కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

2 బాధలకు కారణం మనమేనా?

2 బాధలకు కారణం మనమేనా?

దానికి జవాబు ఎందుకు తెలుసుకోవాలి?

ఒకవేళ బాధలకు కారణం మనమే అయ్యుంటే, వాటిని తగ్గించుకోవడం కూడా మన చేతుల్లోనే ఉండేది.

ఒకసారి ఆలోచించండి

బాధలకు కారణమైన ఈ విషయాల్లో మనుషులు ఎంతవరకు బాధ్యులు?

  • శారీరక, లైంగిక దాడులు.

    ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం, ప్రతీ నలుగురు పెద్దవాళ్లలో ఒకరు చిన్నప్పుడు ఏదోక సమయంలో శారీరక దాడికి గురయ్యారు. అలాగే ప్రతీ ముగ్గురు స్త్రీలలో ఒకరు తమ జీవితంలో ఏదోక సమయంలో శారీరక లేదా లైంగిక దాడికి (లేదా ఆ రెండు దాడులకు) గురయ్యారు.

  • ప్రియమైనవాళ్లు చనిపోవడం.

    WHO ప్రచురించిన ప్రపంచ ఆరోగ్య గణాంకాలు 2018 ప్రకారం, “2016 లో భూవ్యాప్తంగా 4,77,000 హత్యలు జరిగాయని అంచనా.” దీనికి తోడు ఆ సంవత్సరం జరిగిన యుద్ధాల్లో, గొడవల్లో 1,80,000 మంది చనిపోయారని అంచనా.

  • జబ్బులు.

    నేషనల్‌ జియోగ్రాఫిక్‌ పత్రికలో ప్రచురించిన ఒక ఆర్టికల్‌లో, ఫ్రాన్‌ స్మిత్‌ అనే రచయిత ఇలా రాశారు: “పొగతాగేవాళ్లు వంద కోట్ల కన్నా ఎక్కువమంది ఉన్నారు. అత్యంత ప్రాణాంతకమైన ఈ ఐదు జబ్బుల్లో పొగాకు ప్రమేయం ఉంది: గుండె జబ్బు, స్ట్రోక్‌, శ్వాస సంబంధమైన ఇన్‌ఫెక్షన్లు, శ్వాసకోశ సంబంధమైన దీర్ఘకాలిక వ్యాధి, ఊపిరితిత్తుల క్యాన్సర్‌.”

  • సామాజిక అసమానత.

    “పేదరికం, కుల వివక్ష, జాత్యహంకారం, స్త్రీలను ఒకలా పురుషులను ఒకలా చూడడం, వలస వెళ్లాల్సి రావడం, పోటీతత్వం కారణంగా మానసిక సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది” అని మనస్తత్వ నిపుణురాలైన జే వాట్స్‌ చెప్తున్నారు.

    ఎక్కువ తెలుసుకోండి

    jw.org వెబ్‌సైట్‌లో దేవుడు భూమిని ఎందుకు చేశాడు? అనే వీడియో చూడండి.

బైబిలు ఏం చెప్తుందంటే . . .

బాధలకు చాలావరకు మనుషులే కారణం.

చాలావరకు అణచివేసే ప్రభుత్వాల వల్ల బాధలు కలుగుతున్నాయి. ఏ ప్రజలకైతే సేవ చేస్తున్నామని చెప్పుకుంటున్నాయో ఆ ప్రజల జీవితాల్నే అవి దుర్భరం చేస్తున్నాయి.

“మనిషి ఇంకో మనిషి మీద అధికారం చెలాయించి తనకు హాని చేసుకున్నాడు.”ప్రసంగి 8:9.

బాధల్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.

బైబిలు సూత్రాలు పాటిస్తే ఆరోగ్యం మెరుగౌతుంది, అలాగే వేరేవాళ్లతో మంచి సంబంధాలు కలిగి ఉంటాం.

“ప్రశాంతమైన హృదయం శరీరానికి ఆరోగ్యం, అసూయ ఎముకలకు కుళ్లు.”సామెతలు 14:30.

“మీరు అన్నిరకాల ద్వేషం, అలాగే కోపం, ఆగ్రహం, అరవడం, తిట్టడం, అన్నిరకాల చెడుతనం మానేయండి.”ఎఫెసీయులు 4:31.