పత్రిక ముఖ్యాంశం | మనకు ఓదార్పు ఎక్కడ దొరుకుతుంది?
దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్పు
కష్టాలు రకరకాలుగా ఉంటాయి. అన్నిటి గురించి మనం మాట్లాడుకోలేకపోయినా ముందు చెప్పుకున్న నాలుగు ఉదాహరణలు గురించి చూద్దాం. వేర్వేరు సమస్యలు ఎదుర్కొంటున్నవాళ్లు దేవుని నుండి నిజమైన ఓదార్పును ఎలా పొందారో గమనించండి.
ఉద్యోగం పోయినప్పుడు
“నాకు, నా భార్యకు ఒకేసారి ఉద్యోగం పోయింది,” అని శరణ్ a చెప్తున్నాడు. “రెండు సంవత్సరాలు బంధువులు సహాయం చేశారు, దానితోపాటు చిన్నచిన్న పనులు చేసుకుంటూ ఎలాగోలా నెట్టుకొచ్చాం. నా భార్య పుష్ప కృంగిపోయింది, నేను పనికిరానివాడినని అనుకున్నాను.
“మేము ఎలా తట్టుకోగలిగాం? మత్తయి 6:34లో యేసు మాటల్ని పుష్ప ఎప్పుడూ గుర్తుచేసుకునేది. మనం రేపటి గురించి చింతించకూడదు ఎందుకంటే ఏ రోజు కష్టం ఆ రోజుకు ఉంటుంది అని ఆయన చెప్పాడు. ఆమె చేసిన హృదయపూర్వక ప్రార్థనలు ఆ పరిస్థితుల్లో ముందుకు వెళ్లడానికి మాకు సహాయం చేశాయి. నా విషయంలో కీర్తన 55:22 ఓదార్పును ఇచ్చింది. కీర్తనకర్తలానే నా భారాన్ని యెహోవామీద వేశాను, ఆయనే నన్ను కాపాడాడని గ్రహించాను. ఇప్పుడు ఉద్యోగం ఉన్నా మత్తయి 6:20-22 వచనాల్లో యేసు ఇచ్చిన సలహాను పాటిస్తూ సాధారణ జీవితం జీవిస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మేము దేవునికి దగ్గరయ్యాం, ఒకరికి ఒకరం కూడా దగ్గరయ్యాం.”
“మాకున్న చిన్న వ్యాపారం దివాలా తీసినప్పుడు భవిష్యత్తు గురించి నేను భయపడ్డాను,” అని జోనాతన్ చెప్తున్నాడు. “ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడం వల్ల, 20 సంవత్సరాల ప్రయాసం అంతా వ్యర్థమైపోయింది. డబ్బు గురించి నాకు నా భార్యకు గొడవలు అయ్యేవి. క్రెడిట్ కార్డు పనికిరాదేమో అని భయపడి దాన్ని ఉపయోగించేవాళ్లంకాదు.
“మేము మంచి నిర్ణయాలు తీసుకోవడానికి దేవుని వాక్యం, ఆయన పవిత్ర శక్తి సహాయం చేశాయి. ఎలాంటి పని చేయడానికైనా నేను సిద్ధంగా ఉండేవాణ్ణి, అనవసరమైన ఖర్చులన్నీ మేము తగ్గించుకున్నాం. మేము యెహోవాసాక్షులం కాబట్టి తోటి విశ్వాసులు నుండి కూడా మాకు మద్దతు దొరికింది. మేము కష్టాల్లో కూరుకుపోయినప్పుడు వాళ్లు మాకు చేయూతను ఇచ్చారు. మా ఆత్మగౌరవాన్ని పెంచారు.”
వివాహం విచ్ఛిన్నం అయినప్పుడు
“ఉన్నట్టుండి నా భర్త నన్ను వదిలి వెళ్లిపోయినప్పుడు, నాకు ఎంతో బాధ కలిగింది, చాలా కోపం వచ్చింది,” అని రాకెల్ చెప్తుంది. “భయంకరమైన విషాదం నన్ను అలుముకుంది. అప్పుడు నేను దేవునికి దగ్గరయ్యాను, ఆయన నాకు ఓదార్పును ఇచ్చాడు. నేను రోజూ దేవునికి ప్రార్థన చేసినప్పుడు నాకు కావాల్సిన మనశ్శాంతిని ఆయన నాకు ఇచ్చాడు. విరిగిన నా హృదయాన్ని ఆయన అతికించినట్లు నాకు అనిపించింది.
