బాధలు—దేవుని నుండి మనకు వచ్చే శిక్షలా?
లూజియా తన ఎడమ కాలుతో కుంటుతూ ఉంటుంది. చిన్నతనంలోనే ఆమెకు పోలియో వచ్చింది. ఆ జబ్బు చాలా త్వరగా పాకిపోయి శరీరంలో నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. 16 సంవత్సరాలు ఉన్నప్పుడు లూజియా ఒకామె దగ్గర పనిచేసేది, ఆమె లూజియాతో ఇలా అంది, “నువ్వు మీ అమ్మ మాట వినకుండా ఆమెను బాగా విసిగించినందుకే దేవుడు నిన్ను ఈ పక్షవాతంతో శిక్షించాడు.” ఆ మాటలు ఆమెను ఎంత బాధ పెట్టాయో చాలా సంవత్సరాలు తర్వాత కూడా లూజియాకు గుర్తుంది.
డమరిస్ తనకు బ్రెయిన్ క్యాన్సర్ ఉందని తెలుసుకున్నప్పుడు, ఆమె నాన్న ఆమెను ఇలా అడిగాడు: “నువ్వు ఏం చేశావ్, ఎందుకు ఇలా జరిగింది? నువ్వు ఏదో పెద్ద తప్పు చేసి ఉంటావ్. అందుకే దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు.” ఆ మాటలకు డమరిస్ హృదయం నలిగిపోయింది.
దేవుడు శిక్షించడం వల్లే రోగాలు వస్తున్నాయని ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు నమ్ముతున్నారు. మ్యానర్స్ అండ్ కస్టమ్స్ ఆఫ్ బైబిల్ ల్యాండ్స్ అనే పుస్తకంలో క్రీస్తు సమయంలో “అనారోగ్యంతో ఉన్న అతను లేదా అతని బంధువులు, ఏదో పాపం చేయడం వల్లే రోగాలు వస్తాయని, ఆ అనారోగ్యం అతని పాపానికి దేవుడు వేసిన శిక్ష అని” నమ్మేవాళ్లు. మధ్య యుగంలో, “వాళ్లు చేసిన పాపాలకు శిక్షగా దేవుడు వాళ్లపైకి తెగుళ్లు తెచ్చేవాడని కొంతమంది ప్రజలు నమ్మేవాళ్లు,” అని మెడీవల్ మెడిసిన్ అండ్ ద ప్లేగ్ అనే పుస్తకం చెప్తుంది. యూరప్‌లో 14వ శతాబ్దంలో ఎంతోమంది ప్రజలు తెగుళ్ల వల్ల చనిపోయారు. అది దేవుడు చెడ్డ ప్రజల మీదకు తీసుకువచ్చిన తీర్పు అని చెప్పవచ్చా? లేదా వైద్య పరిశోధకులు చెప్తున్నట్లు ఆ తెగులు సూక్ష్మక్రిముల వల్ల వచ్చిందా? నిజంగా ప్రజలు పాపాలు చేస్తున్నందుకే దేవుడు వాళ్లను రోగాలతో బాధ పడేలా చేస్తున్నాడా? * అని ఇంకొంతమంది ఆలోచించవచ్చు.
ఆలోచించండి: ఒకవేళ ప్రజలను శిక్షించడానికే దేవుడు రోగాలను, బాధలను పెడితే మరి అనారోగ్యంతో ఉన్నవాళ్లను యేసు ఎందుకు బాగుచేస్తాడు? అది దేవుని న్యాయాన్ని, నీతిని పాడు చేసినట్లు కాదా? (మత్తయి 4:23, 24) యేసు దేవుని పనులకు విరుద్ధంగా ఎప్పుడూ ఏమి చేయలేదు. ఆయన ఇలా అన్నాడు: “నేను ఎప్పుడూ ఆయనకు ఇష్టమైన పనులే చేస్తాను,” “తండ్రి నాకు ఆజ్ఞాపించినట్లే నేను చేస్తున్నాను.”—యోహాను 8:29; 14:31.
బైబిలు స్పష్టంగా చెప్తుంది. యెహోవా దేవుని “చర్యలన్నియు న్యాయములు.” (ద్వితీయోపదేశకాండము 32:4) ఉదాహరణకు, విమానంలో ఉన్న ఒకతన్ని శిక్షించడానికి దేవుడు దాన్ని కూల్చేసి వందలమంది అమాయకులు చనిపోయేలా అస్సలు చేయడు. దేవుని నమ్మకమైన సేవకుడైన అబ్రాహాము దేవుని నీతి గురించి చెప్తూ “దుష్టులతోకూడ నీతిమంతులను” ఆయన అస్సలు నాశనం చేయడని చెప్పాడు. అది “నీకు దూరమవునుగాక” అని ఆయన అన్నాడు. (ఆదికాండము 18:23, 25) “దేవుడు అన్యాయము చేయుట అసంభవము,” ఆయన “దుష్కార్యము” చేయడు అని కూడా బైబిలు చెప్తుంది.—యోబు 34:10-12.
