మంచి భవిష్యత్తు—ప్రతీఒక్కరి కల
‘మీ భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటున్నారు’ అని అడిగితే ఏం చెప్తారు? మీరూ, మీ ఇంట్లోవాళ్లు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, సుఖశాంతులతో వర్ధిల్లాలని, జీవితంలో పైకి ఎదగాలని కోరుకుంటారు. కదా? ఎవరైనా అదే కోరుకుంటాం.
అయితే, మంచి భవిష్యత్తు పొందాలనే కోరిక తీరని కలలానే మిగిలిపోతుందని చాలామంది భయపడుతున్నారు. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో, పరిస్థితులు ఎలా మారిపోతాయో తెలియకపోవడమే ఆ భయానికి కారణం. ఉదాహరణకు, కరోనా వైరస్ వల్ల ఎంతోమంది జీవితాలు రాత్రికిరాత్రే తలకిందులు అయిపోయాయి, లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు, చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకుని ఆర్థికంగా నష్టపోయారు. ఇలాంటి పరిస్థితిని చూశాక, రేపటి రోజున జీవితం ఎలా ఉంటుంది అనే ఆందోళన ప్రతీఒక్కరిలో మొదలైంది.
‘ఈరోజు నేను ఏం చేస్తే రేపు నా జీవితం బాగుంటుంది’ అని అందరూ ఆలోచిస్తున్నారు. చేయగలిగింది ఏదైనా ఉందని తెలిస్తే వెనకాడకుండా దాన్ని చేస్తున్నారు. భవిష్యత్తు బాగుండడం కోసం కొంతమంది తలరాతను లేదా అదృష్టాన్ని నమ్ముతారు. ఇంకొంతమందేమో ఎక్కువ చదువు, బాగా డబ్బు ఉంటే ఏ చీకూచింతా లేకుండా జీవితం సాఫీగా గడిచిపోతుందని అనుకుంటారు. ఇంకొందరు, వేరేవాళ్లకు మేలు చేస్తే పుణ్యం వస్తుందని నమ్ముతారు.
ఇవి ఏవైనా మీకు మంచి భవిష్యత్తును ఇవ్వగలవా? అది తెలియాలంటే, ముందు ఈ ప్రశ్నలకు జవాబు తెలుసుకోవాలి:
మీ భవిష్యత్తు దేనిమీద ఆధారపడి ఉంటుంది?
చదువు, డబ్బు మంచి భవిష్యత్తును ఇస్తాయా?
మంచి పనులు చేసినంత మాత్రాన మంచి భవిష్యత్తు పొందుతామా?
మంచి భవిష్యత్తు పొందే మార్గాన్ని ఎవరు చూపిస్తారు?
ఈ ప్రశ్నలన్నిటికీ ఈ కావలికోట పత్రికలో జవాబులు ఉన్నాయి.