కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎక్కువకాలం జీవించే రహస్యం జన్యువుల్లో ఉందా?

ఎక్కువ కాలం జీవించడానికి చేసిన ప్రయత్నాలు

ఎక్కువ కాలం జీవించడానికి చేసిన ప్రయత్నాలు

“మనుషులు కష్టపడి చేసేలా దేవుడు వాళ్లకు ఇచ్చిన పనిని నేను చూశాను. ఆయన ప్రతీదాన్ని దాని సమయంలో అందంగా చేశాడు; నిరంతరం జీవించడమనే ఆలోచనను కూడా వాళ్ల హృదయంలో పెట్టాడు.”ప్రసంగి 3:10, 11, NW.

ఎంతో తెలివైన సొలొమోను రాజు ఎప్పుడో రాసిన ఆ మాటలు, మనుషులు ఏమి కోరుకుంటారో చక్కగా వివరిస్తున్నాయి. మనిషి ఆయుష్షు చాలా తక్కువ, పైగా మరణాన్ని ఎవరూ తప్పించుకోలేరు, కాబట్టి ఎక్కువ కాలం జీవించాలనే కోరిక మనుషుల్లో ఎప్పుడూ ఉంది. ఎక్కువ కాలం జీవించే రహస్యాన్ని కనుక్కోవడానికి మనుషులు ఎలాంటి ప్రయత్నాలు చేశారో తెలియజేసే ఎన్నో కథలు, పురాణాలు చరిత్రలో ఉన్నాయి.

ఉదాహరణకు, సుమేరియా రాజైన గిల్గామేషు గురించి చూద్దాం. అతని జీవితం గురించి ఎన్నో విచిత్రమైన కథలు చెప్పేవాళ్లు. అలాంటి ఒక కథ గిల్గామేషు పురాణంలో ఉంది. అందులో అతను మరణాన్ని తప్పించుకోవడం ఎలానో తెలుసుకోవడానికి ఎంతో ప్రమాదకరమైన ప్రయాణాన్ని మొదలుపెట్టాడని ఉంది. కానీ ఆ ప్రయత్నంలో అతను విఫలం అయ్యాడు.

ఒక ప్రాచీనకాల రసాయన శాస్త్రవేత్త తన ప్రయోగశాలలో

క్రీస్తు పూర్వం నాల్గవ శతాబ్దంలో, చైనా దేశంలో ఉన్న రసాయన శాస్త్రవేత్తలు “ఒక దివ్యౌషధం” తయారు చేయడానికి ప్రయత్నించారు. అది మనిషి ఆయుష్షును పొడిగిస్తుందని వాళ్లు నమ్మారు. అందులో మెర్‌క్యురి, ఆర్సెనిక్‌ లాంటి హానికరమైన మూలకాలను కొద్ది మోతాదులో కలిపారు. ఈ దివ్యౌషధం వల్ల ఎంతోమంది చైనా చక్రవర్తులు మరణించారని అంటారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం యూరప్‌లో రసాయన శాస్త్రవేత్తలు, బంగారాన్ని తినగలిగేలా మార్చడానికి ప్రయత్నించారు. బంగారం పాడైపోదు కాబట్టి అది మనిషి ఆయుష్షును పొడిగిస్తుందని వాళ్లు నమ్మారు.

ఈ రోజుల్లో చాలామంది జీవశాస్త్రవేత్తలు, జన్యుశాస్త్రవేత్తలు మనుషులు ఎందుకు ముసలివాళ్లు అయిపోతున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయుష్షును పొడిగించే “దివ్యౌషధం” కోసం చేసిన ప్రయత్నాల్లానే, ఈ ప్రయత్నాలు కూడా మనుషుల్లో ఇప్పటికీ ముసలితనాన్ని, మరణాన్ని జయించాలనే కోరిక ఉందని చూపిస్తున్నాయి. మరి అలాంటి పరిశోధనల ఫలితాలు ఏంటి?

దేవుడు ‘నిరంతరం జీవించడమనే ఆలోచనను వాళ్ల హృదయంలో పెట్టాడు.’—ప్రసంగి 3:10, 11

ముసలితనం ఎందుకు వస్తుందో తెలుసుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలు

మానవ కణంపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు మనం ఎందుకు ముసలివాళ్లం అయిపోతున్నాం, ఎందుకు చనిపోతున్నాం అనే విషయాన్ని వివరించడానికి 300లకు పైగా సిద్ధాంతాలను చెప్తున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో అణు జీవశాస్త్రవేత్తలు జన్యువుల్లో, ప్రోటీన్లలో కొన్ని మార్పులు చేసి జంతువుల ఆయుష్షును, మనిషి కణాల ఆయుష్షును పెంచగలిగారు. దీన్ని చూసి చాలామంది ధనవంతులు ఇలాంటి ప్రయోగాలకు ఆర్థిక మద్దతు కూడా ఇస్తున్నారు. మరి ఈ ప్రయోగాలు ఏ దిశగా వెళ్తున్నాయి?

