కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సిమెంట్‌ మిశ్రమంతో ఇటుకలు గట్టిగా కలిసి ఉంటాయి. అలానే ఒకరినొకరు గౌరవించుకుంటూ మాట్లాడుకోవడం భార్యాభర్తల్ని కలిపి ఉంచుతుంది

భార్యాభర్తలకు

3: గౌరవం చూపించడం

3: గౌరవం చూపించడం

అంటే ఏంటి?

ఒకరినొకరు గౌరవించుకునే భార్యాభర్తలు, ఏదైనా విషయంలో ఒకేలా ఆలోచించకపోయినా ఒకరినొకరు పట్టించుకుంటారు. “అలాంటివాళ్లు మొండిగా వాళ్లు అనుకున్నదానికి వాళ్లు అతుక్కుపోయే పరిస్థితి తెచ్చుకోరు, కానీ వాళ్లలో కలవని విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తన భర్త లేదా భార్య అభిప్రాయాలను గౌరవంతో వింటారు, తర్వాత ఇద్దరు కలిసి ఇద్దరికీ నచ్చే అభిప్రాయానికి వస్తారు” అని టెన్‌ లెసన్స్‌ టు ట్రాన్స్‌ఫామ్‌ యువర్‌ మ్యారేజ్‌ అనే పుస్తకం చెప్తుంది.

మంచి సూత్రాలు: “ప్రేమ . . . స్వార్థం చూసుకోదు.” —1 కొరింథీయులు 13:4, 5.

“నా భార్య విలువను నేను అర్థం చేసుకుంటాను, ఆమెకు గానీ మా వివాహానికి గానీ హాని తెచ్చే ఏ పని చేయాలని అనుకోను. అలా నేను ఆమెకు గౌరవం చూపిస్తాను.”—మైకా.

ఎందుకు ముఖ్యం?

గౌరవం లేకపోతే భార్యాభర్తల మధ్య మాటలు విమర్శించుకునేలా, దెప్పిపొడుపుల్లా, అవమానించుకునేలా ఉంటాయి. పరిశోధకులు ఇలాంటి లక్షణాలే విడాకులకు మొదటి గుర్తులని చెప్తారు.

“డొంకతిరుగుడు మాటలు, వెక్కిరింపు మాటలు, జోకులు మీ భార్య ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయి, ఆమెకు మీ మీదున్న నమ్మకాన్ని పోగొడతాయి, మీ వివాహబంధాన్ని పాడుచేస్తాయి.”—బ్రైయాన్‌.

మీరు ఏమి చేయవచ్చు

మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి

ఒక వారం రోజులు మీ మాటల్ని మీ పనుల్ని గమనించుకోండి. తర్వాత ఇలా ఆలోచించండి:

  • ‘నేను నా భర్తను లేదా భార్యను ఎన్నిసార్లు విమర్శించాను, ఎన్నిసార్లు మెచ్చుకున్నాను?’

  • ‘నేను ఏ ప్రత్యేకమైన పద్ధతుల్లో నా భర్తకు లేదా భార్యకు గౌరవాన్ని చూపించాను?’

మీ భర్తతో లేదా భార్యతో ఇలా మాట్లాడి చూడండి

  • ఏ పనులు, ఏ మాటలు మీరు ఒకరినొకరు గౌరవించుకోవడానికి సహాయం చేస్తాయి?

  • ఏ పనులు ఏ మాటలు మీకు ఒకరి మీద ఒకరికి గౌరవం లేదు అని అనుకునేలా చేస్తాయి?

ఇలా చేయండి

  • మీ మీద గౌరవాన్ని చూపించే మూడు మార్గాలను రాయండి. మీ భర్తతో లేదా భార్యతో కూడా అలానే రాయించండి. మీరు రాసుకున్న విషయాలను ఒకరికొకరు ఇచ్చుకోండి. మీరు ఇంకా ఏయే విషయాల్లో గౌరవం చూపించాలో తెలుసుకొని వాటి మీద పనిచేయండి.

  • మీ భర్తలో లేదా భార్యలో మీకు నచ్చే విషయాలను రాయండి. తర్వాత మీకు ఆ లక్షణాలు ఎంత ఇష్టమో మీ భర్తకు లేదా భార్యకు చెప్పండి.

“నా భర్తను గౌరవించడం అంటే నేను ఆయనకు విలువ ఇస్తున్నానని, ఆయన సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని నా పనుల్లో చూపించాలి. ప్రతిసారి ఏదో గొప్పగా చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనం చేస్తూ ఉండే చిన్నచిన్న పనులే మనం నిజంగా గౌరవిస్తున్నామని చూపిస్తాయి.”—మెగన్‌.

చివరిగా, మిమ్మల్ని మీరు గౌరవించుకుంటున్నారా లేదా అనేది ముఖ్యం కాదు, మీ భర్త లేదా భార్య తాము గౌరవించబడుతున్నట్లు భావిస్తున్నారా లేదా అనేదే ముఖ్యం.

మంచి సూత్రాలు: “వాత్సల్యంతో కూడిన ప్రేమను, కనికరాన్ని, దయను, వినయాన్ని, సౌమ్యతను, ఓర్పును అలవర్చుకోండి.”—కొలొస్సయులు 3:12.