కుటుంబం కోసం | యువత
నిజమైన స్నేహితులు కావాలంటే ఏం చేయాలి
సమస్య
టెక్నాలజీ వల్ల ముందెప్పుడూ లేనంత సులభంగా చాలామందితో మాట్లాడుకోవచ్చు. అయినా, స్నేహాలు పైపైనే ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఒక అబ్బాయి ఇలా చెప్తున్నాడు: “నా స్నేహితులు నన్ను ఎప్పుడు వదిలేస్తారో తెలీదు కానీ మా నాన్న స్నేహితులు మాత్రం ఎన్నో సంవత్సరాలుగా మంచి స్నేహితులుగా ఉన్నారు.”
ఈ రోజుల్లో మంచి ఫ్రెండ్స్ దొరకడం ఎందుకంత కష్టమైపోయింది?
మీరు తెలుసుకోవాల్సినవి
కొంతవరకు టెక్నాలజీయే కారణం. మెసేజ్‌లు, సోషల్ నెట్‌వర్క్‌లు లాంటివాటి వల్ల ఎక్కడున్నవాళ్లతోనైనా కూడా స్నేహం చేయగలుగుతున్నాం. చక్కగా మాట్లాడుకునే బదులు ఇప్పుడు వెంటవెంటనే, అనిపించిందల్లా మెసేజ్‌ల్లో పెట్టేస్తున్నారు. Artificial Maturity అనే పుస్తకం ఇలా చెప్తుంది: ముఖాముఖిగా మాట్లాడుకోవడం చాలా తక్కువైపోయింది, చదువుకునే పిల్లలు ఒకరితో ఒకరికన్నా కంప్యూటర్, ఫోన్ ముందే ఎక్కువ సమయం గడుపుతున్నారు.
కొన్నిసార్లు అంత మంచి స్నేహం లేకపోయినా టెక్నాలజీ వల్ల ఎంతో మంచి స్నేహం ఉన్నట్టుగా అనిపిస్తుంది. బ్రాయన్ a అనే 22 సంవత్సరాల అబ్బాయి ఇలా అంటున్నాడు, “నేనే ఎప్పుడూ నా ఫ్రెండ్స్‌కు మెసేజ్‌లు పెడుతున్నానని అనిపించింది. అప్పుడు మెసేజ్‌లు పెట్టడం ఆపేసి వాళ్లు నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారా లేదా అని చూశాను కానీ చాలా తక్కువ మందే మాట్లాడారు. నేను అనుకున్నట్లు వాళ్లంతా నాకు మంచి స్నేహితులు కాదని అప్పుడు తెలిసింది.”
మెసేజ్‌లు, సోషల్ మీడియా వల్ల ఎప్పుడు అంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు కాబట్టి స్నేహాలు ఇంకా బలపడే అవకాశం ఉంది కదా అనుకోవచ్చు. అవును, కానీ ఫోన్‌లు, కంప్యూటర్‌లతోపాటు ముఖాముఖిగా మాట్లాడుకుంటేనే స్నేహాలు బలపడతాయి. సోషల్ నెట్‌వర్క్‌లు ఇద్దరి మధ్య కేవలం బ్రిడ్జ్‌ను కడతాయి కానీ వాళ్లను దగ్గర చేయవు.
ఏమి చేయవచ్చు
నిజమైన స్నేహం ఎలా ఉంటుందో తెలుసుకోండి. స్నేహితులు గురించి బైబిలు ఇలా చెప్తుంది: “సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు.” (సామెతలు 18:24) మీకూ అలాంటి స్నేహితులు కావాలా? మీరూ అలాంటి స్నేహితులుగా ఉన్నారా? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలంటే, ముందు ఒక ఫ్రెండ్‌లో మీరు కోరుకుంటున్న మూడు లక్షణాలు రాసుకోండి. తర్వాత, ఒక ఫ్రెండ్‌గా మీరు చూపించాలనుకుంటున్న మూడు లక్షణాలు రాయండి. మీరు వీటి గురించి ఆలోచించండి: ‘నేను విలువిచ్చే లక్షణాలు నా ఆన్‌లైన్ ఫ్రెండ్స్‌లో ఎవరికైనా ఉన్నాయా? నా గురించి వాళ్లను అడిగితే నేను ఎలాంటి లక్షణాలు చూపిస్తున్నాను అని వాళ్లు చెప్తారు?’—మంచి సలహా: ఫిలిప్పీయులు 2:4.
