కుటుంబం కోసం | భార్యాభర్తలు
సమస్యల గురించి ఎలా మాట్లాడుకోవాలి?
సమస్య
మీరు, మీ భార్య లేదా భర్త కలిసి ఏదైన సమస్య గురించి మాట్లాడుకునేటప్పుడు సంభాషణ ముగిసే సరికి ఏ ఉపయోగం లేనట్లు అనిపించిందా? అయితే, మీరు పరిస్థితిని మార్చుకోవచ్చు. కాని ముందు మీరు, మగవాళ్లు ఆడవాళ్లు మాట్లాడే పద్ధతుల్లో ఉన్న తేడాలు తెలుసుకోవాలి. a
మీరు తెలుసుకోవాల్సినవి
పరిష్కారం కన్నా ముందు సమస్య గురించి మాట్లాడుకోవడమే స్త్రీలు ఎక్కువగా కోరుకుంటారు. నిజానికి కొన్నిసార్లు మాట్లాడుకోవడమే వాళ్లకు కావాల్సిన పరిష్కారం.
“నా మనసులో ఉన్నవన్నీ ఆయనతో చెప్పాక, ఆయన నన్ను అర్థం చేసుకున్నారని తెలుసుకున్నప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది. అలా మాట్లాడిన కొద్దిసేపటికే మనసు తేలిక అవుతుంది.”—సంజన. b
“ఏదైన సమస్య గురించి నాకు అనిపించినది అంతా నా భర్తకు చెప్పేంత వరకు నేను దాన్ని మర్చిపోలేను. చెప్పుకున్నాక దాన్నుండి బయటకు వచ్చేస్తాను.”—అక్షర.
“మాట్లాడుతున్నప్పుడు ఒక విషయాన్ని పరిశోధన చేసి బయటకు తీస్తున్నట్లు అనిపిస్తుంది. నేను మాట్లాడేటప్పుడు, సమస్యకు సంబంధించిన విషయాలన్నీ ఆలోచిస్తూ అసలైన కారణం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాను.”—లారా.
పురుషులు వెంటనే పరిష్కారాలు వెదుకుతారు. అది సహజమే, ఎందుకంటే సమస్యను పరిష్కరించడమే వాళ్ల పని అని పురుషులు అనుకుంటారు. సమస్యకు పరిష్కారం చెప్పడం ద్వారా తన మీద ఆధారపడవచ్చని భర్త భార్యకు చూపిస్తాడు. కాబట్టి వాళ్లు ఇచ్చే పరిష్కారం వెంటనే ఒప్పుకోనప్పుడు భర్తలు ఆశ్చర్యపోతారు. “పరిష్కారం అవసరం లేనప్పుడు అసలు ఆ సమస్య గురించి ఎందుకు మాట్లాడాలో నాకు అర్థం కాదు,” అని కపిల్ అనే భర్త చెప్తున్నాడు.
కాని “సలహా ఇచ్చే ముందు సమస్యను అర్థంచేసుకోవాలి” అని The Seven Principles for Making Marriage Work పుస్తకం హెచ్చరిస్తుంది. “పరిష్కారం చెప్పే ముందు మీరు సమస్య గురించి పూర్తిగా తెలుసుకున్నారని, పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారని మీ భార్యకు భరోసా
ఇవ్వాలి. సమస్యకు పరిష్కారం చెప్పాలని భార్యలు ఎక్కువగా కోరుకోరు. చక్కగా వినాలని కోరుకుంటారు అంతే.”ఏమి చేయవచ్చు
భర్తలకు: మీ భార్య చెప్పేది జాగ్రత్తగా వింటూ ఆమెకు ఎలా అనిపిస్తుందో అర్థంచేసుకోవడం అలవాటు చేసుకోండి. థామస్ అనే అతను ఇలా అంటున్నాడు: “కొన్నిసార్లు, చెప్పింది విన్న తర్వాత, ‘దీనివల్ల ఉపయోగం ఏంటి?’ అనుకుంటాను. కానీ నా భార్యకు కావాల్సింది అదే, ఆమె చెప్తున్న వాటిని నేను వినాలి.” స్టీఫెన్ అనే భర్త కూడా అదే అంటున్నాడు: “నా భార్య తన మనసులో ఉన్న విషయాలు చెప్తున్నప్పుడు మధ్యలో ఆపకుండా వినడం మంచిది అని నేను గ్రహించాను. చాలాసార్లు అంతా మాట్లాడిన తర్వాత నాకు ఇప్పుడు హాయిగా ఉందని ఆమె చెప్తుంది.”
