దేవుడిచ్చిన వెలకట్టలేని బహుమతికి కృతజ్ఞత చూపించండి
“వివరించడానికి సాధ్యం కాని ఆయన ఉచిత వరాన్ని గురించి దేవునికి కృతజ్ఞతలు!”—2 కొరిం. 9:15, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.
1, 2. (ఎ) దేవుడిచ్చిన ‘వివరించడానికి సాధ్యం కాని ఉచిత వరంలో’ ఏమేమి ఉన్నాయి? (బి) ఈ ఆర్టికల్‌లో మనం ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?
యెహోవా, తన ప్రియ కుమారుడైన యేసును భూమ్మీదికి పంపించడం ద్వారా ప్రేమతో మనకు అత్యంత గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు. (యోహా. 3:16; 1 యోహా. 4:9, 10) అపొస్తలుడైన పౌలు ఈ బహుమానాన్ని ‘వివరించడానికి సాధ్యం కాని ఉచిత వరం’ అని పిలిచాడు. (2 కొరిం. 9:15, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) ఇంతకీ పౌలు ఎందుకు అలా అన్నాడు?
2 యేసు బలి ఆధారంగా దేవుని అద్భుతమైన వాగ్దానాలన్నీ నిజమౌతాయని పౌలుకు తెలుసు. (2 కొరింథీయులు 1:20 చదవండి.) అంటే ‘వివరించడానికి సాధ్యం కాని ఉచిత వరం’ కేవలం యేసు బలి మాత్రమే కాదు. దేవుడు భవిష్యత్తులో మనకోసం చేయబోయే మంచి వాటన్నిటితోపాటు ఆయన మనపై చూపించే యథార్థ ప్రేమ కూడా ఆ వరంలో భాగమే. కాబట్టి అంత విలువైన బహుమానాన్ని మనకు పూర్తిగా అర్థమయ్యేలా వివరించడం అసాధ్యం. అయితే ఆ ప్రత్యేకమైన బహుమానం మనపై ఎలాంటి ప్రభావం చూపించాలి? 2016, మార్చి 23 బుధవారం రోజున జరిగే క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు సిద్ధపడుతుండగా ఏమి చేసేలా ఆ బహుమానం మనల్ని ప్రోత్సహించాలి?
దేవుడిచ్చిన ప్రత్యేక బహుమానం
3, 4. (ఎ) ఎవరైనా మీకు ఓ బహుమానం ఇచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది? (బి) ఓ ప్రత్యేకమైన బహుమానం మీ జీవితాన్ని ఎలా మార్చేయగలదు?
3 మనకెవరైనా ఓ బహుమానాన్ని ఇస్తే చాలా సంతోషిస్తాం. కొన్ని బహుమానాలు ఎంత ప్రత్యేకంగా ఉంటాయంటే అవి మన జీవితాన్నే మార్చేయగలవు. ఉదాహరణకు, మీరు ఓ నేరం చేశారని ఊహించుకోండి. అందుకు మీకు ఉరిశిక్ష విధించారు. కానీ హఠాత్తుగా, మీకు పరిచయంలేని ఓ వ్యక్తి మీ బదులు శిక్ష అనుభవించడానికి ముందుకొచ్చాడు. అంటే ఆయన మీ కోసం చనిపోవడానికి సిద్ధపడ్డాడు. ఆయన మీకోసం చేస్తున్న త్యాగం ఓ ప్రత్యేకమైన బహుమానం లాంటిది. దాన్నిబట్టి మీకేమనిపిస్తుంది?
4 అంతటి ప్రేమతో ఇస్తున్న ఆ ప్రత్యేకమైన బహుమానం, మీరు జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఆలోచించుకునేలా చేస్తుంది. బహుశా మీరు ఇతరులపట్ల మరింత ఉదారంగా, ప్రేమగా ఉండాలని అలాగే మీతో కఠినంగా ప్రవర్తించినవాళ్లను కూడా క్షమించాలని నిర్ణయించుకుంటారు. మీకు పరిచయంలేని ఆ వ్యక్తి చేసిన త్యాగానికి జీవితాంతం రుణపడి ఉండాలనుకుంటారు.