ముఖ్యమైన విషయాలేంటో తెలుసుకోండి. ఎక్కువగా, ఒకే ఇష్టాయిష్టాలు లేదా హాబీలు ఉన్నవాళ్లు ఆన్‌లైన్‌లో ఫ్రెండ్స్ అవుతారు. కానీ దానితోపాటు ఒకే లాంటి నైతిక ప్రమాణాలు కూడా ఉండాలి. “నాకు ఎక్కువమంది ఫ్రెండ్స్ లేరు కానీ ఉన్నవాళ్లు మాత్రం నేను ఇంకా మంచిగా అవ్వడానికి నాకు సహాయం చేస్తారు,” అని 21 సంవత్సరాల లీయాన్ చెప్తుంది.—మంచి సలహా: సామెతలు 13:20.
ఇంట్లోనే ఉండకండి, అందరినీ కలవండి. ముఖాముఖిగా మాట్లాడుకున్నప్పుడు చాలా విషయాలు గమనిస్తాం. ఉదాహరణకు, అవతలి వాళ్ల స్వరంలో వచ్చే చిన్నచిన్న తేడాలు, ముఖ కవళికలు, హావభావాలు (body language) మనం నేరుగా మాట్లాడుకుంటేనే గమనిస్తాం.—మంచి సలహా: 1 థెస్సలొనీకయులు 2:17.
ఉత్తరం రాయండి. ఈ కాలంలో ఉత్తరాలు ఎవరు రాస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ఎంత పాత పద్ధతి అనిపించినా, ఉత్తరం రాసేటప్పుడు వాళ్ల గురించే ఆలోచిస్తూ వాళ్లపైనే దృష్టి పెట్టి రాస్తాం. ఆ ఉత్తరం ద్వారా మీకు వాళ్లపై శ్రద్ధ ఉందని తెలుస్తుంది. ఒకేసారి రెండు మూడు పనులు చేయడం మామూలు అయిపోయిన ఈ లోకంలో ఇలా ఉత్తరం రాయడం గొప్ప విషయం. షెరీ టర్కిల్ అనే ఆమె రాసిన Alone Together అనే పుస్తకంలో ఒక యువకుడి గురించి ఇలా ఉంది, ఆయనకు ఇప్పటివరకు ఎవరూ ఒక్క ఉత్తరం కూడా రాయలేదు. ఒకరికొకరు ఉత్తరాలు రాసుకున్న కాలం గురించి ఆ యువకుడు ఇలా అంటున్నాడు: “నేను అప్పటికి పుట్టకపోయినా, ఆ కాలంలో జీవించి ఉండి ఉంటే బాగుండు అనిపిస్తుంది.” స్నేహితులు చేసుకోవడానికి ఆ ‘పాత టెక్నాలజీని’ ఒకసారి ఉపయోగించి చూడండి.
ముఖ్యమైన విషయం: కేవలం మాట్లాడుకుంటేనే మంచి స్నేహితులు అయిపోరు. ఒకరికొకరు ప్రేమ, తదనుభూతి, సహనం, క్షమించుకోవడం లాంటి లక్షణాలు చూపించుకోవాలి. అవి స్నేహాన్ని మరింత ఆనందించేలా చేస్తాయి. ఆన్‌లైన్ స్నేహాల్లో ఇలాంటి లక్షణాలు చూపించడం కుదరదు.
a ఈ ఆర్టికల్‌లో కొన్ని అసలు పేర్లు కావు.