కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

టెక్నాలజీ మీ పిల్లల్ని ఎలా పాడుచేయగలదు?

టెక్నాలజీ మీ పిల్లల్ని ఎలా పాడుచేయగలదు?

ఫోన్‌లు అలాగే వాటిలోని ఫీచర్లు తెలుసుకోవడం పెద్దవాళ్లకు కష్టంగా ఉంటుంది. కానీ పిల్లలకు చిన్నప్పటి నుండే అవి అలవాటు అయిపోయాయి కాబట్టి వాటిని వాడడం వాళ్లకు చాలా తేలిక.

అయితే టెక్నాలజీని ఎక్కువగా వాడే పిల్లల్లో గమనించింది ఏంటంటే వాళ్లు . . .

  • ఫోన్‌లకు అతుక్కుపోతుంటారు.

  • ఆన్‌లైన్‌లో ఇతరుల్ని వేధిస్తుంటారు లేదా వేధింపులకు గురౌతారు.

  • అశ్లీలచిత్రాలు చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మీరు మనసులో ఉంచుకోవాల్సినవి . . .

ఫోన్‌లకు అతుక్కుపోవడం

కొన్ని యాప్‌లను, వీడియో గేమ్‌లను తయారుచేసేవాళ్లు మనం వాటికి బానిసైపోయేలా తయారుచేస్తున్నారు. ఎందుకో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? యాడ్స్‌ వల్ల వ్యాపారవేత్తలు ఎక్కువ లాభం సంపాదిస్తుంటారు. కాబట్టి యాడ్స్‌ వచ్చే యాప్‌లను మనం ఎంత ఎక్కువ వాడితే వాళ్లకు అంత ఎక్కువ డబ్బులు వస్తాయి.

ఇలా ఆలోచించండి: మీ పిల్లలు ఫోన్‌లకు అతుక్కుపోతున్నట్టు మీకు అనిపిస్తుందా? వాళ్లు సమయాన్ని తెలివిగా ఉపయోగించుకునేలా మీరు ఎలా సహాయం చేయవచ్చు? —ఎఫెసీయులు 5:15, 16.

ఆన్‌లైన్‌ వేధింపులు

కొంతమంది ఆన్‌లైన్‌లో అసహ్యంగా, అనాలోచితంగా మాట్లాడుతుంటారు. అలా చేసేవాళ్లు ముందుముందు ఇతరుల్ని వేరే విధానాల్లో కూడా మానసికంగా కృంగదీసే ప్రమాదం ఉంది. దాన్నే సైబర్‌ బుల్లీయింగ్‌ అని కూడా అంటారు.

అంతేకాదు అందరి దృష్టిలో పడాలని, బాగా ఫేమస్‌ అవ్వాలని కొంతమంది ఆన్‌లైన్‌లో ఇష్టమొచ్చినట్టు, అమర్యాదగా ప్రవర్తిస్తుంటారు. ఇంకొంతమందైతే వేరే కారణం వల్ల కూడా బాధపడుతుంటారు. ఎలాగంటే ఒక వ్యక్తిని, తన ఫ్రెండ్స్‌ పార్టీకి పిలవలేదని అనుకుందాం. ఆ విషయం తెలిసినప్పుడు తనను కావాలనే అందరూ దూరం పెడుతున్నారని అతను అనుకొని బాధపడవచ్చు.

ఇలా ఆలోచించండి: మీ పిల్లలు ఇంటర్నెట్‌ ఉపయోగిస్తున్నప్పుడు ఇతరులతో మంచిగా ప్రవర్తిస్తున్నారా? (ఎఫెసీయులు 4:31) ఎవరైనా వాళ్లను దూరం పెడుతున్నారని తెలిసినప్పుడు ఆ విషయాన్ని వాళ్లు తట్టుకోగలుగుతున్నారా?

అశ్లీలచిత్రాలు

ఇంటర్నెట్‌లో అశ్లీలచిత్రాలు చూడడం ఇప్పుడు చాలా సులువు. ఫోన్‌లో సెట్టింగ్స్‌ మార్చినాసరే, కొన్ని చెడు విషయాలు పిల్లల కంట పడతాయని తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి.

ఫోన్‌ ద్వారా సెక్స్‌కి సంబంధించి కొన్ని ఫోటోలు, మెసేజ్‌లు లేదా వీడియోలు పంపించుకోవడాన్ని సెక్స్‌టింగ్‌ అంటారు. అయితే అందులో చిన్నపిల్లల అశ్లీలచిత్రాలు పంపించడం లేదా చూడడం కూడా భాగమే. అలా చేస్తే చట్టపరంగా శిక్షపడవచ్చు.

ఇలా ఆలోచించండి: ఇంటర్నెట్‌లో మీ పిల్లలు అశ్లీలచిత్రాలు చూడకుండా లేదా వాటిని ఇతరులకు పంపించకుండా ఉండడానికి మీరు ఎలా సహాయం చేయవచ్చు?—ఎఫెసీయులు 5:3, 4.

మీరు ఏం చేయవచ్చు?

మీ పిల్లలకు నేర్పించండి

పిల్లలు ఫోన్‌లను ఎక్కువగా వాడుతుంటారు. కానీ, దాన్ని సరిగ్గా వాడే విషయంలో వాళ్లకు సహాయం అవసరం. పిల్లల చేతికి ఫోన్‌ ఇచ్చేముందు దానిని తెలివిగా ఎలా వాడాలో నేర్పించకపోతే ఈత రాకముందే వాళ్లను సముద్రంలోకి తోసేసినట్టు అవుతుందని ఒక పుస్తకం చెప్తుంది.

మంచి సలహా: పిల్లలు నడవాల్సిన దారిని వాళ్లకు నేర్పించండి. వాళ్లు ముసలివాళ్లయినప్పుడు కూడా దాన్నుండి తొలగిపోరు.—సామెతలు 22:6.

ఈ సలహాల్లో మీరు ఏం పాటించాలనుకుంటున్నారో చూడండి లేదా ఏమేమి చేయాలనుకుంటున్నారో రాయండి.

  • ఆన్‌లైన్‌లో ఇతరులతో దురుసుగా ప్రవర్తించకుండా దయగా ఉండమని నా పిల్లలకు నేర్పించాలి

  • ఎవరైనా వాళ్లను దూరం పెడుతున్నారని మా పిల్లలకి అనిపిస్తే, దాన్ని వాళ్లు తట్టుకునేలా సహాయం చేయాలి

  • మా పిల్లలు ఆన్‌లైన్‌లో వచ్చే చెడు విషయాలు చూడకుండా ఉండేలా చేయగలిగినదంతా చేయాలి

  • ఒకవేళ మా పిల్లలకు ఫోన్‌ ఉంటే, వాళ్లు ఏం చూస్తున్నారో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి

  • వాళ్లు ప్రతీ రోజు తమ ఫోన్‌ను ఎంత సమయం ఉపయోగించాలో నిర్ణయించాలి

  • పడుకునేటప్పుడు లేదా ఒక్కరే ఉన్నప్పుడు పిల్లల్ని ఫోన్‌ వాడనివ్వకూడదు

  • అందరూ కలిసి తినేటప్పుడు ఫోన్‌ను వాడనివ్వకూడదు