5. యెహోవా ఇచ్చిన విమోచన క్రయధనం అనే బహుమానం వేరే ఇతర బహుమానాలకన్నా ఏవిధంగా గొప్పది?
5 అయితే యెహోవా ఏర్పాటు చేసిన విమోచన క్రయధనం, ముందటి పేరాలో మనం చూసిన ఉదాహరణలోని బహుమానంకన్నా చాలా గొప్పది. (1 పేతు. 3:18) దీని గురించి ఆలోచించండి. మనందరం ఆదాము నుండి పాపాన్ని వారసత్వంగా పొందాము, ఆ పాపానికి శిక్ష మరణం. (రోమా. 5:12) కానీ యెహోవా ఎంతో ప్రేమతో యేసును భూమ్మీదకు పంపించి, మనుషులందరికోసం ‘మరణము అనుభవించేలా’ చేశాడు. (హెబ్రీ. 2:9) యేసు అర్పించిన బలి ఇప్పుడు మన జీవాన్ని కాపాడడంతోపాటు, భవిష్యత్తులో మరణాన్ని శాశ్వతంగా జయించడానికి మార్గం తెరిచింది. (యెష. 25:7, 8; 1 కొరిం. 15:22, 26) యేసు మీద విశ్వాసం ఉంచే ప్రతీఒక్కరూ ఎల్లప్పుడూ సమాధానంతో, సంతోషంతో ఉంటారు. అంటే అభిషిక్తులు పరలోకంలో క్రీస్తు తోటి రాజులుగా, భూనిరీక్షణ ఉన్నవాళ్లు భూమ్మీద దేవుని రాజ్యపౌరులుగా నిత్యం సంతోషంగా ఉంటారు. (రోమా. 6:23; ప్రక. 5:9, 10) యెహోవా ఇచ్చిన ప్రత్యేకమైన బహుమానంలో ఇంకా ఏయే దీవెనలు ఉన్నాయి?
6. (ఎ) యెహోవా ఇచ్చిన బహుమానంలోని ఏ దీవెన కోసం మీరు ఎదురుచూస్తున్నారు? (బి) దేవుడిచ్చిన బహుమానం ఏ మూడు పనులు చేసేలా మనల్ని ప్రోత్సహిస్తుంది?
6 దేవుడు ఇచ్చిన బహుమానంలో భాగంగా, త్వరలో భూమంతా అందమైన తోటలా మారుతుంది. అంతేకాదు అనారోగ్యంతో ఉన్నవాళ్లు బాగవుతారు, చనిపోయినవాళ్లు తిరిగి బ్రతుకుతారు. (యెష. 33:24; 35:5, 6; యోహా. 5:28, 29) ‘వివరించడానికి సాధ్యం కాని ఉచిత వరాన్ని’ ఇచ్చినందుకు యెహోవాను, ఆయన ప్రియ కుమారుణ్ణి మనం ప్రేమిస్తున్నాం. అయితే ఈ బహుమానం మనల్ని ఏమి చేసేలా ప్రోత్సహిస్తుంది? అది మనల్ని (1) యేసుక్రీస్తును ఎక్కువగా అనుకరించేలా, (2) తోటి సహోదరసహోదరీల్ని ప్రేమించేలా, (3) ఇతరుల్ని మనస్ఫూర్తిగా క్షమించేలా ప్రోత్సహిస్తుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
“క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది”
7, 8. క్రీస్తు చూపించిన ప్రేమ మనలో ఏ కోరికను కలిగించాలి? అది మనల్ని ఏమి చేసేలా ప్రోత్సహించాలి?
7 మొదటిగా, మన జీవితాన్ని యేసును ఘనపర్చడానికి ఉపయోగించాలనే కోరికను దేవుని ప్రేమ మనలో కలిగించాలి. అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు, “క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది.” (2 కొరింథీయులు 5:14, 15 చదవండి.) మనం యేసు చూపించిన గొప్ప ప్రేమను అంగీకరిస్తే, అది ఆయనను ప్రేమించి ఘనపర్చేలా మనల్ని ప్రోత్సహిస్తుందని పౌలుకు తెలుసు. అవును, యెహోవా మనమీద ఎంత ప్రేమ చూపించాడో పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు, యేసు ఇష్టపడేలా జీవించాలనే కోరిక మనలో కలుగుతుంది. అలా కోరుకుంటున్నామని మనమెలా చూపించవచ్చు?
