కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం | మనకు ఓదార్పు ఎక్కడ దొరుకుతుంది?

మనందరికీ ఓదార్పు అవసరం

మనందరికీ ఓదార్పు అవసరం

మనందరం చిన్నప్పుడు కిందపడి దెబ్బలు తగిలించుకుని ఉంటాం. చెయ్యి కోసుకు పోవడం, మోకాలు గీసుకుపోవడం మీకు బహుశా గుర్తుండవచ్చు. అప్పుడు అమ్మ ఏమి చేసిందో గుర్తు తెచ్చుకోండి. ఆమె చక్కగా దెబ్బను శుభ్రం చేసి బ్యాండేజ్‌ వేయడం లేదా కట్టు కట్టడం చేసి ఉంటుంది. మీరు ఏడుస్తున్నప్పుడు ఆమె ప్రేమగా మాటలు చెప్పి, మిమ్మల్ని దగ్గరకు తీసుకుని బుజ్జగించినప్పుడు మీకు నొప్పి తగ్గి ఉంటుంది. ఆ వయసులో మీకు కావాల్సిన ఓదార్పు సహాయం వెంటనే దొరికేది.

కానీ మనం పెద్దవాళ్లం అవుతున్నప్పుడు జీవితం అలా ఉండదు. సమస్యలు పెద్దవి అయ్యే కొద్ది, ఓదార్పు దొరకడం కష్టం అవుతుంది. పెద్దయ్యాక వచ్చే సమస్యలు కట్టు కట్టడంతోనో, అమ్మను కౌగిలించుకోవడంతోనో పరిష్కారం కావు. అలాంటి కొన్ని ఉదాహరణలు పరిశీలించండి.

  • ఉద్యోగం పోవడం వల్ల వచ్చే మానసిక ఒత్తిడిని మీరు ఎప్పుడైనా అనుభవించారా? హూలియన్‌ ఉద్యోగం పోయినప్పుడు ఏం చేయాలో తెలీక, ఎంతో బాధకు గురయ్యాడు. ‘నేను నా కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి?’ అని ఆలోచనలో పడిపోయాడు. ‘ఎన్నో సంవత్సరాలు కష్టపడి పని చేశాక, నేను ఆ ఉద్యోగానికి పనికిరానని కంపెనీకి ఎందుకు అనిపించింది?’ అని బాధపడేవాడు.

  • వివాహం విచ్ఛిన్నమై మీ జీవితం తలక్రిందులు అయిపోయిందా? “3 సంవత్సరాల క్రితం నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయినప్పుడు, నేను దుఃఖంలో మునిగిపోయాను. నా గుండె రెండు ముక్కలైపోయినట్లు అనిపించింది,” అని రాకెల్‌ అంటోంది. “శారీరకంగా, మానసికంగా ఎంతో బాధని అనుభవించాను. నాకు చాలా భయం వేసింది.”

  • మీకు తీవ్రమైన అనారోగ్య సమస్య ఉంది. కానీ అది తగ్గుతున్నట్లు అనిపించడం లేదు. పూర్వీకుడైన యోబులానే మీరూ ఇలా బాధపడి ఉంటారు: “నా బదుకు నాకు అసహ్యం. నేను శాశ్వతంగా జీవించాలని కోరను.” (యోబు 7:16, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) 80 సంవత్సరాల వయసున్న లూయీస్‌ చెప్తున్న మాటలను మీరు ఒప్పుకుంటారు. ఆయన ఇలా అంటున్నాడు: “నేను ఎప్పుడు చనిపోతానా అని కొన్నిసార్లు ఎదురుచూస్తుంటాను.”

  • ప్రియమైనవాళ్లు చనిపోయి మీరు ఓదార్పు కోసం ఎదురుచూస్తున్నారు. “విమానం కూలిపోయి మా అబ్బాయి చనిపోయినప్పుడు, ముందు నేను నమ్మలేకపోయాను, తర్వాత ఎంతో బాధ కలిగింది. బైబిల్లో ఉన్నట్లు, ఒక పెద్ద కత్తి నాలోకి దూసుకుపోయినట్లు అనిపించింది” అని రాబర్ట్‌ వివరిస్తున్నాడు.—లూకా 2:35.

రాబర్ట్‌, లూయీస్‌, రాకెల్‌, హూలియన్‌లు అలాంటి విషాద సమయాల్లో కూడా ఓదార్పును, సహాయాన్ని పొందారు. ఓదార్పును ఇవ్వగలిగిన ఉన్నతమైన వ్యక్తి గురించి వాళ్లు తెలుసుకున్నారు, ఆయనే సర్వశక్తిగల దేవుడు. ఆయన ఎలా ఓదార్పును ఇస్తాడు? అవసరమైనప్పుడు ఆయన మిమ్మల్ని కూడా ఓదారుస్తాడా? (wp16-E No. 5)