ఇలా చేయండి: ఈసారి మీ భార్యతో సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు, ఉచిత సలహాలు ఇవ్వకండి. ఆమె కళ్లలోకి చూడండి, ఆమె ఏమి చెప్తుందో జాగ్రత్తగా వినండి. ఒప్పుకుంటూ తల ఊపండి. మీకు అర్థమైందని చూపించడానికి ఆమె చెప్పిన వాటిలో ముఖ్యమైన కొన్ని మాటలు మళ్లీ చెప్పండి. “కొన్నిసార్లు నా భార్యను నేను అర్థం చేసుకుంటున్నానని, ఆమె చెప్పిన వాటిని ఒప్పుకుంటున్నానని ఆమెకు నమ్మకం కలిగితే చాలు,” అని చార్లెస్ చెప్తున్నాడు.—మంచి సలహా: యాకోబు 1:19.
భార్యలకు: మీకు ఏమి కావాలో మీ భర్తకు స్పష్టంగా చెప్పండి. “మాకు ఏమి కావాలో భర్తలకు తెలుసుండాలని మేము ఎదురుచూస్తాం కాని కొన్నిసార్లు మేమే వివరంగా చెప్పాలి,” అని ఇప్షిత చెప్తుంది. యామిని కూడా ఇలా అంటుంది: “నేను ఇలా చెప్తాను, ‘నాకు ఒక సమస్య ఉంది, నువ్వు దాన్ని పూర్తిగా వినాలని నేను అనుకుంటున్నాను. నువ్వు ఆ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం లేదు, నన్ను అర్థం చేసుకుంటే చాలు.’”
ఇలా చేయండి: విషయం పూర్తిగా వినకుండా మీ భర్త పరిష్కారం చెప్తుంటే, ఆయనకు అర్థం చేసుకునే మనసు లేదనే అభిప్రాయానికి వచ్చేయకండి. ఆయన మీకు సహాయం చేసి మీ సమస్యను తగ్గించాలని అనుకుంటున్నాడు. ఈషా అనే ఆమె ఇలా చెప్తుంది: “ఆయన మీద చిరాకు పడకుండా, ఇలా ఆలోచిస్తే మంచిది: ‘నా భర్తకు నా మీద శ్రద్ధ ఉంది, నేను చెప్పేది వినాలని అనుకుంటున్నాడు అదే సమయంలో నాకు సహాయం చేయాలని కూడా అనుకుంటున్నాడు.’”—మంచి సలహా: రోమీయులు 12:10.
భార్యాభర్తలు ఇద్దరికి: మనతో ఇతరులు ఎలా ఉండాలని కోరుకుంటామో మనం కూడా ఇతరులతో అలాగే ఉంటాము. కాని సమస్యల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మాత్రం మీ భర్త లేదా భార్య ఏమి కోరుకుంటున్నారో అలా ఉండడం ముఖ్యం. (1 కొరింథీయులు 10:24) మోహిత్ అనే భర్త ఇలా చెప్తున్నాడు: “మీరు భర్త అయితే, వినడం నేర్చుకోండి. మీరు భార్య అయితే, సమస్యకు పరిష్కారం చెప్తున్నప్పుడు వినడానికి కొన్నిసార్లు సిద్ధంగా ఉండాలి. ఏదో ఒక చోట మీ ఇద్దరు రాజీ పడితే ఇద్దరు ప్రయోజనం పొందుతారు.”—మంచి సలహా: 1 పేతురు 3:8. ◼ (g16-E No. 3)
a ఇందులో చెప్పిన లక్షణాలు భార్యాభర్తలందరికీ ఉండకపోవచ్చు. కానీ ఈ ఆర్టికల్లో ఉన్న సూత్రాలు పెళ్లైన వాళ్లు భర్తని, భార్యని బాగా అర్థం చేసుకుని వాళ్లతో చక్కగా మాట్లాడడానికి సహాయం చేస్తాయి.
b ఈ ఆర్టికల్‌లో ఉన్నవి అసలు పేర్లు కావు.