8 యెహోవా మీద మనకున్న ప్రేమ మనం యేసు అడుగుజాడల్లో నడుస్తూ ఆయన్ను అనుకరించేలా ప్రోత్సహిస్తుంది. (1 పేతు. 2:20-21; 1 యోహా. 2:5, 6) దేవునికి, క్రీస్తుకు లోబడడం ద్వారా మనం వాళ్లను ప్రేమిస్తున్నామని చూపిస్తాం. యేసు ఇలా అన్నాడు, “నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందును.”—యోహా. 14:21; 1 యోహా. 5:3.
9. మనం ఎలాంటి ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది?
9 మన జీవన విధానం ఎలా ఉందో ఆలోచించుకోవడానికి ఈ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణ కాలం సరైన సమయం. కాబట్టి మీరిలా ప్రశ్నించుకోండి, ‘నేను ఏయే విషయాల్లో ఇప్పటికే యేసును అనుకరిస్తున్నాను? నేనింకా ఏ విషయాల్లో మార్పులు చేసుకోవాలి?’ ఈ లోక ప్రభావం మనమీద ఎప్పుడూ ఉంటుంది కాబట్టి మనం ఈ ప్రశ్నల గురించి ఆలోచించడం చాలా ప్రాముఖ్యం. (రోమా. 12:2) జాగ్రత్తగా లేకపోతే, మనం ఈ లోకంలోని బోధకులను, ప్రముఖ వ్యక్తులను అలాగే క్రీడాకారులను అనుకరించాలనే ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది. (కొలొ. 2:8; 1 యోహా. 2:15-17) మరి అలాంటి ఒత్తిడికి లొంగిపోకూడదంటే మనమేమి చేయాలి?
10. జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో మనం ఏ ప్రశ్నల గురించి ఆలోచించాలి? వాటి జవాబులు మనల్ని ఏమి చేసేలా కదిలించాలి? (ప్రారంభ చిత్రం చూడండి.)
10 మనమెలాంటి బట్టలు వేసుకుంటున్నామో, ఎలాంటి పాటల్ని వింటున్నామో, సినిమాలు చూస్తున్నామో, మన కంప్యూటర్, సెల్‌ఫోన్ లేదా టాబ్లెట్లలో ఏమి ఉన్నాయో పరిశీలించుకోవడానికి కూడా జ్ఞాపకార్థ ఆచరణ కాలం సరైన సమయం. మిమ్మల్ని ఇలా ప్రశ్నించుకోండి, ‘ఒకవేళ నేను యేసు ఉండే చోటుకు వెళ్తుంటే, ఈ బట్టలు వేసుకుంటానా?’ (1 తిమోతి 2:9-10 చదవండి.) ‘నేను క్రీస్తు అనుచరున్ని లేదా అనుచరురాలినని నా బట్టలు చూపిస్తున్నాయా? నేను చూసే సినిమాలు చూడడానికి లేదా సంగీతాన్ని వినడానికి యేసు ఇష్టపడతాడా? ఒకవేళ యేసు నా సెల్‌ఫోన్ లేదా టాబ్లెట్ తీసుకుంటే, అందులో ఉన్నవాటిని బట్టి నేను సిగ్గుపడతానా? నేను ఆడుతున్న వీడియో గేములంటే నాకెందుకు ఇష్టమో యేసుకు వివరించడానికి నేను ఇబ్బందిపడతానా?’ మనకు యెహోవా మీద ప్రేమ ఉంటే క్రైస్తవులకు తగని వాటన్నిటినీ పడేస్తాం, అవి ఎంత ఖరీదైనవి అయినాసరే. (అపొ. 19:19, 20) మన జీవితాన్ని యేసును ఘనపర్చేందుకు ఉపయోగిస్తామని మనం యెహోవాకు సమర్పించుకున్నప్పుడు మాటిచ్చాం. కాబట్టి యేసును అనుకరించడానికి అడ్డుగా ఉండే దేన్నీ మన దగ్గర ఉంచుకోకూడదు.—మత్త. 5:29, 30; ఫిలి. 4:8.
