కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని పరిపాలనలో సృష్టంతా కలిసిమెలిసి, శాంతిగా ఉండేది

దేవుని రాజ్యం మనకు ఎందుకు అవసరం?

దేవుని రాజ్యం మనకు ఎందుకు అవసరం?

మనుషులు మొట్టమొదట సృష్టించబడినప్పుడు మన సృష్టికర్త ఒక్కడే పరిపాలకుడు. ఆయన పేరు యెహోవా. ఆయన ప్రేమతో పరిపాలించాడు. మనుషులు నివసించడానికి ఆయన ఒక అందమైన ఇల్లు చేశాడు. అదే ఏదెను తోట! ఆయన వాళ్లకు పుష్కలంగా ఆహారాన్ని ఇచ్చాడు. అంతేకాదు, వాళ్లకు చేయడానికి మంచి పని కూడా ఇచ్చాడు. (ఆదికాండం 1:28, 29; 2:8, 15) మనుషులు దేవుని ప్రేమగల పరిపాలన కింద ఉండివుంటే, వాళ్లు ఈపాటికి శాంతికరమైన పరిస్థితుల్లో ఆనందంగా జీవిస్తుండేవాళ్లు.

మొదటి మనుషులు దేవుణ్ణి తమ పరిపాలకునిగా తిరస్కరించారు

తిరుగుబాటుదారుడైన ఒక దేవదూత, దేవుని పరిపాలనా హక్కును సవాలు చేశాడని బైబిలు చెప్తుంది. ఆ తర్వాత అతను అపవాదియైన సాతానని పిలువబడ్డాడు. దేవుని నిర్దేశం, ఆయన పరిపాలన లేకపోతే మనుషులు ఇంకా సంతోషంగా ఉంటారన్నట్టు సాతాను మాట్లాడాడు. విచారకరంగా, మన మొదటి తల్లిదండ్రులైన ఆదాముహవ్వలు సాతాను బాట పట్టి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.—ఆదికాండం 3:1-6; ప్రకటన 12:9.

ఆదాముహవ్వలు దేవుణ్ణి తమ పరిపాలకునిగా తిరస్కరించడం వల్ల పరదైసు ఇల్లును, నిత్యం సంపూర్ణ ఆరోగ్యంతో జీవించే అవకాశాన్ని చేజార్చుకున్నారు. (ఆదికాండం 3:17-19) వాళ్లు తీసుకున్న నిర్ణయం ఆ తర్వాత వాళ్లకు పుట్టిన పిల్లలపై కూడా ప్రభావం చూపించింది. ఆదాము పాపం చేయడం వల్ల, “పాపం, పాపం ద్వారా మరణం లోకంలోకి ప్రవేశించాయి” అని బైబిలు చెప్తుంది. (రోమీయులు 5:12) పాపం వల్ల వచ్చిన మరో ఘోరమైన ఫలితమేంటంటే: “మనిషి ఇంకో మనిషి మీద అధికారం చెలాయించి తనకు హాని చేసుకున్నాడు.” (ప్రసంగి 8:9) ఇంకో మాటలో చెప్పాలంటే, మనుషులు తమనుతాము పరిపాలించుకున్నప్పుడు సమస్యలు తప్పవు.

మానవ పరిపాలన తెరమీదకు వచ్చింది

నిమ్రోదు యెహోవాకు ఎదురుతిరిగాడు

బైబిల్లో ప్రస్తావించబడిన మొదటి మానవ పరిపాలకుడు నిమ్రోదు. అతడు యెహోవా పరిపాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. నిమ్రోదు కాలం నుండి అధికారంలో ఉన్న మనుషులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వచ్చారు. దాదాపు 3,000 సంవత్సరాల క్రితం రాజైన సొలొమోను ఇలా రాశాడు: “దౌర్జన్యానికి గురౌతున్నవాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, అయితే వాళ్లను ఓదార్చేవాళ్లు ఎవ్వరూ లేరు. వాళ్లను బాధపెడుతున్నవాళ్లు బలవంతులు.”—ప్రసంగి 4:1.

పరిస్థితులు ఇప్పుడు వేరుగా ఏమీ లేవు. 2009⁠లో, ఐక్యరాజ్య సమితి ప్రచురణ ఒకటి ఏం చెప్పిందంటే, “మన సమాజంలో చెడు అంతటికీ గల మూల కారణాల్లో ఒకటి” చెడ్డ పరిపాలనే అనే విషయం అంతకంతకు స్పష్టమవుతోంది.

చర్య తీసుకోవడానికి సమయం వచ్చింది!

లోకానికి మెరుగైన పరిపాలకులు, మెరుగైన ప్రభుత్వం అవసరం. సరిగ్గా అదే మన సృష్టికర్త వాగ్దానం చేశాడు!

మంచి ప్రభుత్వాలు కూడా మనుషుల పెద్దపెద్ద సమస్యల్ని పరిష్కరించలేకపోయాయి

దేవుడు ఒక రాజ్యాన్ని లేదా ప్రభుత్వాన్ని స్థాపించాడు, మనుషుల ప్రభుత్వాలన్నిటి స్థానంలో అది వస్తుంది, ఇక ఆ తర్వాత, “అదొక్కటే ఎప్పటికీ నిలుస్తుంది.” (దానియేలు 2:44) ఆ రాజ్యం కోసమే లక్షలాదిమంది ప్రార్థిస్తూ ఉన్నారు. (మత్తయి 6:9, 10) అయితే ఆ రాజ్యాన్ని దేవుడు ఒక్కడే పరిపాలించడు. ఒకప్పుడు మనిషిగా జీవించిన వ్యక్తిని దానికి రాజుగా ఆయన నియమించాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు?