కొందరి నమ్మకాలు
హిందువులు
ఈ జన్మలోనో గత జన్మలోనో చేసిన పనులకు ఫలితంగా బాధలు వస్తాయని వాళ్లు నమ్ముతారు. మనసును లోక సంబంధ విషయాలకు దూరంగా ఉంచుకుంటే మోక్షాన్ని అంటే పునర్జన్మల చక్రం నుండి విముక్తిని పొందవచ్చని వాళ్ల నమ్మకం.
ముస్లింలు
బాధలు అనేవి పాపానికి శిక్ష అని, విశ్వాసానికి పరీక్ష అని వాళ్లు నమ్ముతారు. కష్టాలు వచ్చినప్పుడు “దేవుడిచ్చిన దీవెనలన్నిటి విషయంలో కృతజ్ఞులై ఉండాలని, అవసరంలో ఉన్నవాళ్లకు సాయం చేయాలని మనకు గుర్తొస్తుంది” అని ఇస్లామిక్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికాకు ప్రెసిడెంట్ అయిన డా. సయ్యద్ సయీద్ అంటున్నారు.
యూదుల నమ్మకాలు
ఒక వ్యక్తి చేసిన పనుల ఫలితమే బాధలని వాళ్లు నమ్ముతారు. కొంతమంది యూదులు చనిపోయినవాళ్లు తిరిగి బ్రతుకుతారని, బాధలు అనుభవించి చనిపోయిన నిర్దోషి తిరిగి బ్రతికిన తర్వాత ప్రతిఫలం పొందుతాడని నమ్ముతారు. కాబలిస్టిక్ యూదా మతంవాళ్లేమో పునర్జన్మను నమ్ముతారు. పునర్జన్మ ద్వారా ఒక వ్యక్తికి తన తప్పుల్ని సరిదిద్దుకునే ఎన్నో అవకాశాలు దొరుకుతాయని వాళ్లు చెప్తారు.
బౌద్ధ మతస్థులు
ఒక వ్యక్తి ఎన్నో జన్మల పాటు బాధలు అనుభవిస్తాడనీ అతని చెడు పనులు, భావోద్వేగాలు, కోరికలు ఆగిపోయే వరకు అలా జన్మలు ఎత్తుతూనే ఉంటాడనీ వాళ్లు నమ్ముతారు. తెలివి ద్వారా, మంచి పనుల ద్వారా, మనసును నియంత్రించుకోవడం ద్వారా ఒక వ్యక్తి నిర్వానం పొందవచ్చని అంటే బాధలేవీ ఉండని పరిస్థితిని చేరుకోవచ్చని నమ్ముతారు.
కన్‌ఫ్యూజనిసం మతస్థులు
చాలావరకు బాధలకు కారణం “మనుషుల వైఫల్యాలు, తప్పులు” అని వాళ్లు నమ్ముతారని ఎ డిక్షనరీ ఆఫ్ కంపారెటివ్ రెలీజియన్ చెప్తుంది. వాళ్ల సిద్ధాంతాల ప్రకారం, మంచిగా జీవించడం ద్వారా కొంతవరకు బాధల్ని తగ్గించుకోవచ్చు కానీ ఎక్కువశాతం బాధలు మాత్రం “మనుషుల కన్నా శక్తిమంతులైన ఆత్మ ప్రాణుల వల్ల వస్తాయి. అలాంటి సందర్భాల్లో విధి ఎలా నడిపిస్తే మనిషి అలా నడుచుకోక తప్పదు.”
కొన్ని ఆఫ్రికన్ మతాలవాళ్లు
దుష్టశక్తుల వల్ల బాధలు వస్తున్నాయని వాళ్లు నమ్ముతారు. వాళ్ల నమ్మకాల ప్రకారం దుష్టశక్తులు అదృష్టాన్నైనా, విపత్తునైనా తీసుకురాగలరు, ఆ శక్తుల్ని శాంతింపజేయాలంటే రకరకాల ఆచారాలు చేయాలి. ఒక వ్యక్తికి జబ్బు చేస్తే, అది దుష్టశక్తుల పని అని వాళ్లు నమ్ముతారు. దాన్ని తిప్పికొట్టడానికి ఏ ఆచారాలు చేయాలో, ఏ మందులు వాడాలో భూతవైద్యుడు చెప్తాడు.
క్రైస్తవులు
బైబిల్లోని ఆదికాండం పుస్తకం చెప్తున్నట్లు, బాధలకు కారణం మొదటి మానవ జంట చేసిన పాపమే అని వాళ్లు నమ్ముతారు. అయితే, చాలా చర్చి శాఖలు ఆ బోధకు తమ సొంత ఆలోచనలు చేర్చాయి. ఉదాహరణకు కొంతమంది క్యాథలిక్కులు ఏం చెప్తారంటే, ఒక వ్యక్తి తనకు వచ్చిన బాధను ‘దేవునికి అర్పించవచ్చు,’ ఆ అర్పణ వల్ల చర్చికి ప్రయోజనం చేకూరవచ్చు లేదా ఇతరులకు రక్షణ కలగవచ్చు.
ఎక్కువ తెలుసుకోండి
jw.org వెబ్‌సైట్‌లో దేవుణ్ణి ఎలా ఆరాధించినా ఫర్వాలేదా? అనే వీడియో చూడండి.