కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒక చికిత్స లేదా పరిష్కారం కేవలం జబ్బులకున్న లక్షణాలను మాత్రమే కాదు, వాటి లోపల దాగిన కారణాలను కూడా సరిచేయాలి

సవాలు

మన సమస్యల మూల కారణం తెలుసుకోవాలి

మన సమస్యల మూల కారణం తెలుసుకోవాలి

మన శాంతిభద్రతలను పాడుచేసి, మన భవిష్యత్తును ప్రమాదంలో పడేసే ఎన్నో సమస్యలను మనుషులు పరిష్కరించుకోగలరని మీరు నమ్ముతున్నారా? సరైన పరిష్కారం కావాలనుకుంటే అసలు ఆ సమస్యలను తెస్తున్న కారణాలను పరిష్కరించాలి కాని పైకి కనపడే లక్షణాలను కాదు.

ఉదాహరణకు టామ్‌ అనే ఒకతని ఆరోగ్యం బాలేదు, తర్వాత అతను చనిపోయాడు. అతను ఎందుకు చనిపోయాడు? “మొదట్లో అతని వ్యాధి లక్షణాలు కనపడినప్పుడు ఎవరూ దాని వెనకున్న కారణాన్ని తెలుసుకోవాలని అనుకోలేదు,” అని అతను చనిపోయే కొంతకాలం ముందు చేరిన హాస్పిటల్‌ డాక్టర్‌ రాశాడు. మొదట్లో టామ్‌కు వైద్యం చేసిన డాక్టర్లు అతనికి ఉపశమనం కలిగించే వైద్యం మాత్రమే చేసినట్లు అనిపిస్తుంది.

నేడు మనుషులు కూడా ప్రపంచానికున్న సమస్యల విషయంలో ఇలానే చేస్తున్నారా? ఉదాహరణకు, నేరాలతో పోరాడడానికి ప్రభుత్వాలు చట్టాలను రూపొందిస్తాయి, నిఘా కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తాయి, పోలీసు బలగాలను పటిష్ఠం చేస్తాయి. ఈ జాగ్రత్తలు కొంతవరకు ప్రయోజనకరంగా ఉన్నా, లోపల దాగిన కారణాలను మాత్రం తీసేయలేవు. ఎందుకంటే చాలావరకు ప్రజలు ప్రవర్తించే విధానం వాళ్లు ఎలా ఆలోచిస్తున్నారో, భావిస్తున్నారో, కోరుకుంటున్నారో చూపిస్తుంది.

దక్షిణ అమెరికాలో ఆర్థికంగా దిగజారిపోతున్న ఒక దేశంలో డాన్యల్‌ అనే అతను నివసిస్తున్నాడు. అతను ఇలా చెప్పాడు: “ఒక సమయంలో మా జీవితం బానే ఉండేది. ఆయుధాలతో వచ్చి దొంగతనాలు చేస్తారనే భయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉన్న నగరం గానీ గ్రామం గానీ లేదు. దేశంలో పరిస్థితి కష్టంగా ఉండడం వల్ల చాలామంది ప్రజలు దురాశతో ఉన్నారని, ఇతరుల ప్రాణాలను, వాళ్ల వస్తువులను లెక్కచేయడంలేదని స్పష్టంగా మాకు కనపడుతుంది.”

మధ్యప్రాచ్య దేశాల్లో పోరాటాల నుండి పారిపోయి వచ్చిన ఒకతను తర్వాత బైబిలు గురించి నేర్చుకున్నాడు. ఆయన ఇలా చెప్తున్నాడు: “నేను పుట్టిన పట్టణంలో చాలామంది యువకులను వాళ్ల కుటుంబాలు, అక్కడి రాజకీయ మత వ్యవస్థలు, యుద్ధాల్లో పాల్గొని యుద్ధ వీరులుగా అవ్వమని ప్రోత్సహిస్తాయి. అవతలి వైపు ఉన్న వాళ్లకు కూడా ఇలానే చెప్తారు. ఇదంతా చూసి మానవ పరిపాలకుల మీద నమ్మకం పెట్టుకోవడం ఎంత బాధాకరమైన విషయమో నేను తెలుసుకున్నాను.”

