కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భవిష్యత్తును కనిపెట్టడం

భవిష్యత్తును కనిపెట్టడం

రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తు, మీ కుటుంబ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? భవిష్యత్తులో మీకు ధనం వస్తుందా లేదా దరిద్రం వస్తుందా, ప్రేమ ఉంటుందా లేదా ఒంటరితనం మిగులుతుందా? ఎక్కువ కాలం జీవిస్తామా లేదా తక్కువ కాలం జీవిస్తామా? కొన్ని వేల సంవత్సరాలుగా ప్రజలు ఈ ప్రశ్నల గురించి అన్వేషిస్తూనే ఉన్నారు.

నేడు నిపుణులు లోకం ఏ దిశగా వెళ్తుందో అధ్యయనం చేసి భవిష్యత్తు గురించి కొన్ని అంచనాలు వేస్తుంటారు. వాళ్లు చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి, కానీ కొన్ని ఘోరంగా విఫలం అయ్యాయి. ఉదాహరణకు 1912లో వైర్‌లెస్‌ టెలిగ్రాఫ్‌⁠ను కనిపెట్టిన గూల్యెల్మో మార్కొనీ భవిష్యత్తు గురించి ఇలా చెప్పాడు: “రాబోయే వైర్‌లెస్‌ యుగం యుద్ధాన్ని అసాధ్యం చేస్తుంది.” డెకా రికార్డ్‌ కంపెనీ ఏజెంట్‌ 1962⁠లో బీటిల్స్‌ అనే మ్యూజిక్‌ బ్యాండ్‌ను తిరస్కరించాడు. గిటారు వాయించే గ్రూపులు ఇంక ఉండవని అతను అనుకున్నాడు.

భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి చాలామంది మానవాతీత శక్తుల వైపు వెళ్తారు. కొంతమంది జ్యోతిష్యుల సలహాలు తీసుకుంటారు. పత్రికల్లో, వార్తల్లో రాశి ఫలాలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. ఇంకొంతమంది జాతకం చెప్పేవాళ్ల దగ్గరకు లేదా మాంత్రికుల దగ్గరకు వెళ్తారు. ఎందుకంటే వాళ్లు టారో కార్డులను, నంబర్లను లేదా మనిషి చేతి మీద ఉన్న గీతలను చదివి అక్కడ చూసినవాటిని బట్టి భవిష్యత్తు చెప్పగలమని చెప్పుకుంటారు.

భవిష్యత్తును తెలుసుకునే ప్రయత్నంలో, పూర్వకాలంలో కొంతమంది ఒరాకిల్స్‌ దగ్గరకు వెళ్లేవాళ్లు. ఒరాకిల్‌ అంటే ఒక దేవునికి ప్రతినిధిగా ఆ దేవుని దగ్గర నుండి వచ్చే సమాచారాన్ని చెప్పే పూజారి లేదా పూజారిణి. ఉదాహరణకు లిడియాకు చెందిన క్రీసస్‌ రాజు గ్రీసు దేశంలో డల్ఫీలో ఉన్న ఒరాకిల్‌కు చాలా ఖరీదైన బహుమానాలను పంపించి, పారసీక రాజైన కోరెషు మీద తాను యుద్ధం చేస్తే ఫలితం ఏమౌతుందో తెలుసుకోవాలని అనుకున్నాడు. క్రీసస్‌ గనుక కోరెషు రాజు మీద యుద్ధానికి వెళ్తే అతను ఒక “మహా సామ్రాజ్యాన్ని” నాశనం చేస్తాడని ఆ ఒరాకిల్‌ చెప్పాడు. గెలుస్తానన్న నమ్మకంతో క్రీసస్‌ ముందుకు వెళ్లాడు. కానీ నాశనం అయిన మహా సామ్రాజ్యం మాత్రం తన సొంత సామ్రాజ్యమే.

ఆ ఒరాకిల్‌ అర్థం కాకుండా చెప్పిన జోస్యం పనికిరాలేదు. గెలిచింది ఎవరైనా కావచ్చు కానీ ఆ జోస్యం మాత్రం నిజమన్నట్లే అనిపించింది. ఆ తప్పుడు సమాచారం వల్ల క్రీసస్‌ సర్వం కోల్పోయాడు. మరి భవిష్యత్తు చెప్పడానికి నేడున్న పద్ధతుల్ని ఆశ్రయించే వాళ్ల పరిస్థితి బాగుందా?