11. (ఎ) దేవునిపట్ల, యేసుపట్ల మనకున్న ప్రేమ పరిచర్యలో ఏమి చేసేలా మనల్ని ప్రోత్సహిస్తుంది? (బి) ప్రేమ ఉంటే సంఘంలోని ఇతరులకు మనం ఏవిధంగా సహాయం చేస్తాం?
11 యేసుపై మనకున్న ప్రేమ ఉత్సాహంగా ప్రకటించేలా, బోధించేలా మనల్ని ప్రోత్సహిస్తుంది. (మత్త. 28:19, 20; లూకా 4:43) జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో 30 లేదా 50 గంటలు ప్రకటనాపనిలో గడిపేలా మీ రోజూవారి పనుల్లో మార్పులు చేసుకోగలరా? ఈ అనుభవాన్ని పరిశీలించండి. 84 ఏళ్లున్న ఓ సహోదరునికి భార్య లేదు. అతని వయసు, ఆరోగ్యం సహకరించవు కాబట్టి పయినీరు సేవచేయలేనని అనుకున్నాడు. అయితే ఆయన ఉంటున్న ప్రాంతంలోని పయినీర్లు ఆ సహోదరునికి సహాయం చేయాలనుకున్నారు. వాళ్లు ఆయనను పరిచర్యకు తీసుకువెళ్లి, తీసుకువచ్చే ఏర్పాటు చేశారు, ఆయనకు పరిచర్య చేయడానికి సులభంగా ఉండే ప్రాంతాన్ని కూడా ఎంచుకున్నారు. దాంతో ఆయన 30 గంటలు పరిచర్య చేయాలనే లక్ష్యం చేరుకున్నాడు. మరి మీరు కూడా, జ్ఞాపకార్థ ఆచరణ జరిగే నెలలో సహాయ పయినీరు సేవచేసేలా మీ సంఘంలో ఎవరికైనా మద్దతివ్వగలరా? నిజమే పయినీరు సేవచేయడం ప్రతీఒక్కరికి కుదరకపోవచ్చు. కానీ మన సమయాన్ని, శక్తిని యెహోవాకు మరింత ఎక్కువగా సేవచేయడానికి ఉపయోగించవచ్చు. మనమలా చేస్తే, పౌలులాగే మనం కూడా “క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది” అని చూపించినవాళ్లమౌతాం. దేవుని ప్రేమ మనల్ని ఇంకా ఏమి చేసేలా కదిలిస్తుంది?
ఒకర్నొకరం ప్రేమించుకోవడం మన బాధ్యత
12. దేవుని ప్రేమ మనల్ని ఏమి చేసేలా కదిలించాలి?
12 రెండవదిగా, మన తోటి సహోదరసహోదరీలను ప్రేమించేలా దేవుని ప్రేమ మనల్ని కదిలిస్తుంది. అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు, “ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింపబద్ధులమై యున్నాము.” (1 యోహా. 4:7-11) కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాలంటే మనం మన సహోదరసహోదరీలను ప్రేమించాలి. (1 యోహా. 3:16) మరి వాళ్లపట్ల మనకున్న ప్రేమను ఎలా చూపించవచ్చు?
13. ఇతరుల్ని ప్రేమించే విషయంలో యేసు ఎలాంటి ఆదర్శాన్ని ఉంచాడు?
13 ఇతరులపట్ల మనమెలా ప్రేమ చూపించవచ్చో యేసు జీవితం మనకు నేర్పిస్తుంది. ఆయన భూమ్మీదున్నప్పుడు ప్రజలకు, ముఖ్యంగా వినయంగలవాళ్లకు సహాయం చేశాడు. రోగులను, కుంటివాళ్లను, గుడ్డివాళ్లను, చెవిటివాళ్లను, మూగవాళ్లను బాగుచేశాడు. (మత్త. 11:4, 5) యేసు కాలంలోని మతనాయకులు, దేవుని గురించి నేర్చుకోవాలనుకునే ప్రజలను ‘శాపగ్రస్థుల్లా’ చూశారు. కానీ అందుకు భిన్నంగా యేసు అలాంటి ప్రజలకు దేవుని గురించిన విషయాల్ని బోధించడానికి ఇష్టపడ్డాడు. (యోహా. 7:49) ఆయన వినయస్థులైన ఆ ప్రజలను ప్రేమించాడు, వాళ్లకు సహాయం చేయడానికి కష్టపడ్డాడు.—మత్త. 20:28.
