కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం ఎందుకు ముసలివాళ్లమై, చనిపోతున్నాం?

మనం ఎందుకు ముసలివాళ్లమై, చనిపోతున్నాం?

మనుషులు చనిపోవడం దేవుని ఉద్దేశం కాదు. మన మొదటి తల్లిదండ్రులైన ఆదాముహవ్వలు ఏ లోపం లేకుండా పరిపూర్ణ శరీరంతో సృష్టించబడ్డారు. వాళ్లకు ఎప్పటికీ బ్రతికి ఉండే అవకాశం ఉంది. ఏదెను తోటలో ఒక చెట్టు గురించి యెహోవా ఆదాముతో అన్న మాటల్ని బట్టి మనం అలా చెప్పవచ్చు.

ఆ చెట్టు పండ్లు తిన్న రోజున ఆదాము ఖచ్చితంగా చనిపోతాడని దేవుడు అతనితో చెప్పాడు. (ఆదికాండము 2:17) ఆదాము ముసలివాడై చనిపోవాలనే ఉద్దేశంతోనే దేవుడు అతన్ని సృష్టిస్తే దేవుడు ఆ ఆజ్ఞ ఎందుకు ఇస్తాడు? ఆ చెట్టు పండ్లు తినకపోతే తాను చనిపోనని ఆదాముకు తెలుసు.

మనుషులు చనిపోవడం దేవుని ఉద్దేశం కాదు

ఆదాముహవ్వలు బ్రతికి ఉండడానికి కావాల్సిన ఎన్నో పండ్ల చెట్లు ఆ తోటలో ఉన్నాయి, ఆ చెట్టు ఒక్కటే కాదు. (ఆదికాండము 2:9) ఆ చెట్టు పండ్లు తినకుండా ఉండడం ద్వారా ఆదాముహవ్వలు వాళ్లకు జీవాన్ని ఇచ్చిన దేవునికి లోబడి ఉండేవాళ్లు. వాళ్లు ఏం చేయాలో చెప్పే హక్కు దేవునికే ఉందని వాళ్లు గుర్తిస్తున్నట్లు కూడా చూపించేవాళ్లు.

ఆదాము, హవ్వ ఎందుకు చనిపోయారు?

ఆదాము, హవ్వ ఎందుకు చనిపోయారో అర్థం చేసుకోవడానికి మనందరి జీవితాలను మార్చేసిన ఒక సంభాషణను చూద్దాం. అపవాది అయిన సాతాను పామును ఉపయోగించి ఒక ఘోరమైన అబద్ధాన్ని చెప్పాడు. బైబిల్లో ఇలా ఉంది: “దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది ఆ స్త్రీతో—ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగెను.”—ఆదికాండము 3:1.

దానికి హవ్వ ఇలా అంది: “ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును; అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములనుగూర్చి దేవుడు—మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెను.” అప్పుడు ఆ పాము హవ్వతో “మీరు చావనే చావరు; ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియును” అని చెప్పింది. అలా సాతాను, యెహోవా అబద్ధాలు చెప్పాడని, ఆయన మన మొదటి తల్లిదండ్రులకు మంచి జరగకుండా అడ్డుకుంటున్నాడని నిందించాడు.—ఆదికాండము 3:2-5.

హవ్వ ఆ మాటల్ని నమ్మింది. ఆమె ఆ చెట్టును చూస్తూ ఉండిపోయింది, ఆ పండ్లు ఆమెకు చాలా అందంగా, తినాలనిపించేలా కనిపించాయి. ఆమె వాటిని తీసుకొని తిన్నది. తర్వాత ఆమె, “దాని ఫలములలో కొన్ని . . . తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను” అని బైబిలు చెప్తుంది.—ఆదికాండము 3:6.

ఆ చెట్టు పండ్లు తిన్న రోజున ఆదాము ఖచ్చితంగా చనిపోతాడని దేవుడు అతనితో చెప్పాడు.—ఆదికాండము 2:17

తనకు ఎంతో ఇష్టమైన పిల్లలు, కావాలని తన మాటను విననప్పుడు దేవుడు ఎంత బాధపడి ఉంటాడో! ఆయన ఏం చేశాడు? ఆదాముతో యెహోవా ఇలా అన్నాడు: “నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు.” (ఆదికాండము 3:17-19) దేవుడు చెప్పినట్లే, “ఆదాము బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ముప్పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.” (ఆదికాండము 5:5) ఆదాము పరలోకానికి, లేదా ఆత్మగా వేరే లోకానికి వెళ్లలేదు. యెహోవా ఆదామును నేలమట్టి నుండి సృష్టించకముందు ఆదాము ఎక్కడా లేడు. కాబట్టి అతను చనిపోయినప్పుడు నిర్జీవమైన మట్టిలానే అయిపోయాడు. అతను ఉనికిలో లేకుండా పోయాడు. ఎంత దారుణమైన పరిస్థితి!

మనం ఎందుకు పరిపూర్ణులుగా లేము?

ఆదాము, హవ్వ కావాలని దేవుని మాట వినలేదు కాబట్టి పరిపూర్ణ జీవాన్ని, ఎప్పటికీ జీవించే అవకాశాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ల శరీరంలో మార్పులు వచ్చాయి. వాళ్లు అపరిపూర్ణులు అయ్యారు, తప్పులు చేసే స్వభావం వాళ్లలో వచ్చేసింది. కానీ వాళ్లు చేసిన పాపం వల్ల వచ్చిన ఫలితాలు వాళ్లు ఒక్కళ్లే అనుభవించలేదు. వాళ్లు ఆ పాపపు స్థితిని తమ పిల్లలకు వారసత్వంగా ఇచ్చారు. రోమీయులు 5:12 లో ఇలా ఉంది: “ఒక మనిషి [ఆదాము] ద్వారా పాపం, పాపం ద్వారా మరణం లోకంలోకి ప్రవేశించాయి. అదే విధంగా, అందరూ పాపం చేశారు కాబట్టి మరణం అందరికీ వ్యాపించింది.”

బైబిలు పాపాన్ని, మరణాన్ని “సమస్తజనముల ముఖములను కప్పుచున్న ముసుకు” అని, “సమస్త జనములమీద పరచబడిన తెర” అని వర్ణిస్తుంది. (యెషయా 25:7) ఈ ముసుగు ఒక విషపూరితమైన పొగలా మనుషులందర్నీ కప్పేస్తుంది, దానినుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. అవును, ‘ఆదాము వల్ల అందరూ చనిపోతున్నారు.’ (1 కొరింథీయులు 15:22) అయితే, అపొస్తలుడైన పౌలు అడిగిన ఈ ప్రశ్న మనందరికి వస్తుంది: “ఇలాంటి మరణానికి నడిపించే శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు?” ఎవరైనా విడిపించగలరా?—రోమీయులు 7:24.