“కోపం, ఉక్రోషం నుండి బయటపడడానికి దేవుని వాక్యం నాకు ఎంతో సహాయం చేసింది. రోమీయులు 12:21లో అపొస్తలుడైన పౌలు అన్న మాటలు నేను హృదయంలోకి తీసుకున్నాను: ‘కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.’
“తట్టుకుని ముందుకు వెళ్లడానికి ఒక మంచి కౌన్సిలర్ నాకు సహాయం చేశాడు. ఆయన ప్రసంగి 3:6లో ‘పోగొట్టుకొనుటకు’ కూడా సమయం కలదు అనే మాటలు చూపించి కొన్ని వదులుకోవాలని దయగా చెప్పాడు. అది చాలా కష్టమైన సలహా కానీ నాకు అవసరమైంది అదే. ఇప్పుడు నా జీవితంలో కొత్త లక్ష్యాలు ఉన్నాయి.”
“మీ వివాహం విచ్ఛిన్నం అయినప్పుడు, మీకు సహాయం అవసరం,” అని ఎలిజబెత్ అంటోంది. “నాకు ఒక మంచి స్నేహితురాలు ఉంది, ప్రతీరోజు ఆమె నాకు కావాల్సిన మద్దతు ఇచ్చింది. నాతో కలసి ఏడ్చేది, నన్ను ఓదార్చేది, నన్ను ప్రేమగా చూసుకునేది, నాకు ఎవ్వరూ లేరని ఎప్పుడూ అనుకోనిచ్చేదికాదు. మానసికంగా నాకు అయిన గాయాలను మాన్పడానికి యెహోవా ఆమెను ఉపయోగించాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను.”
అనారోగ్యం, ముసలితనం
మొదటి ఆర్టికల్‌లో చూసిన లూయిస్‌కు చాలా తీవ్రమైన గుండె జబ్బు ఉంది. ఆయన రెండు సార్లు దాదాపు చనిపోయే స్థితికి వెళ్ళాడు. ఆయనకు ఇప్పుడు రోజుకు 16 గంటలు ఆక్సిజన్ పెట్టాలి. “నేను యెహోవాకు ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాను” అని చెప్పాడు. “అలా ప్రార్థన చేసిన తరువాత దేవుని పవిత్రశక్తి వల్ల నాకు శక్తి వస్తుంది. జీవితం ముందుకు సాగడానికి ప్రార్థన నాకు ధైర్యాన్ని ఇస్తుంది ఎందుకంటే నాకు ఆయనపై విశ్వాసం ఉంది, ఆయన నన్ను చూసుకుంటాడని నాకు తెలుసు.”
“నాకు చాలా పనులు చేయాలని ఉంది, కానీ చేయలేను” అని 80లలో ఉన్న శారద అంటోంది. “నా శక్తి తగ్గిపోతుంటే జీర్ణించుకోలేకపోతున్నాను. చాలా అలసటగా ఉంటుంది. మందుల మీదే బ్రతకాలి. యేసు తనకొచ్చిన ఒక కష్టాన్ని సాధ్యమైతే తీసివేయమని తండ్రిని అడిగిన విషయం గురించి నేను ఆలోచిస్తుంటాను. యెహోవా యేసుకు బలాన్ని ఇచ్చాడు, నాకూ ఇస్తున్నాడు. రోజూ నేను చేసుకునే చికిత్స ప్రార్థన. దేవునితో మాట్లాడిన తర్వాత నాకు ఉపశమనం కలుగుతుంది.”—మత్తయి 26:39.
