కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ఇప్పుడు కూడా జీవితాన్ని ఆనందించవచ్చు

మీరు ఇప్పుడు కూడా జీవితాన్ని ఆనందించవచ్చు

అనారోగ్యం, ముసలితనం, మరణం ఇటువంటి బాధలు లేని జీవితం ఎంత బావుంటుందో! ఆ అద్భుతమైన భవిష్యత్తును మీరు సొంతం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రతీ ఒక్కరికీ చాలా సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి. వాటి విషయంలో మీకు సహాయం ఎక్కడ దొరుకుతుంది? బైబిలు చక్కని నిర్దేశం ఇస్తుంది, దాన్ని పాటిస్తే ఇప్పుడే మీరు సంతోషంగా, సంతృప్తిగా ఉండవచ్చు. మనం కొన్ని సమస్యల్ని, వాటి విషయంలో బైబిలు ఎలా సహాయం చేయగలదో చూద్దాం.

సంతృప్తిగా ఉండడం

బైబిలు ఇచ్చే సలహా: “డబ్బును ప్రేమించకండి, ఉన్నవాటితో సంతృప్తిగా జీవించండి.”హెబ్రీయులు 13:5.

ఈ రోజుల్లో లోకం చాలా వస్తువుల్ని మనకు చూపిస్తూ, అవి తప్పకుండా మన దగ్గర ఉండాలని మనం అనుకునేలా చేస్తుంది. కానీ బైబిలు మాత్రం మనం “ఉన్నవాటితో సంతృప్తిగా” జీవించవచ్చని చెప్తుంది. అలా ఎలా ఉండవచ్చు?

“డబ్బు మీద మోజు” పెంచుకోకండి. ప్రజలు డబ్బు మోజులో పడి ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, స్నేహితుల్ని, నీతినియమాల్ని ఆఖరికి తమ గౌరవాన్ని కూడా పక్కన పెట్టేస్తున్నారు. (1 తిమోతి 6:10) దానివల్ల చివరికి నష్టమే మిగులుతుంది! డబ్బును ప్రేమించేవాళ్లకు ఎప్పటికీ తృప్తి ఉండదు.—ప్రసంగి 5:10.

మనుషుల్ని ప్రేమించండి, వస్తువుల్ని కాదు. నిజమే వస్తువుల వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. కానీ అవి మనల్ని ప్రేమించలేవు, కృతజ్ఞత చూపించలేవు; మనుషులు మాత్రమే అలా చేయగలరు. “నిజమైన స్నేహితుడు” ఉన్నప్పుడు మన జీవితం సంతృప్తిగా ఉంటుంది.—సామెతలు 17:17.

బైబిలు నిర్దేశం పాటించడం ద్వారా మనం ఇప్పుడు కూడా జీవితాన్ని ఆనందించవచ్చు

అనారోగ్య సమస్యల్ని తట్టుకోవడం

బైబిలు ఇచ్చే సలహా: “సంతోషముగల మనస్సు ఆరోగ్య కారణము.”సామెతలు 17:22.

సంతోషం ఒక మంచి మెడిసిన్‌లా, మనకున్న అనారోగ్య సమస్యల్ని తట్టుకునేలా చేయగలదు. అయితే అనారోగ్యంతో బాధపడుతూ సంతోషంగా ఉండడం ఎలా సాధ్యం?

కృతజ్ఞతతో ఉండండి. మనకున్న సమస్యల గురించే ఆలోచిస్తూ ఉంటే, మనకు ప్రతీ రోజు కష్టంగా అనిపిస్తుంది. (సామెతలు 15:15) దానికి బదులుగా “కృతజ్ఞులై ఉండండి” అని బైబిలు మనకు చెప్తుంది. (కొలొస్సయులు 3:15) కాబట్టి జీవితంలో ఉన్న మంచి విషయాల పట్ల, అవి ఎంత చిన్నవైనా సరే కృతజ్ఞతతో ఉండండి. అందమైన సూర్యాస్తమయం, చల్లగాలి, మనం ప్రేమించేవాళ్ల ముఖంపై చిరునవ్వు, ఇవి మనకు ఎంతో సంతోషాన్ని ఇవ్వగలవు.

వేరేవాళ్లకు సహాయం చేయండి. మన ఆరోగ్యం అంత బాగా లేకపోయినా, “తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.” (అపొస్తలుల కార్యాలు 20:35) మనం చేసిన వాటికి ఇతరులు కృతజ్ఞతలు చెప్పినప్పుడు, మనకు సంతృప్తిగా అనిపిస్తుంది, అప్పుడు మనం మన సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉంటాం. మనం వేరేవాళ్లకు సహాయం చేసి వాళ్ల జీవితాలు బాగుండేలా చేసినప్పుడు, మన జీవితం కూడా బావుంటుంది.

వివాహ బంధాన్ని బలపర్చుకోవడం

బైబిలు ఇచ్చే సలహా: ‘ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో పరిశీలించి తెలుసుకోండి.’ఫిలిప్పీయులు 1:10.

భార్యాభర్తలు కలిసి ఎక్కువగా సమయం గడపకపోతే, వాళ్ల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి భార్యాభర్తలు తమ వివాహ బంధానికి విలువివ్వాలి, వాళ్లు దాన్ని జీవితంలోని ఎక్కువ ప్రాముఖ్యమైన వాటిలో ఒకటిగా చూడాలి.

కలిసి పనులు చేయండి. ఎవరికి వాళ్లే వాళ్లకిష్టమైన పనులు చేసుకునే బదులు, కలిసి పనులు చేయడానికి ఖచ్చితమైన ప్రణాళికలు వేసుకోండి. ఇద్దరు కలిసి పనిచేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని బైబిలు చెప్తుంది. (ప్రసంగి 4:9) మీరిద్దరూ కలిసి వంట చేసుకోవచ్చు, ఎక్సర్‌సైజ్‌లు చేయవచ్చు, టీ కాఫీ లాంటివి తాగుతూ సరదాగా గడపొచ్చు, ఇంకేదైనా ఆహ్లాదాన్ని ఇచ్చే పని చేయవచ్చు.

ప్రేమిస్తున్నారని చూపించండి. భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవాలని, గౌరవించుకోవాలని బైబిలు ప్రోత్సహిస్తుంది. (ఎఫెసీయులు 5:28, 33) చిన్న చిరునవ్వు, ప్రేమగా హత్తుకోవడం, చిన్నచిన్న గిఫ్ట్‌లు ఇవ్వడం లాంటివి వివాహబంధాన్ని ఎంతో బలపరుస్తాయి. అలాగే, భర్తగానీ భార్యగానీ శారీరకంగా దగ్గరవ్వాల్సింది కేవలం తమ వివాహ భాగస్వామితోనే.—హెబ్రీయులు 13:4.