బాధల గురించి బైబిలు ఏమి చెప్తుంది
దేవుడు మనం చేసిన తప్పుకు శిక్షగా మనకు బాధలను తీసుకురావడం లేదు. యేసుకు ఈ విషయం స్పష్టంగా తెలుసు. ఒక సందర్భంలో యేసు, ఆయన శిష్యులు ఒక పుట్టి గుడ్డివాడిని చూశారు. అప్పుడు శిష్యులు ఆయన్ని ఇలా అడిగారు: “రబ్బీ, ఎవరు పాపం చేయడం వల్ల ఇతను గుడ్డివాడిగా పుట్టాడు? ఇతనా, ఇతని తల్లిదండ్రులా?” యేసు ఇలా జవాబిచ్చాడు: “ఇతను పాపం చేయడం వల్లో, ఇతని తల్లిదండ్రులు పాపం చేయడం వల్లో ఇతను గుడ్డివాడిగా పుట్టలేదు. కానీ ఇతని ద్వారా ప్రజలు దేవుని పనుల్ని చూడగలిగేలా, ఇది ఒక అవకాశాన్ని కల్పించింది.”—యోహాను 9:1-3.
ఇతను పాపం చేయడం వల్లో, ఇతని తల్లిదండ్రులు పాపం చేయడం వల్లో ఇతను గుడ్డివాడిగా పుట్టలేదు అని యేసు చెప్పినప్పుడు అప్పట్లో ఉన్న అపోహలను బట్టి యేసు శిష్యులు ఆశ్చర్యపోయి ఉంటారు. ఆయన గుడ్డివాడి కళ్లను బాగుచేశాడు, అంతేకాదు దేవుడు బాధలతో మనుషులను శిక్షిస్తాడు అనే తప్పుడు నమ్మకాన్ని కూడా కొట్టిపడేశాడు. (యోహాను 9:6, 7) ఈ రోజుల్లో పెద్దపెద్ద అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవాళ్లు, వాళ్ల బాధలకు దేవుడు కారణం కాదని తెలుసుకోవడం నిజంగా ఎంతో ఓదార్పుగా ఉంటుంది.
ప్రజలు చేసిన తప్పులను బట్టి దేవుడు వాళ్లను శిక్షిస్తుంటే యేసు అనారోగ్యంతో ఉన్నవాళ్లను ఎందుకు బాగుచేశాడు?
లేఖనాలు మనకు నమ్మకాన్ని ఇస్తున్నాయి
-
“చెడు విషయాలతో దేవుణ్ణి ఎవ్వరూ పరీక్షించలేరు, దేవుడు కూడా అలా ఎవ్వరినీ పరీక్షించడు.” (యాకోబు 1:13) ఎన్నో వందల సంవత్సరాలుగా మనుషులను బాధపెడుతున్న అనారోగ్యం, నొప్పి, మరణం లాంటి ‘చెడు విషయాలు’ అన్నీ త్వరలోనే తీసివేయబడతాయి.
-
యేసుక్రీస్తు “అనారోగ్యంతో ఉన్న వాళ్లందర్నీ బాగుచేశాడు.” (మత్తయి 8:16) తన దగ్గరకు వచ్చిన వాళ్లందర్నీ బాగుచేయడం ద్వారా దేవుని కుమారుడు, ప్రపంచవ్యాప్తంగా దేవుని రాజ్యం ఏమి చేస్తుందో చూపించాడు.
-
“వాళ్ల కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును ఆయన తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు. అంతకుముందున్న విషయాలు గతించిపోయాయి.”—ప్రకటన 21:3-5.
మరి బాధలకు కారణం ఎవరు?
మనుషులందరూ ఇంత నొప్పిని, ఇన్ని బాధలను ఎందుకు అనుభవిస్తున్నారు? ఈ ప్రశ్న గురించి మానవజాతి శతాబ్దాలుగా ఆలోచిస్తుంది. బాధలకు దేవుడు కారణం కానప్పుడు, మరి ఇంకెవరు? దానికి జవాబు మనం తర్వాత ఆర్టికల్‌లో చూస్తాము.
^ పేరా 4 ప్రాచీన కాలంలో ప్రజలు, కొన్ని రకాల పాపాలు చేసినందుకు దేవుడు వాళ్లను శిక్షించిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు దేవుడు ప్రజల్ని శిక్షించడానికి అనారోగ్యాన్ని, దుర్ఘటనలను ఉపయోగిస్తున్నాడని బైబిలు చెప్పడం లేదు.