హూలియన్ 30 సంవత్సరాలుగా మల్టిపుల్ స్ల్కెరోసిస్ (multiple sclerosis) అనే వ్యాధితో బాధపడుతున్నాడు. అతను కూడా ఇలానే అనుకుంటున్నాడు: “ఆఫీసర్ కుర్చీ నుండి నేను చక్రాల కుర్చీలోకి వచ్చేశాను, అయినా నా జీవితం వృథా కాలేదు ఎందుకంటే నేను ఇతరులకు సేవ చేస్తూ గడుపుతున్నాను. ఇతరులకు ఏదైన ఇచ్చినప్పుడు మన బాధ తగ్గుతుంది. అవసరంలో బలాన్ని ఇస్తాననే మాటను యెహోవా నిలబెట్టుకుంటున్నాడు. అపొస్తలుడైన పౌలులా నేను కూడా ఇలా చెప్పగలను: ‘నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.’”—ప్రియమైనవాళ్లు చనిపోయినప్పుడు
“మా నాన్నగారు రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పుడు, నేను అస్సలు నమ్మలేకపోయాను,” అని అఖిల్ చెప్తున్నాడు. “నాకు అది చాలా అన్యాయంగా అనిపించింది, ఆయన రోడ్డు ప్రక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు అంతే. నేను ఏమి చేయలేకపోయాను. ఆయన 5 రోజులు కోమాలో ఉండి చనిపోయారు. మా అమ్మ ఎదురుగా ఏడ్వకుండా నన్ను నేను ఆపుకున్నాను, కానీ ఒక్కడినే ఉన్నప్పుడు ఏడ్పు ఆపుకోలేకపోయేవాణ్ణి. ‘ఎందుకు? ఎందుకు ఇలా జరిగింది?’ అని బాగా ఆలోచించేవాడిని.
“భయంకరమైన ఆ రోజుల్లో, నా భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి సహాయం చేయమని, నాకు మనశ్శాంతిని ఇవ్వమని యెహోవాను అడిగేవాణ్ణి. మెల్లమెల్లగా ప్రశాంతంగా అనిపించింది. ‘కాలవశము చేత’ కొన్ని సంఘటనలు ఎవరికైనా జరగవచ్చని పవిత్ర లేఖనాల్లో ఉన్న విషయాలు నాకు గుర్తుకొచ్చాయి. దేవుడు అబద్ధమాడడు కాబట్టి, నేను తప్పకుండా మా నాన్నను తిరిగి చూస్తానని నమ్ముతున్నాను.”—ప్రసంగి 9:11; యోహాను 11:25; తీతు 1:2.
మొదటి ఆర్టికల్‌లో మాట్లాడుకున్న రాబర్ట్ కూడా అలాగే అంటున్నాడు. ఆయన ఇలా చెప్తున్నాడు: “ఫిలిప్పీయులు 4:6, 7లో చెప్పిన మనశ్శాంతిని నేను అనుభవించాను. యెహోవాకు ప్రార్థించడం వల్ల మేము ఆ మనశ్శాంతిని పొందాము. అలా ప్రశాంతంగా ఉన్నాం కాబట్టే న్యూస్ రిపోర్టర్ల ముందు పునరుత్థానం గురించిన మా నమ్మకాలను వివరించగలిగాం. విమానం కూలిపోయి మా అబ్బాయి దూరమైనా, ఆయనతో మేము ఆనందంగా గడిపిన చాలా జ్ఞాపకాలు ఇంకా మా మదిలో ఉన్నాయి. వాటి గురించే ఎక్కువగా ఆలోచించడానికి ప్రయత్నిస్తాము.
“మేము టీవీలో మా నమ్మకాల గురించి ప్రశాంతంగా వివరించామని మా తోటి సహోదరులు చెప్పారు. ఖచ్చితంగా వాళ్లు మా గురించి చేసిన ప్రార్థనల వల్లే అది సాధ్యమైందని మేము వాళ్లకు చెప్పాం. ఎంతోమంది మమ్మల్ని ఓదార్చడానికి చెప్పిన మాటల ద్వారా యెహోవా మాకు సహాయం చేశాడని నేను నిజంగా నమ్ముతున్నాను.”
ప్రజలు ఎంత పెద్ద సమస్యలను, కష్టాలను ఎదుర్కొంటున్నా దేవుడు వాళ్లకు కావాల్సిన ఓదార్పును ఇవ్వగలడని ముందు చెప్పిన ఉదాహరణలు చూపిస్తున్నాయి. మరి మీ విషయం? మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా కష్టకాలాల్లో మీకు కావాల్సిన ఓదార్పు అందుబాటులో ఉంది. b కాబట్టి, సహాయం కోసం యెహోవా వైపు చూడండి. ఆయన “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు.”—2 కొరింథీయులు 1:3. ▪ (wp16-E No. 5)
a ఈ ఆర్టికల్‌లో కొన్ని పేర్లు అసలు పేర్లు కావు.
b దేవునికి దగ్గరై ఆయన ఇచ్చే ఓదార్పును పొందాలంటే, మీకు దగ్గర్లో ఉన్న యెహోవాసాక్షులతో మాట్లాడండి లేదా దగ్గర్లోని మా బ్రాంచి కార్యాలయానికి ఉత్తరం రాయండి.