దేవుడు అన్నీ ప్రార్థనలకు ఎందుకు జవాబివ్వడు?
మన పరలోక తండ్రైన యెహోవా దేవునికి మనం మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనలు వినడమంటే ఎంతో ఇష్టం. అవి ఆయనకు సంతోషాన్నిస్తాయి. కానీ దేవుడు అన్నీ ప్రార్థనలకు జవాబివ్వడు, ఎందుకలా? మనం ప్రార్థించేటప్పుడు ఏ విషయాల్ని మనసులో పెట్టుకోవాలి? ఇప్పుడు బైబిలిచ్చే కొన్ని సలహాల్ని చూద్దాం.
“నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, . . . చెప్పిన మాటలే మళ్లీమళ్లీ చెప్పకు.”—మత్తయి 6:7.
మనం కంఠస్థం చేసి ప్రార్థన చేయడం లేదా పుస్తకాన్ని చూస్తూ ప్రార్థనను చదవడం లాంటిది చేస్తే యెహోవాకు ఇష్టం ఉండదు. బదులుగా, మనం హృదయంలో నుండి మాట్లాడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒకసారి ఇలా ఊహించుకోండి, మీ స్నేహితుడు మీ దగ్గరకు వచ్చి ప్రతీరోజు ఒకేలాంటి మాటల్ని పదేపదే చెప్తూ ఉంటే మీకెలా అనిపిస్తుంది? చిరాకొస్తుంది కదా! మంచి స్నేహితులు నిజాయితీగా మనసువిప్పి మాట్లాడుకుంటారు. అలాగే, మనం సొంత మాటల్లో ప్రార్థించినప్పుడు మన పరలోక తండ్రిని ఒక స్నేహితునిలా భావిస్తున్నామని చూపిస్తాం.
“ఒకవేళ మీరు అడిగినా, మీరు వాటిని పొందట్లేదు. ఎందుకంటే, మీరు . . . దురుద్దేశంతో అడుగుతున్నారు.”—యాకోబు 4:3.
దేవుడు వద్దన్న వాటిని చేయడం గానీ కోరుకోవడం గానీ చేస్తూ, వాటిని దీవించమని ప్రార్థిస్తే ఆ ప్రార్థనలకు ఆయన జవాబివ్వడని మనకు తెలుసు. ఉదాహరణకు, అత్యాశ చూపించడం లేదా అదృష్టాన్ని నమ్మడం తప్పని యెహోవా చెప్తున్నాడు. అలాంటప్పుడు జూదం ఆడే ఒక వ్యక్తి, డబ్బును గెలుచుకునే అదృష్టాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తే, దానికి ఆయన జవాబిస్తాడా? (యెషయా 65:11; లూకా 12:15) అలాంటి ప్రార్థనలకు యెహోవా జవాబివ్వాలని కోరుకోవడం అస్సలు సరైనది కాదు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబివ్వాలంటే, మనం అడిగేవి బైబిల్లో ఆయన కోరేవాటికి అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.
“ధర్మశాస్త్రాన్ని వినడానికి ఇష్టపడనివాళ్ల ప్రార్థన అసహ్యం.”—
బైబిలు కాలాల్లో, కొంతమంది దేవుని నీతి ప్రమాణాలకు లోబడలేదు. అలాంటి వాళ్లు చేసే ప్రార్థనలకు ఆయన జవాబివ్వలేదు. (యెషయా 1:15, 16) ఆయన ఇప్పటికి అలాగే ఆలోచిస్తున్నాడు. (మలాకీ 3:6) దేవుడు మన ప్రార్థనలకు జవాబివ్వాలంటే ఆయనిచ్చిన ఆజ్ఞలకు ఎప్పుడూ లోబడడానికి కృషి చేయాలి. మనం గతంలో తప్పులు చేస్తే అప్పుడేంటి? యెహోవా మన ప్రార్థనల్ని ఇంకెప్పుడూ వినడా? అస్సలు కాదు! మనం మన జీవితాన్ని మార్చుకుని దేవుణ్ణి సంతోషపెట్టడానికి కృషి చేస్తే ఆయన ప్రేమతో మనల్ని క్షమిస్తాడు.—అపొస్తలుల కార్యాలు 3:19.