ఒక ప్రాచీన పుస్తకం చక్కగా ఇలా చెప్తుంది:

  • “నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది.”—ఆదికాండము 8:21.

  • “హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?”—యిర్మీయా 17:9.

  • “దుష్ట ఆలోచనలు, హత్యలు, . . . లైంగిక పాపాలు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దైవదూషణలు హృదయం నుండి వస్తాయి.”—మత్తయి 15:19.

మనలో ఉండే చెడు లక్షణాలను తీసేసే పరిష్కారాన్ని మనుషులు తెలుసుకోలేకపోయారు. నిజం చెప్పాలంటే ఆ లక్షణాలు ఇంకా పెరిగిపోతున్నట్లు ముందు ఆర్టికల్లో చూసిన సమస్యలను బట్టి చెప్పవచ్చు. (2 తిమోతి 3:1-5) ఇప్పుడు సమాచారం ఇంతగా అందుబాటులో ఉన్నప్పటికీ, ఇంతకుముందుకన్నా ఇప్పుడు ఎక్కువగా ఒకరితో ఒకరు చర్చించుకోగలుగుతున్నప్పటికీ పరిస్థితి ఇలానే ఉంది. మరి ఎందుకు మనం ప్రపంచాన్ని శాంతిగా, సురక్షితంగా చేసుకోలేము? మననుండి మనం చేయగలిగినదానికన్నా ఎక్కువగా ఆశిస్తున్నామా? అసాధ్యమైనదాని కోసం ప్రయత్నిస్తున్నామా?

అసాధ్యమైనదాని కోసం ప్రయత్నాలు చేస్తున్నామా?

ఏదో ఒక అద్భుతం చేసి మనం మనుషుల్లో ఉన్న చెడు లక్షణాలను తీసేసుకోగలిగినా, అప్పటికీ మనం ప్రపంచాన్ని అందరికీ సురక్షితంగా భద్రంగా చేసుకోలేము. కారణం? మనుషులుగా మనకున్న పరిమితులు.

ఒక చిన్న వాస్తవం ఏంటంటే తమ మార్గాన్ని ఏర్పర్చుకోవడం, సన్మార్గంలో ప్రవర్తించడం మనుష్యుల వశములో లేదు. (యిర్మీయా 10:23) అవును, మనల్ని మనం పరిపాలించుకునేలా మనం తయారు చేయబడలేదు. ఎలా అయితే మనం నీళ్లలోనో, లేదా అంతరిక్షంలోనో నివసించేలా చేయబడలేదో అలానే మనం మనతోటివాళ్లను పరిపాలించగలిగేలా కూడా చేయబడలేదు.

మనం నీటిలో జీవించేలా తయారు చేయబడలేదు అలానే మనం మన తోటివాళ్లని పరిపాలించేలా కూడా తయారు చేయబడలేదు

దీన్ని పరిశీలించండి: ఎవరికైనా, వాళ్లతో సమానమైనవాళ్లు వాళ్లకు ఎలా ఉండాలి, ఎలాంటి మంచి నియమాలు పాటిస్తూ జీవించాలి అని చెప్తే ఇష్టం ఉంటుందా? అబార్షన్‌ (గర్భంలో బిడ్డను చంపేయడం), ఉరితీయడం లాంటి వాటిని ఎలా చూడాలి లేదా పిల్లల్ని ఎలా క్రమశిక్షణలో పెట్టాలి లాంటి విషయాల్లో ఇలా చేయాలి ఇలా చేయకూడదు అని ఎవరైనా ఖచ్చితంగా నిర్దేశిస్తుంటే ఇష్టం ఉంటుందా? ప్రజల్ని విడదీసే విషయాల్లో ఇవి కొన్ని మాత్రమే. కానీ ఒప్పుకోవడానికి కష్టంగా ఉన్నా బైబిలు చెప్పే మాటల్లో అర్థం ఉందని అనిపిస్తుంది. తోటివాళ్లను పరిపాలించే నైతిక అధికారం గానీ, సామర్థ్యం గానీ మనకు లేవు. మరి సహాయం కోసం మనం ఎక్కడ చూడాలి?