ఆయుష్షును పెంచే ప్రయత్నాలు. మనం ముసలివాళ్లం అవ్వడానికి కారణం టెలొమేర్లు (క్రోమోజోముల చివరి భాగాలు) అని జీవశాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఈ టెలొమేర్లు కణ విభజన జరుగుతున్నప్పుడు జన్యుపరమైన సమాచారాన్ని కాపాడతాయి. కానీ కణ విభజన జరిగిన ప్రతీసారి ఈ టెలొమేర్లు చిన్నగా అయిపోతుంటాయి. చివరికి కణ విభజన ఆగిపోయి ముసలితనం మొదలవుతుంది.

2009లో నోబెల్‌ పురస్కారం పొందిన ఎలీజబెత్‌ బ్లాక్‌బాన్‌, ఆమె బృందం ఒక ఎంజైమ్‌ను కనుక్కున్నారు. ఈ ఎంజైమ్‌ టెలొమేర్లు చిన్నగా అయిపోవడాన్ని ఆలస్యం చేస్తుంది. ఫలితంగా కణం ఆయుష్షు పెరుగుతుంది. కానీ వాళ్లు రిపోర్టులో ఒప్పుకున్నదేంటంటే “టెలొమేర్లు అద్భుతంగా జీవితాన్ని పొడిగించలేవు, సాధారణంగా మనుషులు జీవించే సంవత్సరాల కన్నా ఎక్కువ సంవత్సరాలు జీవించేలా అవి చేయలేవు.”

సెల్యులార్‌ రీప్రోగ్రామింగ్‌ ద్వారా కూడా త్వరగా ముసలితనం రాకుండా చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. మన కణాల వయసు పెరిగి, విభజన జరగలేని స్థితికి వచ్చినప్పుడు అవి రోగనిరోధక కణాలకు తప్పుడు సంకేతాలు పంపించవచ్చు. దానివల్ల వాపులు, విపరీతమైన నొప్పులు, వ్యాధులు వస్తాయి. ఈ మధ్యకాలంలో ఫ్రాన్స్‌లో ఉన్న శాస్త్రవేత్తలు ముసలివాళ్ల నుండి తీసుకున్న కణాలను రీప్రోగ్రామ్‌ చేశారు అంటే వాటిలో ఉన్న సమాచారాన్ని మార్చారు. వాళ్లలో కొంతమంది వయసు 100 సంవత్సరాలకన్నా ఎక్కువే. ‘కణాల ఆయుష్షును పెంచడం’ ఎలాగో పరిశోధనల్లో తెలుసుకున్నామని ఈ బృందం ముఖ్య పరిశోధకుడైన ప్రొఫెసర్‌ జాన్‌-మార్క్‌ లమెత్రె ప్రకటించాడు.

సైన్స్‌ మనం ఎక్కువ కాలం జీవించేలా చేయగలదా?

త్వరగా ముసలితనం రాకుండా చేసే ప్రయత్నాల ద్వారా, మనుషులు సాధారణంగా జీవించే సంవత్సరాలకన్నా ఎక్కువ కాలం జీవించేలా చేయలేమని కొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు. నిజమే, 19వ శతాబ్దం నుండి మనిషి ఆయుష్షు క్రమంగా పెరుగుతూ వచ్చింది. కానీ ఇది ముఖ్యంగా శుభ్రత పాటించడం, అంటువ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం, మందులు టీకాలు వేసుకోవడం వల్లే సాధ్యం అయింది. మనిషి జీవితాన్ని ఇంతకన్నా ఎక్కువ పొడిగించలేమని కొంతమంది జన్యుశాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.

దాదాపు 3,500 సంవత్సరాల క్రితం, బైబిలు రచయితయైన మోషే ఇలా ఒప్పుకున్నాడు: “మా ఆయుష్షు 70 సంవత్సరాలు, మరీ ఎక్కువ బలం ఉంటే 80 సంవత్సరాలు. కానీ అవి కష్టాలతో, కన్నీళ్లతో నిండివుంటాయి; అవి ఇట్టే గడిచిపోతాయి, మేము లేకుండాపోతాం.” (కీర్తన 90:10, NW) ఎక్కువ కాలం జీవించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా మనిషి ప్రస్తుతం జీవించే సంవత్సరాలు దాదాపు మోషే చెప్పినంతే ఉన్నాయి.

కానీ, తాబేళ్లలాంటి కొన్ని జీవులు 200 సంవత్సరాలపైనే జీవించగలవు. కొన్నిరకాల పెద్దపెద్ద చెట్లు కూడా వేల సంవత్సరాలు బ్రతకగలవు. మన ఆయుష్షును వాటితోగానీ మిగతావాటితో గానీ పోల్చుకుంటే ‘మన జీవితం కేవలం 70 లేదా 80 సంవత్సరాలు మాత్రమే ఎందుకు ఉంది?’ అని అనిపించవచ్చు.