బైబిలు జీవితాలను మారుస్తుంది
గెలిచే ముందు నేను చాలాసార్లు ఓడిపోయాను
-
పుట్టిన సంవత్సరం: 1953
-
దేశం: ఆస్ట్రేలియా
-
ఒకప్పుడు: అశ్లీల చిత్రాలకు అలవాటు పడ్డాడు
నా గతం:
మా నాన్న 1949లో జర్మనీ నుండి ఆస్ట్రేలియాకు వలస వచ్చారు. ఇక్కడ బొగ్గు గనుల్లో, విద్యుత్తు ఉత్పాదక పరిశ్రమల్లో పని వెతుక్కుంటూ వచ్చారు. విక్టోరియాలోని ఒక గ్రామంలో స్థిరపడ్డారు. కొంతకాలానికి మా అమ్మను పెళ్లి చేసుకున్నారు. నేను 1953లో పుట్టాను.
కొన్ని సంవత్సరాల తర్వాత మా అమ్మ యెహోవాసాక్షుల దగ్గర బైబిలు నేర్చుకోవడం మొదలుపెట్టింది, కాబట్టి నాకు చిన్నప్పటి నుండి బైబిలు బోధలతో పరిచయం ఏర్పడింది. కానీ మా నాన్నకు ఏ మతం ఇష్టం ఉండదు. ఆయన చాలా భయంకరంగా, క్రూరంగా తయారయ్యాడు, మా అమ్మ ఆయనంటే భయపడేది. అయినా రహస్యంగా బైబిలు నేర్చుకునేది, ఆ బోధలు ఆమెకు బాగా నచ్చాయి. నాన్న బయటకు వెళ్లినప్పుడు ఆమె నేర్చుకున్న విషయాలను నాకు, మా చెల్లికి చెప్పేది. భవిష్యత్తులో రాబోయే పరదైసు భూమి గురించి, బైబిలు సూత్రాలను పాటిస్తే వచ్చే ఆనందం గురించి మాకు చెప్పింది.—కీర్తన 37:10, 29; యెషయా 48:17.
నాకు 18 సంవత్సరాలప్పుడు, మా నాన్న పెట్టిన హింసలు తట్టుకోలేక నేను ఇంటి నుండి బయటకు రాక తప్పలేదు. అమ్మ బైబిలు గురించి చెప్పిన విషయాలను నేను నమ్మినా, వాటి విలువ నాకు తెలియలేదు. కాబట్టి నేను వాటిని పాటించలేదు. బొగ్గు గనుల్లో కరెంట్పని చేయడం మొదలుపెట్టాను. నాకు 20 సంవత్సరాలు వచ్చాక, పెళ్లి చేసుకున్నాను. పెళ్లైన మూడు సంవత్సరాలకు నాకు కూతురు పుట్టింది, అప్పుడు నా జీవితంలో ముఖ్యమైన విషయం ఏమిటో ఆలోచించడం మొదలుపెట్టాను. బైబిల్లో విషయాలు మా కుటుంబానికి సహాయం చేస్తాయని నాకు తెలుసు కాబట్టి యెహోవాసాక్షులతో కలిసి బైబిలు గురించి నేర్చుకోవడం మొదలు పెట్టాను. కానీ నా భార్యకు యెహోవాసాక్షులు అంటే అస్సలు ఇష్టం లేదు. నేను ఒకసారి యెహోవాసాక్షుల మీటింగ్కు వెళ్లాను. అప్పుడు నా భార్య, బైబిలు స్టడీ అన్నా వదిలేయ్ లేదా మమ్మల్ని అన్నా వదిలేయ్ అని తేల్చిచెప్పేసింది. నేను ఏమి చేయలేకపోయాను, ఆమె చెప్పినట్లే యెహోవాసాక్షులను కలవడం ఆపేశాను. సరైనది తెలిసి కూడా చేయకుండా ఉన్నందుకు తర్వాత చాలా బాధపడ్డాను.
ఒకరోజు నాతో పనిచేసే వాళ్లు నాకు అశ్లీల చిత్రాలు, వీడియోలు చూపించారు. అవి ఇంకా చూడాలి అనిపించేలా ఉన్నాయి, చాలా అసహ్యంగా కూడా ఉన్నాయి. తర్వాత తప్పు చేశాననే భావాలతో కృంగిపోయాను. బైబిల్లో నేర్చుకున్న విషయాలను బట్టి దేవుడు నన్ను తప్పకుండా శిక్షిస్తాడని అనుకున్నాను. అసభ్యకరమైన చిత్రాలను ఎక్కువగా చూడడం వల్ల వాటిమీద నా అభిప్రాయం మారిపోయింది. కొంతకాలానికి వాటికి బాగా అలవాటు పడిపోయాను.
తర్వాత 20 సంవత్సరాల్లో, మా అమ్మ నేర్పించడానికి ప్రయత్నించిన నియమాలకు మెల్లమెల్లగా దూరం అయ్యాను. నా మెదడులోకి ఎక్కించుకున్న
విషయాలు నా ప్రవర్తనను మార్చేశాయి. అసభ్యంగా మాట్లాడేవాన్ని, నేను వేసే జోకులు కూడా అసహ్యంగా ఉండేవి. సెక్స్ విషయంలో నా ఆలోచనలు పూర్తిగా చెడిపోయాయి. నా భార్యతో కలిసి ఉన్నా, వేరే స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్నాను. ఒక రోజు అద్దంలో నన్ను నేను చూసుకుని, ‘నువ్వంటే నాకు ఇష్టం లేదు’ అనుకున్నాను. ఆత్మగౌరవానికి బదులు నా మీద నాకే అసహ్యం కలిగింది.నా భార్యతో విడిపోయాను. నా జీవితం చెల్లాచెదురు అయిపోయింది. అప్పుడు నా మనసు విప్పి యెహోవాకు ప్రార్థన చేశాను. 20 సంవత్సరాల క్రితం ఆపేసిన బైబిలు స్టడీ మళ్లీ మొదలుపెట్టాను. అప్పటికి మా నాన్న చనిపోయారు, మా అమ్మ బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షి అయ్యింది.
బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే . . .
బైబిలు ఉన్నత ప్రమాణాలకూ నా జీవితానికీ సంబంధమే లేకుండా అయిపోయింది. కానీ ఇక నుండి బైబిలు వాగ్దానం చేసిన మనశ్శాంతిని ఎలాగైనా పొందాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. నా మాటలను మార్చుకోవడం మొదలుపెట్టాను, కోపాన్ని తగ్గించుకోవడం మొదలుపెట్టాను. తిరుగుబోతుతనం, త్రాగుబోతుతనం, జూదం మానేయాలని నిర్ణయించుకున్నాను. మా బాస్ దగ్గర దొంగతనం చేయడం కూడా మానాలనుకున్నాను.
నేను పెద్దపెద్ద మార్పులు ఎందుకు చేసుకోవాలనుకుంటున్నానో నాతో పనిచేసే వాళ్లకు అర్థం కాలేదు. కనీసం మూడు సంవత్సరాలు వాళ్లు నన్ను మళ్లీ ఇదివరకటిలా మార్చాలని విసికిస్తూ వచ్చారు. ఏ చిన్న పొరపాటు చేసినా, గట్టిగా అరచినా, బూతు మాట అన్నా, వెంటనే గట్టిగా సంతోషంతో, “ఆహా! పాత జో మళ్లీ తిరిగొచ్చాడు” అనేవాళ్లు. ఆ మాటలు నన్ను చాలా బాధ పెట్టేవి. నేను ఇంక మారను అని చాలాసార్లు బాధపడేవాన్ని.
నేను ఉద్యోగం చేసే చోటు అశ్లీల పుస్తకాలు, వీడియోలతో నిండిపోయి ఉండేది. నా తోటి ఉద్యోగస్థులు కూడా నేను ఇదివరకు చేసినట్లే ఆ బూతు చిత్రాల్ని కంప్యూటర్ల ద్వారా బాగా పంచిపెట్టేవాళ్లు. నేను ఆ అలవాటు నుండి బయట పడాలనుకుంటున్నాను, కానీ వాళ్లు నన్ను ప్రతీసారీ పడేయాలని పట్టుదలతో ప్రయత్నించారు. సహాయం, ప్రోత్సాహం కోసం నాకు స్టడీ ఇచ్చే అతన్ని ఆశ్రయించాను. నా మనసులో ఉన్నవన్నీ చెప్తుంటే ఆయన ఓపిగ్గా విన్నాడు. కొన్ని బైబిలు మాటలు ఉపయోగించి, ఆ అలవాటుతో ఎలా పోరాడాలో ఆయన నాకు చూపించాడు. మానకుండా ప్రార్థన చేస్తూ యెహోవా సహాయం అడగమని ఆయన నాకు చెప్పాడు.—కీర్తన 119:37.
ఒకరోజు నేను నాతో పనిచేసే వాళ్లందర్నీ పిలిచి ఒక మీటింగ్ పెట్టాను. అందరూ వచ్చాక వాళ్లలో ఇద్దరికి బీరు బాటిళ్లు ఇవ్వమన్నాను. వాళ్లిద్దరూ తాగుడు మానేయాలనుకుంటున్నారు. వెంటనే అక్కడున్న వాళ్లంతా, “నువ్వు అలా చేయకూడదు, వీళ్లిద్దరూ ఈ అలవాటు నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్నారు” అని గట్టిగా అరిచారు. “నేను కూడా అంతే” అని నేను జవాబిచ్చాను. ఇంక ఆ రోజు నుండి నేను అశ్లీల చిత్రాలు చూసే అలవాటు నుండి బయటపడడానికి ఎంత కష్టపడుతున్నానో వాళ్లు అర్థం చేసుకుని, మళ్లీ ఇదివరకులా మారి పోవాలని ఎప్పుడూ నన్ను బలవంతపెట్టలేదు.
కొంతకాలానికి యెహోవా సహాయంతో నేను అశ్లీల చిత్రాలు చూసే అలవాటును ఓడించాను. 1999లో బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షి అయ్యాను. సంతోషంగా గౌరవంగా బ్రతకడానికి నాకు రెండో అవకాశం దొరికినందుకు ఎంతో సంతోషిస్తున్నాను.
నేను ఇంతకాలం ప్రేమించిన విషయాలను యెహోవా ఎందుకు అసహ్యించుకుంటున్నాడో ఇప్పుడు నాకు అర్థమైంది. ఒక ప్రేమగల తండ్రిగా అశ్లీల చిత్రాలు చేసే నష్టం నుండి యెహోవా నన్ను కాపాడాలనుకున్నాడు. సామెతలు 3: 5, 6లో ఉన్న మాటల్లో చాలా నిజం ఉంది. “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.” కాబట్టి బైబిల్లో ఉన్న నియమాలు మనల్ని రక్షించడమే కాదు, మనకు విజయాన్ని కూడా తీసుకువస్తాయి.—కీర్తన 1:1-3.
నేనెలా ప్రయోజనం పొందానంటే . . .
ఇంతకుముందు నా మీద నాకే అసహ్యం వేసేది, కానీ ఇప్పుడు నాకు ఆత్మగౌరవం, మనశ్శాంతి ఉంది. పవిత్రంగా జీవిస్తున్నాను, యెహోవా ఇచ్చే క్షమాపణ, మద్దతు నుండి ప్రయోజనం పొందుతున్నాను. 2000లో ఒక అందమైన క్రైస్తవ సహోదరి కారోలన్ని పెళ్లి చేసుకున్నాను. యెహోవా అంటే నాకు ఎంత ఇష్టమో ఆమెకు అంతే ఇష్టం. మా ఇల్లు శాంతికి నిలయం. ప్రేమ, పవిత్రత ఉన్న ప్రపంచవ్యాప్త సహోదర బృందంలో మేమూ ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. ▪ (wp16-E No. 4)