కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏలా లోయ

దావీదు గొల్యాతుల యుద్ధం​—⁠నిజంగా జరిగిందా?

దావీదు గొల్యాతుల యుద్ధం​—⁠నిజంగా జరిగిందా?

దావీదు గొల్యాతుల కథ నిజంగా జరిగిందా లేదా కేవలం కథేనా అని చాలామంది అనుకుంటారు. ముందు ఆర్టికల్‌ చదువుతున్నప్పుడు మీకు అలాంటి సందేహం వచ్చిందా? అయితే ఈ మూడు ప్రశ్నల గురించి ఆలోచించండి.

1 | ఒక మనిషి దాదాపు తొమ్మిదిన్నర అడుగుల ఎత్తు (2.9 మీ) ఉండడం సాధ్యమేనా?

గొల్యాతు “ఆరుమూళ్ల జేనెడు” ఎత్తు ఉండేవాడని బైబిల్లో ఉంది. (1 సమూయేలు 17:4) ఇక్కడ చెప్పిన మూరెడు, 17.5 అంగుళాలతో (44.5 సె.మీ) సమానం, జేనెడు 8.75 అంగుళాలతో (22.2 సె.మీ) సమానం. అంటే దాదాపు తొమ్మిది అడుగుల ఆరు అంగుళాలు (2.9 మీ). గొల్యాతు అంత ఎత్తు ఉండి ఉండక పోవచ్చు అని కొంతమంది పట్టు పడతారు. కానీ ఆలోచించండి: ఈ మధ్యకాలంలో, నమోదైన అతి పొడవైన వ్యక్తి 8 అడుగుల 11 అంగుళాలు (2.7 మీ) ఉన్నాడు. కాబట్టి గొల్యాతు ఇంకో ఆరు అంగుళాలు (15 సె.మీ) ఎత్తు ఉండడం అసాధ్యమా? ఆయన రెఫాయీము వంశానికి చెందిన వాడు. ఆ జాతి వాళ్లు అసాధారణ ఎత్తులో ఉండేవాళ్లు. క్రీ. పూ. 13వ శతాబ్దానికి చెందిన ఒక ఐగుప్తు పత్రం ప్రకారం కనాను ప్రాంతంలో ఎనిమిది అడుగులు కన్నా (2.4 మీ) ఎత్తుగా ఉండే బలవంతులైన యోధులు ఉండేవాళ్లు అని ఉంది. కాబట్టి గొల్యాతు ఎత్తు చాలా ఎక్కువే అయినా అసాధ్యం కాదు.

2 | దావీదు నిజమైన వ్యక్తేనా?

ఒక సమయంలో పండితులు రాజైన దావీదును ఒక కథగా కొట్టిపారేసేవాళ్లు. కానీ ఇప్పుడు అలా అనుకోవడానికి లేదు. ఎందుకంటే పురావస్తు శాస్త్రజ్ఞులు “దావీదు గృహం” అని రాసి ఉన్న ఒక రాయిని కనుగొన్నారు. యేసుక్రీస్తు మాటలను బట్టి కూడా దావీదు నిజంగా ఉన్నాడని తెలుస్తుంది. (మత్తయి 12:3; 22:43-45) మెస్సీయగా యేసును గుర్తించిన రెండు వంశావళుల కూడా రాజైన దావీదు వంశం నుండి యేసు వచ్చాడని చూపిస్తున్నాయి. (మత్తయి 1:6-16; లూకా 3:23-31) కాబట్టి దావీదు నిజంగా ఉన్నాడు.

3 | ఈ సంఘటనలో ఉన్న ప్రదేశాలన్నీ నిజమైనవేనా?

యుద్ధం ఏలా అనే లోయలో జరిగిందని బైబిల్లో ఉంది. అంతేకాకుండా ఆ ప్రదేశాల గురించి ఇంకొన్ని వివరాలు ఉన్నాయి. ఫిలిష్తీయులు శోకో, అజేకా అనే రెండు నగరాల మధ్య కొండ ప్రక్కగా దిగారని ఉంది. వాళ్లకు ఎదురుగా ఉన్న కొండ ప్రాంతంలో, లోయ అవతల ఇశ్రాయేలీయులు దిగారు. ఈ ప్రదేశాలన్నీ నిజంగా ఉన్నాయా?

ఈ మధ్యకాలంలో ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్లిన ఒక యాత్రికుడు ఏమి చెప్పాడో గమనిద్దాం: “మా గైడ్‌ భక్తిపరుడు కాదు. ఆయన మమ్మల్ని ఏలా లోయ ప్రాంతానికి తీసుకెళ్లాడు. మేము పైకి ఎక్కుతూ కొండ చివరికి వెళ్లాము. అక్కడ చుట్టూ ఉన్న లోయను చూపిస్తూ, ఆయన మాతో 1 సమూయేలు 17:1-3 చదివించాడు. తర్వాత ఆ లోయ అవతల ప్రాంతాన్ని చూపించి: ‘ఇక్కడ మీకు ఎడమ ప్రక్కన శోకో నగర శిథిలాలు ఉన్నాయి’ అన్నాడు. ప్రక్కకు తిరిగి, ‘అక్కడ మీకు కుడి ప్రక్కన అజేకా నగర శిథిలాలు ఉన్నాయి. ఫిలిష్తీయుల సైన్యాలు ఈ రెండు నగరాల మధ్య మీకు ఎదురుగా ఉన్న కొండల్లో దిగారు. కాబట్టి మనం నిల్చున్న చోట ఇశ్రాయేలు సైన్యాలు దిగి ఉంటాయి’ అని చెప్పాడు. అప్పుడు నేను నిల్చున్న చోట సౌలు, దావీదు నిల్చున్నట్లు ఊహించుకున్నాను. అక్కడ నుండి దిగుతూ మేము లోయ అడుగు భాగానికి చేరుకున్నాము. మేము ఎండి పోయిన ఒక నదిని దాటాము. దాని నిండా రాళ్లు ఉన్నాయి. గొల్యాతును చంపడానికి దావీదు ఇక్కడే వంగి ఐదు నున్నని రాళ్లను ఏరుకున్నట్లు అప్పుడు నేను ఊహించుకున్నాను.” ఆ యాత్రికుడు కూడా మిగతా వాళ్లలానే బైబిల్లో ఇచ్చిన ఖచ్చితమైన వివరాలను చూసి చాలా ఆశ్చర్యపోయాడు.

కాబట్టి ఈ చారిత్రక సంఘటన నిజమా కాదా అని మనం సందేహించాల్సిన అవసరమే లేదు. ఇందులో ఉన్న వాళ్లందరూ నిజంగా ఉన్నవాళ్లే, ఆ ప్రదేశాలన్నీ నిజంగా ఉన్నవే. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సంఘటన దేవుడు రాయించిన మాటల్లో ఉంది, కాబట్టి అది “అబద్ధమాడనేరని” సత్య దేవుని నుండి వచ్చింది.—తీతు 1:1, 2; 2 తిమోతి 3:16, 17. ▪ (wp16-E No. 5)