కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సమస్య

మన రక్షణకు, భద్రతకు ఉన్న ప్రమాదాలు

మన రక్షణకు, భద్రతకు ఉన్న ప్రమాదాలు

“ఈ తరం ప్రజలు, గతంలో ఎన్నడూ లేని విధంగా సాంకేతిక, వైజ్ఞానిక, ఆర్థిక వనరులను అనుభవిస్తున్నారు . . . అయినప్పటికీ బహుశా [రాజకీయ, ఆర్థిక, పర్యావరణ] వ్యవస్థల్ని నాశనం అంచుకు తీసుకెళ్లిన మొదటి తరం కూడా ఇదే కావచ్చు.”—ద గ్లోబల్‌ రిస్క్‌ రిపోర్ట్‌ 2018, ప్రపంచ ఆర్థిక చర్యావేదిక.

చాలామంది విజ్ఞానవంతులైన ప్రజలు, మన భవిష్యత్తు గురించి, భూమి భవిష్యత్తు గురించి ఎందుకు చింతిస్తున్నారు? మన ముందున్న కొన్ని సవాళ్లను పరిశీలించండి.

  • సైబర్‌ నేరాలు: “రోజురోజుకీ ఇంటర్నెట్‌ ఒక ప్రమాదకరమైన స్థలంగా తయారౌతుంది. పిల్లలపై లైంగిక కోరికలు ఉన్నవాళ్లకు, ఏడిపించేవాళ్లకు, పోకిరీలకు, సమాచారాన్ని దొంగిలించేవాళ్లకు అడ్డాగా మారిపోయింది,” అంతేకాదు “ఒకరి గుర్తింపును దొంగిలించడం, నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న నేరాల్లో ఒకటి. . . . మానవజాతికున్న నీచమైన లక్షణాలను—ద్రోహాన్ని, క్రూరత్వాన్ని బయటపెట్టుకునే అవకాశాన్ని కూడా ఇంటర్నెట్‌ కల్పించింది” అని ది ఆస్ట్రేలియన్‌ అనే వార్తాపత్రిక చెప్తుంది.

  • ఆర్థిక అసమానత: ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదవాళ్లందరిని కలిపితే, వాళ్లలో సగం మంది దగ్గర ఎంత డబ్బు ఉంటుందో, అత్యంత ధనవంతులైన ఎనిమిది మంది దగ్గర కూడా అంతే డబ్బు ఉందని, ఈమధ్య కాలంలో ఆక్స్‌ఫామ్‌ అంతర్జాతీయ నివేదిక తెలియజేసింది. ఆక్స్‌ఫామ్‌ ఇంకా ఇలా చెప్తుంది “అస్తవ్యస్తంగా ఉన్న మన ఆర్థిక వ్యవస్థలు సమాజంలో ఉన్న నిరుపేదలను పణంగా పెట్టి ధనమంతటినీ గొప్పవాళ్ల చేతుల్లోకి పెడుతున్నాయి. అందులో ఎక్కువ పేదవాళ్లు ఆడవాళ్లే.” పెరుగుతున్న ఈ అసమానతవల్ల, సామాజిక తిరుగుబాటు మొదలవ్వవచ్చని కొందరు భయపడుతున్నారు.

  • పోరాటాలు, హింసలు: 2018 యునైటెడ్‌ నేషన్స్‌ రెఫ్యూజీ ఏజెన్సీ నివేదిక ఇలా చెప్పింది: “మనకు తెలిసి ప్రజలు అత్యధిక సంఖ్యలో వలస వెళ్లడం ఇప్పుడే చూస్తున్నాం.” ఎక్కువగా పోరాటాలు లేదా హింసలు వల్ల 6 కోట్ల 80 లక్షల కంటే ఎక్కువ మంది ఇళ్లను వదిలి వెళ్ళాల్సి వచ్చింది. “ప్రతీ రెండు సెకండ్లకు ఒకరు బలవంతంగా వలస వెళ్తున్నారు,” అని ఆ నివేదిక చెప్తుంది.

  • పర్యావరణానికి ఉన్న ప్రమాదాలు: “చాలా రకాల మొక్కలు, జంతువులు వేగంగా అంతరించిపోతున్నాయి, గాలి, సముద్రం కాలుష్యమైపోవడం మనుషుల ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలో పడేస్తుంది” అని 2018 ద గ్లోబల్‌ రిస్క్‌స్‌ రిపోర్ట్‌ చెప్తుంది. కొన్ని దేశాల్లో కీటకాల సంఖ్య బాగా తగ్గిపోతుంది. కీటకాలు మొక్కల ఫలదీకరణానికి సహాయం చేస్తాయి కాబట్టి మన వాతావరణం పూర్తిగా నాశనం అయిపోయే ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పగడపు దిబ్బలు కూడా ప్రమాదంలో ఉన్నాయి. గడిచిన 30 సంవత్సరాల్లో, దాదాపు ప్రపంచంలో ఉన్న సగం దిబ్బలు నాశనం అయిపోయాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

మరి, సురక్షితంగా, ఎక్కువ భద్రంగా ఉన్న ప్రపంచం కోసం అవసరమైన మార్పులు మనం చేసుకోగలుగుతున్నామా? అందుకు విద్య కొంతవరకు సహాయం చేస్తుందని కొందరు భావిస్తున్నారు. అలా అయితే ఎలాంటి విద్య అవసరం? ఈ ప్రశ్నల్ని తర్వాతి ఆర్టికల్స్‌లో పరిశీలిస్తాం.