14. తోటి సహోదరసహోదరీల పట్ల మీరెలా ప్రేమ చూపించవచ్చు?
14 మీ సంఘంలోని సహోదరసహోదరీలకు ముఖ్యంగా వయసుపైబడిన వాళ్లకు మీరు ఏ విధంగా సహాయం చేయగలరో ఆలోచించడానికి జ్ఞాపకార్థ ఆచరణ కాలం మనకు మంచి అవకాశానిస్తుంది. అలాంటివాళ్లను మీరు వెళ్లి కలవగలరా? వాళ్లకోసం భోజనాన్ని వండి తీసుకెళ్లడం, ఇంటిపనుల్లో సహాయం చేయడం, మీతోపాటు మీటింగ్‌కు లేదా పరిచర్యకు తీసుకెళ్లడం లాంటివి చేయగలరేమో ఆలోచించండి. (లూకా 14:12-14 చదవండి.) తోటి సహోదరసహోదరీల పట్ల ప్రేమ చూపించేలా దేవుని ప్రేమ మనల్ని ప్రోత్సహించాలి.
తోటి సహోదరసహోదరీలపట్ల దయ చూపించండి
15. మనం ఏ విషయాన్ని గుర్తించాలి?
15 మూడవదిగా, తోటి సహోదరసహోదరీలను క్షమించేలా దేవుని ప్రేమ మనల్ని ప్రోత్సహిస్తుంది. మనలో ప్రతీఒక్కరం ఆదాము నుండి పాపమరణాల్ని వారసత్వంగా పొందాం కాబట్టి “విమోచన క్రయధనం నాకు అవసరంలేదు” అని మనలో ఎవ్వరం అనలేం. అత్యంత నమ్మకమైన దేవుని సేవకునికి కూడా విమోచన క్రయధనం అనే బహుమానం అవసరం. మనలో ప్రతీఒక్కరం యెహోవాకు పెద్ద మొత్తంలో అప్పున్నాం, అయితే ఆయన దాన్ని క్షమించాడు. మనం ఈ విషయాన్ని గుర్తించడం ఎందుకు ప్రాముఖ్యం? దానికి జవాబు యేసు చెప్పిన ఓ ఉపమానంలో ఉంది.
16, 17. పెద్ద మొత్తాన్ని క్షమించిన ఓ రాజు గురించి యేసు చెప్పిన ఉపమానం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
16 యేసు ఓ ఉపమానంలో, ఒక రాజు తనకు 6 కోట్ల దేనారాలు అప్పు ఉన్న దాసుడిని క్షమించాడని చెప్పాడు. కానీ ఆ దాసుడు మాత్రం, తనకు కేవలం 100 దేనారాలు అప్పు ఉన్న తన తోటి దాసుణ్ణి క్షమించలేదు. నిజానికి రాజు తనపట్ల చూపించిన దయ తోటివాణ్ణి క్షమించేలా ఆ దాసుడిని కదిలించి ఉండాలి. అయితే తన దాసుడు తోటివాని అప్పును క్షమించలేదని తెలుసుకున్న రాజు కోపంతో, “చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని; నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి యుండెను గదా” అని అన్నాడు. (మత్త. 18:23-35) ఆ రాజులాగే యెహోవా కూడా మన రుణాల్ని క్షమించాడు. మరి ఆయన చూపించిన ప్రేమ, దయ ఏం చేసేలా మనల్ని ప్రోత్సహించాలి?