మనం మన సృష్టికర్త వైపు చూడడమే సరైనది. ఎంతైనా ఆయనే కదా మనల్ని సృష్టించింది. అంతేకాదు కొంతమంది అనుకుంటున్నట్లుగా ఆయన మనల్ని మర్చిపోలేదు. పైగా ఆయనకు మనపైన ఉన్న శ్రద్ధను బైబిల్లో ఉన్న తెలివైన మాటల్లో చూడవచ్చు. ఆ ప్రత్యేకమైన పుస్తకాన్ని మనం అర్థం చేసుకుంటే మనల్ని మనం బాగా అర్థం చేసుకోగలుగుతాం. అంతేకాదు, మానవ చరిత్ర ఎందుకింత దయనీయంగా ఉందో కూడా అర్థం చేసుకోగలుగుతాం. “ప్రజలు, ప్రభుత్వాలు మనిషి చరిత్రని చూసి ఎన్నడూ ఏమీ నేర్చుకోలేదని, ఆ చరిత్ర నుండి నేర్చుకున్న పాఠాలను అనుసరించలేదని మనకు అర్థమౌతుంది” అని ఒక జర్మన్‌ సిద్ధాంతవేత్త ఎందుకు రాశాడో కూడా మనం అర్థం చేసుకోవచ్చు.

బైబిల్లో ఉన్న తెలివైన మాటలు మనల్ని కాపాడతాయి

“ఒక వ్యక్తి చేసే నీతి పనులే అతను తెలివైనవాడని చూపిస్తాయి” అని ఒక తెలివైన అతను అన్నాడు. (లూకా 7:35) అలాంటి తెలివైన మాటల్ని మనం యెషయా 2:22లో చూస్తాము, అక్కడ ఇలా ఉంది: “నరుని లక్ష్యపెట్టకుము.” ఆ మంచి సలహా మనకు అనవసరమైన కోరికలు పెట్టుకోకుండా, జరగని వాటికోసం ఎదురుచూడకుండా సహాయం చేస్తుంది. ఉత్తర అమెరికాలో ఉన్న ఒక పట్టణంలో నివసించే కెనెత్‌ అనే అతను దౌర్జన్యానికి గురి అయ్యాడు. అతను ఇలా అంటున్నాడు: “ఒక రాజకీయ నాయకుడి తర్వాత మరో రాజకీయ నాయకుడు పరిస్థితుల్ని మారుస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ మార్చలేరు. వాళ్ల వైఫల్యాలు బైబిల్లో ఉన్న మాటలు నిజమైనవని, తెలివైనవని మనకు ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటాయి.”

ఇంతకుముందు చూసిన డాన్యల్‌ ఇలా రాస్తున్నాడు: “మనుషులు చక్కగా పరిపాలించుకోలేరని రోజురోజుకీ నా నమ్మకం బలపడుతుంది. . . . బ్యాంకులో మీకున్న డబ్బు మీద, లేదా ఏదైనా పెన్షన్‌ స్కీమ్‌ మీద నమ్మకంతో మీరు రిటైర్‌ అయ్యాక హాయిగా ఉండవచ్చు అనే గ్యారంటీ లేదు. ఈ విషయంలో ప్రజలు నిరాశతో ఘోరంగా బాధపడడం నేను చూశాను.”

మనం అనవసరమైన నమ్మకాలు పెట్టుకోకుండా బైబిలు మనకు సహాయం చేస్తుంది. అది మనకు మంచి నిరీక్షణను కూడా ఇస్తుందని తర్వాత చూస్తాం.