కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తల్లిదండ్రులు తమ మంచి ఆదర్శం ద్వారా పిల్లలకు ప్రేమను నేర్పిస్తారు

సవాలును ఎదుర్కోవడానికి ఒక ప్రయత్నం

నైతిక విద్య

నైతిక విద్య

ఒక స్కూల్‌ ట్రిప్పులో కొంతమంది టీనేజీ అబ్బాయిలు, మరో అబ్బాయి మీద లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వాళ్లందరూ కెనడాలో ఒక పేరున్న ప్రైవేటు స్కూలుకు వెళ్ళే వాళ్లే. ఈ సంఘటన జరిగిన తర్వాత, ఒట్టావా సిటిజన్‌ అనే వార్తాపత్రికలో లియోనార్డ్‌ స్టర్న్‌ ఇలా రాశాడు: “తెలివి, విద్య, మంచి సామాజిక హోదా ఉన్నా యౌవనులు నైతికంగా మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు.”

స్టర్న్‌ ఇంకా ఇలా రాశాడు: “తల్లిదండ్రులుగా మీకున్న ఏకైక లక్ష్యం పిల్లలకు మంచి నైతిక విలువల్ని నేర్పించడమే అని అనుకుంటారు. కానీ నిజానికి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల చదువు లేదా డబ్బు సంపాదించడంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు.”

చదువు ముఖ్యం. కానీ ఎంత గొప్ప చదువైనా, అది ఒక వ్యక్తి చెడు కోరికలు, చెడు ఆలోచనలతో పోరాడడానికి సహాయం చేయలేదు. మరి అలాంటప్పుడు నైతికంగా సరైన దారిలో నడిపించే మంచి విద్య మనకు ఎక్కడ దొరుకుతుంది?

నైతికంగా, ఆధ్యాత్మికంగా నడిపించే విద్య

బైబిలు అద్దం లాంటిది. మనం అందులోకి చూసినప్పుడు మన లోపాలు, బలహీనతలు మనకు మరింత స్పష్టంగా కనబడతాయి. (యాకోబు 1:23-25) అయితే బైబిలు ఇంకా ఎక్కువే చేస్తుంది. నిజమైన శాంతి సామరస్యాలకు దోహదపడే మంచి లక్షణాలను వృద్ధి చేసుకునే క్రమంలో, అవసరమైన మార్పులు చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. ఆ లక్షణాలు ఏంటంటే మంచితనం, దయ, ఓర్పు, ఆత్మనిగ్రహం, ప్రేమ. “ప్రేమ ప్రజల్ని పూర్తిస్థాయిలో ఒకటి చేస్తుంది” అని కూడా చెప్పొచ్చు. (కొలొస్సయులు 3:14) ప్రేమ ఎందుకంత ప్రత్యేకమైనది? ఈ లక్షణం గురించి బైబిలు ఏం చెప్తుందో గమనించండి.

  • “ప్రేమ ఓర్పు కనబరుస్తుంది, దయ చూపిస్తుంది. ప్రేమ ఈర్షపడదు, గొప్పలు చెప్పుకోదు, గర్వంతో ఉబ్బిపోదు, మర్యాద లేకుండా ప్రవర్తించదు, స్వార్థం చూసుకోదు, త్వరగా కోపం తెచ్చుకోదు. హానిని మనసులో పెట్టుకోదు. అది అవినీతి విషయంలో సంతోషించదు కానీ, సత్యం విషయంలో సంతోషిస్తుంది. అది అన్నిటినీ భరిస్తుంది, . . .  అన్నిటినీ సహిస్తుంది. ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.”—1 కొరింథీయులు 13:4-8.

  • “ప్రేమ ఉంటే సాటి మనిషికి హాని తలపెట్టం.”—రోమీయులు 13:10.

  • “అన్నిటికన్నా ముఖ్యంగా, ఒకరి మీద ఒకరు ప్రగాఢమైన ప్రేమ చూపించండి. ఎందుకంటే ప్రేమ చాలా పాపాల్ని కప్పుతుంది.”—1 పేతురు 4:8.

మిమ్మల్ని ప్రేమించేవాళ్లతో ఉన్నప్పుడు మీకెలా అనిపిస్తుంది? సురక్షితంగా? భద్రంగా? హాయిగా? అవును, వాళ్లు మీ మంచి కోరుకుంటారని, కావాలని మిమ్మల్ని బాధపెట్టరని మీకు తెలుసు.

త్యాగాలు చేసేలా కూడా ప్రేమ ప్రజల్ని కదిలిస్తుంది. ఇతరుల ప్రయోజనం కోసం తమ జీవన విధానాన్ని కూడా వాళ్లు మార్చుకుంటారు. ఉదాహరణకు జార్జ్‌ అనే ఒకతను తాతయ్యాడు. ఆయన తన మనవడితో సమయం గడపాలని ఎంతో కోరుకున్నాడు. కానీ ఇక్కడో సమస్య ఉంది. జార్జ్‌ బాగా పొగతాగేవాడు, పిల్లవాడి దగ్గర పొగతాగడం ఆయన అల్లుడికి ఇష్టం లేదు. మరి జార్జ్‌ ఏం చేశాడు? ఆయనకు 50 ఏళ్లుగా పొగతాగే అలవాటు ఉన్నా, తన మనవడి కోసం ఆ అలవాటును వదులుకున్నాడు. నిజంగా, ప్రేమకు ఎంత శక్తి ఉందో కదా!

మంచితనం, దయ, ముఖ్యంగా ప్రేమ లాంటి ఎన్నో మంచి లక్షణాలను వృద్ధి చేసుకోవడానికి బైబిలు మనకు సహాయం చేస్తుంది

ప్రేమ అనేది మనం నేర్చుకోవాల్సిన లక్షణం. ఎలా ప్రేమించాలో పిల్లలకు నేర్పించే విషయంలో తల్లిదండ్రులదే ముఖ్యమైన పాత్ర. వాళ్లు తమ పిల్లల్ని పోషిస్తారు, కాపాడతారు, బాధలో లేదా అనారోగ్యంలో ఉన్నప్పుడు వాళ్లకు సహాయం చేస్తారు. మంచి తల్లిదండ్రులు తమ పిల్లలతో మాట్లాడతారు, వాళ్లకు నేర్పిస్తారు. అలాగే పిల్లలకు క్రమశిక్షణ ఇస్తూ అందులో భాగంగా, ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకునేందుకు సహాయం చేసే మంచి సూత్రాలను కూడా వాళ్లకు నేర్పిస్తారు. అంతేకాదు మంచి తల్లిదండ్రులు మంచి ఉదాహరణగా ఉంటూ, పిల్లలకు మంచి ఆదర్శంగా ఉంటారు.

విచారకరంగా కొంతమంది తల్లిదండ్రులు తమ బాధ్యతలు నెరవేర్చే విషయంలో విఫలం అవుతారు. మరి వాళ్ల పిల్లలు ఎప్పటికీ మంచివాళ్లుగా తయారవ్వలేరా? ఎంత మాత్రం కాదు! చాలామంది పెద్దవాళ్లు, ఆఖరికి అస్తవ్యస్తంగా ఉన్న కుటుంబాల్లో పెరిగి పెద్దైనవాళ్లు కూడా తమ జీవితాల్లో అద్భుతమైన మార్పులు చేసుకొని శ్రద్ధగల, నమ్మకమైన పౌరులుగా అయ్యారు. వీళ్లు ఎప్పటికీ మారరు అని ఇతరులు భావించిన కొంతమంది, ఎలా మారారో తర్వాతి ఆర్టికల్లో పరిశీలిస్తాం!