒక మత సంస్థలో చేరాను. యౌవనస్థుల కోసం ఆ సంస్థవాళ్లు చేసే సహాయ కార్యక్రమాల్ని నేను దగ్గరుండి చూసుకునేదాన్ని. కానీ ఆ సంస్థలో కొందరు తప్పుడు పనులు చేయడం, అధికారం చెలాయించాలని కోరుకోవడం, చర్చీ డబ్బుల్ని సొంత పనుల కోసం వాడుకోవడం చూసి షాక్‌ అయ్యాను.”

“నేను నా కుటుంబాన్ని చాలా బాగా చూసుకున్నాను. కానీ నాకు మాత్రం మంచి జరగలేదు. నా భర్త నన్నూ, మా అబ్బాయిని వదిలేసి వెళ్లిపోయాడు.”—సియూ-పింగ్‌, హాంగ్‌కాంగ్‌

కొంతమందికి దేవుని మీద నిజంగా భక్తి ఉంటుంది, వాళ్లు ఎప్పుడూ ఇతరులకు మంచి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వాళ్లకు తిరిగి మంచి జరగనప్పుడు నిరాశపడుతుంటారు. వియత్నాంలో ఉంటున్న వాన్‌కు కూడా అలాంటి నిరాశే ఎదురైంది. ఆమె ఇలా చెప్పింది: “చనిపోయిన మా కుటుంబ సభ్యుల ఫోటోల ముందు నేను ప్రతిరోజు పువ్వులు, పండ్లు, వాళ్లకు ఇష్టమైన ఆహారపదార్థాలు పెట్టేదాన్ని. అలాచేస్తే మా కుటుంబం బాగుంటుందని నమ్మాను. కానీ, ఎన్నో ఏళ్ల పాటు నేను చేసిన మంచి పనులు, పూజలు ఏవీ ఫలించలేదు. నా భర్త జబ్బు చేసి మంచానపడ్డాడు, విదేశాల్లో చదువుకుంటున్న మా కూతురు చిన్న వయసులోనే చనిపోయింది.”

మంచి పనులు చేసినంత మాత్రాన మంచి భవిష్యత్తు పొందలేమని దీన్నిబట్టి తెలుస్తోంది. మరి మంచి భవిష్యత్తు పొందాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు జవాబు తర్వాతి పేజీల్లో తెలుసుకుందాం.