17 మనం జ్ఞాపకార్థ ఆచరణకు సిద్ధపడుతుండగా ఈ ప్రశ్నల గురించి ఆలోచించాలి: ‘నా తోటి సహోదరసహోదరీలు ఎవరైనా నన్ను బాధపెట్టారా? వాళ్లను క్షమించడం నాకు కష్టమనిపిస్తుందా?’ ఒకవేళ మీ జవాబు అవును అయితే, “క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల” యెహోవాను అనుకరించడానికి ఇదే సరైన సమయం. (నెహె. 9:17; కీర్త. 86:5) యెహోవా చూపించిన గొప్ప దయపట్ల మనకు కృతజ్ఞత ఉంటే, మనం కూడా ఇతరులపట్ల దయ చూపిస్తాం వాళ్లను మనస్ఫూర్తిగా క్షమిస్తాం. మనం తోటి సహోదరసహోదరీల్ని ప్రేమిస్తూ వాళ్లను క్షమిస్తేనే యెహోవా కూడా మనల్ని ప్రేమించి, క్షమిస్తాడు. (మత్త. 6:14, 15) మనం ఇతరుల్ని క్షమించినంత మాత్రాన వాళ్లు మనల్ని బాధపెట్టలేదని కాదు. కానీ అలా క్షమించడం వల్ల భవిష్యత్తులో మనం సంతోషంగా ఉండగలుగుతాం.
18. తోటి సహోదరి బలహీనతల్ని సహించడానికి దేవుని ప్రేమ ఓ సహోదరికి ఎలా సహాయం చేసింది?
18 నిజమే, తోటి సహోదరసహోదరీల బలహీనతల్ని సహించడం మనకు కష్టం కావచ్చు. (కొలొస్సయులు 3:13, 14; ఎఫెసీయులు 4:32 చదవండి.) అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న లిల్లీ అనే ఒంటరి సహోదరి అనుభవాన్ని గమనించండి. ఆమె విధవరాలైన క్యారల్ [1] అనే సహోదరికి చాలా రకాలుగా సహాయం చేసేది. ఉదాహరణకు, క్యారల్ ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి దగ్గరుండి తీసుకెళ్లేది, ఆమెకు షాపింగ్‌లో సహాయం చేసేది, ఇంకా చాలా పనులు చేసిపెట్టేది. లిల్లీ ఇన్ని చేసినా క్యారల్ మాత్రం ఆమెను ఎప్పుడూ ఏదోఒకటి అంటూ ఉండేది. కొన్నిసార్లయితే క్యారల్‌కు సహాయం చేయడం లిల్లీకి చాలా కష్టంగా అనిపించేది. కానీ లిల్లీ, క్యారల్లో ఉన్న మంచి లక్షణాలపై మనసుపెట్టి క్యారల్ తీవ్ర అనారోగ్యం పాలై చనిపోయేదాకా ఆమెకు సహాయం చేసింది. క్యారల్‌కు సహాయం చేయడం లిల్లీకి కష్టం అనిపించినప్పటికీ ఆమె ఇలా చెప్తుంది, “క్యారల్ పునరుత్థానం అవ్వడం చూడాలనివుంది. ఆమె పరిపూర్ణురాలు అయినప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంది.” అవును, తోటి సహోదరసహోదరీల బలహీనతల్ని సహిస్తూ, మనుషులు పరిపూర్ణులయ్యే కాలం కోసం ఎదురుచూసేలా దేవుని ప్రేమ మనల్ని ప్రోత్సహిస్తుంది.
19. దేవుడిచ్చిన ‘వివరించడానికి సాధ్యం కాని ఉచిత వరం’ మిమ్మల్ని ఏమి చేసేలా ప్రోత్సహిస్తుంది?
19 అవును, ‘వివరించడానికి సాధ్యం కాని ఉచిత వరం’ యెహోవా మనకు ఇచ్చాడు. ఆ వరంపట్ల మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత చూపిస్తూ ఉందాం. యెహోవా, యేసుక్రీస్తు మనకోసం చేసినవాటి గురించి ధ్యానించడానికి జ్ఞాపకార్థ ఆచరణ కాలం సరైన సమయం. వాళ్లిద్దరు మనపై చూపించిన ప్రేమ యేసును ఎక్కువగా అనుకరించేలా, తోటి సహోదరసహోదరీల్ని ప్రేమించేలా, వాళ్లను మనస్ఫూర్తిగా క్షమించేలా మనల్ని ప్రోత్సహించాలని కోరుకుందాం.
^ [1] (18వ పేరా) ఈ ఆర్టికల్‌లోని కొన్ని పేర్లు అసలు పేర్లు కావు.